ధిల్లీ బాలాజీ సన్నిధిలో ఆద్వాని -బీహార్ హోరా హోరీ

 

Inline image 1
 
 

బిహార్.. హోరాహోరి

  • 01/11/2015
  •  -ఎస్.కె.రామానుజం

దేశ రాజకీయాలపై ఆసక్తి ఉన్న అందరి దృష్టీ ఇప్పుడు బిహార్‌పైనే ఉంది. అక్కడి శాసనసభకు ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆ పోరులో గెలుపెవరిది..? ఇప్పుడు అందరి ప్రశ్న ఇదే. రాజకీయంగా దసరాకు ముందు ఉన్న పరిస్థితికి, ఆ తరువాత పరిస్థితికి చాలా తేడా వచ్చేసింది. రోజురోజుకూ మారుతున్న పరిణామాలతో అంచనాలు మారుతున్నాయి. ఇప్పటికైతే సమఉజ్జీల మధ్య సమరం ఇది. రాజకీయాల్లో ‘ఒకరి బలహీనతే మరొకరి బలం’ అన్న సంగతి అందరికీ తెలిసిన రహస్యం. కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు మాటను బట్టి ఓటరు మనసు మారిపోయే సన్నివేశాలు రాజకీయాల్లో మామూలే. బిజెపి పరివారం కీలక సమయంలో నోరుజారి కష్టాలు కొని తెచ్చుకుంటూంటే, ‘మహాకూటమి’ నేతలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని బలం పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు కాస్తంత పైచేయిగా కన్పించిన ఎన్డీఎ కూటమికి ఇప్పుడు తత్వం బోధపడుతోంది. బిహార్ అసెంబ్లీలో 243 స్థానాలకు నిర్వహిస్తున్న ఐదు దశల పోలింగ్ ప్రక్రియ మరో నాలుగురోజుల్లో పూర్తవుతుంది. అక్కడికి మూడురోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయి. అంతవరకూ ఓపికగా ఉండేది ఎవరు? ఈలోగానే ఎవరు గెలుస్తారు? ఎవరి ప్రభుత్వం వస్తుంది? అన్న ఆసక్తి ప్రతిఒక్కరిలో సహజంగానే కనిపిస్తుంది. ఇక మీడియా హడావుడి చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు వచ్చిన ‘ముందస్తు పోలింగ్ సర్వేలు’ చెబుతున్నమాట కూడా ఇరు కూటముల మధ్య హోరాహోరీ పోరు ఉందని, ఒకటీ అరా తప్ప ఎవరికీ పెద్ద ఆధిక్యం ఉండదని తేల్చిచెబుతున్నాయి. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బిజెపి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఆ తరువాత పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒక్క దిల్లీ మినహా చెప్పుకోతగ్గ ఫలితాలనే రాబట్టింది. చివరకు జమ్మూ- కాశ్మీర్‌లోనూ అద్భుత ఫలితాలు సాధించి దేశ రాజకీయ యవనికపై సరికొత్త అవతారం ఎత్తింది. ఈ పరిణామాలు విపక్షాలను బెంబేలెత్తించాయి. బిహార్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి దూకుడుకు ముకుతాడు వేయకపోతే భవిష్యత్ రాజకీయాల్లో కష్టాలు తప్పవన్న భయం వాటిని వెన్నాడింది. ఆ భయం మొదలవగానే విపక్షాలు ఏకమయ్యే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇక్కడ ఎవరి అవసరాలు వారివి. ఎవరి అంచనాలు వారివి. అవసరం కొద్దీ అంతా ఏకమయ్యారు. విడివిడిగా పోటీచేస్తే బిజెపి బృందం సులువుగా అధికారంలోకి వస్తుందన్న అంచనా వారిని ఒక పంచన చేర్చింది. జనతా పరివార్ పేరిట ఆరుపార్టీలు ఏకమైనా ములాయం సింగ్ అలకతో అది అభాసుపాలయ్యింది. ఆ తరువాత మరో రెండు పార్టీలు ఆ తాను నుంచి విడిపోయాయి. చివరకు జనతాదళ్ (యు), ఆర్‌జెడి, కాంగ్రెస్ పక్షాలతో కలిసి మహాకూటమి సీట్లు పంచుకుని పోటీ చేస్తున్నాయి. వీటికి దీటుగా బిజెపి మరికొన్ని పార్టీలతో కలసి బరిలోకి దిగింది. ప్రధానంగా వీరి మధ్యే పోటీ నెలకొంది. ఇక బిఎస్‌పి, ఎస్‌పి, లెఫ్ట్‌కూటమి, తొలిసారిగా ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం పార్టీ రంగంలోకి దిగాయి. బిజెపికి అనుకూలంగా ఒవైసీ పార్టీ వ్యవహరిస్తోందన్న సరికొత్త విమర్శల జడివాన మొదలైన నేపథ్యంలో బిజెపి నేతల అనూహ్య వ్యాఖ్యలు తేనెతుట్టెను కదిపాయి. బిహార్‌లో పదేళ్లుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మధ్యలో చేసిన ‘మాంజీ’ ప్రయోగం వికటించి మళ్లీ సింహాసనం ఎక్కారు. మోదీతో విభేదించి, లోక్‌సభ ఎన్నికల్లో భారీగా నష్టపోయిన నితీష్ ఒంటరిపోరుతో ఒనగూడేదేమీ ఉండదన్న సత్యంతో లాలూతో సఖ్యత కుదుర్చుకున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సామెతకు బిహార్ రాజకీయాలు సరైన ఉదాహరణ. సరే, రాజకీయ ఉద్దండుల అంచనాలన్నీ నిజమవుతాయా? ఓటర్ల నాడి ఏమిటన్నది అంతుబడుతోందా? అంటే ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే. అయితే తాజా పరిణామాలు, బిహార్‌లో కొత్తగా వచ్చిన ఓటర్లు, తొలిమూడు దశల్లో మహిళా ఓటర్లు పెద్దసంఖ్యలో ఓటువేయడంవంటి అంశాలనుబట్టి కొంతవరకు పరిస్థితిని ఊహించవచ్చు. కులమే మూలం.. దేశంలోని వెనుకబడిన రాష్ట్రాల్లో బిహార్ ఒకటి. అక్షరాస్యతలో వెనుకబడి ఉన్న ఈ రాష్ట్రంలో అన్నింటికన్నా కులాల ప్రభావమే అధికం. అన్ని పరిణామాలూ ఈ అంశం ఆధారంగానే సంభవిస్తూంటాయి. ‘మండల్ వివాదం’ రాజుకోకముందు వరకు అది అంతర్లీనంగానే ఉన్న వ్యవహారం. ఆ తరువాత అది విచ్చలవిడిగా, విశృంఖలంగా మారిపోయింది. కులం ప్రస్తావన లేని విధానం లేదు. ఎన్డీఏతో జతగట్టి నితీష్ అధికారంలోకి వచ్చాక ఆ రాష్ట్రం తొలిసారిగా అభివృద్ధి మార్గాన పయనించడం మొదలైంది. ఇది తిరుగులేని నిజం. యాదవులను ఏకతాటిపై నడిపి చాలాకాలం పాటు అధికారంలో ఉన్న రాజకీయ చతురుడు లాలూప్రసాద్ యాదవ్ అవినీతి కారణంగా ఎన్నికలకు దూరమయ్యాక ఆ వర్గం వెనుకబడింది. యాదవుల కారణంగా ఎన్నో కష్టాలు పడిన కొన్ని వర్గాలు నితీష్ పంచన చేరి ఎన్డీఏకు అద్భుతమైన విజయాలు అందించాయి. మారిన పరిణామాల్లో నితీష్ యాదవుల మద్దతుకోసం లాలూతో చేయిచేయి కలపడం రాజకీయంగా కలసివస్తుందని భావిస్తున్నా కొన్ని సందేహాలు జెడియును భయపెడుతున్నాయి. యాదవుల పొడగిట్టని కొన్ని వెనుకబడిన వర్గాలు, అగ్రకులాలు వారికి దూరమవుతారన్న అంచనాలున్నాయి. సరే..ఎన్నికల వేళ బిహార్‌లో కులాల పాత్ర ఏమిటో చూద్దాం. ఓటర్లు 6.6 కోట్లు బిహార్‌లో ఎన్నికల్లో ఓటుహక్కు కలిగినవారి సంఖ్య 6.68 కోట్లు. వీరిలో పురుషులు 3.56 కోట్లు, మహిళలు 3.11 కోట్లమంది. మొత్తం ఓటర్లలో మహిళల సంఖ్య 30శాతం. కొత్తగా ఓటుహక్కు వచ్చినవారి సంఖ్య 20 లక్షలమంది. వీరంతా తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈసారి ఎన్నికల్లో మహిళలు, తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోబోయే