వానప్రస్థం మీ చేతుల్లోనే — అనంతం లో ఆనందం రవి శంకర్ ,అనుకోవడం..బాధపడటం ఎందుకు?యాంకర్ సుమ

వానప్రస్థం మీ చేతుల్లోనే
31-12-2015 23:34:03

వర్ణాశ్రమధర్మాలు అనే మాట పలు సందర్భాల్లో వింటూంటాం. వర్ణం మనకు తెలిసిందే, కానీ ఆశ్రమం పూర్తిగా ఆశ్రమమని అర్థం కాదు. ఏ విషయంపై మనం శ్రమతో దీక్షతో పనిచేస్తామో అది ఆ విషయానికి సంబంధించిన ఆశ్రమం. అనగా జీవితంలో ఒకానొకదశ.
వేదాలు మనిషి పుట్టిన సమయం నుంచి మరణించే వరకూ జీవితకాలానికి కావాలసినంత టైమ్‌టేబుల్‌ తయారు చేశాయి. ఇందులో నాలుగు భాగాలు లేదా పీరియడ్‌లు ఉన్నాయి. ఏ దశలో మనిషి ఏం చేయాలని నిర్దేశించాయి. ఈ టైమ్‌టేబుల్‌లో ఒక పీరియడ్‌ వానప్రస్థం.
మనుస్మృతిలాంటి పుస్తకాల్లోనూ, ఇతిహాస, పురాణాల్లోనూ ఆశ్రమాల గూర్చి చర్చ విస్తారంగా ఉంది. మహాభారతంలో అనేకచోట్ల, ముఖ్యంగా శాంతి పర్వంలో మనిషి జీవితంలోని నాలుగు దశలు, ఆయా దశల్లో వ్యక్తి చేయాల్సిన పనులు వివరంగా కనిపిస్తాయి. విద్య నేర్చుకునే దశను బ్రహ్మచర్యాశ్రమం అనీ, వివాహ జీవితాన్ని గృహస్థాశ్రమం అనీ, వయస్సు మళ్లిన తర్వాత క్రమక్రమంగా తన బాధ్యతలను పిల్లలకు అప్పగించడం, జ్ఞానం పట్ల ఆసక్తి చూపడం, సమాజానికి ఉపయోగించే పనులు చేయడం అనేది మూడో దశ. దీనికే వానప్రస్థాశ్రమం అని పేరు. వనం అంటే అరణ్యం. ప్రస్థం అంటే ప్రయాణం. నగరాల్లోనూ, గ్రామాల్లోనూ ఉండే రణగొణ ధ్వనులు లేని ప్రాంతమే అరణ్యం (రణం అంటే శబ్దం). పూర్వం నిజంగానే అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ సాధారణ జీవితం గడపడం ఇందులోని లక్ష్యం. ఈ దశ నుంచి పూర్తిగా తప్పుకుని పరివ్రాజకుడిగా (సంన్యాసి) ఉండటం అనేది చివరి దశ.
ఆధునిక జీవనంలో మనం ఈ మూడు దశలనే చూస్తాం. బాల్యంలో విద్యాభ్యాసం, తర్వాత ఉద్యోగం చేయడం, కొంత కాలానికి ఆ ఉద్యోగం నుంచి ఇష్టంగానో, అయిష్టంగానో విరమించడం అనే మూడు దశలు. మొదటి రెండు దశల్లోని వ్యక్తి జీవితం శ్రమతో నిండి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు కూడా శ్రమతో కూడినవే. అయినా వీటి నుంచి విరమించడానికి చాలామందికి చాలా మందికి మనసొప్పదు. చాలామంది ఎంతో బాధతో పదవీ విరమణ చేయడం, జీవితంలో శూన్యత్వాన్ని అనుభవించడం జరుగుతుంది. జీవితంలో ఎంతో సాఫల్యం పొంది, ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తులు కూడా నిరాశకు, మానసిక క్షోభకు గురికావడం కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవడం కూడా చూస్తూంటాం. మధ్య వయసులో విసుగు (boredom ) ఎలా తొలగించాలి అనేది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఎదుర్కొంటున్న ఒకానొక ముఖ్య సమస్య.
పూర్వీకులు చెప్పిన వానస్రస్థానికీ, ప్రస్తుత విశ్రాంత (రిటైర్డ్‌) జీవనానికీ కొంత పోలిక ఉంది. రెండింటిలోనూ వ్యక్తి ఒక బాధ్యత నుంచి వైదొలగడం, కొత్త జీవనాన్ని ప్రారంభించడం ఉంది. సమయాన్ని ఏ రీతిలోనైనా గడిపే స్వేచ్ఛ ఉంది. అయినా ఈ రెండింటి మధ్య భేదం చాలా ఉంది. వానప్రస్థం స్వచ్ఛందంగా తీసుకున్న మార్గం.
పదవీవిరమణ బలవంతంగా వచ్చిన విశ్రాంతి. వానప్రస్థంలో త్యాగమనే అంశం ఉంది. ఇదివరకు అనుభవించిన అధికారాన్నీ, సుఖాన్నీ, బాధ్యతల్నీ స్వతంత్రంగా వదలడం. ఈనాటి విశ్రాంత జీవనంలో త్యాగం అనే అంశం లేదు. వానప్రస్థంలో శరీరాన్నీ, మనసు, ఇంద్రియాలను నిగ్రహించి ధార్మికంగా ఉండటం, సమాజం కోసం పని చేయడం, భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడం అన్నది లక్ష్యం. రిటైర్మెంట్‌లో ఈ ధార్మికత అనే ప్రస్తావన లేదు. వానప్రస్థానికి వెళ్లిన వ్యక్తి అహింస, సత్యం వ్రతంగా ఉంచుకుని నిప్పులాంటి జీవనం గడపాలని శాంతిపర్వం చెబుతుంది. రాజులు కొడుకులకు రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థానికి వెళ్లడం పరిపాటిగా ఉండేది. బహుశా అందువల్లనే మన చరిత్రలో పాశ్చాత్యదేశాల్లోలాగా తండ్రులను బంధించిన సంఘటనలు కనిపించవు. రాజులే కాకుండా మిగతావారికీ కూడా ఈ వానప్రస్థం ఉండేది. పుత్రుడికి పుత్రుడు కల్గిన తర్వాత గృహస్థు వానప్రస్థానికి వెళ్లాలి (శాంతిపర్వం). అతిథులను ఆదరించడం కోసం అవసరమైన ధనాన్ని పెట్టుకోవడం తప్పుకాదని కూడా చెప్పారు.
వేదాలు అనేక కర్తవ్యాలు, కర్మలు, వ్రతాలు అనే పేరిట మనిషికి ధార్మిక కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉంచింది. అందువల్ల వానప్రస్థానికి వెళ్లిన వ్యక్తి కూడా ఎలాంటి మానసిక సంక్షోభం, నైరాశ్యం లేకుండా దాన్ని ఒక ధర్మంగా భావించి సంతోషంగా ఉండేవాడు. సుఖాలను వదిలివేయడం కూడా ధర్మమే అన్నప్పుడు వ్యక్తికి నైరాశ్యం ఉండదు. పదవీ విరమణలో ధర్మమనే అంశం లేనందున ఒక వ్యక్తికి స్వచ్ఛందంగా కాకుండా బలవంతంగా తన ప్రాధాన్యాన్ని పోగొట్టుకోవడంగా భావిస్తాడు. దీనివల్ల అశాంతి, నిరాశలతో పాటు జీవన గమ్యం లేకపోవడం జరుగుతుంది.
జీవితంలో ఆనందం ఎలా నింపుకోవాలి అన్నది మామూలు మనిషితో పాటు శాస్త్రవేత్త, తత్వవేత్త అందరూ ఆలోచించే విషయం. మనిషి తన వ్యక్తిగత సుఖాన్ని పొందుతూనే ఇతరుల మేలుకై పనిచేయడాన్ని ధార్మిక జీవనం అంటారు. మనిషి కొంతైనా ధార్మిక మార్గంలో లేనపుడు అతని పరిస్థితి ఎలా ఉంటుందో తైత్తరీయ ఉపనిషత్తు వర్ణిస్తుంది. అయ్యో నేను మంచి మార్గంలో ఎందుకు నడవలేదు, ఎందుకు చెడు పనులు చేస్తూ వచ్చాను అని ఎంతో కొంత ఆవేదన ప్రతిమనిషీ పడతాడని రుషి భావన. చాలామందిలో ఇలాంటి ఆవేదనను మనం చూస్తూంటాం. చిన్నతనంలో ఫలానా విషయాలు తెలుసుకుని ఉంటే బాగుండేది. ఫలానా విధంగా ఉంటే పిల్లలు క్రమశిక్షణతో పెరిగి ఉండేవారు అని విచారించడం చూడగలం.

