గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 36-మహామహోపాధ్యాయ తర్క వేదాంత రత్న బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు

maddulapalli 1 001 maddulapalli2 001నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

36-మహామహోపాధ్యాయ తర్క వేదాంత రత్న బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి  గారు

ఆంద్ర దేశం లో తర్క శాస్త్రం లో అద్వితీయులని పించుకొని ,వందలాది శిష్యులను  ఆ శాస్త్రం లో తీర్చి దిద్ది వేలాది పురాణ  ప్రవచనాలు చేసి విజయవాడకే ఒక గొప్ప శాస్త్రీయ గౌరవాన్ని కల్పించిన వారు శ్రీ మద్దుల పల్లి మాణిక్య శాస్త్రిగారు .చెవులకు కుండలాలు నుదుట విభూతి రేఖలు ఫాలభాగం లో కుంకుమ వంటి నిండా అతి విలువైన కాశ్మీర శాలువా చక్కనివెడల్పు అంచుల ఖద్దరు  ఆంద్రబిళ్ళ గోచీ కట్టు  తో స్పురద్రూపం తో బ్రహ్మ వర్చస్సుతో  శాస్త్రిగారిని చూస్తె అపర శంకరులని పించేవారు .వారు లేని వేదాంత సభ ,తర్క సభ ఉండేదికాదు .అందర్లోనూ కొట్టొచ్చినట్లు కనిపించే మహా గాంభీర్య మూర్తి మత్వం వారిది .చాలా సభలలో నూ ,విజయవాడలో మా బంధువుల వివాహ సందర్భాలలోనూ వారిని చూశాను .సభా తాంబూలం వారికిచ్చి ఆశీర్వచనం పొంది యజమానులు ధన్యులయేవారు  .ఆ వర్చస్సు అ ఠీవీ ఆ రాజసం ఆ విద్వత్తు ,ఆవ్యాసంగం ,ఆ ఉపన్యాస ధోరణి ,ఆ ప్రతిభా నాన్య దర్శనం అనిపించేవి .రాష్ట్ర పతి సన్మాన గ్రాహీతలైన వారి గురించి ఈతరం వారికెవరికీ తెలియక పోవటం ఆశ్చర్యమే .ఎంతోమంది గీర్వాణ కవుల గురించి రాశానుకదా మరి మద్దుల పల్లి వారి గురించి వెలితి ఉండిపోయిందనే విషయం  నన్ను బాధించింది .నాకు తెలిసిన వారి నందర్నీ సంప్రదించాను .ఎవరికీ తెలియదన్నారు .నా తపన గమనించిన పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు మద్దుల పల్లి వారి అబ్బాయి బావ మరది ఫోన్ నంబర్ ఇచ్చారు. ఆయనకు ఫోన్ చేస్తే  మాణిక్య శాస్త్రిగారి అబ్బాయి శ్రీ దక్షిణా మూర్తి గారి నంబర్ ఇచ్చారు. వారితో మాట్లాడి నా తపన చెప్పి సరసభారతి పుస్తకాలు పంపాను. వారు తమ తండ్రిగారు రాష్ట్రపతి పురస్కారాన్ని అందు కోన్నప్పుడు అయన గౌరవార్ధం బెనారస్ విశ్వ విద్యాలయ తెచ్చిన ప్రత్యేక సావనీర్ ను ,శ్రీ శంకరాచార్య ప్రకరణాలపై మాణిక్య  శాస్త్రి గారు  రాసిన తత్వ ప్రభ గ్రంధాన్ని పంపారు .మొదటిది అంతా సంస్కృతం లో వివిధ లబ్ధ ప్రతిష్ట రచయితలు  రాసిన ఉత్తమ  వ్యాసాలున్నాయి అందులో మా గబ్బిట వారైన శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి గారి వ్యాసమూ ఉంది . శాస్త్రిగారికుమారులు దక్షిణామూర్తిగారు హిందీలో తమ తండ్రిగారి గురించి వ్రాసిన వ్యాసం అందులో ఉంది .అదే ఈ వ్యాసానికి ఆధారం  .