కొత్తఓటర్లు ఫలితాలను నిర్దేశిస్తారని అందరూ భావిస్తున్నారు. ఇదీ కులాల లెక్క.. బిహార్ ప్రత్యేకతే కులాలు. ప్రజాస్వామ్యం, నీతివంతమైన రాజకీయాలు వంటి పడికట్టు పదాలు ఆ రాష్ట్రంలో పనిచేయవు. రాజనీతి వేరు, రాజకీయం వేరని బిహార్ రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. లౌకికవాదం, మతవాదం అన్నమాటలు అక్కడి కులాలు, మతాల అంశాల వారీగానే మాట్లాడతారు. రాజకీయ పరమపద సోపానపటంలో సింహాసనం అధిష్ఠించాలంటే కులం,మతం ఆనుపానులన్నీ తెలుసుకోవాలి. ఆ లెక్కల్లో ఇప్పుడు ఎవరు ‘బెస్ట్’ అన్నది త్వరలో తేలిపోతుంది. ఇప్పటికిప్పుడు వారు వేసుకున్న రాజకీయ లెక్కలకు మూలం ఇలా ఉంది. విభజన తరువాత పూర్వ ప్రాభవం కోల్పోయిన బిహార్ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యతను ఈసారి దక్కించుకున్నాయి. అందుకే అక్కడ ఉన్న వందలాది వర్గాల్లో ఎక్కువమంది మద్దతుకోసం రాజకీయ పక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒబిసి వర్గాలు 50శాతం మేరకు ఉన్నాయి. వీరిలో యాదవుల వాటా 15శాతం. కుర్మీ, కొయిరి, కుశవహ వంటి కులాల వాటా దాదాపు 11శాతం. బాగా వెనుకబడిన వర్గాలు (ఇబిసి)లు 20 శాతం. రాష్ట్రంలోని కనీసం 30 నియోజికవర్గాల్లో ప్రభావం చూపే ముస్లింలు 17 శాతం. అగ్రకులాలు 15 శాతంమంది ఉన్నారు. వీరిలో రాజపుత్రులు 5, భూమిహార్ 4, బ్రాహ్మణులు 5, కాయస్థులు 1శాతం ఉన్నారు. వీరుకాక మహాదళితులు 16శాతం మంది ఉన్నారు. మహాదళితుల్లోకి రాని దళితులు 4శాతంమంది ఉన్నారు. కులం వారీగా లెక్కలోకి రాని ఓటర్లు 2శాతంమంది ఉన్నారు. కులాలు, మతాల వారీగా ఇదీ అసలు స్వరూపం. ఎవరి పక్షాన ఎవరు? చాలాకాలం పాటు అధికారంలో ఉన్న లాలుప్రసాద్ యాదవ్ అంటే యాదవులకు చాలా ఇష్టం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా, ఆయన కొన్నాళ్లుగా క్రియాశీలంగానే వ్యవహరిస్తున్నారు. పెద్దసంఖ్యలో ఉన్న యాదవులు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటం, తన ఇద్దరు కొడుకులు, కుమార్తె రాజకీయంగా ఇంకా ఎదగకపోవడం, తనవర్గాన్ని ఇప్పటికైనా కాపాడుకోకపోతే భవిష్యత్ లేదన్న సత్యం తెలిసిన లాలూ నితీష్‌కు స్నేహహస్తం చాటారు. మోదీతో విభేదించి లోక్‌సభ ఎన్నికల్లో నష్టపోయిన ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని యాదవుల మద్దతు పొందేందుకు ఓ అడుగువేశారు. నితీష్‌కూడా ఓబిసియే. ఆయన కుర్మీ కులస్థుడు. అవినీతి మకిలి లేని నాయకుడు. అభివృద్ధిని అలవాటు చేసిన నేత. ముస్లింలు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలకు ఆదర్శంగా ఉన్న నాయకుడు. అయితే, ప్రధాని మోదీతో ఢీకొట్టి చతికిలపడ్డారు. మోదీకి గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడంత ప్రభ లేదని నితీష్ అంచనా. పైగా లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలకు చాలా తేడా ఉందని, దిల్లీ ఎన్నికలే అందుకు నిదర్శనమని భావిస్తున్నారు. మోదీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఎలాగూ చేసేదేమీ లేదు. అందుకే లాలూ, నితీష్‌లతో చేతులు కలిపింది. మోదీ భయం ఆ రెండు పార్టీలకన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ. నితీష్ ఓడితే అతడికన్నా తమపార్టీకే ఎక్కువ కష్టాలని భావిస్తోంది. అందుకే సోనియా, రాహుల్ బిహార్ బరిలోకి దిగి మోదీపై విరుచుకుపడుతున్నారు. ములాయం దూరం జరిగాక, లెఫ్ట్‌పార్టీలు ఓ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. లోపాయికారీగా అవి నితీష్ వర్గానికి సహకరించే సూచనలు కన్పిస్తున్నాయి. ఇక తొలిసారిగా ఎంఐఎం రంగంలోకి దిగింది. జాతీయ పార్టీగా విస్తరించడానికి బిహార్ ఎన్నికలను ఒవైసీ ఉపయోగించుకుంటున్నారు. బిజెపికి పరోక్షంగా సహకరించడానికి ఒవైసీ ప్రయత్నిస్తున్నారని, ఓట్ల చీలికవల్ల నితీష్ కూటమి నష్టపోయి, బిజెపి కూటమి బలపడుతుందని వారంతా భయపడుతున్నారు. ఈలోగా అనుకోని పరిణామాలు సంభవించి పరిస్థితుల్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ఇక దిల్లీలో గుణపాఠం చెప్పిన ఆప్, గుజరాత్ తాజా హీరో హార్థిక్ పటేల్ వంటివారి సన్నాయినొక్కులు బిజెపిని ఎంతోకొంత నష్టపరిచే అవకాశం ఉంది. ఎన్డీయే కూటమి పరిస్థితి… ఇక ఎన్డీయే కూటమిలో బిజెపి ప్రధాన పార్టీ. రామ్‌విలాస్ పాశ్వాత్ లోక్‌జన్‌శక్తి, మాజీ ముఖ్యమంత్రి మాంజీ సారథ్యంలోని హిందుస్తాన్ అవామ్ మోర్చా, మరికొన్ని పార్టీలు ఇందులో ఉన్నాయి. మోదీ ప్రభావం, అభివృద్ధి నినాదం వల్ల తమకు మేలు జరుగుతుందని ఆ కూటమి భావిస్తోంది. మహాదళిత వర్గానికి చెందిన మాంజీ, దళిత వర్గానికి చెందిన రామ్‌విలాస్ పాశ్వాన్, ఒబిసిల్లోని యాదవ వ్యతిరేక వర్గాలు, అగ్రవర్ణాలు తమకు అండగా నిలుస్తాయని ఆ పార్టీలు అంచనావేస్తున్నాయి. మహాకూటమి పరిస్థితి ప్రీ పోల్ సర్వేలు, అక్కడి వాస్తవ పరిస్థితులను అంచనావేస్తే రెండు కూటములు సమఉజ్జీలుగా ఉన్నాయి. అప్పటికప్పుడు ఫలితాలు అంచనావేస్తే కొద్దిగా ఎన్డీయే పైచేయి సాధించింది. మూడోదశ పోలింగ్ జరిగాక మహాకూటమికి పరిస్థితి అనుకూలంగా మారిందని అర్థమవుతోంది. బిజెపి, పరివార్ నేతల అసందర్భ, అనుచిత వ్యాఖ్యల వల్ల ఆ పరిస్థితి ఏర్పడింది. ఐదారు స్థానాలు ఆధిక్యత సాధించనుందన్న ఎన్డీయే కూటమికి గట్టి దెబ్బ తగిలిందన్న ప్రచారం సాగుతోంది. దీంతో ఆ కూటమి దిద్దుబాటు చర్యలకు దిగింది. నితీష్ ఎత్తుగడ ఎన్నికల ప్రచారంలో మహాకూటమి తరపున నితీష్‌కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌లు ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తున్నారు. బిజెపి బృందం తప్పిదాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నెమ్మదిగా పైచేయి సాధించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించుకుంటున్నారు. ప్రచారం ప్రారంభమైన వెంటనే ‘బిహారీ..