దర్శకుడు రేలంగి అనుభవాలు

‘క్లాప్‌ బోర్డ్‌’ అంటే ఏమనుకుంటున్నావురా? అన్నారు
Updated :15-Nov-2015 : 14:46
గత వారం 
అట్లూరి పుండరీకాక్షయ్యగారి బంధువు జగన్మోహనరావుగారు ఆ సమయంలోనే ‘మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ చిత్రం నిర్మిస్తున్నారు. కృష్ణంరాజుగారు, నాగభూషణంగారు ముఖ్య పాత్రధారులు. బి.వి.ప్రసాద్‌గారు దర్శకుడు. దాసరి నారాయణరావుగారు ఆ చిత్రానికి మాటల రచయిత. కేతాగారు మమ్మల్ని పుండరీకాక్షయ్యగారి దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశారు. ఆయన కూడా నేను సినిమా ఫీల్డ్‌లోకి రావడానికి మొదట ఒప్పుకోలేదు. ‘ఎందుకు డాక్టర్‌గారు.. ఈ బురదలోకి. మేమంతా ఏవో తంటాలు పడి నెట్టుకొస్తున్నాం. సినిమాలు వద్దండీ. శుభ్రంగా చదివించి డాక్టర్‌ని చేయండి. లేదంటారా మీలాగా ఆర్‌.ఎం.పి. డాక్టర్‌ని చేయండి’ అని సలహా ఇచ్చారు. అయినా నేను వినలేదు. నా మొండిపట్టు చూసి మా నాన్నగారు కూడా ఆయన మాటలు వినిపించుకోలేదు.
‘సరే మీరు డిసైడ్‌ అయిన తర్వాత నేను చెప్పేదేముంది. మా సంస్థలో ఇతన్ని చేర్చుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. కాకపోతే అప్రెంటిస్‌ కనుక జీతభత్యాలు ఉండవు. షూటింగ్‌ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని అక్కడికి అతనే రావాల్సి ఉంటుంది. పికప్‌ చేయడం, డ్రాప్‌ చేయడం ఉండవు. ఇందుకు ఇష్టమైతే రావచ్చు’ అని నిర్మొహమాటంగా చెప్పారు. నేను సరేనన్నాను. ఆ సినిమాకి బండ్రెడ్డి నరసింహారావుగారు అసోసియేట్‌ డైరెక్టర్‌. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాగర్‌గారు. అలా ‘మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ చిత్రంతో అప్రెంటిస్‌గా నా సినీజీవితం 1971 అక్టోబర్‌ 14న ప్రారంభమైంది. ఆ రోజే ‘మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ చిత్రం మొదలైంది.

ఇక చదవండి

మా నాన్నగారిని వదిలిపెట్టి ఎప్పుడూ లేను. మా ఊరు దాటి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ వెళ్లినా సాయంత్రానికల్లా తిరిగి వచ్చేసేవాణ్ణి. ఇప్పుడు ఊరే కాదు రాష్ట్రం దాటి వచ్చేశాను. కొత్త ప్రాంతం, కొత్త వ్యక్తులు, మనకి తెలియని భాష. అయినా తెలిసిన వాళ్లు ఉన్నా రనే ధైర్యం. మెల్లిగా ఆ వాతావరణానికి అల వాటు పడ్డాను.
టీ నగర్‌లో తన స్నేహితుడు కోళ్ల సత్యంగారి ఇంట్లో నన్ను పెట్టారు నాన్నగారు. రాజాబాదర్‌ స్ర్టీట్‌లో అది ఉండేది. పై పోర్షన్‌లో కోళ్ల సత్యంగారు, అప్పారావుగారనే మరో ఆర్టిస్ట్‌ ఉండే వారు. కింద పోర్షన్‌లో మేకప్‌మన్‌ జయకృష్ణగారు ఉండేవారు. మా పక్క బిల్డింగ్‌ ఆర్టిస్ట్‌ ప్రభాకరరెడ్డిగారిది. అది ఆయన సొంత ఇల్లు. ఆయన ఇంటికి మహారథిగారు, ఇటీవల చనిపోయిన దర్శకుడు భాస్కరరావుగారు తదితరులు వస్తుండేవారు. యోగక్షేమాలు తెలియజేస్తూ ఉత్తరాలు రాయడానికి నేను బద్ధకిస్తానేమోనని నాన్నగారు ఓ వంద ఇన్‌లాండ్‌ లెటర్లు కొని ఫ్రమ్‌ అడ్రెస్‌, టు అడ్రెస్‌ తనే రాసి నా చేతికి ఇచ్చారు. వారానికి ఒకసారికి తప్పనిసరిగా ఉత్తరాలు రాయమని మరీమరీ చెప్పి వెళ్లారు.