జనన విద్యాభ్యాసాలు

శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్స్త్రిగారు 1916 ఫాల్గుణ బహుళ పాడ్యమి నాడు ప్రకాశం జిల్లా కలిగిరి మండలం ఆనంద పురాగ్రహారం లో జన్మించారు .తలిదండ్రులు శ్రీమతి చెంచు లక్ష్మి శ్రీ దత్తాత్రేయ శాస్త్రి గార్లు .తండ్రి ప్రకాండ వైయాకరుణులు .జ్యోతిష్ శాస్త్రం లో నిష్ణాతులు .ఆయన రోజులో ఎక్కువ భాగం భగవధ్యానం పూజ లోను విద్యార్ధులకు బోధనలోను ,ప్రజాహిత కార్యక్రమాలలోనూ గడిపే వారు .భార్యతో వారి దాంపత్య జీవితం సుఖ సంపన్నంగా ఉండేది . ఈ దంపతుల ప్రధమ సంతానం శ్రీమతి వెంకట సుబ్బమ్మ  ,రెండు శ్రీ సత్యనారాయణ శాస్త్రి మూడు శ్రీ లక్ష్మీ నరసింహ శాస్స్త్రి నాలుగు శ్రీ మాణిక్య శాస్త్రి అయిదు శ్రీమతి లక్ష్మీ వేదమ్మగార్లు .జ్యేష్టపుత్రుడైన సత్యనారాయణ శాస్త్రి గారు సంస్కృతాంధ్రాలలో ప్రసిద్ధ కవి .రెండవ కుమారుడు శ్రీ లక్ష్మీ నరసింహ శాస్త్రి సంగీత శాస్త్రం లో సుప్రసిద్ధ విద్వాంసులు .ఆఖరివారైన శ్రీ కృష్ణ మూర్తి శాస్త్రి అధ్యాపకులుగా పని చేసి విశ్రాంతి తీసుకొంటున్నారు

చిన్నతనం నుండి మాణిక్య శాస్త్రిగారు తండ్రి గారి వద్ద సంస్క్రుతాధ్యయనం చేశారు .శాస్త్రాలు నేర్వాలన్న ఆ కాంక్షతో 12వ ఎతానే కాశీ వెళ్ళారు . అక్కడ తర్కం వేదాంత శాస్త్రాలు అభ్యసించారు .పది సంవత్సరాల కఠోర పరిశ్రమ చేసి ప్రకాండ పండితులై ,కాశీ మహారాజు చేత ఘన సన్మానం అందుకొన్నారు. తర్వాత స్వగృహం చేరారు .శ్రీ వేమూరి రామ బ్రహ్మ శాస్త్రి మహోదయుల వద్ద శిష్యరికం చేసి తర్క ,వేదా౦తాల అంతు చూశారు .గురువుగారి ప్రశంసలు అందుకొన్నారు .శ్రీ గోరుగంత సుబ్రహ్మణ్య శాస్త్రి గురువరేణ్యు ల వద్దా చాలాకాలం విద్య నభ్యసించి గురువు గారిచే ‘’నువ్వు ఇప్పుడు విద్వాన్మణి వయ్యావు .గురువుకు కూడా చిర  యశస్సుకలిగించి ప్రకాండ పండితుడివై విశ్వ విఖ్యాత కీర్తినార్జిస్తావు ‘’అని ఆశీరభినదనలు అందుకొన్న విద్యా మాణిక్యం మాణిక్య శాస్స్త్రి గారు .

వివాహం సంతానం .

విప్పర్ల పల్లి నివాసి శ్రీ వంగల శ్రీ కృష్ణ మూర్తి ,ఆది లక్ష్మి దంపతుల సుపుత్రి శ్రీమతిసుబ్బలక్ష్మిని వివాహమాడారు .మాణిక్య శాస్త్రిగారు మొదట్లో ఆగిరిపల్లి సర్వ తంత్ర స్వతంత్ర విద్యాలయం లో అధ్యాపకులుగా సేవ చేశారు. తర్వాత విజయవాడ కు చేరి భారత మహిళా మండలి లో పురాణ ప్రవచనం చేస్తూ ,శిష్యులకు తర్క ,వేదాంత శాస్త్రాలు బోధిస్తూ నేర్చిన విద్యకు  సార్ధకత కల్పించారు .1954లో విజయవాడలో స్వగృహం నిర్మించుకొన్నారు .

