గీర్వాణ కవుల కవితా గీర్వాణం –4 1-శ్రీ పన్నాల రాధా కృష్ణ శర్మ

నాలుగవ గీర్వాణం

 

సాహితీ బంధువులకు నమస్సులు –‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’శీర్షికతో మొదటిభాగం లో 146,రెండవ భాగం లో 254,మూడవ భాగం లో 118మంది అంటే మొత్తం 518 మంది సంస్కృత కవుల గురించి అంతర్జాలం లో రాసిన సంగతి మీకు తెలుసు .ఇంకారాయవలసిన కవులు  చాలామందే ఉన్నారు .శ్రీ తూములూరి శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి సౌజన్యం తో నాలుగైదు రోజులక్రితం శ్రీ మేళ్ళ చెరువు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు(తెనాలి ),శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ గారు పరిచయమై వారికి మన పుస్తకాలు పంపగా తమ గురించి తమ రచనల గురించే కాక ఇంకా లబ్ధ ప్రతిష్టి తు లైన కవుల గురించి వారి రచనల గురించి వివరాలు తెలియ బరుస్తామని చెప్పారు .శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ గారూ శ్రీ దక్షిణామూర్తి శాస్త్రిగారు,శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారి ద్వారా పరిచయమై అక్టోబర్ 19న హైదరాబాద్ లో నేను వారిని సందర్శించి ఇంటర్వ్యు చేసి రికార్డ్ చేశాను .వీరిని గురించి రాయాలి .నిన్న మా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు అమెరికా నుండి ఆచార్య శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి(ఎలమర్రు )గురించి విలువైన సమాచారం నెట్ ద్వారా పంపారు .కనుక’’ నాలుగవ గీర్వాణం’’   ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాను .ఎవరి గురించి వివరం లభిస్తే వారి గురించి ఇందులో రాస్తాను .దీనికి మళ్ళీ ఒకటో నంబరు తో మొదలు పెడతాను .చదివి స్పంది౦చ వలసినదిగా మనవి .-మీ దుర్గాప్రసాద్

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –4

1— శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మ

శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ గారు 1932మర్చి 22న కృష్ణాజిల్లా నూజివీడు దగ్గర నరసాపురం లో జన్మించారు .నూజి వీడు జమీందారు గారు వీరి తండ్రిగారిని ఆహ్వానించి  తీసుకెళ్ళారు .ఎలిమెంటరీ స్కూల్ చదువు లేదు .లెక్కలు వచ్చేవికావు .మేస్టార్లు కొడతారని బడికి వెళ్లేవారుకాదు. తలిదండ్రులు శ్రీ కానాది భట్ల సూర్యనారాయణ, కోటమ్మగార్లు ,చిలకలూరి పేట పన్నాల వెంకట సుబ్బయ్య గారికి దత్తత వెళ్ళారు .అక్కడా చదువు సాగలేదు పెంపుడు తండ్రి స్వేచ్చ నిచ్చేవాడుకాడు ..బంధువుల ఇళ్ళల్లోఏదో పని చేస్తూ ఉండేవారు   చదువు లేదు చట్టుబండలు లేదని ఆక్షేపించారు .పట్టుదల వచ్చింది .కృష్ణా జిల్లా గొడవర్రులో 1945సంస్కృత పాఠ శాలలో చేరారు .దీన్ని త్రిలింగ విద్యా పీఠం ఆధ్వర్యం లో .చుండూరి వెంకట రెడ్డి నిర్వహించేవారు .సుమారు రెండేళ్ళు కావ్యాలు చదివారు .గురువు శ్రీవెల్లంకి సత్యనారాయణగారు   .ఇక్కడి నుండి గురువుగారి బావగారు పైడిమర్రి చంద్రమౌళి శాస్త్రిగారి దగ్గర నేలకొండపల్లి లో చేరి వ్యాకరణం మొదలైనవి చదివారు .గొప్ప పునాది ఏర్పడింది ఇక్కడే అని గర్వంగా చెప్పారు ..సంస్కృతం మీద అభిమానం బాగా కలిగింది .శ్రీమతి కాత్యాయని ని వివాహమాదారు కుమారుడు, కుమార్తె కలిగారు .

