ఊసుల్లో ఉయ్యూరు -56 గూరూరు మైకా వ్యాపారం చేసిన వేగ రాజు వారు

ఊసుల్లో ఉయ్యూరు -56

గూరూరు మైకా వ్యాపారం చేసిన వేగ రాజు వారు

గూరూరు మైకా గనులు ,వ్యాపారం అంటే చప్పున గుర్తోచ్చేవారు కృష్ణా జిల్లా మానికొందలోని గోగినేని వారి కుటుంబం .అక్కడి మైకా గనులపై తిరుగు లేని ఆధిపత్యం సంపాదించి పుష్కల౦ గా  డబ్బు సంపాదించి అపర కుబేరులయ్యారని అందరూ చెప్పుకొనే విషయమే .సరుకు ఒకటే కాని దాని లోని లోతులుపాతులు తెలిసి వ్యాపారం చేస్తే కలిసొస్తుంది .లేక పొతే నష్టాల్లో ఆ గని లోతుల్లోకి కూరుకు పోతారు .దీనికెంతో లౌక్యం చాకచక్యం ,ధీమా, వ్యవహార దక్షత,అవతలి వాడిని ఎదుర్కొనే సత్తా ,సామర్ధ్యం ఉండాలి ,.దీనికి తోడూ అదృష్టమూ కలిసి రావాలి  .మైకా పైకి కనిపించే తళతళలతో ఊరించి బుట్టలో వేసు కొంటుంది. దిగితెనేకాని లోతు తెలియదుకదా .తెలీకుండా దిగితే ,అంచులు పట్టుకొనే తెలివి తేటలు లేకపోతె పెట్టిన సొమ్మంతా గనిపాలే .మిగిలేది అప్పులూ, తిప్పలే    .ఈ రెండవ రకానికి చెందినా వాళ్ళే మా ఉయ్యూరు లోని వేగారాజు వారు .పూర్తిగా మునిగిపోయారు .ఇప్పటిదాకా  ఉయ్యూరు వారు మైకా వ్యాపారం చేశారని నాకు తెలీదు  మా ఉయ్యూరు వాడు ,హైస్కూల్ లో నాశిష్యుడు ,కే సి పిలో పని చేసి రిటైరై  బెంగుళూర్ లో స్థిర డ్డవాడు  ,ఏ దేశం లో ఉన్నా సరసభారతి ని చదివి స్పంది౦ చేవాడూ ,వేగరాజు రాజేంద్ర ప్రసాద్ ,ఏదో పని మీద ఉయ్యూరు వచ్చి నాలుగు రోజుల క్రితం మా ఇంటికొచ్చి మాటల సందర్భంగా తమ తాతగారు స్వర్గీయ వేగ రాజు వెంకట సుబ్బయ్య గారు గూడూరు మైకా గనుల వ్యాపారం చేశారని ,అందులో నష్టపోయారని సవివరంగా తెలిపాడు .నేను రాసేదంతా ఆతను నాకు చెప్పిన విషయాలే .

          శ్రీ వేగరాజు వెంకట సుబ్బయ్య గారిల్లు ఉయ్యూరు లో విష్ణాలయం వెనక బజారులో ఉంది .ఆయన్ను నా చిన్నప్పుడు చూశాను .అప్పటికే బాగా ముసలివారు .వాకిట్లోదిగాలుగా  కూర్చుని ఉండేవారు.ఆయన భార్య సుందరమ్మగారినీ చూశానని గుర్తు . మేము విష్ణాలయానికి మా ఇంటి నుంచి ఈ వెనక దారిలోనే వెళ్ళేవాళ్ళం .ఇప్పటికీ అలానే వెడతాం.అప్పటికి ఆయన గురించి నాకేమీ పెద్దగా తెలియదు .కాని అయన తమ్ముడు వేగ రాజు సీతారామయ్య గారు ఇంకా వయసులోనే ఉన్నారు .బాగా స్థితిపరులని పేరు పొందారు .ఈయన ఇల్లు గుండు పద్మావతమ్మ గారింటికి వెళ్ళే దారిలో ఎడమ ప్రక్క ఎత్తైన స్థలం లో ఉండేది .సంతానం లేదు .అన్నగారి పిల్లలే వారింట్లో పిల్లలు .సీతారామయ్యగారు వేగ రాజు వారికే దత్తత వెళ్లారట .అందుకే ఆస్తి బాగా కలిసివచ్చిందట .వీరి ద్దరి మధ్య వెంకటేశ్వర రావు గారు౦౦ డేవారట .ఈయన్ను నేను చూసిన గుర్తు లేదు .ముగ్గురికి పిత్రార్జితమైన ఇల్లు ,పొలాలు ,స్థలాలు బాగానే ఉండేవట .వీరి పొలాలు తోటల వల్లూరు రోడ్డుకు ,పుల్లేరుకాలువకు ఎదుటి వైపు రోడ్డును ఆనుకొని ఉండేవట .ఉయ్యూరులో వేగరాజు వారి కటు౦ బానికి మంచి పలుకు బడి ఉండేదట .ఇక్కడి ఆస్తి అజమాయిషీ వెంకటేశ్వరరావు గారు చేసేవారట .