మాణిక్య శాస్త్రి గారికి పంచాగ్నుల వంటి అయిదుగురు కుమారులు జన్మించారు .ప్రధమ పుత్రులు శ్రీ సూర్య నారాయణ ఘనాపాఠీ విద్యార్ధులకు వేదాధ్యనం గరుపుతూ 25మంది ఘనా పాఠీ లను తయారు చేసిన ఘనులు .రెండవ కుమారుడు శ్రీ లక్ష్మీ నరసింహ శాస్త్రిగారు చార్టర్డ్ అకౌంటంట్ గా  పని చేసి 20మంది చార్టర్డ్ అకౌంట్స్ ను తయారు చేసినవిశేష  సునిసిత మేధావి .మూడవ కుమారులు శ్రీ కృష్ణ మూర్తి శాస్త్రిగారు తండ్రిగారి సేవలో తరిస్తూ జీవితాన్ని సార్ధకం చేసుకొన్నారు .నాలుగవ పుత్ర రత్నం శ్రీ దక్షిణామూర్తిగారు పూజ్యపాడులైన జనకుల వద్దనే సంస్కృతాన్ని అభ్యసించి కేంద్రీయ విద్యాలయం లో సంస్కృత అధ్యాపకులుగా సేవలందిస్తున్నారు .తండ్రిగారి వారసత్వాన్ని నిలుపుతూ పురాణ ప్రవచనాలు చేస్తూ ఆర్ష విజ్ఞానాన్ని వ్యాపింప జేస్తున్నారు .అయిదవ కుమారులు శ్రీ దత్తాత్రేయ శాస్త్రిగారు తండ్రిగారు మాణిక్య శాస్త్రిగారి శాస్త్ర జ్ఞానాన్ని ఆపోసన పట్టి ఉత్తరాదికారిగా తర్క ,వేదాన్తాది శాస్త్రాలను  అధ్యయనం చేసి బహు ప్రఖ్యాతులయ్యారు .విశాఖ పట్నం ఆంద్ర విశ్వ విద్యాలయం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వెలుగొందుతున్నారు .మాణిక్య శాస్త్రి గారి పుత్రులు అయిదుగురూ మాణిక్యాల లాంటి వారే .తండ్రిగారి  యశస్సును ద్విగుణీకృతం చేస్తున్నారు  ధన్య జీవి శాస్త్రిగారు .