అది షూటింగ్‌ పోస్ట్‌బాక్స్‌ అని తర్వాత తెలిసింది

‘మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ చిత్రం షూటింగ్‌ ఎక్కువగా ఏవీఎం స్టూడియోలో జరిగేది. వడపళని వెళ్లే బస్‌ ఎక్కి అక్కడికి చేరుకునేవాడిని. నేను కొత్తవాడిని కనుక సెక్యూరిటీ గార్డ్‌ గేటు దగ్గరే ఆపేసేవాడు. దాంతో తెలిసిన వాళ్లు ఎవరన్నా వస్తారేమోనని ఎదురుచూసేవాడిని. ప్రొడక్షన్‌ బాయ్స్‌తోనే లోపలికి వెళ్లిన సందర్భాలు చాలా ఎక్కువ. ఇక సాయంత్రం ఐదు, ఐదున్నరకల్లా నన్ను పంపించేసేవాళ్లు. ఆ సమయానికి ఏదన్నా కారు టీ నగర్‌ వెళుతుంటే అందులో నన్ను ఎక్కించే వారు. సెట్లో నేను చేసే పనేమీ లేదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకూ అలా చేతులు కట్టుకుని ఓ పక్క నిలబడి షూటింగ్‌ ఎలా జరుగుతోందో అబ్జర్వ్‌ చేయడమే. సాయంత్రం అయ్యేసరికి కాళ్లు లాగేసేవి. చేతులు నొప్పులు పుట్టేవి. అలవాటు లేని వ్యవహారం కనుక నీరసం వచ్చేసేది. ఒక్కోసారి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ బాగా లేటయ్యేది. భోజనం కూడా ఉండేది కాదు. ఇక ఉత్తరం రాయడానికి తీరికేది? కానీ మా నాన్నగారు మాత్రం వదలకుండా ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేవారు. కొడుకు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడోనని ఆయన ఆందోళన. ‘అడ్రెస్‌ రాసి మరీ ఉత్తరాలు ఇచ్చాను కదా. నేను క్షేమం అని ఒక ముక్క రాయడానికి వాడికంత బద్ధకం ఏమిటి?’ అనుకునేవారాయన.

అందుకే ఒక రోజు రాత్రి తీరిక చేసుకుని నింపాదిగా కూర్చుని అన్ని వివరాలతో ఉత్తరం రాశాను. అయితే దాన్ని పోస్ట్‌ చేయాలి కదా. పొద్దున్నే లేచి షూటింగ్‌కు పరిగెట్టడానికే సమయం సరిపోతుంది ఇక పోస్టాఫీసుకు వెళ్లి ఉత్తరాన్ని పోస్ట్‌ చేసే తీరిక ఎక్కడిది?