గుంటూరు జిల్లా పరిషద్ హైస్కూల్స్ లో తలుగు పండితులుగా పని చేస్తూ 1969లో తెలుగు ఏం ఏ ,72లో సంస్కృతం ఏం ఏ సాధించారు . రామాయణం ,రామాయణం ఆధారంగా వచ్చిన వివిధ ప్రక్రియలలో  ‘’శ్రీరామ శీలాను శీలనం’’ విషయమ౦  గా గ్రహించి పరిశోధన చేసి 1977లో పిహెచ్ డి పొందారు .బరోడాకు చెందినఒక పరీక్షకుడు ‘’రాముడు దేవుడైతేఏం  కాకపొతే ఏం’’అని వ్యాఖ్యానించి నందుకు  మనసు నొచ్చుకొని శ్రీ రాముడినే శంకి౦చి నందుకు బాధ పడి డాక్టరేట్ పొందినా ఎక్కడా ‘’డాక్టర్ ‘’అని రాసుకోలేదని చెప్పిన  మహోన్నత వ్యక్తిత్వం పన్నాల వారిది  .  .ఆంధ్రా యూని వర్సిటీ లో లెక్చరర్ పోస్ట్ కు ప్రయత్నించారు .అది తీవ్ర పోటీగా మారి వీరికి అందలేదు .అప్పటికే ఎన్నో గ్రంధాలు సంస్కృత ఆంధ్రభాషలలో రాసి ఉన్నందున వీరి పేరు విశేష వ్యాప్తి చెంది .ధర్మపురి సంస్కృత కళాశాలలో ఇంటర్వ్యు లేకుండానే వీరి ప్రతిభ గుర్తించి ప్రిన్సిపాల్ పదవినిచ్చారు .అంతకు ముందు నాలుగు నెలలు గూడూరు దగ్గర విద్యానగరం కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు .

జిల్లెళ్ళమూడి సంస్కృత  కాలేజి లో’’ అమ్మ’’ ఆహ్వానం తో చేరి  1971 నుండి 1987 వరకు  ప్రిన్సిపాల్ గా పని చేసి,అమ్మ చరణార విందమధు మత్త  భ్రుంగమై,ఆమెపై స్తుతి ,స్తోత్రాలుఎన్నో  రాస్తూ ,ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ ,కళాశాలకు సేవలందించారు . 1978లో స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు .మధ్యలో డెప్యుటేషన్ పై1981నుండి 86వరకు   తిరుపతి దేవస్థానం తరఫున వ్యాసభాగవతం శుద్ధ ప్రతి(క్రిటికల్ ఎడిషన్ )  ప్రచురించే ప్రాజెక్ట్ లో వీరిని పరిష్కర్తగా తీసుకొన్నారు. ఎన్నాళ్ళైనా అది నత్త నడక నడుస్తుంటే విసుగెత్తి మానేసి హైదరాబాద్ లో స్థిరపడ్డారు .వీరికి ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు కుమారుడు బి టెక్ పాసై అమెరికాలో ఉద్యోగిగా ఉంటున్నాడు .కుమార్తె బెంగుళూరులో ఉంటున్నది

పోతుకూచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రిగారమ్మాయి శ్రీమతి ఝాన్సీ   పన్నాల వారి ‘’పావక ప్రభ’’ కు ప్రతిపదార్ద తాత్పర్యాలను రాశారు . పావక ప్రభ ను శ్రీ ఏం దినకర్ ఇంగ్లీష్ లోకి ‘’The Sojourn “’గా అనువదించారు  ..డాక్టర్ శ్రీమతి సుగుణ పన్నాలవారు ‘’జిల్లెల్ల మూడి అమ్మ ‘’గారిపై వ్రాసిన  గ్రంధాలపై రిసెర్చ్ చేసి పి హెచ్ డి పొందారు                                         .పన్నాల వారు ‘’యోగ వాసిష్ట సారం, . రామదాసు చరిత్ర ,శృంగార లహరి ,అంబికా సహస్ర నామ స్తోత్రం ,అంబికా సుప్రభాతం ,అంబికా స్తవ కదంబం ,అంబికా కరావలంబ స్తోత్రం ‘’మొదలైన రచనలు చేశారు .అమ్మ ఆశ్రమానికి దాదాపు ఇరవై దాకా పుస్తకాలు రాసి అందజేశానని ,తన వద్ద ఒక్క కాపీ కూడా లేదని తాను ప్రచారం కోరుకోలేదని ఆ’’ జ్ఞాన పండు’’అతి వినయంగా నాతొ అన్నారు . దీనికి నిదర్శనం వారి రచనల్లో వారి పేరు తప్ప ఏ విధమైన వివరాలు, విశేషాలు ఉండక పోవటమే .తనది ఒక భాషా సేవగా, అమ్మ పద సేవగా వారు భావించి జీవించారు .సంతృప్తి వారి జీవితం లో స్పష్టంగా కనిపిస్తుంది .భేషజాలు లేని వ్యక్తిత్వం, డబ్బ పండు లాంటి ఛాయా మనల్ని ఆకర్షిస్తాయి .,రమణ మహర్షి రాసిన ‘’ఉమా సహస్రం ‘’ కావ్యాన్ని  అనువాదం చేశానని చెప్పారు  .యోగ వాసిష్ట సారం ఇటీవలే రాశారు  83 ఏళ్ళ జ్ఞాన వయో వృద్దు శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మగారిని వారింట్లో అక్టోబర్ 19 సాయంత్రం  సందర్శించి మాట్లాడి ధన్యుడనయ్యాను .

ఇప్పుడు వారి గీర్వాణ వాణీ విలాసాన్ని చూద్దాం –ముందుగా ‘’శృంగార లహరి’’లో స్నానిద్దాం .పన్నాలవారికి సర్వం జిల్లెల్ల మూడి అమ్మ గా దర్శనమిస్తుంది .ఆమెయే ఆయన శృంగార లహరి  .

మొదటి శ్లోకం ‘’యయా శక్త్యా బ్రహ్మా కమల నయనః ఫాలనయనః –జగత్ స్రస్టు౦ పాతుం ప్రళయ ముపనేతు  చ కుశలాః

యాయా వ్యాప్తం విశ్వం వసతి ఖలు యస్యాం జగదిదం –నమామాద్యాం దేవీం ముకుళిత కర స్తా మభ య దా౦ ‘’ మరొకటి –

‘’నమే సంధ్యో పాస్తి .ర్నచ విహిత కర్మ స్వభిరతి –స్త్వదీయా౦ఘ్రి ద్వంద్వం విధి వదసి నాభ్యర్చిత మహో

కిమాలోక్య వ్యర్దే మయి సదయ భావా సి జనని – తవైత ద్వాత్సల్యం వదతి భవతీం విశ్వ జననీం ‘’

సంస్కృత కవితాప్రవాహం శంకరాచార్యుల సౌందర్య లహరిని తలపింప జేస్తుంది .జిల్లెళ్ళమూడిని ‘’అర్క పురి

‘’అన్నారు.అమ్మ దివ్య చరిత్రయే ఈ లహరి .ఆమె హంసత్వాని వర్ణిస్తూ చెప్పిన శ్లోకం పరమ గభీరంగా ఉంది .

‘’భజంతే హంసా స్తంవిధి మపి నిషేవ్యోదక పయో –విభాగ ప్రాశస్త్యం తవ తు చరణౌ సేవిత వతాం

క్రుతార్దానాం నీరం భవతి విమల క్షీర మహ-ప్రభవం క స్తోతుం ప్రభవతి  శుభే తావక మిహ ‘’

చివరగా ఒక శ్లోకం

‘’క్వణన్మంజీరం  భో జనని విచారంత్యాం త్వయి భ్రుశం –నటంత స్సానందం సరభస ము౦ దృశ్యా  దివి షదో

ముదాభ్య్గ్డ ద్గచ్చంతో విదరతి నుతిం తే శివ కరీం –క్రుతార్దా కృత్వా యాం దదతి పరమానంద లహరీం ‘’

‘’అమ్మ ‘’శ్రీ లలితా పరా భట్టారికను దర్శించి పులకించి అనుభూతి తనుపొంది మనకు ఆ ఐశ్వర్యాన్ని కలిగించారు పన్నాల మహాశయులు .