మాణిక్య శాస్త్రిగారి బహు విధ వ్యాసంగం

విజయ వాడలో ఉంటూ మాణిక్య శాస్త్రిగారు త్రిలింగ విద్యా పీఠం లో చాలాకాలం తర్క వేదాంత శాస్త్రధ్యాపనంచేశారు .తరువాత స్వంత ఇంటిలో గురుకులమేర్పరచి ఎందరో శిష్యుఅలను అద్వితీయ పండితులుగా తీర్చి దిద్దారు .అందులో ప్రసిద్ధులు శ్రీ శ్రీ చతుర్వేదుల రామ లింగ శాస్త్రి ,శ్రీ కరిపెద్దు పురుషోత్తమ శాస్స్త్రి   ,శ్రీ పొదిలి లక్ష్మీ నారాయణ శాస్త్రి ,శ్రీ మేడి చర్ల గోపాల కృష్ణ మూర్తి శాస్త్రి మొదలైన దిగ్దంతులైన పండిత ప్రకా౦డులున్నారు. .శివరామ కృష్ణ క్షేత్రం లో 29 సంవత్సరాలు ఏకధాటిగా ప్రతిదినం పురాణ ప్రవచనం చేసిన రికార్డు శాస్త్రిగారిది .సాధారణ జనాలకు కూడాఅర్ధమయ్యేట్లు  వారు  తర్క  వేదాంత విషయాలను ప్రవచించే తీరు  మహాదా శ్చర్యంగా ఉండేది .ఉప పురాణాలను కూడా సామాన్యులకు సులభ బోధకం గా చెప్పే నేర్పు వారిది. అందుకే వారి ప్రవచనాలకు విశేషం గా భక్తజనం హాజరై విజయం కలిగించేవారు .చందోలు శాస్త్రిగా పిలువ బడే బాలా త్రిపుర సుందరీ ఉపాసకులు  బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారింట నెల రోజులు ఉండిఆ బ్రాహ్మీమయ మూర్తికి సర్వ శాస్త్ర పాండిత్యం లో మెలకువలు కరతలామలకం చేశారు .ఈ విషయాన్ని తాడేపల్లి వారే స్వయంగా చెప్పుకొన్నారు .విజయవాడలో శ్రీ మాణిక్య శాస్త్రి గారికి ఘన సన్మానం జరిగినపుడు శ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారు గురుభక్తిగా అభినందన శ్లోకాలు రచించి చదివారు .ఆ మాణిక్యం ఘన పదార్ధమైతే ఈ మాణిక్యం వాత్సల్య ఝరీ సదృశం అన్నారు .

దిన చర్య

శ్రీ మాణిక్య శాస్త్రి గారి దిన చర్య చాలా నిర్దుష్టంగా ఉండేది .క్షణం తీరుబడి లేనికార్య వ్యగ్రత వారిది    .ప్రతి దినం తెల్లవారుఝామున మున బ్రాహ్మీ ముహూర్తం లో నిద్ర లేచి గ్రంధావ లోకనాం చేసేవారు .7 గంటల వరకు పూజ,దేవతార్చన లో నిమగ్నంయ్యేవారు .తర్వాత పురాణ ప్రవచనం చేసేవారు .ఉదయం 9గంటలకు శిష్యులకు శాస్త్రాధ్యాపనం చేసేవారు .తర్వాత మళ్ళీ పూజ .భోజనాంతరం సాయంకాలం వరకు శాస్త్రాధ్యాపనం .సాయంకాలం నుండి రాత్రి 9గంటల వరకు పూజాదికాలు .రాత్రి 10గంటలనుండి ఒక గంట సేపు పునశ్చరణ .ఇదీ శాస్త్రిగారి బిజీ షెడ్యూల్ .  శాస్త్రిగారి ధర్మ పత్ని శ్రీమతి సుబ్బలక్ష్మి గారు ఛాత్రులకు ,పండితులకు అతిధులకు అందజేసే ఆతిధ్యం లో భర్త గారికి చేదోడు వాదోడుగా ఉంటూ గురుపత్నిగా సమాన గౌరవాదరాలను పొందేవారు .ప్రతి సంవత్సరం శాస్త్రి గారి గృహం లో నవ రాత్రి ఉత్సవాలను మహా వైభావంగానిర్వహించేవారు .ఆంద్ర దేశం లోని సుప్రసిద్ధ సమస్తవేద ,శాస్త్ర పండితులు  విచ్చేసి శాస్త్రి గారి ఘనమైన ఆదరణ ఆతిధ్యాలను గ్రహించి,సగౌరవ సత్కారాలను అందుకొని సంతృప్తి చెందేవారు

