ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -88
38-అమెరికా పత్రికా సామ్రాజ్యాధి పతి –విలియం రాండాల్ఫ్ హార్ స్ట్-3(చివరిభాగం )
పవర్ టెంటకిల్స్
పత్రికాధి పత్యం తో సంతృప్తి పడలేదు .ఇంకా విస్తృతమైన స్థిరమైన సాహిత్య పిపాసకులను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టాడు .మేగజైన్ రంగాన్నివశపరచుకొని ఒక స్థితిలో 13 అతి ఖరీదైన నాణ్యమైన పీరియాడికల్స్ ను ప్రచురిస్తూ అందులో ‘’గుడ్ హౌస్ కీపింగ్ ‘’,కాస్మో పాలిటన్’’లను చాలా విజయవంతంగా నడిపాడు .పుట్ట గొడుగుల్లా మేగజైన్లను పుట్టించాడు .అప్పటికి ప్రపంచం లోనే అతి పెద్ద పేపర్ సామ్రాజ్యాన్ని ఏర్పరచి మేగజైన్ మొఘల్ అని పించాడు .తివాచీ నేత ,యుద్ధ సామగ్రి ,వెండి ,ఇంగ్లీష్ ఫర్నిచర్ ,మూరిష్ పాటరీ తన వ్యాపారరంగాలలో టెంటకిల్స్ ను చొప్పించేశాడు .పనికి రాని ‘’నిక్ నాక్స్’’ను ,సేల్లిని ఆస్ట్రిచ్ ఎగ్ లను కొనటానికి ను 35,౦౦౦ డాలర్లు తగలేశాడు .అతని ఏజెంట్లు ప్రముఖ శాస్త్రజ్ఞుడు బెంజమిన్ ఫ్రాన్ క్లిన్ కళ్ళ జోడును ,ఈజిప్ట్ కళా ఖండాలను ,గ్రీకు మార్బుల్స్ ను ,రెండవ రకపు పెయింటింగ్స్ ను ప్రపంచమంతా తిరిగి కొని సేకరించారు .ఆయన వేర్ హౌస్ పాకేజీ విప్పి వెలుగు చూడని ,ఆయనే చూడని వస్తువులతో నిండిపోయింది .ఎక్కడ కొత్తది కనపడినా దాన్ని కొని సేకరించారు .
ఒక సారి ‘’స్పానిష్ మొనాస్టరీ ‘’ని కొని ,ఆ బిల్డింగ్ లోని ప్రతి రాయినీ జాగ్రత్తగా తెప్పించటానికి రైల్ రోడ్డు నిర్మించుకొన్నాడు .ఈ మొత్తం వ్యవహారానికి అరమిలియన్ డాలర్లు ఖర్చు చేశాడు మాహాను భావుడు .అన్నిటినీ పొందాలి అన్నీ తన అధీనం లోకి తెచ్చుకోవాలన్న తపనే ఈ పనులన్నిటినీ ఆయనతో చేయించింది .వేల్స్ లో ఒక రాజ సౌధాన్ని కొన్నాడు .లాంగ్ ఐలాండ్ లో తల తిరిగిపోయే అద్భుత సౌధం నిర్మించాడు .కాలి ఫోర్నియాలో సాన్ సిమియాన్ లో ఉన్న రాంచ్ ను 75,౦౦0ఎకరాలకు విస్తరింప జేశాడు .అందులో అరుదైన అందమైన పుష్పాల గార్డెన్ పెంచాడు .ఒక జంతు ప్రదర్శన శాల (జూ ),ఆటలాడే ప్రదేశాలు , సగం మాన్యు మెంట్ గా, సగం మాసోలియం(గోరీ ) గా ఉండే ఒక ‘’ మ్యూరీష్ పాలస్’’ నిర్మించాడు .,ఇవికాక నివాసానికి అతి విలాసమైన భవంతిని అందులో పార్టీలు ఇవ్వటానికి అతిపెద్ద బా౦కేట్ హాల్, అతిధులకు కుటుంబ సభ్యులకు అతి పెద్ద హోటల్ లో ఉండే వాటి కంటే విశాలమైన ఎక్కువ గదులు ,ఏర్పరచాడు .రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు .లింకన్ ఫారం ను కొన్నాడు దియేటర్లు కట్టాడు .అపార్ట్ మెంట్లు స్కై స్క్రేపర్లు నిర్మించాడు .ఇది చాలదన్నట్లు సినిమా నిర్మాణ వ్యాపారం లోనూ తనదైన శైలిలో విస్తరించాడు .మొదట వార్తా చిత్రాలు ,ఫీచర్ ఫిలిమ్స్ ను ప్రొడ్యూస్ చేశాడు .తర్వాత సీరియల్స్ ,ఆ తర్వాత మెరియన్ డేవిస్ ను పెట్టి సూపర్ చిత్రాలు తీశాడు .చేతి చమురు బాగా వదిలి 7 మిలియన్ డాలర్లుపైగా బొక్క పడ్డ్డాయి . స్థిరమైన ఆలోచనలు లేక చేసిన పిచ్చి పనులయ్యాయి ఇవన్నీ .ఆయన పేపర్లన్నీ తళుకు బెళుకు తారాగణం తో సెక్స్ కధలతో నిండిపోతున్నాయి .’’మే వెస్ట్ ‘’రౌడీ సినిమాలు అసభ్యకరంగా ఉన్నాయని ,ఆమె పేరు ను తన మేగజైన్ లలో ఎక్కడా రాకూడదని శాసించాడు .