ఆ రోజు వీనస్‌ స్టూడియోలో షూటింగ్‌ జరుగుతోంది. ముందు రోజు కూడా అక్కడే జరిగింది. ఆ స్డూడియోలోనే ఒక చోట పోస్ట్‌ బాక్స్‌ ఉండటం ముందురోజు గమనించాను. అందుకే ఆ మర్నాడు లొకేషన్‌కు వెళ్లగానే మొదట ఆ పోస్ట్‌ బాక్స్‌ దగ్గరికి వెళ్లి, ఉత్తరం అందులో వేశాను. హమ్మయ్య.. నా క్షేమసమాచారాలు నాన్నగారికి తెలుస్తాయి అని తేలికగా ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత షూటింగ్‌కు వెళ్లిపోయాను. కాసేపటికి ఫ్లోర్‌ ఇన్‌చార్జ్‌ మా సెట్‌కివచ్చాడు. వస్తూనే ‘ఇక్కడ ‘రేలంగి నరసింహారావ్‌ ఎవరండీ?’ అని బేస్‌ వాయిస్‌తో ప్రశ్నించాడు. ఆ సమయంలో నేను, అసోసియేట్‌ సాగర్‌ గారు సెట్‌ బయటే ఉన్నాం. నేనేదన్నా తప్పుపని చేశానేమోనని కంగారు పడి ‘ఎందుకు.. ఏమైంది?’ అని అడిగాడు సాగర్‌గారు. అతను సమాధానం చెప్పకుండా ‘ఎవరో చెప్పండి ముందు’ అన్నాడు. సాగర్‌తో పాటు నాకూ కంగారు ఎక్కువైంది. నన్ను చూపించి ఇతనేనండీ.. ‘ఏం జరిగింది’ అని అడిగాడు. ‘ఏమయ్యా ఇతను ఫీల్డ్‌కి కొత్తా? షూటింగ్‌ కోసం మనం ఏర్పాటు చేసిన పోస్ట్‌ బాక్స్‌లో అతను లెటర్‌ వేశాడు. ఇదుగో’ అని సాగర్‌ చేతికి నేను పోస్ట్‌ చేసిన ఉత్తరాన్ని అందించాడు. అప్పటికి కానీ నేను చేసిన తప్పు ఏమిటో నాకు అర్థం కాలేదు. షూటింగ్‌ కోసం ఇలా స్ట్రీట్‌ సెట్‌లో పోస్ట్‌బాక్సులు కూడా ఏర్పాటు చేస్తుంటారని అప్పుడే నాకు తెలిసింది. ఆ మర్నాడు సాయంత్రం టీ నగర్‌లోని పోస్ట్‌ బాక్స్‌లో ఆ ఉత్తరం పోస్ట్‌ చేశాను. కొన్ని రోజులకు ‘మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది.

పాండీబజార్‌లో.. తురాయి చెట్ల నీడలో…

దాంతో మళ్లీ పని కోసం వెదుక్కోవాల్సిస పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే దాసరి నారాయణరావుగారికి దర్శకత్వ ఛాన్స్‌ రావడంతో ఆయన బయటి సినిమాలకు రాయడం మానేసి ‘తాత-మనవడు’ స్ర్కిప్ట్‌ పనిలో నిమగ్నమయ్యారు. అయనతో పరిచయం ఉండటం వల్ల ప్రతిరోజూ సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లేవాణ్ణి. అప్పట్లో ఆయన టీనగర్‌లో హెన్స్‌మన్‌ పార్క్‌ పక్కనే ఉన్న ఇంట్లో ఉండే వారు. నేను, ధవళ సత్యంగారు, రాజు అనే ఆర్టిస్ట్‌, కాపరపు సూర్యనారాయణ అని…. దాసరిగారితో కలిసి నాటకాలు వేసి తర్వాత పరిశ్రమకి వచ్చి జూనియర్‌ ఆర్టిస్ట్‌ సప్లయర్‌గా స్టిరపడ్డారు.. ఆయన , ఇప్పుడు గురువుగారి దగ్గర బంగారుబాబుగారు అని ఉన్నారే ఆయన తండ్రి సుబ్బారెడ్డిగారు…. మేమంతా దాసరిగారింట్లో కలిసే వాళ్లం. పద్మగారు మా అందరికీ టీలు తయారు చేసి ఇచ్చేవారు. గురువుగారు ఆ రోజు తను రాసిన సన్నివేశాలన్నీ మాకు చదివి వినిపించేవారు. ‘చాలా బాగుంది సార్‌’ అని మేమంతా అభినందించే వాళ్లం.