బాహరీ’ నినాదంతో బిజెపికి నితీష్ చెక్ చెప్పారు. బిజెపి తరపున రాష్ట్రం నుంచి పనిచేస్తున్న ఏకైక వ్యక్తి సుశీల్ మోదీ. ఆయన కూడా కొన్ని సంవత్సరాల క్రితం బిహార్‌కు వచ్చి స్థిరపడిన వ్యక్తి. ప్రధాని మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర నాయకులు బిహార్‌కు చెందినవారు కాదు. ఎన్డీయే కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. దీంతో నితీష్ ఓ విమర్శ చేశారు. బిహార్‌కు చెందిన తనను గెలిపిస్తారా..? బయటినుంచి వచ్చి వెళుతున్నవారిని గెలిపిస్తారా? అంటూ గళమెత్తారు. పైగా ఎన్డీయే ప్రచార సామాగ్రిలో ఉండే నేతల్లో ఎక్కువమంది గుజరాతీయులే. రాష్ట్రానికి చెందిన నేతలకు సరైన స్థానం లేదు. ఈ విషయాన్ని కూడా నితీష్ వదిలిపెట్టలేదు. దీంతో బిజెపి తన ప్రచార వ్యూహాన్ని మార్చుకోవలసి వచ్చింది. దేశంలో రిజర్వేషన్లను పునః పరిశీలించాలన్న ఆర్‌ఎస్‌ఎస్ అధినేత భగవత్ చేసిన వ్యాఖ్యలో నిజానిజాలు, సహేతుకత పక్కనపెడితే నితీష్‌కూటమికి అది పెద్ద ఆయుధమైపోయింది. మండల్ తరువాత బిహార్‌లో తీవ్రమార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో, వెనుకబడిన, అతివెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో సహజంగా ఆయన వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయి. ఈ విషయాన్ని లాలూ-నితీష్ జంట తమకు అనుకూలంగా మార్చుకుంది. బిజెపి ఇప్పుడు కక్కలేని, మింగలేని స్థితిలో ఉంది. అయితే ఈ వ్యాఖ్యల వల్ల అగ్రవర్ణాలు సంపూర్ణంగా బిజెపికి సమర్థించవచ్చు. ఈ వర్గంలో ఓట్ల చీలిక ఉండకపోవచ్చు. దళితుల హత్యపై కేంద్రమంత్రి వికె సింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు, దాద్రీ సంఘటన, బిజెపి పరివారంలో కొందరు చేసిన వ్యాఖ్యలు ముస్లింలు, దళితుల్లో ప్రతికూలతకు కారణమయ్యాయి. గొడ్డుమాంసంపై నిషేధం వంటి నిర్ణయాలు ముస్లింలను ఎన్డీయే కూటమికి దూరం చేసాయి. అయితే బిజెపి అంచనా వేరుగా ఉంది. బీఫ్, దాద్రీ సంఘటనల వల్ల హిందువుల మద్దతు తమకు గరిష్టంగా ఉంటుందని, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఈ భావన తమకు ఉపకరిస్తుందని అంచనావేస్తోంది. కాకపోతే రిజర్వేషన్లపై వ్యాఖ్య మాత్రం ఆ పార్టీని కలవర పెడుతోంది. కమలం కల మోదీపైనే ఆశలన్నీ పెట్టుకున్న బిజెపి బిహార్‌లో గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. దిల్లీతరహా అనుభవం ఎదురవకూడదని భావిస్తోంది. అగ్రకులాలకు, వెనుకబడిన వర్గాలకు మధ్య పోటీ అన్న లాలూ ప్రచారాన్ని ఆసరా చేసుకుని బిజెపి మొదట నితీష్ కూటమికి చెక్ చెప్పింది. బిహార్‌లో వెనుకబడినవర్గాల్లో యాదవులదే అగ్రస్థానం. వారి ఆధిపత్యంతో నలిగిపోయిన ఇతర ఒబిసిలు బిజెపిని ఆశ్రయిస్తారని ఆ పార్టీ అంచనావేసింది. నితీష్‌పై ఆయా వర్గాలకు ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ యాదవులను నమ్మే సాహసం వారు చేయకపోవచ్చు. లాలూ అధికారంలో ఉండగా వారు పడిన ఇబ్బందులను ఇప్పటికీ వారు మరిచిపోలేకపోతున్నారు. ‘జంగిల్‌రాజ్’ మళ్లీ వద్దన్న మోదీ మాటలు పనిచేస్తాయని ఆశతో ఉంది. అభివృద్ధి, భారీ ప్యాకేజీ, ఆ ప్యాకేజీని వద్దన్న నితీష్ వైఖరిని ఆ కూటమి తూర్పార పట్టి ఓటర్లకు చేరవయ్యింది. కాస్త పరిస్థితులు అనుకూలిస్తున్న తరుణంలో బీఫ్ నిషేధం, దానిపై మంత్రుల వ్యాఖ్యలు, రిజర్వేషన్ల వివాదం, దాద్రి సంఘటనలు కష్టాలను తెచ్చిపెట్టాయి. నితీష్ అభివృద్ధి చేసినా, అది అంతంతమాత్రమేనని ఆ పార్టీ చెబుతోంది. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ పేరు ప్రకటించడం, లాలూ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా నితీష్‌కే మద్దతిస్తామని స్పష్టం చేయడం వారికి లాభం చేకూర్చే అంశాలు. ఎన్డీయే కూటమికి ఆధిక్యం వస్తే ముఖ్యమంత్రి ఎవరన్నది చెప్పలేదు. మాజీ ముఖ్యమంత్రి మాంజీ వల్ల మహాదళితులు, పాశ్వాన్ వల్ల దళితులు, అగ్రవర్ణాల్లోని రాజపుత్రులు, భూమిహార్, కాయస్థ, బ్రాహ్మణులు తమకు పట్టం కడతారన్న ఆశతో ఉంది. మహిళలు, యువకుల్లో మోదీని అభిమానించేవారే ఎక్కువని బిజెపి ఆశపడుతోంది. ఉత్తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్‌కే ఎక్కువమంది మద్దతిచ్చినా స్థానిక రాజకీయాలను ప్రభావితం చేసే ఇతర అంశాలు, కులాల లెక్కలు ఓటువేయడానికి కారణమవుతాయి. ఇప్పటికే జరిగిన పొరపాట్ల వల్ల వచ్చే ప్రమాదాన్ని పసిగట్టిన బిజెపి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. పట్టణ ఓటర్లను ఆకర్షించడం, మహిళలు, యువ ఓటర్లను తమవైపు మళ్లించడం, స్ధానిక నేతలను ప్రచారంలోకి దించడం, ప్రధాని మోదీ ప్రచార సభలు భారీగా నిర్వహించడంవంటి చర్యలు చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో యువకులు, మహిళలు, ఒబిసిల్లో కొన్ని వర్గాలు బిజెపి పంచన చేరాయి. ఈసారి అలాంటి పరిస్థితి లేదని నితీష్ కూటమి భావిస్తోంది. నితీష్ కుర్మి వర్గానికి (ఒబిసి) చెందిన వ్యక్తి. ఒబిసిల్లోని కొయిరి వర్గానికి చెందినవారు, కుశవహ వర్గానికి చెందినవారు బిజెపిని ఆదరిస్తారని, మోదీకూడా ఒబిసి వర్గానికి చెందినవారేనని ఆ పార్టీ భావిస్తోంది. నితీష్ తన కుటుంబానికి, బంధువర్గానికి ఎన్నికల్లో ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ఇది ఆయనకు లాభించే అంశం. కాగా, లాలూ తన ఇద్దరు కుమారులు తేజ్, తేజస్విలను ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇది ఆయనకు నష్టం కలిగించే అంశం. వ్యక్తిగతంగా ఆ ఇద్దరూ గెలిచినా యాదవులను వ్యతిరేకించే ఇతర వర్గాలు తమకు రక్షణ కల్పించే బిజెపి కూటమివైపు మళ్లవచ్చు. నితీష్‌పై వారికి అభిమానం ఉన్నా, ఆయన లాలూ పక్షాన ఉండటంవల్ల తమకు మేలు జరగదని వారు భావించడమే అందుకు కారణం. అందువల్ల ఎవరు ఎన్ని అంచనాలు వేసుకున్నప్పటికీ స్థానికంగా భద్రత, అభివృద్ధి అంశాల ప్రాతిపదికన ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఏతావతా బిహార్ ఎన్నికల్లో బిజెపి కూటమి గెలిస్తే- అది మహాకూటమి రాజకీయ అవకాశవాదం ఓటమిగా భావించాల్సి వస్తుంది. ఎన్డీయే కూటమి ఓటమిపాలైతే అది స్వయంకృతమనే అనుకోవాలి. నిజానికి అంతిమ విజేత ఓటరే కదా! ఎందుకంటే అందరి అంచనాలను తలకిందులు చేసే శక్తి అతడికే ఉంది. * నవ, యువ ఓటర్లు కీలకం బిహార్‌లో మొత్తం 6 కోట్ల 68 