దియేటర్ యాజమాన్యం
దియేటర్ వ్యాపారం ప్రారంభించి అందులో స్వంత జీవితాను భవం తో పూర్తిగా కూరుకు పోయాడు .18వ ఏట కాలిఫోర్నియా జడ్జి కూతురు అందచందాల భామ సిబిల్ సా౦డర్సన్ తో ప్రేమలో పడ్డాడు .ఎంగేజి మెంట్ కూడా అయిపొయింది. కాని హార్స్ట్ హార్వర్డ్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పారిస్ వెళ్ళింది .అక్కడ కన్జర్వేటరి చదివి ‘’ఆపరేటిక్ స్టార్’’గా తిరిగి వచ్చింది .కాని మన వాడిని మనువాడటం మరిచే పోయింది .రెండేళ్ళ తర్వాత మళ్ళీ మనోడు మరో కాలిఫోర్నియా యువతిఎలినార్ కల్హాన్ ప్రేమలో పడి ఇద్దరూ కలుసుకొంటూ ప్రేమలో ఉన్నారు ఆమె తనకు గొప్ప నటి కావాలనే కోరిక ఉందని చెప్పింది .మళ్ళీ ఎంగేజ్ మెంట్ తంతు జరిగింది .ఆ అమ్మాయి నటిగా మారి లండన్ వెళ్లి అక్కడి అభిమాన నటి గా ఎదిగింది .మళ్ళీ కద మామూలయింది.ఇక అమ్మ మాత్రమె తనను ఓదార్చగలదు అనుకోని ఆమె రక్షణ కోరాడు
అకస్మాత్తు పెళ్లి
.ఆమె మీద ఉన్న నమ్మకం తో మరో 20 ఏళ్ళదాకా పెళ్లి ఊసు ఎత్తలేదు .వయసు నలభై వ పుట్టిన రోజున ‘డాన్సింగ్ ’విల్సన్ సిస్టర్స్’’ లో ఒకరైన ‘’ మిలిసేంట్ విల్సన్ అనే చర్చ్అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .అయిదుగురు మగపిల్లలు కలిగారు .వీరంతా తండ్రిని బహు ప్రేమాభిమానాలతో చూసేవారు ఆరాధించేవారు .
