తధ్యం కంటే సందేహాస్పదం మేలు
అని చెప్పే మహా భారతం లోని జరితారి కద తెలుసుకొందాం .మందపాలుడనే ముని వెయ్యేళ్ళు తీవ్ర తపస్సు చేసి యోగ బలం తో దేవలోకం చేరాడు . కాని స్వర్గ ప్రవేశం కలగలేదు .కారణం ఏమిటని అక్కడి దేవతలను ప్రశ్నించాడు. అతనికి సంతానం లేదు కనుక సంతతి లేని వారికి స్వర్గ ద్వారాలు తెరుచుకోవని చెప్పారు .మునికి వెంటనే సంతానం సాధించాలనే కోరిక కలిగి భూలోకానికి తిరిగి వచ్చాడు .అర్జెంట్ గా సంతానం కలగాలంటే ఏమిటి ఉపాయమ అని ఆలోచిస్తే ,పక్షి రూపం లోనే అది సాధ్యం అని గ్రహించాడు .మహర్షి తాను ఒక ‘’లావుక పక్షి ‘’అయి ,’’జరిత’’ అనే అనే మరొక ఆడ లావుక పక్షిని భార్యను చేసుకొని సుఖించాడు . జరితారి మొదలైన నలుగురు బ్రహ్మ జ్ఞానుల్ని సంతానం గా పొంది ,ఖా0డవ వనం లో భార్య జరిత సంరక్షణ లో ఉంచి ,మొదటి భార్య ‘’లపిత ‘’దగ్గరకు చేరుకొన్నాడు . లపితతో విహరిస్తుండగా అగ్ని దేవుడు ఖాండవ వనాన్ని కాల్చ టానికి వెడుతూ ఎదురయ్యాడు .ఆయన రాకలోని అ0తరార్ధాన్ని గ్రహించి ముని, అగ్ని సూత్రాలతో ప్రసన్నం చేసుకొన్నాడు . అగ్ని దేవుడితో తాను ఉత్తమ లోక ప్రాప్తి కోసం జరిత అనే లావుక పక్షిని పెళ్ళాడి బ్రహ్మ వేత్తలైన నలుగురు కుమారుల్ని లావుక పక్షి రూపాలలో కని,తల్లి జరిత సంరక్షణలోఖాండవ వనం లో ఉంచి వచ్చానని ,ఖాండవ దహనం చేసేటప్పుడు తన నిసుగులైన కుమారుల జోలికి వెళ్ళకుండా వారిని కాపాడమని వేడుకొన్నాడు .’’వేద వేత్తలను కాపాడటం నా విధి ‘’అని అగ్ని అభయమిచ్చాడు మహర్షికి .
స్వాహా దేవుడు ఖాండవ దహనం చేస్తూ సర్వం స్వాహా చేస్తూ పోతున్నాడు .అగ్నిజ్వాలలు, నల్లని పొగ అడవి అంతా అల్లుకు పోతున్నాయి .ఒక చెట్టుమీద బిడ్డలపిట్టలతో ఉన్న తల్లి జరిత ఏ క్షణం లోనైనా చెట్టును అగ్ని కబళిస్తుందని భయ పడుతోంది .రెక్కలు రాని తన నిసువులను ఎలా కాపాడుకోవాలో ఆమెకు పాలు పోవటం లేదు. ఈ అపాయాన్నుంచి ఉపాయం గా ఎలా బయట పడాలో తోచటం లేదు .ప్రళయాగ్ని లా అగ్ని వ్యాపిస్తుంటే బిడ్డలతో తల్లి జరిత చెట్టు మొదట్లో ఉన్న కలుగులలోకి వెళ్లి వారిని తలదాచుకోమని ఉపాయం చెప్పింది .తాను బ్రహ్మ వేత్తలైన నలుగురు బిడ్డల్ని కని వారికే ఆపదా రాకుండా చూసుకొంటానని వారి తండ్రి కి వాగ్దానం చేశానని తన మాట విని కలుగుల్లోకి కి వెళ్లి దాక్కోమని బ్రతిమాలిడింది .అప్పుడు అందులో పెద్దకొడుకు’’ జరితారి’’ ‘’అమ్మా !కలుగులోకి వెడితే మాంసపు ముద్దల్లా ఉన్న మమ్మల్ని ఎలుకలు తినేస్తాయి .చెట్టు గూటిలో నే ఉంటె మంట మమ్మల్ని కాల్చేస్తుంది ఎలుక చేత చావుకంటే అగ్ని వల్ల మరణిస్తే ఉత్తమ గతి కలుగుతుంది .ఎలుక వలన చావు తధ్యం .గూటిలోనే ఉంటె చావు సందేహాస్పదం .ఎందుకంటె గాలి దిశమారితే చెట్టు కాలిపోదు .మేము సురక్షితంగా ఉండగలుగుతాం .అందుకని తధ్యం కంటే సందేహాస్పదమైన దాన్ని ఎన్నుకోవటం వివేక వంతుల లక్షణం .నువ్వు మా విషయం ఆలోచించకుండా నీకు క్షేమంగా ఉన్న చోటుకు పారిపో .మా గురించి బెంగ వదిలి పెట్టు .పుత్ర వ్యామోహం వదిలెయ్యి .నువ్వు బ్రతికుంటే మళ్ళీ మా తండ్రికి సంతానాన్ని సాధించి పెట్ట గలవు .కనుక నీ ఆత్మ రక్షణ నీకు తక్షణ కర్తవ్యం ‘’‘’అని ఆ బ్రహ్మ జ్ఞాని జ్ఞాన బోధ చేశాడు తల్లి జరిత కు .