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉంది. వీరిలో 30శాతం మంది 18నుంచి 29 ఏళ్లలోపువారు. తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోవలసినవారి సంఖ్య దాదాపు 20 లక్షలమంది. నిజానికి గత ఎన్నికల్లో బిహార్‌లోని నియోజికవర్గాల్లో ఒక్కో అభ్యర్థికి సగటున వచ్చిన ఆధిక్యం 15వేలు. ఈసారి కొత్తగా నమోదైన, తొలిసారి ఓటుహక్కును వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య నియోజికవర్గాల వారీగా విభజిస్తే అంతకంటే ఎక్కువే. అందువల్ల ఫలితాన్ని శాసించే స్థితిలో వీరున్నారు. అయితే రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో పేరు నమోదు చేసుకున్నా వారు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారని, వీరు ఎన్నికలకు రారని అంటున్నారు. బిజెపి ఇలాంటివారిపై ఓ కనే్నసి, వారిని ఎన్నికలవేళకు రప్పించాలని పనిచేస్తోంది. బలం…బలగం ఎవరెన్ని చెప్పినా, ఎంత ప్రచారం చేసినా, ఎన్ని విమర్శలు చేసినా అంతిమంగా నిర్ణయాన్ని చెప్పవలసినది ఓటరు. అతడు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటువేస్తేగాని అది తేలదు. తమకు అనుకూలమైనవారిని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటువేసేలా చేయడంలోనే సగం గెలుపు ఉంటుంది. అలా చేయాలంటే సరైన బలం, బలగం ఉండాలి. బిజెపికి బిహార్‌లో 6 లక్షలమంది సుశిక్షుతలైన కార్యకర్తలు ఉన్నారు. వీరిలో సగం మంది బిజెపి కూటమికి అనుకూలంగా ప్రచారం చేస్తారు. మిగతా సగం మంది మహాకూటమికి సానుకూల అంశాలపై సమాచారం సేకరించి వాటికి తగ్గట్లు వ్యూహాలు అమలు చేస్తారు. టీస్టాళ్లు, రచ్చబండల వద్ద వీరంతా తమ పనిచేసుకొస్తూంటారు. ఇక, 70వేల మంది ఆర్‌ఎస్‌ఎస్ వలంటీర్లు రంగంలోకి దిగారు. తమ సంస్థ అధినేత భగవత్ వ్యాఖ్యల అనంతరం వీరు తమ వ్యూహాన్ని మార్చారు. ఇక 80 లక్షలమంది సభ్యులు ఆ పార్టీకి ఉన్నారు. జెడియుకు లక్షమంది కార్యకర్తలు ఉన్నారు. మరో పదివేలమంది ఆర్‌జెడి పక్షాన కార్యకర్తలు ఆ పార్టీకి పనిచేస్తున్నారు. ఇక మాంజీ, ఒవైసీ, లెఫ్ట్ పార్టీల తరపున పెద్దగా బలగం లేదు. కాంగ్రెస్ పక్షాన పదివేలమంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. సంస్థాగత నిర్మాణం గట్టిగా ఉన్న బిజెపికి ఈ విషయంలో లాభం చేకూరే అవకాశం ఉంది. మహిళలే నిర్ణేతలా? తొలి మూడు దశల్లో 57శాతం పైగా మహిళా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఓటర్లలో వారిసంఖ్య 3కోట్లపైమాటే. అంటే దాదాపు 45శాతం. గత లోక్‌సభ ఎన్నికల్లో వీరిలో ఎక్కువమంది మోదీకి పట్టంగట్టారు. ఈసారి వారిమొగ్గు ఎవరివైపో కచ్చితంగా తెలియడం లేదు. నితీష్ పాలనపై వారికి సంతృప్తి ఉన్నా ఆయన కూటమిలోని మిగతా పక్షాలపై వ్యతిరేకత ఉంది. వెనుకబడినవర్గాలకు మంచి విద్యావకాశాలు, విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇవ్వడంవంటి పథకాలు నితీష్‌కు అనుకూలమైనా మోదీ ఆకర్షణనూ తక్కువ అంచనా వేయలేని పరిస్థితి.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.