ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -87
38-అమెరికా పత్రికా సామ్రాజ్యాధి పతి,సంచలన కధనాలకు ,ఎల్లో జర్నలిజానికి ఆద్యుడు –విలియం రాండాల్ఫ్ హార్ స్ట్
అమెరికా జర్నలిజం లో వీరవిజయం సాధించినా ,రాజకీయం లో ఘోర పరాజయం పాలైనవాడు విలియం రాండోల్ఫ్ హార్స్ట్.;ఆనాడు’ లార్డ్ ఆఫ్ ది ప్రెస్’’గా ప్రసిద్ధి చెందినజోసెఫ్ పులిట్జర్ కు తీవ్ర ప్రత్యర్ధి విలియం .పులిట్జర్ సెన్సేషనల్ రిపోర్ట్ లతో సంచలనం సృష్టించి ,తన వార్తాపత్రికను ,దానితోబాటు జర్నలిస్ట్ ప్రపంచాన్ని ఒక కొత్త స్వేచ్చా స్తాయికి తెచ్చినవాడు . హార్స్ట్ అధోజగత్ సహోదరుల బుజం కాయటం లో చాంపియన్ గా జీవితాన్ని ప్రారంభించి ,సాంఘిక సంస్కరణలకు వ్యతిరేకియై అ౦తకు ముందెన్నడూ లేని బాధ్యతా రాహిత్య సెన్సేషనల్ వార్తలప్రచురణలతో దెబ్బతిన్నాడు .సెన్సేషనల్ వార్తలు దొరక్కపోతే తానె స్వయంగా వార్తలను వండి వడ్డించేవాడు .అంటే వార్తలను సృస్టించే వాడన్నమాట .తాజా సంఘటనలకు నిత్య గండాలుగా సంకట స్తితులుగా చూపిస్తూ ,ఔత్సుక్యానికి పరాకాష్ట గా మలుస్తూ అంతులేని సంపదను ,పత్రికా సామ్రాజ్యాదిపత్యాన్నీ ,అధికారాన్ని సాధించి ఎన్నో గోలుసుపత్రికల డైరెక్టర్ అయి ,చివరికి ప్రింట్ మీడియాకు డిక్టేటర్ అయ్యాడు .
సిల్వర్ స్పూన్ బాయ్ –ఆమ్మ కూచి
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ ఫ్రాన్సిస్కో లో 29-4-1863లో కోటీశ్వరుడు ,పబ్లిషర్ ,సెనేటర్ అయిన జార్జి హార్స్ట్ కు జన్మించాడు .తల్లి ఫాబే అపర్సన్ .దక్షిణాదికి చెందిన సంస్క్రుతీసంపన్ను రాలు. భర్తలకంటే 22ఏళ్ళు చిన్నది .కవల పిల్లలలో ఒకడుగా జన్మించి ,వేరొకరు చిన్నతనం లోనే చనిపోతే విలియం తలిదండ్రులకు ఏకైక పుత్రుడై గారాబంగా పెరిగాడు .తల్లి ప్రేమనంతా ఇతని మీదే కురిపించింది .ఆప్యాయాన్ని ఆత్మీయతను ఇతని మీదనే చూపించింది .’’సన్నీ’’ అని అల్లారు ముద్దుగా పిలుస్తూ ,విలాసవంతమైన జీవితాన్ని అందిస్తూ పదేళ్ళ వయసులోనే ,తనతో బాటు యూరప్ యాత్రలు చేయించింది .అందుకే ఆ కొడుకు ‘’పిల్లవాడి గొప్ప మిత్రుడు తల్లి మత్రమే ‘’అని గొప్పగా చెప్పేవాడు .తిరిగి వచ్చాల కుటుంబానికి చెందిన గుర్రబ్బండీలో స్కూల్ కు పంపించింది .తానునడిచే స్కూలుకు వెడతానని ,తన బట్టలకు చిరుగులు చూపి కుట్టించమని లేకపోతె తనతోటి నిరుపేద విద్యార్ధులు గేలి చేస్తారని తల్లితో వాదించేవాడు .అ సమయం లో ఆతను 45 వేల ఎకరాల విస్తీర్ణం ఉన్న సాన్ సిమియాన్ లో ఉండేవాడు .17వ ఏట తూర్పున ఉన్నన్యు అంప్ షైర్ లోని సెయింట్ పాల్ కు ప౦పారు .