            ఈ అన్నదమ్ములలో పెద్ద వారైన వెంకట సుబ్బయ్యగారు గూడూరు వెళ్లి  మైకా గనులకొనుబడి , అమ్మకం  సుమారుగా 1940నుండే చేసేవారట .కొంతకాలం బాగా కలిసోచ్చిందట .విధి వైపరీత్యం వలన వీరి  గనులు కొన్ని కూలిపోయాయి .వ్యాపారం మొత్తం దివాలా తీసిందట .పది వేల రూపాయల అప్పులలో కూరుకు పోయారట .దిగాలుపడి గూడూరు నుంచి ఉయ్యూరు వచ్చేశారు .ఆ అప్పులు తీరిస్తేకాని ఆయన తల ఎత్తుకొలేని స్తితి .అప్పుడు తమ్ముడు వెంకటేశ్వర రావు గారు అన్నగారి పేర ఉన్న స్థలాలు ,పొలాలు   అయినకాడికి అమ్మేసి ,ఆ పది వేలు తీర్చేసి ,తానూ బొక్కాల్సింది బొక్కేసి రాజమండ్రి వెళ్లిపోయారట .ఊళ్ళో కరణం సీతం రాజు సాంబశివ రావు గారు ఈ వెంకటేశ్వర రావు గారికి బాగా వత్తాసు పలికి వెయ్యి రూపాయలు కిమ్మతు ఉన్నదాన్ని వందరూపాయలే వాల్యూ గాచూపించి సుబ్బయ్య గారిని ఈ ఇద్దరూ నిలువునా ముంచారని రాజేంద్ర ప్రసాద్ మొన్న ;లబో దిబో మన్నాడు. ఆతను చెప్పేదాకా నాకు అసలే విషయమూ తెలియనే తెలియదు .ఇలా ఉయ్యూరు వేగ రాజు వారి గూడూరు మైకా గనుల వ్యాపారం ముగిసిన అధ్యాయమే అయింది .కాని అదృష్టం బాగుండి ఆయన అల్లుడు మైకాలో పిచ్చ పిచ్చగా  సంపాదించాడట .ఆ కద తెలుసుకొందాం .ఎవరి అదృష్టం ఎలాంటిదో ?

        సుబ్బయ్యగారు సుందరమ్మగార్లకు శ్రీ వెంకట నాగేశ్వర రావు ,శ్రీ సాంబ శివరావు ,శ్రీ గోపాలకృష్ణ మూర్తి ,శ్రీ విశ్వేశ్వర రావు ,శ్రీ సూర్య నారాయణ ,శ్రీ విజయ రామారావు  అనే 6గురు కుమారులు .ఒక్కతే శ్రీమతి దుర్గాంబ ఆడపిల్ల .ఇందులో విస్సు ,సూరి మాకు సీనియర్లు .విజయ రామారావు నాకు హైస్కూల్   లో క్లాస్ మేట్.