రచనా వ్యాసంగం

అనేక విషయాలపై భాషణలు ,ప్రసంగాలు ,చర్చలు ,అధ్యాపనం పురాణ ప్రవచనం విశేషాలను ప్రముఖ పత్రికలన్నీ వ్యాసపరంపర గా అందజేసేవి .వారి వ్యాసాలను ప్రచురించేవి .దిన పత్రికలైన ఇండియన్ ఎక్స్ ప్రెస్ ,హిందూ పత్రికలూ ఆంగ్లం లో వారి ప్రసంగాలను అందజేసేవి .శాస్త్రిగారు ఎక్కడ ఏ విషయమై రాసినా, మాట్లాడినా పత్రికలన్నీ వెంటనే ప్రముఖం గా ప్రచురించి వారి భావధారను అందజేసేవి .ఆంద్ర పత్రిక ఈనాడు వంటి తెలుగుపత్రికలు శాస్త్రిగారి బహుముఖీన పాండిత్యం విద్వత్తుల గురించి ప్రత్యేక వ్యాసాలూ రాసేవి .ప్రధాని నెహ్రూ నుండి పొందిన సన్మాన వార్తలను ఇల్లస్త్రేటేడ్ వీక్లీ ఘనం గా ప్రచురించి శాస్తిగారి కీర్తిని దశ దిశలా చాటింది .దర్భంగా మహారాజు చేసిన సన్మానాన్ని ప్రముఖంగా ప్రచురించి వారి కీర్తికిరీటానికి మరో కలికితురాయి నంద జేసింది

మాణిక్య శాస్త్రిగారు అనుక్షణ వ్యాసంగం లో ఉంటూ కూడా ‘’శ్రీ శంకరాచార్య ప్రకరణల పై ‘’తత్వ రహస్య ప్రభ ‘రాశారు .దీనికి రాష్ట్ర పతి పురస్కారం  ఘన సన్మానం లభించింది .ఇందులో దక్షిణా మూర్తి స్తోత్రం ,అపరోక్షాను భూతి దశ శ్లోకి ,సోపాన పంచకం ,ఏక శ్లోకీ మనీషా పంచకం మొదలైన వాటిపై వివరణ తో చర్చించారు .

శాస్త్రిగారి రెండవ గ్రంధం ‘’తత్వ సంవిజ్ఞాన పీఠికా’’ఇందులో భక్తీ ముక్తి మార్గాలు అనేక వేదాంత విశేషాలు ,ఉదాహరణలు ఉంటాయి వీరి తత్వ రహస్య ప్రభ ఇప్పటికీ లభ్యమే . .

శాస్త్రిగారి గురుకులం

మాణిక్య శాస్త్రి గారింట ఎందరో విద్యార్ధులు ఉండినిరంతర విద్య అధ్యాపనం చేసేవారు .వారే తర్వాత అగ్రగణ్య పండితులై గురువుగారి కీర్తికి కూడా కారకులయ్యారు .శాస్త్రిగారి సుపుత్రులు డా .దత్తాత్రేయ శాస్త్రి గారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఆచార్యులై,పురాణ ప్రవచకులై గురుపరంపరను కొనసాగించటం విశేషం .శ్రీ రాణీమురళీ కృష్ణ కేంద్రీయ విద్యాలయం లో సంస్క్రుతాధ్యాపకులై గీర్వాణ సేవలో తరిస్తున్నారు .శ్రీ ధూళిపాళ రామ కృష్ణ విజయవాడ మేరీస్టేల్లా కళాశాలలో సంస్కృత ఆచార్యులై భాషా సేవలందిస్తున్నారు శ్రీపాలగుడు సుబ్రహ్మణ్య శాస్త్రి సంస్క్రుతాధ్యాపనం తోబాటు పురాణ ప్రవచనం లోను అద్వితీయులని పించుకొన్నారు .ఈ శిష్య పరంపర ప్రతి ఏడాది మాణిక్య శాస్త్రి గారి జన్మ దినమైన ఫాల్గుణ బహుళ పాడ్యమినాడు గురు పూజోత్సవాన్ని అతి వైభవం గా నిర్వహిస్తారు .అంతర్గత వేద ,శాస్త్ర సభలను ఏర్పాటు చేస్తూ భక్తీ శ్రద్ధలతో  పండిత సన్మానాలనూ  వైభవం గా చేసి గురుభక్తిని ప్రకటించుకోవటం ఒక విశిష్టమైన ఆదర్శ  వంతమైన ఆనవాయితీ .దేశం లోని వివిధ ప్రాంతాలనుండి ఇక్కడికి వచ్చి శాస్త్రిగారి అంతే వాసులై శాస్త్ర విద్య నభ్య సించిన వారిలోశ్రీ వేదవ్యాస,శ్రీ శ్రీనివాసాచార్య ,శ్రీ కృష్ణ రాజ తంత్రీ మొదలైన మహా పండితులున్నారు  . శిష్యులలో మాణిక్య శాస్త్రిగారికి ప్రియశిష్యులు శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రిగారు  .బెనారస్ విశ్వ విద్యాలయం లో వైదిక దర్శన విభాగం లో ప్రొఫెసర్ గా పనిచేశారు  .అనేక మంది విద్యార్ధులకు మార్గ దర్శనం చేశారు . .గురు కీర్తి దశ దిహలా వ్యాపింప జేసి గురూణం తీర్చుకొన్న శాస్త్రి గారి ప్రియ తమ అంతేవాసి .