హార్వర్డ్ లో ఉన్నా జీవితాన్ని’’ లైట్ తీసు’’కున్నాడు
అక్కడ హార్వర్డ్ లో ప్రవేశం కోసం చదివాడు . ఎక్కడో ప్రవాసం లో ఉన్నట్లు ఫీలయ్యేవాడు .చదువుపై శ్రద్ద చూపలేదు .అమ్మ మీద బెంగతో ఉండిపోయాడు .హార్వర్డ్ లో చేరినా అక్కడా సర్దుకు పోవటం కుదరలేదు .చేతినిండా డబ్బు ఉండటం తో జలసాగా విలాసంగా పార్టీలుఇస్తూ ,ప్రతి చిన్న సందర్భానికి టపాసులు కాలుస్తూ దుబారా చేస్తూ ఉన్నాడు .అనేక ప్రాక్టికల్ జోక్స్ ను సృష్టించి స్నేహితులకు చెప్పి నవ్వించేవాడు .తండ్రి పలుకుబడి కొడుకు కలివిడి తో యూని వర్సిటి వారి హాస్య పత్రిక ‘’లాంపూన్ ‘’కు బిజినెస్ మేనేజర్ అయ్యాడు .అడ్డగి౦చలేనంత చిలిపితనం తో చదువు కు గుంట కొట్టి గంట వాయించాడు .అధికారులు గమనిస్తూనే ఉన్నారు .క్రమ శిక్షణ విషయం లో ఇంకొక తప్పు చేస్తే డిస్మిస్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు .ఇవేమీ లెక్క లోకి తీసుకోకుండా’’లైట్ తీసుకొని’’ ‘’కేరే ఝాట్ ‘’గా మారి చదువు వదిలేసి జోకుల కేకులు తింటూ తినిపిస్తూ సంఘం లో కలుపు గోలు తనం పెంచుకొన్నాడు .చివరికి కొద్దికాలం సస్పెండ్ అయి మళ్ళీ చేరి ,తల్లి సేవ చేయటానికి వెళ్ళే ముందు మరో మిస్టేక్ చేసి బహిష్కరింప బడ్డాడు.అతని చేతినిండా చెప్పిన పని చేసే నమ్మకమైన స్నేహితులను డబ్బిచ్చి కుదుర్చుకొని వారితో ఫాకల్టీ సభ్యులకు క్రిస్మస్ బహుమతులను కవర్ లలో పెట్టి అందజేసేవాడు .వాటిని అందుకున్నవారు వాటిని ఓపెన్ చేసి చూస్తె అద్భుతమైన ప్రాచీన కుండలు ,వాటిపై వారి వారి చిత్రాలు ఉండటం గమనించి ఆశ్చర్య పోయే వాళ్ళు .ఇలా’’ బే ఫర్వాగా ‘’రెండేళ్ళు హార్వర్డ్ జీవితాన్ని గడిపాడు .చదువుపై హార్ట్ పెట్టకుండా హార్స్ట్ .
పత్రికాదిపత్యానికి బాటలు
21ఏళ్ళకు పాలిపోయిననీలి కళ్ళతో పాలిపోయిన శరీరం తో ఉండేవాడు .కళ్ళల్లో దృఢమైన నిశ్చయం మాత్రం కనిపించేది .ఆధిపత్యం సాధించాలని 22లో నిశ్చయించుకొన్నాడు .హార్వర్డ్ నుంచి తొలగించటానికి కొద్ది రోజుల ముందు తండ్రికి ఒక గొప్ప ఉత్తరం రాస్తూ తమ ‘’సాన్ ఫ్రాన్సిస్కో ఎక్సామినర్ ‘’పత్రిక ను ,అప్పుడున్న యజమాని-అంటే తన తండ్రి కంటే గొప్పగా నడపగలనని నిర్భయం గా తెలియ జేశాడు.తన ఆశయం నెరవేరటానికి కావలసిన డబ్బు కేటాయించమని కోరాడు .న్యు యార్క్ వరల్డ్ అనే పులిట్జర్ నడిపే పత్రిక కంటే కాలిఫోర్నియా వాతావరణం తో మరింత సృజనాత్మకంగా నడుపుతానని హామీ ఇచ్చాడు .మరో లేఖ రాస్తూ తమ పత్రికలో ఉన్న లోపాలను వివరంగా తెలియ బర్చాడు .ఎలా అభివృద్ధిలోకి తేవాలో సూచించాడు .తక్కువ జీతాలతో సరైన అవగాహన లేని సిబ్బందితో ఇక కుదరదని కొత్త వారితో సర్వోత్క్రుస్టమైన కొత్త నైపుణ్యం తో నడిపితేనే మనుగడ అనీ అన్నాడు .కొడుకు సత్తా ఏమిటో చూద్దామని పత్రికను మరింత సుందరంగా విలాసం గా తీర్చి దిద్దటానికి అడిగిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు అందజేశాడు తండ్రి .