ఇంట్లో ఆశ్రయం ఇస్తే గుండెలో దూరిన నటి
అతని భార్య మిలిసేంట్ హార్ట్స్ దియేటర్ రంగం లో ప్రవేశించే వారికి చారిటీ ట్రస్ట్ పెట్టి సహాయ పడేది .అలాంటి అమ్మాయిలలో మేరియాన్ డేవిస్ అనే అమ్మాయిని చేర దీసి తన ఇంట్లోనే ఆశ్రయ మిచ్చింది .అప్పుడు హార్స్ట్ వయసు యాభై డేవిస్ వయసు ఇరవై .దీనితో బ్రూక్లిన్ కి చెందిన ఈమె ఒక్కరాత్రి లో సేలిబ్రేటి అయిపొయింది .ఈమెను గురించి కవయిత్రి డోరోతి పార్కర్ ‘’మీరు హాలీ వుడ్ ఆకాశం వైపు చూస్తె అక్కడి నక్షత్రాలన్నీ ‘’మేరియాన్ డేవిస్ ‘’అని జపిస్తాయి అన్నది .రాండాల్ఫ్ డబ్బుతో, పేపర్ల బూస్టింగ్ లతో చాలా ఖరీదైన సినిమాలలో హీరోయిన్ గా నటించినా ‘’వెండి తెర రాణి’’కాలేక పోయింది .కాని హార్స్ట్ కు చాలా విశ్వాసంగా ,కంపానియన్ గా,ఆరాధకురాలిగా ఉండేది.ఒక సారి అతని ఆర్ధిక పరిస్తితి దెబ్బతింటే ఒక మిలియన్ డాలర్లు తిరిగి ఇచ్చేసి ఆదుకొన్నదికూడా .భార్య విడాకులకు అంగీకరించకపోయినా ,ఆమెనుండి దూరమై డేవిస్ తో గడిపాడు. జల్సా ఖర్చు లో మార్పేమీ రాలేదు .విచ్చల విడిగా డబ్బు ఖర్చు చేశాడు .ఆమె తో సంతృప్తిగా జీవించాడు .తన ప్రేమను పంచాడు తానూ ఇంతవరకు పొందని ప్రేమాను భూతిని ఆమెద్వారా పొందాలిగాడు . .
రాచకీయ అడుసు లో కాలు –బహు భంగుల భంగ పాట్లు
నలభై ఏళ్ళ వయసులో రాండాల్ఫ్ బుద్ధి తక్కువై రాజకీయ రంగ అరంగేట్రం చేశాడు .’’వార్ మేకర్ –ఇప్పుడు కింగ్ మేకర్ –సారీ సాక్షాత్తు.కింగ్ ‘’అయ్యాడు .1902లో కాంగ్రెస్ కు ఎన్నికై రాజకీయారణ్యం లో ప్రవేశించాడు .సరైన ప్రజా ప్రతినిధి అని అనిపించుకోలేక పోయాడు .అతని సహచర సభ్యులు అతని ఆలోచనలపై పై అపనమ్మకం తో ఉండేవారు .చివరికి పార్టీ నాయకుడుకూడా అతనితో కలిసి మాట్లాడని పరిస్థితి ఏర్పడింది .దీనికి బెదరకుండా మరింత అత్యాసతో కొడితే గోల్కొండ కొట్టాలని ప్రెసిడెంట్ పదవిపై కన్నేశాడు .1904లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా నామినేట్ అవటానికి అన్ని రకాల పావులూ కదిపాడు .చివరికి దాన్ని జడ్జి ఆల్టన్ బి పార్కర్ తన్నుకు పోయాడు . ఏడాది తర్వాత న్యూ యార్క్ మేయర్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా ప్రయత్నించాడు .టామనీ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు .అయినా ఆశ చావక న్యు యార్క్ గవర్నర్ కోసం అదే టామనీ తో చేతులు కలిపి ,ఎన్నో బహిరంగ సభలలో ఉపన్యాసాలిచ్చాడు .నలభై మూడు లో బలిష్టమైన ఎముకలతో ,భారీ పర్సనాలిటి తో పొడవైన ముఖం తో ,జుట్టు నుదుటి మీద పడి ఎడమ కనురెప్పలపై వాలిపోతున్నట్లు ఉండేవాడు .పడమటి దేశ గర్వం ముఖం లో బాగా కనిపించేది .చిన్న చిన్న వాక్యాలు మాట్లాడేవాడు .ఇవన్నీ ఎవర్నీ ఆకర్షించ లేక పోయాయి .ప్రచార సంరంభానికి అయిదు లక్షల డాలర్లు ఖర్చు చేసినా ,డెమొక్రాట్ పార్టీఅభ్యర్ధులలో హార్స్త్స్ తప్ప అందరూ ఎన్నికయ్యారు . విధి వక్రించింది .619డాలర్లు మాత్రమే ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసిన చార్లెస్ ఇవాన్స్ హగ్స్ బ్రహ్మాండమైన మెజారిటీ తో ఎన్నికై రాండాల్ఫ్ ను పీటీ, కాటా దెబ్బ కొట్టాడు .
