నాటక రచయితగా, నటుడిగా తనదైన ముద్ర… క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 750 సినిమాలు… మూడు నంది అవార్డులు… రచయితగా ఎనిమిది పుస్తకాలు… దర్శకుడిగా మూడు షార్ట్ ఫిల్మ్‌లు, ఒక జనం మెచ్చిన సినిమా… ఇదీ తనికెళ్ళ భరణి ట్రాక్ రికార్డ్. ‘డిసైడ్ చేస్తా’, ‘అద్యెచ్ఛా’(అధ్యక్షా), ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అంటూ ఆయన తనదైన శైలిలో పలికిన డైలాగులు తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయేవే. ఆ ‘బహుముఖ ప్రజ్ఞా’భరణి చెప్పిన షూటింగ్ ముచ్చట్లే ఇవి …
లేడీస్ టైలర్ సినిమాకు నేను మాటల రచయితను. అయితే అంతకుముందు నాకు నాటకాల్లో నటించిన అనుభవం ఉన్నట్లు వంశీ గారికి తెలియదు. నటీనటులకు సీన్లు వివరిస్తుంటే ‘బాగా చేస్తున్నావయ్యా నువ్వే ఎందుకు నటించకూడదు’ అని అప్పటికప్పుడు నాతో వేషం వేయించారు. అలా సినీనటుడ్నయ్యాను.
బాపుగారి చమత్కారం
బాపుగారి సినిమా ‘పెళ్ళి పుస్తకం’ షూటింగ్ జరుగుతోంది. దానిలో నాక్కూడా ఒక పాత్ర ఇస్తే బావుణ్ననిపించింది. కానీ వాళ్ళు పిలవలేదు. అనుకోకుండా ఒక రోజు కబురు వచ్చింది. అది హీరో, హీరోయిన్ల ఫస్ట్ నైట్ సీన్. వారిరువురి మధ్యకూ పురోహితుడి తమ్ముడిగా ప్రవేశించి దక్షిణ గురించి అడిగే పాత్ర నాది. ఆ సన్నివేశంలో నేను శ్లోకాలు కూడా చెబితే బావుంటుందన్నారు బాపుగారు. గుర్తొచ్చిన ఏవో రెండు శ్లోకాలు చెప్పేసి సీను కానిచ్చేశాను. ఇక బయల్దేరబోతుంటే బాపుగారు నా చేతిలో పదివేల రూపాయల చెక్కు పెట్టారు. ఆయన సినిమాలో చిన్న పాత్ర వేస్తేనే చాలనుకున్న నేను డబ్బులు వద్దన్నాను. ఆయన వినకుండా బలవంతంగా ముట్టచెప్పారు. ఇవ్వవలసిన డబ్బులే ఎగ్గొట్టే ఈ ఇండస్ట్రీలో ఇంత చిన్న వేషానికి పదివేలా! అని ఆశ్చర్యపోతుంటే, రమణగారు వచ్చి పదివేల రూపాయల కట్ట చేతిలో పెట్టారు. ఆల్రెడీ చెక్కు ఇచ్చారండీ అన్నాను. ‘అది నీ నటనకు, ఇది నీ రచనకు’ అన్నారాయన. స్ర్కిప్ట్‌లో లేని శ్లోకాలను చెప్పినందుకు కూడా రెమ్యూనరేషన్ ఇచ్చి వారి దొడ్డ మనసు చాటుకున్నారు. అలా నాకు డబుల్ రెమ్యూనరేషన్ ఇప్పించిన సీను, తీరా చూస్తే సినిమాలో లేదు. అదేంటండీ అని బాపుగారిని అడిగితే, ‘నీ నటన మాకు బాగా నచ్చి దాన్ని ఎడిట్‌చే సి మేమే ఉంచేసుకున్నామయ్యా’ అని చమత్కరించారు. ఇంతకీ విషయమేమిటంటే నిడివి ఎక్కువయిందని కత్తిరించిన సీన్లలో ఇదీ ఉందట.
