దోమాత్మ
ఏదో ‘’కంపు కొట్టు ‘’కు౦టు౦డగా చటుక్కున దోమ కుట్టింది. అంతే స్పీడ్ గా చేత్తో లాగిపెట్టికోట్టా .చచ్చూరుకోకుండా ‘’దోమాత్మ ‘’ప్రత్యక్షమైంది .ఏదో కరుణశ్రీ గారి ‘’పూలబాల’’లాగా గోడు వెళ్ళ బోసు కొంటుం దనుకుంటే సతాయించటం మొదలెట్టింది .’’ఏ మయ్యా ! నీకేమైనా బుద్ధి ఉందా ? మోడీ భక్తుడి నంటావు .మాకింత అవమానం జరుగుతుంటే నీ బ్లాగ్ లో దులిపెయ్యకుండా వత్తాసు పలుకుతావా ?అని దబాయించింది .’’నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్ధం కావటం లేదు .ఏమిటి నీ బాధ ?’’అన్నాను .’’మాదోమల బాదే నా బాధ’’అన్నది లోకం బాధ తనబాద అన్న శ్రీ శ్రీ లాగా. ‘’నీకు మీ సంఘానికి వచ్చిన ప్రమాదం ఏమిటి ?’’ప్రశ్నించా .’’మీ మోడీ తనపనేదో తానూ చేసుకోకుండా ‘’స్వచ్చ భారత్ ‘’అనటం దానికి దేశమంతా తానా అంటే తందానా అనటం మాకేమీ నచ్చలేదు ‘’అంది .ఇదెక్కడి గొడవరా బాబూ అనుకొన్నా .’’ఇన్నేళ్ళుగా హాయిగా ఏ పోరూ పోచ్చం లేకుండా వీధుల్లో చెత్తకుప్పలమీద, మురిక్కాలవపైనా బతుకున్న మా పొట్టలు కొట్టేస్తున్నాడు .మాకు ఇక ఆవాసం ఎక్కడ ?మా తిండి సంగతేమిటి ?ఇలా అయితే మేం బతికి బట్ట కట్టే దేట్ట్టా ?’’దబాయించింది .’’మా వీధులు మేము బాగు చేసుకోవటం ,పరిసరాలు పరి శుభ్రం చేసుకోవటం తప్పా ?’’నేనూ దబాయించాను .’’తప్పు అంటా వేం .తప్పున్నర .మొనగాడిలా వచ్చి ఇన్నేళ్ళు కాంగ్రెసోళ్ళు చేయలేనిపని చేసి మాకన్యాయం చేయటం నేరంకాదా””?విరుచుకుపడింది దోమాత్మ .
‘’ఇప్పటిదాకా తేరగా కుళ్ళు ,గిళ్ళు మెక్కి తెగ బలిసి బిలియన్ బిలియన్లు గా సంతతి పెంచుకొని దేశం లో లేని జబ్బులన్నీ మాకు అంటించి ఇన్నాళ్ళు ఏడిపించారు మీ సంతానం .ఇప్పటిదాకా ‘’మమ్మేలిన వారు ‘’గుడ్డి దర్బార్ సాగించి మీకు న్యాయం ,మాకన్యాయం చేశారు .ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొత్తాలోచనలతోముందుకెళ్ళి మీపనిపట్టి మాకు న్యాయం చేస్తోంది .మా సుఖం మేము చూసుకో వద్దా ?’’అన్నాను నేనుకూడా స్వరం పెంచి . ‘’రోడ్డు మీద ఏదో ఏడుస్తున్నారనుకొంటే’’ ప్రతి ఇంటికి మరుగు దొడ్డి ‘’అని మరో ప్లాన్ వేసి మాకు నిలవ నీడ లేకుండా చేస్తున్నాడు మీ మోడీ .పోనీ గంగ మీద వాలి బతుకుదామంటే ‘’గంగ ప్రక్షాళన ‘’అంటున్నాడు .ఇకమాకు ఒకటే మార్గం మిగిలింది ‘’అన్నది ‘’ఏమిటో అది ‘’అన్నా .’’మీరంతా సంఘీభావం తో సమ్మె చేస్తారు ,ప్రదర్శనలు చేస్తారు కదా !మేము ‘’దోమల ధిల్లీ మార్చ్ ‘’చేసి మీ నాయకుడి మీద దాడి చేస్తాం .అక్కడే ధర్నా చేస్తాం .ప్లేకార్డ్స్ చేతుల్లో పట్టుకొని నిరసన తెలియ జేస్తాం ‘’అంది ఆత్మ విశ్వాసం తో .’’ఎందుకైనా మంచిది మీ బలమెంతో చూసుకో నీ వెనక ఎన్ని దోమలోస్తాయో ఆలోచించుకో ‘’అన్నాను .’’ఎంటయ్యో మరీ దబాయిస్తున్నావ్ –మెత్తని వాళ్ళం కదా అని పేట్రేగిపోకు ‘ఒకప్పుడు’’ దోమలగూడా ‘’ఏలిన వాళ్ళం .ఈలేస్తే కోట్లకుకోట్లు వాలిపడతారు మా దోమ దొరలు .’అంది .’’అయినా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో “’అన్నా .తిరిగి చూసుకొని మరి మాట్లాడలేదు .వెనక సైన్యంకాదు కదా దాని మొగుడో పెళ్ళామో కూడా కనిపించలా .అవాక్కైన దోమాత్మ ‘’ఇంకెక్కడి సంఘం నాయనా ! అందర్నీ మట్టుపెట్టేశారు –పూర్వం మేము కలరా మసూచికం మొదలైన వాటితో మిమ్మల్ని నంజుకు తిన్నట్లు.మీరిప్పుడు మమ్మల్ని నాకేశారు .మా రోజులు అయిపోయాయి ఇక మీవే రోజులు .ఇంతకీ నాకు స్వర్గమా నరక ప్రాప్తా ?’’అడిగింది ‘’నా చేతిలో చచ్చావ్ కనక స్వర్గమే ఫో ‘’అన్నా .అంతే స్వార్ధం చూసుకొని దోమాత్మ స్వర్గ ద్వారం దగ్గర వెయిట్ చేయటానికి వెళ్లి నట్లుంది .నాకు కనిపించలేదు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-15-ఉయ్యూరు