వానప్రస్థంలో ఉన్న కొన్ని అంశాలను ఈనాటి విశ్రాంత జీవన విధానంలో చేర్చుకోగలం. అరణ్యానికి పోకపోయినా మనం చేస్తున్న పనులను చాలామటుకు తగ్గించుకోగలం. అనవసరమైన పనులను చాలావాటిని మానేయగలం. మనం ఉన్న చోటే అరణ్యం (నిశ్శబ్దంగా ఉన్న స్థలం)గా మార్చుకోవచ్చు. ఏకాంతాన్ని శాపంగా కాకుండా వరంగా భావించుకోవచ్చు. విశ్రాంత జీవితంలో ఉన్న వేలాది మంది అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, వారి మేధోసంపదను వృథా చేయడం చూస్తూంటాం. వీరిలో ప్రతి ఒక్కరూ అనేక మంది బాలబాలికలను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దగలిగారు. ఇటీవల కొన్ని చోట్ల వయోజనుల నివాసం (community for elderly)లో బాలల హాస్టల్‌ నిర్వహిస్తూ ఉండటం మంచి ఉదాహరణ. సమాజ శ్రేయస్సుకై ఈశ్వరార్పణ బుద్ధితో చేసే పనిని కర్మయోగం అంటారని ఇదివరలో తెలుసుకున్నాం. ఈ విశ్రాంత దశలోనైనా మనం కొంత వరకు కర్మయోగాన్ని ఆచరిస్తే జీవితానికి కొత్త నిర్వచనం ఇచ్చిన వాళ్లం అవుతాం.

డాక్టర్‌ కె. అరవిందరావు
రి

టైర్డు డీజీపీ

 

 

అనంతంలో ఆనందం
31-12-2015 23:45:55

ఐదు యమాల్లో రెండింటి గురించి తెలుసుకున్నాం. మిగతా మూడు అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. అస్తేయ అంటే దొంగతనం చేయకుండా ఉండటం. అందంగా కనిపించిన వ్యక్తిని చూడగానే.. అంత అందంగా ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటారు. అయితే అలా అనుకోవడంతోనే వారి రూపాన్ని దొంగలిచ్చినట్టు. ఈ దొంగలించడం అసూయను పుట్టిస్తుంది. నచ్చిన దానిని పొందాలనే కోరికను పుట్టిస్తుంది. అస్తేయ- అసూయను తొలిగిస్తుంది. దొంగతనం చేయాలనే కోరికను రానివ్వదు.

బ్రహ్మచర్య ప్రతిష్ఠాయాం వీర్యలాభః

బ్రహ్మ అంటే అనంతం. బ్రహ్మచర్యం అంటే అనంతంలో చరించడం. అనంతమైన నీ స్వభావాన్ని గుర్తించినపుడు దీపపు వెలుగులా ప్రసరిస్తావు. అపుడు బ్రహ్మచర్యం సహజంగా జరుగుతుంది. గాఢమైన ధ్యానంలో కూర్చున్నపుడు నీ శరీరాన్ని గురించిన స్పృహ ఉండదు. ఎంత ఎక్కువ ఆనందంగా ఉంటే అంత తక్కువగా నీ శరీరం ఎరుకలో ఉంటుంది. అనంతమైన జ్ఞానంలో ఉన్నపుడు ఒత్తిడులు, శరీరపు భారం, శరీరం ఉన్నదనే ఎరుక ఉండవు. ఇది బ్రహ్మచర్యం. ఆకాశం లేదా అనంతం అనే ప్రకృతిలో నీవు ఉన్నపుడు అత్యధికమైన శక్తి, ధైర్యసాహసాలు నీకు లభిస్తాయి. ఎప్పుడూ అటూఇటూ చూస్తూ, ఎవరు అందంగా ఉన్నారో గమనిస్తూ లేదా ఎవరితో సంగమించాలని వెతుక్కుంటూ తిరిగేవారిలో శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఎవరినీ ప్రభావితం చేయలేరు.