బిరుద సత్కార పురస్కారాలు

శ్రీశృంగేరి శారదా పీఠం,శ్రీ కంచి కామ కోటి పీఠం,ఉడిపి పెజావర్ మఠం,తిరుపతి దేవస్థానాలకు శ్రీ మాణిక్య శాస్త్రి గారు ఆస్థాన పండితులై గౌరవం పొందారు .ఇందులో కొందరు పీఠాదిపతులకు శాస్త్రిగారు తర్క వేదాంత గురువులవటం మహా గొప్ప విషయం .1992లో రాష్ట్ర పతి శ్రీ ఆర్ .వెంకట్రామన్ గారు మాణిక్య శాస్త్రిగారు చేసిన సంస్కృత సేవలను గుర్తించి రాష్ట్ర పతి పురస్కారాన్ని అందజేసి ఘనం గాసత్కరించారు .ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి బహు పర్యాయాలు పురస్కారం పొందారు .

శాస్త్రి గారి అపార పాండిత్యానికి తగినట్లు ‘’తర్క వేదా౦తాచార్య ,దర్శనాచార్య ,తర్క వేదాంతా రత్న మహామహోపాధ్యాయ మున్నగు బిరుడులందుకొన్న సమర్ధులైన దేశికులు . .శాస్త్రిగారు అగణిత పండితులకు అధ్యాపనం గరపటం వేలాది భక్తులకు ముక్తిమార్గదర్శనం చేయించటం బహు ప్రశంస నీయం .అనేకమంది శిష్యులు గురువుగారి పై ఉన్న గౌరవ ప్రపత్తులకు నిదర్శనంగా తమ పిల్లలకు మాణిక్య శాస్త్రి పేరు పెట్టటం చిరస్మరణీయం .ఇలా జరగటం బహు అరుదు ఈ అరుదైన ఆ గౌరవాన్ని దక్కించుకొన్న వారు శ్రీ మాణిక్య శాస్త్రిగారు

మాణిక్య శాస్త్రి గారి మరణం .

ఒక  సుప్రసిద్ధ సంస్కృత శ్లోకం

–‘’పరి వర్తినీ సంసారే మ్రుతః కో వా న జాయతే –సజాతో యేన  జంతేనయాతి వశః సమున్నతిం ‘

’లో చెప్పినట్లు జీవించిన వారందరూ మరణించి ఏదోఒక జన్మ పొందుతారు .కానీ ఎవని పేరు అతని వంశానికి ఉన్నతి కలిగిస్తుందో అలాంటి వాని జీవితం ధన్యం ఇలాంటి పేరు ప్రతిష్టలను మాణిక్య శాస్త్రిగారు తన వంశానికి కలిగించి ధన్య జీవులయ్యారు .92ఏళ్ళ సార్ధక జీవనం గడిపిన తర్క వేదాంత రత్న మహా మహోపాధ్యాయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్స్త్రిగారు -8-4-2008 బ్రాహ్మీ ముహూర్తం లో బ్రహ్మ పదం చేరుకున్నారు .

‘’జయ౦తితే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరః—నాస్తి యేషాం యశః కాయే జరామరణ వర్జితం ‘’

శ్రీ మాణిక్య శాస్త్రి గారి రెండు ఫోటోలు జతచేశాను చూడండి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-15-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.