… అదీ ‘అద్భుతః’ అసలు కథ
నేను దర్శకత్వం వహించిన ‘మిథునం’ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం మేనరిజం ‘అద్భుతః’ అనే మాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. నిజానికి ఆ పదం ‘అష్టా చెమ్మా’ సినిమాలో అనుకోకుండా నా నోటినుంచి వచ్చిందే. ఆ సినిమాలో నేను వంకాయ పచ్చడి చేస్తూ అవసరాల శ్రీనివాస్‌తో మాట్లాడే సన్నివేశం ఒకటి ఉంది. అప్పుడు నిజంగానే వంకాయను పుటంపెట్టి కాల్చి శాసో్త్రక్తంగా పచ్చడి చేశాను. సీన్ ప్రకారం అతడితో మాట్లాడటం అయిపోయాక పచ్చడి బండ నాకి రుచి చూడాలి. అలా రుచిచూస్తూ పచ్చడి చాలా బాగా కుదరటంతో అప్రయత్నంగా ‘అద్భుతః’ అనేశాను. దాన్ని అలా సీన్లో ఉంచేశారు. ఆ ఎక్స్ప్రెషన్నే తరువాత ‘మిథునం’లో వాడాను.
పిండి పులిహోర తెమ్మంటే…
‘పిండి పులిహోర’ గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్ వంటకం. దాన్ని ‘మిథునం’ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం తినే దృశ్యం ఒకటుంది. అందుకోసం పిండి పులిహోర తెప్పించమని ఆర్ట్ డైరెక్టర్‌తో చెప్పా. తీరా షాట్ తీద్దామనుకుంటుండగా చూస్తే ఒక గిన్నెలో పులిహోర, మరో గిన్నెలో పిండి ఉన్నాయి. అతడికి పిండితో చేసే పులిహోర గురించి తెలియదట. సినిమా కాబట్టి ఏదోలా మ్యానేజ్ చేసేశామనుకోండి.
వార్నీ! గుమ్మడికాయ అభిమానం …
పరదేశి సినిమా షూటింగ్‌కు అమెరికా వెళ్ళినప్పుడు నాకు, ఎమ్మెస్ నారాయణకు, బ్రహ్మానందానికి, బాబూమోహన్‌కు ఒకే మోటెల్(అక్కడి హోటల్స్‌ని అలా అంటారు)లో బస ఏర్పాటు చేశారు. ఒక రోజు మమ్మల్ని తీసుకెళ్ళడానికి కారు రాలేదు. అందరం ఆకలితో నకనకలాడి పోతున్నాం. మోటెల్స్‌లో వంట చేసుకోవడానికి కింద ప్రత్యేకంగా రూముల ప్రకారం విడి విడిగా స్టవ్‌లూ, పాత్రలూ ఉంటాయి. కానీ కూరగాయలు, సరుకులూ మనమే తెచ్చుకోవాలి. కింద కెళ్ళి చూస్తే మాకు కేటాయించిన ప్రదేశాల్లో ఒక చోట సేమ్యా వంటిది దొరికింది. నాకు కాస్త గరిటె తిప్పడం అలవాటుండడంతో చుట్టుపక్కల ఉన్న ఇతరుల స్టౌల దగ్గరకెళ్ళి దొంగచాటుగా వెతికితే ఒక ఉల్లిపాయ, కొంచెం ఉప్పు, మిరియాల పొడి వంటివి కనిపించాయి. వాటితో ఉప్మా చేస్తే అందరూ లొట్టలేసుకుంటూ తిన్నారు. మర్నాడు షూటింగ్‌కు వెళ్ళాక ఈ విషయం దర్శకుడు రాఘవేంద్రరావు గారికి తెలిసి, ‘నీకు ఈ రోజు షూటింగ్ కాన్సిల్, నేను ఉంటున్న వారింట్లో మంచి గుమ్మడికాయ ఉంది. దానితో చక్కగా కూర వండటమే ఈ రోజు నీ షెడ్యూల్’ అని నన్ను ఆయన ఉంటున్న ఇంటికి పంపించారు. నేను వంట చేసి గుమ్మడికాయ కూరతో అందరికీ విందు చేశాను. నా వంట ఆ ఇంటిగల వాళ్ళకు కూడా బాగా నచ్చింది. నన్ను మర్నాడు వారు తమ ఇంటికి ఆహ్వానించారు. వారి అభిమానానికి పొంగిపోతుంటే అప్పుడు తెలిసింది, వారు నన్ను రమ్మన్నది నా చేత గుమ్మడికాయ కూర వండించి, వారి స్నేహితులకు కూడా రుచి చూపించడానికట!