అపరిగ్రహస్తేయ జన్మకథాయాంతాసంబోధః

నీకంటూ సమకూర్చుకోకుండా జీవించినపుడు నీ పూర్వజన్మల జ్ఞానం, ఇతర జీవాలను గురించిన జ్ఞానం నీకు లభిస్తుంది. మరింత కావాలనే కోరిక ఉన్నప్పుడు, ఆలోచనలు కేవలం తన గురించే వస్తూ ఉంటాయి. వాటితోపాటు భయం కూడా వచ్చి చేరుతుంది. జీవితపు అనంతత్వం అనేది తెలియకుండా పోతుంది. నీకంటూ లేకుండా ఉండటం అంటే నీ ఉనికిలో ఆత్మవిశ్వాసం, నీ సామర్థ్యంపై విశ్వాసం, నీవెవరో తెలుసుకుని ఉండటం. నీకు రొట్టెలు చేయడం ఎలాగో తెలిసినపుడు ఏడాదికి సరిపడా ఒకేసారి చేసి ఉంచుకోవు కదా. తమ శక్తి తెలియనివారు, స్వార్థపరులు అన్నిటినీ కూడబెడుతుంటారు. ఇలా కూడబెడుతూ, కూడబెడుతూ చివరకు కన్నుమూస్తారు. ధనాన్ని పొదుపు చేయవద్దని, కూడబెట్టవద్దని చెప్పలేదు పతంజలి మహర్షి. అలా కూడబెట్టిన దాని ప్రభావం ఏమిటో ఆలోచించమంటున్నాడు.

అపరిగ్రహ- అంటే ప్రజల నుంచి ఏదీ గ్రహించకుండా ఉండటం. కూడబెట్టకుండా ఉండటం. దీనికి పూర్తి వ్యతిరేకం పరిగ్రహ- అంటే అన్నిటినీ స్వీకరించడం, వాటి గురించి ఆశ్చర్యపోవడం, ఆనందంగా ఉండటం. ఎవరి నుంచీ ఏమీ స్వీకరించకుండా జీవించడం ఈ ప్రపంచంలో సాధ్యం కాని పని. దీనిని కూడా సాధన చేసేవారు అక్కడక్కడా ఉంటారు. ఈ ఐదు యమాలు మహావ్రతాలు. సాధనను బట్టి ఫలితం వస్తుంది.

శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌
ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, వ్యవస్థాపకులు
ఆమెకు చిన్నా పెద్దా, ఆడ మగా అందరూ అభిమానులే. ‘సుమ’ధురంగా మాటల సెలయేరులో ప్రేక్షకుల్ని పయనింపచేయడం ఆమె ప్రత్యేకత. అదే స్టేజిషోలయితే సమయస్ఫూర్తితో… కొన్ని సెటైర్లు, మరికొన్ని పంచ్‌లు వేస్తూ, చమక్కులు విసురుతూ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తారామె. 2015 తనకెలాంటి అనుభవాల్ని మిగిల్చింది. అలాగే ఈ నూతన సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారో సుమ కనకాల చెప్పిన మాటల ముచ్చట్లు…

‘‘పోయిన ఏడాదిలో శని, ఆదివారాలు పని చేయకూడదని నిర్ణయించుకున్నాను. పనిచేయకుండా ఉన్న ఆ రెండు రోజుల్ని పిల్లల కోసం కేటాయించేశాను. ఆడియో లేదా అవార్డ్‌ ఫంక్షన్‌లు ఏవైనా ఉంటే మాత్రం యాంకరింగ్‌ చేస్తున్నాను. 2016లో కూడా అదే కంటిన్యూ చేస్తాను.

గడిచిందిలా

2015 సంవత్సరం ఎలా గడిచింది అని మీరడిగితే 2013, 14 సంవత్సరాల్లాగే అనేది నా సమాధానం. చెప్పాలంటే ప్రేక్షకుల ఆదరణ ఇంకా బాగా పెరిగింది. చిన్నపిల్లల దగ్గర్నించి పెద్ద వారి వరకూ అందరూ నన్ను వాళ్ల కుటుంబంలో ఒక సభ్యురాలిగా చూస్తున్నారు. దాంతో నా ఎనర్జీ మరింత పెరిగింది. కొత్తగా నేర్చుకున్న అంశం పాజిటివ్‌గా ఉండటం. కొన్ని ప్రభావాలు, ఇబ్బందులు నాపై పడినప్పటికీ మానసికంగా సమతుల్యత పాటించటం నేర్చుకున్నా. నా ఎనర్జీ నేనే (‘నీ ఎనర్జీ నేను’ అంది కూతురు మనస్విని. వెంటనే ‘అవునవును’ అన్నారు సుమ).