అయినా ధన బలం తో ఆశ పోక మళ్ళీ రాజకీయం లో అదృష్టం పరీక్షించుకోవాలనుకొన్నాడు .వైట్ హౌస్ లోనూ ,ప్రాంచమంతా తన ప్రభావాన్ని ,పలుకు బడి ని చూపించాలని భావించాడు .1908లోప్రెసిడెంట్ పదవికి రిపబ్లికన్ అభ్యర్ధి విలియం హోవార్డ్ టాఫ్ట్.డెమోక్రాటిక్ అభ్యర్ధి మళ్ళీ బ్రియాన్ .సహజం గా డెమొక్రాట్ అయిన హార్ట్స్ రియాన్ తో తగాదా పడి ,ఒక స్వతంత్ర అనామక అభ్యర్ధికి మద్దతు ఇచ్చాడు .ఎన్నికల ప్రచారం లో స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ నుండి కొన్ని లేఖలు దొంగ తనంగా సంపాదించి కొంతమంది సేనేటర్ల పై అభియోగం అనే బాంబు పడేశాడు .ఈ జిమ్మిక్కులేమీ పని చేయలేదు .రిపబ్లికన్ అభ్యర్ధి టాఫ్ట్ ప్రెసిడెంట్ గా భారీ మెజారిటీతో గెలిచాడు .మనవాడు బలపరచిన అనామకుడు హేజెంస్ కు మనవాడి రాష్ట్రం లో ఒక్క వోటుకూడా రాకపోవటం గమనార్హం .డబ్బే అన్నీ చేయిస్తుంది అనుకొంటే పెద్ద పొరబాటు .దానికి మించి చాలా ఉంటాయని గ్రహించాలి .
ఎదురు దెబ్బలు తింటున్నా పదవిపై ఆశ చావ లేదు చిగురిస్తూనే ఉంది .1909లో న్యూయార్క్ మేయర్ పదవి మనకే అనుకొన్నాడు .తీవ్ర ప్రచారార్భాటం తో శక్తి యుక్తులన్నీ పణంగా పెట్టి ప్రయత్నించాడు .మళ్ళీ ఘోర పరాజయం పాలైనాడు .1912లో ప్రెసిడెంట్ పదవికి తన అభ్యర్ధిగా చాంప్ క్లార్క్ కోసం ప్రయత్నిస్తే ,తనను తీవ్రం గా వ్యతిరేకించే వుడ్రో విల్సన్ నామినేట్ అయి ప్రెసిడెంట్ గా గెలిచాడు .కనుక మనవాడికి రాజకీయం అచ్చి రాలేదు. తిరుక్షవరమే అయింది పాపం .
విదేశీ వ్యవహారలలో వేలు
స్వంత రాష్ట్రం లో రెండు పార్టీలు అతన్ని నమ్మలేదు .అంటే తను నమ్మకం కలిగించ లేక పోయాడు .ఇది లాభం లేదని విదేశీ వ్యవహారం లో వేలు పెట్టాడు .20ఏళ్ళకు పూర్వం మనవాడు యుద్ధం సృష్టించాడు .ఇప్పుడు 1914లో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నించాడు .అమెరికా యుద్ధం లో దిగక ఉండలేని పరిస్థితి. అందుకే సంఘటిత కూటమి (అల్లీస్ ) రాజ్యాలకు కొమ్ము కాసింది .పాపం హార్స్ట్ తిట్లు తినే అందరూ ద్వేషించే ఒంటరి వాడైపోయాడు పైగా ఇంగ్లాండ్ ,ఫ్రాన్స్ లకు అమెరికా ఏ మాత్రం సాయం చేసినా విజేత అయ్యే జర్మనీ మాడ్చి మసి చేస్తుందని హెచ్చరించాడు .యుద్ధం వాల్ స్ట్రీట్ కు ఆయుధ సామగ్రి తయారు చేసేవారికి లాభాలు కలిగించింది .చివరికి అమెరికా శత్రు దేశం తో ప్రత్యేక శాంతి ఒడంబడిక కుదుర్చుకోవాల్సి వచ్చింది . అవమానాలు భరించలేక రాండాల్ఫ్ డెమోక్రాటిక్ పార్టీకి గుడ్ బై చెప్పి రిపబ్లికన్ ల పంచలో చేరాడు .రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభ మైన సమయం లో మన ‘’జర్నలిజం మోనార్క్’’’’నేషనల్ సోషలిజం ‘’అనే నినాదాన్ని బయటపెట్టాడు .ఫాసిస్ట్ లు యాంటి సెమి సేమేటిస్ లు కలిసి హిట్లర్ ను ఇంటర్వ్యు చేసి ‘’హిట్లర్ శాంతికి ,ఆర్ధిక స్థిరత్వానికి కృషి చేసే అద్వితీయ శక్తి ‘’అని ప్రకటించారు .జపాన్ కూడా వారితో కలవటం తో హార్స్ట్ ‘’తూర్పు దేశాల బెదిరింపు ‘’(ఓరియెంటల్ మెనేస్ )అని సమాధాన పరచాడు .