పెట్టుడు గెడ్డం మహా చిరాకు …
నాకు పెట్టుడు గడ్డం అంటే తగని చిరాకు. అందుకోసం రెండు మూడు సినిమాలు కూడా వదిలేసుకున్నా. ‘బాహుబలి’లో నాది స్వామీజీ పాత్ర. గడ్డం ఉంటుందని తెలిసినప్పటికీ, ఆ సినిమా చరిత్ర సృష్టిస్తుందని నా మనసుకు అనిపించడంతో ఒప్పేసుకున్నాను. అయితే పెట్టుడు గడ్డం అవసరం రాకుండా ఆ పాత్ర అనుకున్నప్పటి నుంచీ గడ్డం పెంచాను. అయినా ఉపయోగం లేకపోయింది. షూటింగ్‌కి వెళ్ళగానే ఇంత బారు పెట్టుడు గడ్డం నా చేతికిచ్చారు. రాజమౌళి గారినడిగితే ‘మీ గడ్డం చాలదండీ, బారు గడ్డం ఉండాల్సిందే’నన్నారు. ఇక తప్పలేదు. ఆ సినిమాలోని నా డైలాగ్ ‘శివయ్యేటి చేత్తాడో మనకేటి తెల్సూ…’ అనుకుంటూ ఆ కేరళ అడవుల్లో పదిహేను రోజులపాటు షూటింగ్ కానిచ్చేశాను.
నాటకానుభవమే కాపాడింది
అది ‘దయామయుడు’ షూటింగ్ ఆఖరి రోజు. రాత్రి పన్నెండయ్యింది. 400 అడుగుల చివరి షాట్ అది. ఇంచుమించు ఆ షాట్ మొత్తం నా డైలాగులతోనే ఉంది. మధ్య మధ్యలో రెండు మూడు చిన్న చిన్న డైలాగులు ఇతరులవి ఉన్నాయి. ఆ రోజుతో ఆర్టిస్టుల డేట్సన్నీ అయిపోయాయి. ఏమైనా సరే ఆ రోజే షూటింగ్ పూర్తయిపోవాలి. చూస్తే ఫిల్మ్ కూడా 400 అడుగులే ఉంది. ల్యాబ్ పదకొండింటికే మూసేస్తారు. ఫిల్మ్ దొరికే టైం కూడా కాదది. విజయచందర్‌గారు నా దగ్గరకొచ్చి ఏం చేస్తావో తెలీదు, షాట్ మొత్తం ఒకే టేక్‌లో అయిపోవాలి. అన్ని డైలాగ్‌లు ఎలా గుర్తుపెట్టుకుంటావో ఏమో! నీదే భారం అన్నారు. నాకు లోలోపల టెన్షన్ మొదలైంది. అయినప్పటికీ ఎక్కడా తడబడకుండా సింగిల్ టేక్‌లో షాట్ కానిచ్చేశాను. అందరం ఊపిరి పీల్చుకున్నాం. నాటకానుభవం ఉండటమే అప్పుడు నన్ను కాపాడింది.
మూడు దశాబ్దాల సినీ జీవితం నాకెన్నో అనుభవాలనిచ్చింది. వాటిలో కొన్నింటిని ఆంధ్రజ్యోతి ద్వారా ప్రేక్షకులతో పంచుకోవడం నిజంగా అద్భుతః.