మనసు పడిన బాధ

మన జీవితంలో ఎదురయ్యే కొన్ని ఘటనలే కాకుండా ఇతర దేశాల్లో యుద్ధాల్లో మరణించే వారి గురించి ఆలోచించినపుడు కూడా బాఽధగా అనిపిస్తుంది. ఇటీవల రంగనాథ్‌ గారు, కొరియోగ్రాఫర్‌ భరత ఆత్మహత్య చేసుకోవడం వంటి దుర్ఘటనలు మనసును విపరీతంగా బాధించాయి.

సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

మా పిల్లలు సర్‌ప్రైజ్‌ బహుమతులు ఇచ్చే అవకాశం నాకు ఇవ్వరు. రోషన్‌, మనస్విని ముందుగానే ప్లాన్‌ చేసుకుని మరీ వాళ్లకి కావాల్సినవి నాతోనే కొనిపించుకుంటారు. మనస్విని మాత్రం నాకోసం గ్రీటింగ్‌ కార్డులు తయారుచేస్తుంది. వాటిని మా హాల్లో గోడలకు అందంగా అతికిస్తుంది. రాజీవ్‌కు అయితే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు ఏమీ ఇవ్వలేదు. రాజీవ్‌ బర్త్‌డేకి మాత్రం గ్రీటింగ్‌ కార్డ్‌ కొని.. దాని మీద విషెస్‌ రాసి ఇచ్చాను. గ్రీటింగ్‌ కార్డులో విషెష్‌ రాసి చెప్పడంలో భిన్నమైన అనుభూతి కలుగుతుంది. అది ఎంతకాలమైనా పదిలంగా ఉంటుంది కూడా.

నేర్చుకున్నవి… చదివినవి… నచ్చినవి

20 నుంచి 30 ఏళ్ల వరకూ లెర్నింగ్‌ పీరియడ్‌ అంటారు. గురువు దగ్గర ఉండి నేర్చుకోవాలి. అంటే 30 ఏళ్లలోపు కెరీర్‌ను డిసైడ్‌ చేసుకోవాలి.. 30-40 సంవత్సరం వరకూ మనం మెరుగుపడాలి. 40 నుంచి 50 వరకూ అందులోనే ఉండటం మంచిదట. 2015 నాకు 40వ సంవత్సరం. ఇదే ప్రొఫెషన్‌నే కంటిన్యూ చేస్తాను. ఇక 50-60 వరకూ మనం వేరే వారిని తయారుచేసుకోవచ్చు. పాట, నాట్యం వంటివాటిలో దేవుడు నాకు కొద్దిగా ప్రావీణ్యం ఇచ్చాడు. యాంకరింగ్‌లో అదే చేస్తున్నాను.

‘ఐ యామ్‌ మలాలా’ పుస్తకం చదివాను. ఆ పాకిస్తానీ అమ్మాయి ఎన్ని కష్టాలొచ్చినా చదువుపై ప్రేమ పెంచుకుంది. గ్రేట్‌ గర్ల్‌. సాధారణంగా షూటింగ్‌ గ్యాప్‌లో బుక్స్‌ చదువుతుంటాను. ప్రతిరోజూ న్యూస్‌పేపర్స్‌లో కనీసం హెడ్‌లైన్స్‌ చదువుతాను. టెక్నాలజీ విషయానికి వస్తే చూపుడువేలుపైనే ప్రపంచం నడుస్తోందిప్పుడు. నేనయితే ఫేస్‌బుక్‌ ఎక్కువగా చూస్తుంటాను.
మనమెంత అనిపించింది

అమెరికాలో క్రూజ్‌ వెకేషన్‌కు వెళ్లటం మంచి ఎక్స్‌పీరియన్స్‌. లాస్‌ఏంజిల్స్‌ నుంచి మెక్సికోకి వెళ్లే నౌకలో మూడురోజులు కుటుంబమంతా కలిసి ప్రయాణించాం. చుట్టూ సముద్రపు నీరు, రాత్రిపూట చిమ్మచీకటిని చూస్తుంటే.. మనమెంత అనిపించింది. అలాగే ఈ లోకం పెద్ద వింత అనిపించింది. ప్రకృతి నుంచి దూరం వెళ్లే కొద్దీ మనం అనే అహం పెరుగుతుంది. ప్రకృతి దగ్గరికి వెళ్లే కొద్దీ భయం పెరిగి అహం తగ్గిపోతుంది.