అధికారాంతమున చూడవలె
రెండవ ప్రపంచ యుద్ధానంతరం’’ పేపర్ మొఘల్ ‘’పవర్ క్షీణింటం మొదలైంది .ప్రత్యర్ధి సంపాదకులు రాజకీయ నాయకులు ప్రెసిడెంట్లు తీవ్రం గా దాడి చేసేవారు .ఇప్పుడు మరింత సంక్షోభం లో పడ్డాడు .ప్రిస్టేజి డామేజి అయింది .భౌతికంగా కు౦గి పోయాడు మానసికంగా క్రుశించిపోయాడు .1947లో మొదటి సారి హార్ట్ ఎటాక్ వచ్చింది హార్స్ట్ గారికి .మౌంటేన్ రిట్రీట్ నుంచి మకాం మారియన్ డేవిస్ బివేర్లీ హిల్స్ కు మార్చాడు .ముప్ఫై ఏళ్ళ నుండి అంటిపెట్టుకున్నావిడే ఆరోగ్యంగా ఉండగానూ ఇప్పటి అనారోగ్య బలహీన స్థితిలోనూ సపర్యలు చేసి కృతజ్ఞత చూపింది .ఆయన గుండె నిబ్బర౦ మరో నాలుగేళ్ళు జీవి౦చేట్లు చేసింది .88ఏళ్ళ సఫల విఫల దిగ్విజయ పరాజయాలను రుచి చూసిన విలియం రాండాల్ఫ్ హార్స్ట్ గారి హార్ట్ 14-8-1951న శాశ్వతం గా ఆగి పోయింది .
చనిపోవటానికి ముందు తన మనోభిప్రాయాలను వెల్లడించారు .ఆయన జీవిత చరిత్రలు రాశారు .’’ostracism by decency in life ,and oblivion in death ‘’’అని ఊహించి ముందే చెప్పాడు చార్లెస్ బియర్డ్ అనే హిస్టోరియన్ ..అతని రాజకీయం పై వ్యాఖ్యానిస్తూ విలియం అలెన్ వైట్ ‘’I believe that Hearst as an ally of any politician is a form of political suicide ‘’అని ఘాటుగా వ్యాఖ్యానించాడు .ఎవరేమన్నా ఆతను’’ లెజెండరీ ఫిగర్ ‘’అన్నది నిర్వివాదం.1900 లో మొదలుపెట్టి 1936లో ఓడిపోయిన లాండాన్ నుంచి మేకార్దీ వరకు అయన మెచ్చిన పాత స్నేహితులంతా’’proverbial kiss of death ‘’ రుచి చూసిన వాళ్ళే అన్నాడొకాయన .ఒక విధయం గా ఆయన ‘’గొప్ప మూవర్ అండ్ షేకర్ .‘’పత్రికా సామ్రాజ్య వ్యాప్తిలో ఎదురు లేనివాడు తిరుగు లేనివాడు .గొలుసు పత్రికలకు మార్గ దర్శి .సంచలన కధనాలకు ఆలవాలం .’’ఎల్లో కిడ్ ‘’పాత్రా ద్వారా ఎల్లో జర్నలిజానికి నాంది పలికినవాడు .అతని అస్థిర విధాల విషయమై ప్రశ్నిస్తే దానికి ఆయన సమాధానం ‘’it is not important to be consistant ,as it is to be correct .A man who is consistent never learn any things .conditions change ,and he does not ‘’అని జవాబు చెప్పాడు అతని చరిత్రకారులు కూడా అతనిలోని విరుద్ధ భావాలను అలాగే ఉండనివ్వండి అన్నారు .
మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-15-ఉయ్యూరు