వీరి రెండవ కావ్యం ‘’పావక ప్రభ ‘’ఇదీ అమ్మ మీద రాసినదే .దీనికి డా ధూళిపాల అర్క సోమయాజులుగారు ముందుమాట ఆంగ్లం లో రాశారు .జగన్మాతను స్తుతించే అద్భుత స్తోత్రం అన్నారు .ఇందులో ‘’భ్రూ మధ్యే నవ కు౦కు మం ‘శ్లోకం పరమ రామణీయకం అన్నారు .ఇందులో సాక్షాత్తు శ్రీ రాజ రాజేసశ్వరి అమ్మవారిని జిల్లెళ్ల మూడి అమ్మవారిలో తాదాత్మ్యంగా చూసిన ‘’లో చూపు’’ ఉందన్నారు .అలాగే ‘’యతో విద్యా అవిద్యా ..శ్లోకం ,66వ శ్లోకం 71 వ శ్లోకం కవిగారి భావుకతకు ,భక్తీ తాత్పర్యాలకు పరాకాష్ట అన్నారు .

రెండవ శ్లోకం చూద్దాం

‘’ఏకాకితా ముపగతే జన మండలీనాం –మధ్యే చరన్నివ వినిర్మల శాంతి సౌదే

కల్లోలితః పరమ పుణ్య పదే చ పాపం –చిన్వన్ సచిత్ర మనుజో విలపత్సజశ్రం ‘’

చివరగా

‘’అనవరత ముపాసే తాం సముద్రాంబు పూరా-కరుణ కిరణ లక్మఖేలయా పీయ భూయే

నవ జలధరం లాలీలయా భూత దాత్రీ –రచయితి నవ సస్య స్యమాలాంయా సావిత్రీ ‘’అని ముగించారు అణువణువునా ప్రత్యక్షరం లో అమ్మ ప్రేమామృతమే కనిపిస్తుంది. ఆమెది పావక ప్రభ అంటే అగ్ని కాంతి అనగా పవిత్రం ,పుణ్య లోక ప్రాప్తికరం .తాదాత్మ్య భావన తో శర్మగారు రాసి చిరకీర్తి నార్జించారు .వారు రాసిన స్తోత్రాలు సుప్రభాతాలు అన్నీ నిత్యం జిల్లేళ్ళ మూడి అమ్మ గుడిలో గానం చేస్తారు .అంతకంటే వారికి ఇంకేం కావాలి .ఆ మాటే వారు స్వయం గా చెప్పారు నాతొ .

అలాగే అమ్మ సుప్రభాతం ,అంబికా ప్రపత్తి ,శ్రీ చక్రేశ్వరీ స్తవం  ,అంబికా నవ మాలికా స్తవం రాశారు .దీనితోబాటు రాసిన ‘’అంబికా కరావ లంబ స్తోత్రం ‘’కూడా ప్రసిద్ధి చెందింది .అందులో నుంచి మచ్చుకు కొన్ని. ఇది అర్ధ తాత్పర్యాలతో ఉండటం విశేషం .మొదటి శ్లోకం

‘’ఏకైక మిత్రమితిమాం కలుషా స్సమస్తాః-కర్షంత్య ధీరమతి దుర్బల చిత్త మేనం

నైరాశ్య భార నిహతస్య శివేనసూయే –మాతర్భవామి మామ దేహి కరావలంబం ‘’

భావం –అనసూయా మాతా శ్రేయస్కరీ !దైన్యం తో దుర్బల మనసుతో ధైర్యం చెడి ఉన్న నన్ను మిత్రునిగా భావించి పాపాలన్నీ వశ పరచుకొంటున్నాయి .నిరాశ తో కుంగిపోయా .నాకు చేయూతనిచ్చి ఆదుకో .మరో శ్లోకం

‘’త్వత్సన్నిదౌ ప్రశమితైరపి తే పరోక్షే-క్రోదోద్యతై ర్భయద సంశయ సర్ప రాజైః

దస్టోప్యనన్య శరణ్యస్యశివే నసూయే –మాతర్భవాని ౧మమ దేహి కారావ లంబం ‘’