నాది జీతం భత్యం లేని ఉద్యోగం కావడంతో ప్రతి నెలా మా నాన్నగారు నూట పాతిక రూపాయలు పంపించేవారు. పాండీ బజార్‌లోనే అశోకా హోటల్‌ అని ఉండేది. మనియార్డర్‌ రాగానే ముందు 90 రూపాయలు పెట్టి నెలకు సరిపడా భోజనం టిక్కెట్లు కొనేసేవాడిని. ఇంకా మిగిలిన 35 రూపాయలను రోజువారీ ఖర్చుల కోసం చాలా పొదుపుగా వాడుకునేవాణ్ణి. సాయంత్రం అయితే చాలు సినిమావాళ్లు, తెలుగువాళ్లతో పాండీబజార్‌ కిటకిట లాడుతుండేది. పాండీ బజార్‌ నుంచి పానగల్‌ పార్క్‌ వరకూ సినీజనం గుంపులు గుంపులుగా విడిపోయి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఆ రోజుల్లో అక్కడ తురాయి చెట్లు ఉండేవి. వాటి కింద చేరి కబుర్లు చెప్పుకుంటుండేవాళ్లం. భవిష్యత్తు గురించి అందమైన కలలు కనేవాళ్లం. ప్రతి రోజూ పాండీబజార్‌కి వెళ్లేవాడిని కాదు. మా గురువుగారు ఇంట్లో లేనప్పుడు మాత్రమే అక్కడికి వెళ్లేవాళ్లం. గురువుగారు ఉంటే ఆయన ఇంట్లోనే మాకు కాలక్షేపం అయ్యేది.
అలా ఒకరోజు పాండీబజార్‌కు వెళ్లినప్పుడు ‘మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ చిత్రానికి కాస్ట్యూమర్‌గా పనిచేసిన గోపాలకృష్ణగారు కనిపించారు. నేనంటే ఆయనకి అభిమానం. ఏం చేస్తున్నావంటూ నన్ను ఆప్యాయంగా పలకరించారు. ఖాళీగానే ఉన్నానని చెప్పాను. అయితే నాతో రండి అని డాక్టర్‌ నాయర్‌ రోడ్‌లో ఉన్న ఓ ఆఫీసుకు తీసుకెళ్లారు. అది నిర్మాత ఎమ్మెస్‌ రెడ్డిగారి ఆఫీసు అని అక్కడికి వెళ్లాక తెలిసింది.

రెడ్డిగారు ఆరు బయట కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నారు. నేను, గోపాలకృష్ణ ఆయన దగ్గరకు వెళ్లి వినయంగా నమస్కరించాం. ‘రావయ్యా గోపాలకృష్ణా.. ఏమిటీ విశేషాలు… ఈ కుర్రాడెవరు?’ అని అడిగారు రెడ్డిగారు. ‘సార్‌.. ఇతనిది పాలకొల్లు అండీ. డాక్టర్‌గారి అబ్బాయి. ‘మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ చిత్రానికి అప్రెంటిస్‌గా పనిచేశాడు. మన సంస్థలో అవకాశం ఇస్తారేమోనని…’ అని ఆపేశారు గోపాలకృష్ణ. ఆ సమయంలో చలంగారు హీరోగా ‘ఊరికి ఉపకారి’ చిత్రం ప్లాన్‌ చేస్తున్నారు ఎమ్మెస్‌ రెడ్డిగారు. నిజానికి ఆ చిత్రానికి ఆయన కాదు నిర్మాత… వాళ్ల బావమరిది మోహన్‌రెడ్డి. సుందరం మూవీస్‌ బేనరుపై తయారైన ఆ చిత్రం ఎమ్మెస్‌ రెడ్డిగారి పర్యవేక్షణలోనే తయారైంది.
ఆ సినిమాకి దర్శకుడు కె.ఎస్‌.ఆర్‌.దాస్‌గారు. అప్పటికి ఐదు రోజుల షూటింగ్‌ మాత్రమే జరిగింది.