పెద్ద కొడుకు ఎంతో ఆరిందాగా ,లోక జ్ఞానంతో చెప్పిన మాటలలోని పరమార్ధాన్ని గ్రహించి , ఆమె ఆమోదం తెలిపి వారు క్షేమంగా ఉండాలని ప్రార్ధిస్తూ వదలలేక వదలలేక ,మాటిమాటికీ వెనక్కి తిరిగి చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వెళ్లి పోయింది .చతుర్ముఖ బ్రహ్మ నాలుగు శిరస్సులనుంచి నాలుగు వేదాలు ధ్వనిస్తున్నట్లు జరితారి మొదలైన నలుగురు సుస్వరంగా వేద మంత్రాలు చదువుతూ ‘’అభయం మాకు అభయం ‘’అంటూ అగ్ని దేవుని ప్రార్ధించారు .అగ్నికి మందపాల మహర్షికిచ్చిన వాగ్దానం జ్ఞాపక మొచ్చి వాళ్ళున్న వృక్షం జోలికి పోకుండా వృక్షాన్ని భక్షించక రక్షించి మాట నిల బెట్టుకొన్నాడు .ఎక్కడో దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన తల్లి జరిత మళ్ళీ వృక్షాన్ని చేరి బిడ్డల్ని ఆప్యాయంగా కౌగలించుకొని ఆనంద బాష్పాలు రాలుస్తూ అగ్నికి కృతజ్ఞతలు చెప్పింది .అక్కడ మందపాలుడు కొడుకు లేమై పోయారోనని కంగారు పడుతూ తానూ అగ్నిని ప్రార్ధించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ,అగ్ని తప్పక వాగ్దానం నిల బెట్టుకొంటాడని నమ్మకం తోఉన్నాడు .ప్రక్కనే ఉన్న భార్య లపిత ‘’అయ్యగారికి కొత్త పెళ్ళాం మీద మోజు ఇంకా తగ్గలేదన్న మాట .జరిత కూడా పక్షి కదా ఎగిరిపోయి ప్రాణాలు కాపాడుకొనే ఉంటుంది లెండి ‘’అని మేలమాడింది .’’వశిస్టమహర్షి యే పపతివ్రత అయిన భార్య అరుంధతిని సందేహించాడు కదా ‘’అని నవ్వాడు .ఖాండవ దహనం అయిన తర్వాత మందపాలుడు తిరిగివచ్చి భార్యా పిల్లలు క్షేమంగా ఉన్నారని తెలుసుకొని సంతోషించాడు .
ఈ కదలో సంతానం స్వర్గ లోక ప్రాప్తికి మార్గం అనీ ,చేసిన వాగ్దానాన్ని ఎంతటి వారైనానిల బెట్టుకోవాలని ,తధ్యం అని నమ్ముకున్న దానికంటే సందేహాస్పదం అని పించిన దానిని ఎంచుకోవటం మేలు అనే విషయాలు ఉన్నాయని గ్రహించాలి .మహా భారతం ఏది చెప్పినా పరమార్ధ దృష్టితో చెబుతుంది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
.