నవంబర్ 1, 2015 నుంచి ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 1:30 PM ఇండియా లోనూ, అమెరికాలోనూ (USA EST)
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్టుగానే మా హ్యూస్టన్ లోనూ అనేక మంది “విశ్వనాథాభిమానులు” ఉన్నారు. అసమానమైన గొప్ప కళాత్మక దృష్టి తో అనేక విజయవంతమైన చిత్రాల దిగ్దర్శకులు విశ్వనాథ్ గారి ఆయా సినిమాల నేపధ్యం గురించి మా అందరికీ ఉన్న కుతూహలాన్ని ఒక ఆత్మీయమైన చారిత్రక దృక్పథంతో పదిలపరిచే ప్రయత్నం చెయ్యాలని “విశ్వనాధ వీరాభిమాని” చెరువు రామ్మోహన్ కి సుమారు ఏడాది క్రితం వచ్చిన ఒక మంచి ఆలోచన రాగానే మా అందరితోటీ పంచుకున్నాడు. ఆ సమాలోచనలన్నీ కార్యరూపం దాల్చి రూపొందించబడినదే ఈ నవంబర్ నుంచి 1, 2015 నుంచి 13 వారాల పాటు మీరు చూడబోయే “విశ్వనాదామృతం” టెలివిజన్ సీరియల్ —ఈటీవీ లో.
ఈ అపురూప ప్రసారం అటు ఇండియా లోనూ, ఇటు అమెరికా లోనూ (EST) మధ్యాహ్నం 1:30 PM కి జరుగుతుంది.
ఉత్తమ అభిరుచులతో టెలివిజన్ కార్యక్రమాలు, చిన్న సినిమాల నిర్మాణానికి మా మిత్ర బృందం చేత హ్యూస్టన్ లో నెలకొల్పబడ్డ “శృతిలయలు” అనే లాభా పేక్ష లేని సంస్థ తొలి ప్రయత్నమే ఈ “విశ్వనాదామృతం”. ఈ కార్యక్రమాన్ని ఎక్కువ సంఖ్యలో వీక్షించి, ఆనందించి మా సంస్థ విజయానికి తోడ్పడమని మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాం.
ఒక అసాధారణ దర్శకుడి చలన చిత్ర జీవిత సందర్శనం……ఆయా చిత్రాల నిర్మాణంలో ఆయన సృజనాత్మక శక్తి కి అక్షర దానం, గాత్ర దానం, నటనా కౌశలం, సాంకేతిక పరిజ్జానం, ఆయన చిత్ర నిర్మాతలుగా ఆర్ధిక పరిపుష్టినీ అందించిన హేమా హేమీలు ఆత్మీయంగా వెలువరించిన అభిప్రాయాలతో….అందరికన్నా ముఖ్యంగా విశ్వనాథ్ గారే స్వయంగా ఇప్పటి దాకా ఎవరికీ తెలియని విశేషాలని మనతో పంచుకున్న ఒక అపురూపమైన ప్రయత్నం..ఒక ధారావాహికలా బుల్లి తెర మీద చలన చిత్ర చరిత్రని పదిలపరిచే ఈ ధారావాహికకి ఏంకర్ సుప్రసిద్ధ గాయకుడు నేమాని పార్థు. విశ్వనాథ్ గారితో సినీ ప్రస్థానం సాగించిన “సిరివెన్నెల సీతారామ శాస్త్రి”, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కమల్ హసన్, జయ ప్రద, వెంకటేష్, చిరంజీవి, మొదలైన నిష్ణాతులు ప్రధాన వ్యాఖ్యాతలు కాగా అక్కినేని, అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు విశ్వనాథ గారి ప్రతిభా విశేషాలని విశ్లేశిస్తారు.
తెలుగు సినిమా కి దేవుడిచ్చిన వరంగా అందరూ భావించే “కళా తపస్వి” శ్రీ కాశీనాధుని విశ్వనాథ్ గారి “రీల్” లైఫ్ ….అనగా ఆయన తీసిన ప్రతీ సినిమా తాలూకు, నేపధ్యం, ఆ కథ రూపుదిద్దుకున్న తీరుతెన్నులు, పాత్రల ఎంపికలో, సాహిత్యం విలువలు ఉన్న పాటల రచనలలో, అత్యున్నతమైన సంగీతం సమకూర్చడం లో, ఆసక్తికరమైన చిత్రీకరణ లో ఎదుర్కొన్న ఇబ్బందులు మొదలైన విశేషాలతో ఆయన చలన చిత్ర జీవితాన్ని చరిత్రలో శాశ్వతంగా తెర మీద నిక్షేపించిన ఈ “విశ్వనాదామృతం” కార్యక్రమాన్ని కనుల పండుగ గా, వీనుల విందుగా ఆస్వాదించండి. ఈ ధారావాహికలో “ఓ సీత కథ, సిరివెన్నెల, సాగర సంగమం, శంకరా భరణం, శుభలేఖ, స్వాతి కిరణం, స్వరాభిషేకం, స్వర్ణ కమలం, శృతిలయలు మొదలైన విశ్వనాథ్ సినిమాలన్నింటి తెర వెనుక కథలు, పాటలు ఆసక్తికరంగా ఆవిష్కరించబడ్డాయి.
లాభా పేక్ష లేని ఈ “విశ్వనాదామృతం” టెలివిజన్ దారావాహికకి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఒక స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ ధారావాహిక సంక్షిప్త విశేషాలు ఇందుతో జత పరిచిన ఆంగ్ల ప్రకటన లో చూడండి.
ధన్యవాదాలతో
వంగూరి చిట్టెన్ రాజు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
ఫోన్: 832 594 9054