అంతకుముందు ఎమ్మెస్‌ రెడ్డిగారు నిర్మించిన ‘కోడెనాగు’ తదితర చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన రాజాచంద్ర ఈ చిత్రం కథాచర్చల సమయంలో ఏవో కారణాల వల్ల మానేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత పేరాల సుబ్రహ్యణ్యంగారు వచ్చారు. కానీ ఆయన కూడా కొన్ని రోజులు పనిచేసి వెళ్లిపోయారు. ఆ సినిమాకి పని చేయడానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కావాలి. ఆ విషయం తెలిసే గోపాలకృష్ణ నన్ను అక్కడికి తీసుకెళ్లారు.

నా వంక ఎగాదిగా చూసి ‘ఏమిటయ్యా.. ఏం చేస్తావు నువ్వు?’ అని ప్రశ్నించారు రెడ్డిగారు. ‘డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏ పని చెప్పినా చేస్తానండీ’ అన్నాను నేను చేతులు కట్టుకుని వినయంగా.

‘మొదటి సినిమాకి ఏం నేర్చుకున్నావు?’

‘నేను అప్రెంటిస్‌ని కదండీ.. పనులేమీ చెప్పేవారు కాదండీ. సెట్లో ఉండి అన్నీ పరిశీలించేవాణ్ణి’.
‘సరే.. అలాగే పనిలో చేరు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో. జీతభత్యాలేమీ ఉండవు’ అన్నారాయన.
‘అలాగేనండీ’ అన్నాను.
‘గోపాలకృష్ణా.. అసోసియేట్‌ డైరెక్టర్‌ అంజి బాబు దగ్గరకి ఇతన్ని తీసుకెళ్లవయ్యా’ అని చెప్పారు రెడ్డిగారు.

అంజిబాబుగారు దర్శకత్వశాఖలో ఎంతో అనుభవమున్న వ్యక్తి. విఠలాచార్యగారి దగ్గర కో డైరెక్టర్‌గా చాలా కాలం పనిచేశారు. ఇంకా ఎంతో మంది దగ్గర కూడా వర్క్‌ చేశారు. దర్శకునిగా తనకు ప్రమోషన్‌ లభిస్తుందేమోనని ఆశగా ఎదురు చూశారు కానీ ఎవరూ అవకాశం ఇవ్వ లేదు. దాంతో ఇక నేను జీవితంలో దర్శకుణ్ణి అవ నని తీర్మానించుకుని రాజీపడి పోయి వేదాంత ధోరణి అలవరుచుకుని పనిచేస్తున్న సీనియర్‌ మోస్ట్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌. షూటింగ్‌ తొలి రోజున సెట్‌లో ఉన్నప్పుడు హీరో చలంగారి దగ్గరకు తీసుకెళ్లి నన్ను పరిచయం చేశారు అంజిబాబుగారు. ‘ఏ ఊరు మీది?’ అని ఆయన అడిగారు. ‘పాలకొల్లు అండీ’ అని చెప్పాను. ఆయనది కూడా పాలకొల్లు కావడంతో కొంచెం ఆసక్తి చూపిస్తూ ‘అలాగా.. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?’ అని ప్రశ్నించారు. ‘మా నాన్నగారు ఆర్‌.ఎం.పి. డాక్టర్‌గారండీ’ అని చెప్పగానే ‘మా రంగనాయకులుగారి అబ్బాయివా.. భలే వాడివయ్యా.. ఆ విషయం చెప్పవేం’ అని నాన్నగారి గురించి, నా గురించి అడిగారు. పరిచయమైన కాసేపటికే బాగా క్లోజ్‌ అయ్యాం ఇద్దరం. చలంగారిది చాలా మంచి మనసు.
తొలి సంపాదన రూ. 50