భా –నీపాదాల దగ్గరున్నప్పుడు నా అనుమానాలన్నీ తీరి నట్లే ఉంటాయి .వదిలి పెట్ట గానే పాముల్లాగా బుసలు కొడుతూ నన్ను కాటు వేస్తాయి .అలాంటి స్థితిలో నువ్వు తప్ప నాకు వేరే శరణు లేరు. కాపాడు తల్లీ

‘’బంధూక పుష్ప రుచి కుంకుమ శోభి తాస్యే –సిందూర రాగ రమణీయ కపోల దేశే

నాసావరీణ కనక ప్రసవే నసూయే –మాతర్భవాని ౧మమ దేహి కారావ లంబం .’’

తా-మంకెన పువ్వురంగు కుంకుమ బొట్టుతో నీముఖం శోభిస్తోంది చెక్కిళ్ళు సిందూరం రంగుతో అందంగా ,నాసిక సంపెంగ పువ్వును పరిహసిస్తున్నట్లున్నాయి .దివ్య తేజో విరాజమానమైన ఓ పరమేశ్వరీ నాకు చేయూత నివ్వు .

ఈ విధంగా శకరాచార్యులవారి కరావ లంబ స్తోత్రానికి దీటుగా దీన్ని పన్నాల వారు ,ఆపన్న శరణ్య ‘’అమ్మ ‘’ చేసాయం కోరారు .చివరి శ్లోకం లో

‘’అంబా పదాబ్జ మధుపాన రతేన రాదా –క్రిష్ణాఖ్య మత్త మధుపేన కృతం మనోజ్ఞం

స్తోత్రం భవేదిద మనుత్తమ సౌఖ్య దాయి –తేషాం సదా సుకృతి నామిహ ఏ పఠంతి’’

భా-అంబిక చరణ కమలాల సేవ అనే మధువును తృప్తిగా గ్రోలి మత్తెక్కిన తుమ్మెద వంటి వాడు ,రాదా కృష్ణుడు(పన్నాల రాదా కృష్ణ శర్మ )అతనిచేత మనోహరమైన ఈ స్తోత్రం రచింప బడింది దీన్ని చదివిన పుణ్యాత్ములు సర్వోత్తమ సుఖాలను పొందుదురు గాక .

మనోజ్ఞం ,అనుత్తమం  .అనే పదాలను స్తోత్రానికి విశేషణాలుగా పన్నాల వారు వాడారు .ఇంతకంటే సుఖం లేనిది ,సర్వోత్తమమైన సుఖాన్ని ఇచ్చేది అని భావం .ఆ సుఖం మామూలు సుఖం కాదు. మనోజ్నమైనది .అంటే మనసుతో మాత్రమే తెలియ బడేది .అనగా సచ్చిదానంద మైన సుఖం .నిర్మలమైన మనస్సు అంటే ఆత్మ.ఆత్మ యొక్క సుఖం ఆత్మకే తెలుస్తుంది .ఇతరులకు తెలియదు .కనుక ఈ స్తోత్రాన్ని సవిమర్శనంగా పఠించే వారికి రాగ ద్వేష రహితమైన శుద్ధమైన ఆత్మగా మనస్సు ఉంటుందని ఫలశ్రుతి చెప్పారు ,వివరణ కూడా వారే ఇచ్చారు ..అందరం చదివి శుద్దాత్ములవ్వాలని పన్నాలవారి అభీష్టం .

చివరగా’’ శ్రీ అంబికా నవ రత్న మాలిక ‘’లోని చివరి శ్లోకం తో సెలవు తీసుకొందాం –

‘’అంబా దివ్య పదార వింద భజనా –నందామృతా స్వాదినా-రాదా కృష్ణ మధు వ్రతేన కలితం బృందం స్తుతీనామిదం

ఆమోదం జనయత్సమస్త సుమన-స్సంఘస్య పృధ్వీ తలే –జీయాదా రవి చంద్ర తార మమలం –మాత్రా శిషాపోషితం ‘’

పన్నాల వారి ఫోటో జత చేశాను చూడండి

మరో కవితో కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-15-ఉయ్యూరు

 

 

‘’

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.