   దుర్గాంబ గారిని కడప జిల్లా రాజం పేట కు చెందిన శ్రీ గోటేటి వెంకటేశ్వర రావు గారికిచ్చి వివాహం చేశారు .అప్పటికే ఆయన మైకా గనుల యజమాని. దుర్గాంబ గారి పాణి గ్రహణం తో ఆయనకు అంతా బాగా కలిసొచ్చింది. మైకా సామ్రాజ్యాధిపతి అయి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి వ్యాపారం ఎలా చేయాలో నిరూపించి మామగారికి ఊరట కలిపించాడు మామగారిది ‘’బాపన వ్యవసాయం ‘’లా వ్యాపారం ఉంటె అల్లుడుగారు ‘’వైశ్య దృక్పధం ‘’తో గొప్ప సంపాదనా పరులయ్యారు .ఎదురులేని వ్యాపారి అనిపించారు రాజేంద్ర చెప్పిన దాన్ని బట్టి ఇప్పటకీ గోటేటి వారికి 14లారీలు ,జీపులు కార్లూ ఎన్నో ఉన్నాయి .

            సుబ్బయ్య గారి సంతానం లో శ్రీ సాంబశివరావు గారు ఉయ్యూరు కెసీపి లో ఉద్యోగం చేశారు .మంచి పలుకుబడి సంపాదించారు .అందరికి తలలో నాలుకగా ఉండేవారు .ఏడాది క్రితమే సుమారు 90ఏళ్ళు జీవించి చనిపోయారు .ఆయన భార్య చనిపోయి సుమారు 40ఏళ్ళు అవుతుంది .వీరికుమారులు –శ్రీ సురేష్ బాబు  ,శ్రీ రాజేంద్ర ప్రసాద్ ,,బాబ్జీ అనే శ్రీ శంకర్ .ఇతను అకస్మాత్తుగా తండ్రి మరణానంతరం పదినెలల క్రితం చనిపోయాడు .బాబ్జీ ఐ టి ఐ ఇంస్ట్రక్తర్ గా పని చేసి రిటైర్ అయి ఉయ్యూరు చేరి ‘’వేగ రాజు మాన్షన్ ‘’అనే అపార్ట్ మెంట్ సముదాయం నిర్మించి తాతగారి పేరు నిలబెట్టాడు .సురేష్ ,రాజేంద్ర ,బాబ్జీ లు హైస్కూల్ లో నా శిష్యులే .ఉయ్యూరు బ్రాహ్మణ సంఘం లో క్రియా శీలక పాత్ర వహించిన వారే .క్రిందటి కార్తీకమాసం లో కొత్తగా  ఏర్పడిన బ్రాహ్మణ సంఘం లో బాబ్జీ కీలల పాత్ర పోషించాడు .పేదబ్రాహ్మణ విద్యార్ధులకు తండ్రి సాంబశివరావు గారి పేర పది వేల రూపాయల స్కాలర్ షిప్ లను అందజేసిన వదాన్యుడు .సా౦బశివరావుగారి కి ఇద్దరమ్మాయిలు శ్రీమతి బేబి జ్యోతి ,శ్రీమతి రాణీ సుజాత .ఇందులో జ్యోతి హైస్కూల్ లో నా శిష్యురాలే .

   ఉయ్యూరు వీరమ్మ తల్లికి ,వేగ రాజు వారి కుటుంబానికి సాన్నిహితం ఉంది. మాఘ మాసం లో శుద్ధ ఏకాదశి నాడు అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరేటప్పుడు ముందుగా వేగ రాజు వారింటికి వచ్చిచీ, సారే, హారతి తీసుకొన్న తరువాతనే బయాల్దేరుతుంది అని ,వీరమ్మ తిరునాళ్ళు  11వ రోజు జరిగే  సిడి బండీ ఉత్సవం  రోజున  తాటి మాను సిడిబండీకి మొదట వేగరాజువారే గుమ్మడికాయ కట్టి  కొబ్బరికాయ కొట్టి ,హారతిస్తారని ఆ తర్వాతే మిగిలిన వారు చేస్తారని అప్పుడే సిదిబండీ బయాల్దేరుతుందని ,ఇది అనాదిగా ఆనవాయితీగా వస్తోందని  రాజేంద్ర చెప్పాడు .

             మరో విషయం తో కలుద్దాం

సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-10-15-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.