అప్పటికి నేను ఆ సంస్థలో చేరి నెల రోజులైంది. ఎమ్మెస్‌రెడ్డిగారిది చాలా గొప్ప మనసు. తన కంపెనీలో పనిచేసే వారిని కన్నబిడ్డల్లా చూసుకొనేవారు. ప్రతి నెలా 31 కల్లా జీతాలు ఇచ్చేవారు. రెండు రోజుల ముందు తనే స్వయంగా బ్యాంక్‌కి వెళ్లి కొత్త నోట్లు తీసుకువచ్చి కవర్లలో పెట్టి, వాటిమీద స్టాఫ్‌ పేర్లు రాసి, అందించేవారు. ఆ రోజు అందరికీ ఇచ్చారు. నాకు జీతభత్యాలు ఉండవని ముందే చెప్పారు కనుక నేను జీతం గురించి ఆశించలేదు. సాయంత్రం వరకూ ఆఫీసులోనే ఉన్నాను. ఉన్నట్టుండి రెడ్డిగారు నన్ను తన గదిలోకి పిలిచారు. ‘అందరికీ జీతాలిచ్చానయ్యా. నిన్ను ఒట్టి చేతులతో ఇంటికి పంపడానికి మనసొప్పడం లేదు. ఈ నెల నుంచి నీకు యాభై రూపాయలుఇస్తానయ్యా. ఇది జీతం కాదు.. దారి ఖర్చులు అనుకో’ అని యాభై రూపాయలు కవర్లో పెట్టి నాకు అందివ్వబోయారు. తీసుకోవడానికి నేను మొహమాట పడ్టాను. ‘పరవాలేదు సార్‌.. నా రూమ్‌ దగ్గరే కదా’ అన్నాను. ‘‘భలే వాడివయ్యా.. నేను ఇస్తున్నాను కదా.. తీసుకో’ అని బలవంతంగా ఆ కవరు నా చేతిలో పెట్టారు. అలా ఆ రోజు పరిశ్రమలో నా తొలి సంపాదనని అందుకున్నా.

చెంప ఛెళ్ళుమనిపించిన కె.ఎస్‌.ఆర్‌.దాస్‌

దర్శకత్వ శాఖలోని ప్రతి పని నాకు దగ్గరుండి నేర్పించేవారు అంజిబాబుగారు. నేనూ ఆసక్తిగా నేర్చుకొనేవాడిని. ఒక రోజు పోరూర్‌లో షూటింగ్‌ జరుగుతోంది. మెయిన్‌రోడ్‌ మీదే షూటింగ్‌. ఆ రోజు ఎండ చాలా తీవ్రంగా ఉంది. పొద్దున్నే షూటింగ్‌ మొదలెట్టాం. కె.ఎస్‌.ఆర్‌.దాస్‌గారికి స్పీడ్‌ డైరెక్టర్‌గా పేరుండేది. ఏ మాత్రం గ్యాప్‌ లేకుండా షాట్‌ బై షాట్‌ తీసేవారు. ఆయన స్పీడ్‌ని తట్టుకోవడానికి కొన్ని రోజులు పట్టింది నాకు. మొదట ఎడిటర్‌గా పనిచేసి, తర్వాత దర్శకుడయ్యారు కనుక మైండ్‌లోనే ఎడిటింగ్‌ చేసేసేవారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని నేను ఒక్కడినే కావడంతో క్లాప్‌ కొట్టడం, ఎడిటింగ్‌ రిపోర్ట్‌ రాసుకోవడం నేనే చెయ్యాల్సి వచ్చేది. షాట్‌ తీయడం పూర్తి కాగానే దాస్‌గారు మరో షాట్‌ తీయడానికి ఏర్పాట్లు చేస్తుంటే ఈ గ్యాప్‌లో నేను చేతిలో ఉన్న క్లాప్‌ బోర్డ్‌ని రోడ్డు మీద పెట్టి, మోకాళ్ల మీద కూర్చుని ఎడిటింగ్‌ రిపోర్ట్‌ రాసుకోసాగాను. ఇదంతా దూరం నుంచి గమనించిన దాస్‌ గారు వేగంగా నా దగ్గరకు వచ్చి ‘పైకి లేరా’ అన్నారు సీరియస్‌గా.
నేను కంగారు పడుతూ లేవగానే ఫట్‌ మని నా చెంప మీద కొట్టారు. ఆయన అలా కొడతారని నేను ఊహించలేదు. చేత్తో చెంపని అలాగే పట్టుకుని ఆయన వంక చూశాను.
‘క్లాప్‌ బోర్డ్‌ అంటే ఏమనుకుంటున్నావురా… అది మనకు సరస్వతిరా.. నిర్మాతకు లక్ష్మి. అటు వంటి క్లాప్‌ బోర్డ్‌ని రోడ్డు మీద పడేస్తావురా రాస్కెల్‌..’ అంటూ కోపంతో ఊగిపోయారాయన.