హాయిగా నవ్వుకున్నాను

తిరువన్నామలై వెళ్లినపుడు మా అమ్మతో పాటు నేను, పిల్లలూ రమణభగవాన్‌ కొండకు వెళ్లాం. కొండ నుంచి కిందకు దిగుతుంటే కోతులు అడ్డొచ్చాయి. మా అబ్బాయిని ‘కోతి కళ్లల్లోకి చూడొద్దు’ అన్నాను. ‘కోతి కళ్లల్లోకి నేను చూడలేదు, కోతే నా కళ్లలోకి చూస్తోంది’ అన్నాడు. ఈలోపు ఓ కోతి వచ్చి మా అమ్మ చీర కొంగును లాగుతుంటే.. మా అమ్మ ‘వద్దు రమణా’ అంటోంది. ఆ సన్నివేశం చూశాక నవ్వాపుకోలేకపోయాను. ఆ తర్వాత కొండదిగామో లేదో వానరమూక మమ్మల్ని అడ్డగించి, అడిగి మరీ వాటర్‌బాటిల్స్‌ తీసుకెళ్లాయి.

టెన్షన్‌ అనవసరం

నిర్మాత స్రవంతి రవికిషోర్‌ గారి చిత్రం ఆడియోఫంక్షన్‌కి యాంకరింగ్‌ చేశాను. ఆ ఫంక్షన్‌లో నాలుగో పాటకు డాన్స్‌ చేస్తారు అని చెప్పడం మర్చిపోయి ఐదో పాట చెప్పేశాను. దాంతో రవికిషోర్‌ గారితో ‘సారీ సర్‌’ అన్నాను. అందుకు ఆయన ‘ఏమైందమ్మా ఇప్పుడు. ఎవరైనా అరె్‌స్టచేస్తారామ్మా’ అన్నారాయన. ఆ మాటతో ఇన్ని సంవత్సరాలనుంచి యాంకరింగ్‌ చేస్తున్న నేను అంత టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదనుకున్నా.

చేయాలనుకుని మిగిలిపోయినవి

అది చేయాలి. ఇది చేయాలి అని ముందుగానే అనుకుని ప్లాన్‌ చేసుకునే అలవాటు లేదు. ఖమ్మంలో ఓ ఓల్డేజ్‌హోమ్‌కు మూడేళ్లనుంచీ సపోర్టు చేస్తున్నాను. ఈ ఏడాది దానికి సొంతంగా బిల్డింగ్‌ కడుతున్నారు.

ఎంతో ఇష్టం

ఉదయం ఏడున్నరకు పిల్లలు స్కూల్‌కి వెళ్తారు. అదే టైంలో నేను షూటింగ్‌లకు బయల్దేరి వెళ్లిపోతాను. పిల్లలకి నచ్చిన ఫుడ్‌ చేయటం నాకు సరదా. కొత్తగా కుండబిర్యానీ వండడం నేర్చుకున్నా. దాన్ని వండిపెడితే ఇంటిల్లిపాదీ బాగుందని మెచ్చుకున్నారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం, వాళ్లని సంతోషపెట్టే విషయాలకోసం సమయం కేటాయించటం నాకు చాలా చాలా ఇష్టం. అలాగే ఎప్పుడూ ‘శ్రీరామ నీ నామమెంతో రుచిరా..’ పాట పాడుతుంటాను’’ అని గడిచిన ఏడాది గురించి చెప్పారు సుమ.

ఫెయిల్యూర్‌ తట్టుకోలేను
2016 ఎలా ఉండాలి అనుకుంటున్నారు, సెలబ్రేషన్స్‌ ఎక్కడ అని అడిగితే ‘‘నాకు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండవు. ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటే ఒత్తిడి వస్తుంది. ఫెయిల్యూర్‌ను తట్టుకోలేను. అందుకే దేని గురించీ ఆలోచించను. కెరీర్‌ పరంగా వచ్చేది సక్సెస్‌ కాదు. వ్యక్తిత్వపరంగా, మానసికంగా వచ్చేదే సక్సెస్‌. నా షో హిట్‌ అయితేనే సక్సెస్‌ అనుకోను.
గత నాలుగేళ్లనుంచీ కొత్తసంవత్సరం రోజున ప్రోగ్రామ్స్‌ చేసేందుకు వెళ్లడం మానేశాను. మా ఇంట్లో వాళ్లందరం కలిసి ఇంట్లోనే వేడుక చేసుకుంటాం. సరదాగా అందరం కలిసి బయటకు వెళ్తాం’’ అన్నారు.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.