కాని కొడుకు ఒప్పుకోలేదు .తండ్రి అనకొండ కాపర్ మైన్స్ తో బాటు ,మోంటానాలో ఉన్న విశాలమైన ఎస్టేట్ కూడా స్వంతం చేస్తానని ఊరించాడు .కాని తానూ న్యూ యార్క్ వెళ్లి అక్కడ ‘’వరల్డ్ ‘’పత్రిక లో స్థానం సంపాదిస్తాను అన్నాడు .తన్ను కొడుకు దెబ్బ తీశాడని గ్రహించాడు సెనేటర్అయిన తండ్రి. అన్నట్లుగానే న్యూ యార్క్ చేరి రాండాల్ఫ్ పడమటి తీరం లో అత్యున్నతస్థానం లో ఉన్న డెమోక్రాటిక్ వార్తాపత్రికకు సంపూర్ణ అధికారాలతో మేనేజింగ్ ప్రో ప్రైటర్ అయ్యాడు .సాన్ ఫ్రాన్సిస్కో కి వచ్చి మళ్ళీ తండ్రికి మూడో లేఖ రాశాడు .కొట్తోచ్చే’’కొత్తదనం ,మిరుమిట్లు గొలిపే సృజన, వార్తా విధానం లో విప్లవం తెస్తానని అందరూ ‘’ఎక్సామినర్ ‘’లోని తను నిర్వహించే దాన్నే చూసేట్లు చేస్తానని ,ఒక ఏడాదిలో పదివేల అదనపు సర్క్యు లేషన్ సాధిస్తానని ,రెండేళ్లలో పెట్టినఖర్చు వచ్చేస్తుందని ,అయిదేళ్ళలో పసిఫిక్ తీరం లో తమదేపెద్ద గొప్ప పత్రిక అని పించుకొంటు0దని తెలిపాడు .
సంచలన వార్తా కధనాలు
హార్స్ట్ ఆలోచన ఊహావిహారంకాదు,స్పస్టమైనదికూడా .అతని నినాదం ‘’సర్క్యులేషన్ లో మనకు బదులు వేరొకరు ఉండ కూడదు ‘.’అన్నట్లుగానే రుజువు చేసి చూపించాడు .హెడ్ లైన్ లను మరింత ఆకర్షణీయం గా చేశాడు .కార్టూన్ లకు జోకులకు రెట్టింపు స్థలాన్ని కేటా ఇంచాడు .పాత లాగుడు ,పీకుడు వార్తల స్థానం లో కొత్త గగుర్పొడిచే ‘’గాసిప్ కాలమ్స్ ‘’రాయించాడు .ప్రజల స్పందన నాడి లను బట్టి ఎప్పటికప్పుడు మార్పులు చేశాడు .తన స్టాఫ్ లో ఒకమ్మాయిని నడి బజారు లో మూర్చవచ్చినట్లు పడిపొమ్మని చెప్పి ఆమెనుసిటీ రిసీవింగ్ హాస్పిటల్ లోకి చేర్పించాగానే అక్కడ జరిగే దారుణాలన్నీ గమనించిరెండు రోజుల తర్వాత ‘’ఎక్సామినర్ ‘’లో కాలిఫోర్నియా హాస్పిటల్స్ లోని దాస్టీకాలను హాట్ హాట్ గా వార్తల్ని వడ్డించేవాడు .పరిస్థితు లలో రావాల్సిన మార్పుల్నీ తేవాల్సిన సంస్కరణలను సూచించేవాడు .ఇవి తాజా గా పసందుగా ఉండటం తో ఎగబడి విరగ బడి కొని చదివి పేపర్ సర్క్యులేషన్ పెరగటానికి కారకులయ్యారు జనం .సిటీ ని కంట్రోల్ చేసే అధికారుల బోలు తనాన్ని ,పక్ష పాత దృస్టిని,పట్టించుకోక పోవటాన్ని పెద్ద పెద్ద హెడ్డింగ్ లతో ప్రజల దృష్టికి తెచ్చేవాడు ఈ పేపర్ మనకోసమే ఉంది అని ప్రజల్లో నమ్మకం కలిగించాడు విశ్వాసం పెంచాడు .సదరన్ ఫసిఫిక్ రైల్ రోడ్ కోసం ప్రజా పక్షాన నిలిచి పత్రిక ద్వారా పోరాటం చేశాడు .ప్రజా ఉద్యమాలకు బుజం కాశాడు .ప్రజాసమస్యలకు అద్దంపట్టి పరిష్కారాలు చెప్పాడు .అది ప్రజా పత్రిక అని ప్రజావేదిక అని గొప్ప నమ్మకం కలిగించి పత్రికా వ్యాప్తికి విశేషంగా తోడ్పడ్డాడు రాండాల్ఫ్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-11-15-ఉయ్యూరు