‘అది కాదు సార్‌.. ఎడిటింగ్‌ రిపోర్ట్‌ రాసుకోవడానికని…’ అని నేను చెప్పబోతుంటే ఆయన వినిపించుకోకుండా ‘రాసుకోవడానికి నీకు ఇబ్బం దిగా అనిపిస్తేనీ పక్కనే సెట్‌ అసిస్టెంట్‌ ఉన్నాడు. వాడికి ఇవ్వు.. లేదంటే చంకలో పెట్టుకుని రాయి.. ఇలాంటిది మరోసారి రిపీట్‌ అయిందంటే నేను ఊరుకోను’ అని వార్నింగ్‌ ఇచ్చారు.
(మిగతా వచ్చేవారం) 
పవన్‌పై తెలకపల్లిరవి వివాదాస్పద వ్యాఖ్యలు
Updated :15-11-2015 16:44:44
ఒంగోలు: తెలంగాణ సాహితీ స్రవంతి అధ్యక్షుడు తెలకపల్లి రవి.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒంగోలుకు వచ్చిన తెలకపల్లి రవి విలేకరులతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్.. నీకు రాజకీయాలు కావాలా? లేక సినిమాలు కావాలా? తేల్చుకో అని అన్నారు. ‘‘చూడప్ప సిద్దప్పా.. నీకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఉంటే సినిమాలు వదిలేసి, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారు. లేకపోతే రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకో’’ అని రవి హితవు పలికారు.
‘ప్రశ్నించడానికే పార్టీ పెట్టా’ అని చెప్పే పవన్.. ఎవరి తరపున ప్రశ్నిస్తున్నాడో అర్థం కావడం లేదని తెలకపల్లి వ్యంగ్యంగా అన్నారు. ప్రజల కోసం చంద్రబాబును ప్రశ్నిస్తాడనుకొంటే.. చంద్రబాబు చెప్పిన విషయాలే మీడియాతో చెబుతున్నాడని తెలకపల్లి విమర్శించారు. రాజధాని ప్రాంతవాసుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోరాడకుండా ఆయన వద్దే పెయిడ్ ఆర్టిస్టుగా ఉంటే లాభం లేదని చెప్పారు. కనీసం ప్రత్యేక హోదాపై కూడా పవన్ ప్రశ్నించకపోవడం ఏపీ ప్రజల దౌర్భాగ్యమని తెలకపల్లి రవి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులేనిదే ఎన్నికల్లో పోటీ చేయలేమని పవన కల్యాణ్ కూడా అనడం సబబు కాదని ఆయన చెప్పారు.
అమరావతి చుట్టూ 21 అద్భుత నగరాలు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఇంత వరకు అమరావతిని పట్టించుకోలేదని రవి ఎద్దేవా చేశారు.
వినాయకరావు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.