అనాధల పాలిటి అమ్మ సింధూ తాయ్ సప్కల్-గబ్బిట దుర్గాప్రసాద్
పశువుల కాపరి వంశం లో జన్మించి అనాధయై అనాదుల పాలిటి ఆపద్బా౦ధవిగా అమ్మగా నిలిచినా త్యాగ మూర్తి సింధూ తాయ్ సప్కల్ .మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో పింప్రి మేఘే అనే పల్లె టూరిలో 14-11-1948నపశువులకాపరి అభిమంజి సాతే కు సింధు జన్మించింది .కటిక పేదరికం లో ఉన్నా ,ఆమె తల్లికి ఇష్టం లేకపోయినా తండ్రి సింధు ను చదివించాడు .పశువుల మేపే మిషతో ఆమెను స్కూల్ కు పంపేవాడు .అక్కడ భారది చెట్టు బెరడులనే పలక గా ఉపయోగించి విద్య నేర్చింది .పలకా బలపం కూడా కొన లేని దీన స్థితి .నాలుగవ తరగతి చదువుతుండగానే బాల్య వివాహం చేయటం తో ఆమె చదువు ఆగిపోయింది .
పదేళ్ళ ఈ పిల్లకు వార్ధా జిల్లా నవార్ గావ్ కు చెందిన 30ఏళ్ళ పశువుల కాపరి శ్రీహరి సప్కల్ అనే అతనికిచ్చి పెళ్లి చేశారు .ఇరవై ఏళ్ళకే ముగ్గురు పిల్లలను కన్నది .స్థానిక బడా మోతుబరి నాయకుడు ఎండిన పశువుల పేడను అడవి అధికారులతో కుమ్మక్కై గ్రామస్తులకు చిల్లి కానీ కూడా ఇవ్వకుండా దొంగచాటుగా అమ్మేవాడు .ఈ విషయం గమనించిన సింధు అతని దౌష్ట్యానికి ఎదురు తిరిగి గ్రామస్తుల సహకారం తో పోరాడి ఉద్యమించింది .ఉద్యమ తీవ్రతను గుర్తించిన జిల్లా కలెక్టర్ హుటాహుటిన అక్కడికి వచ్చి పరిస్తితిని తెలుసుకొని సింధుపోరాటం లో న్యాయం ఉందని , ఆ మోతుబరి దే తప్పు అని గ్రహించి తీవ్రంగా మందలింఛి అతనికి వ్యతిరేకంగా ఆర్డర్ జారీ చేశాడు .ఇది నచ్చని ఆ బడా పెద్దమనిషి అవమానం తో రెచ్చి పోయి ఆమె భర్త ను లొంగదీసుకొని 9నెలల నిండు గర్భ వతి అయిన భార్యను ఇంటి నుంచి గెంటించేట్లు చేసి ఆమెపై పగ తీర్చుకొన్నాడు .గత్యంతరం లేక ఆమె ఇల్లు వదిలి ,పుట్టింటికి ఎన్నో కిలో మీటర్లు కాలినడకన నడుచుకుంటూ వెళ్ళింది .అక్కడ వాళ్ళు కూతుర్ని ఆదరించలేదు పొమ్మన్నారు .ఎక్కడో ఒక పశువుల పాకలో ఆ రాత్రే ఆడపిల్లను కన్నది . ఆత్మ హత్య చేసుకోవాలనే ఆలోచనను మనసులోకి రానీయ కుండా ఎదిరించి ధైర్యంగా నిలబడాలన్న కోరిక ఆమె లో బలీయంగా పెరిగింది .
సింధూ సప్కాల్ రైల్వే ప్లాట్ ఫారాల మీదా అడుక్కొని పొట్ట పోసుకోన్నది .తన పిల్ల లాగా లోకం లో ఎందరో అనాధ బిడ్డలున్నారని గ్రహించి ,తన కూతురుతో పాటు వారినీ చేరదీసి వారందరికోసం ఇంకా ఎక్కువగా తీవ్రంగా భిక్షమెత్తి సంపాదించి వారిని పోషించింది .తన దగ్గరకొచ్చిన ప్రతి అనాధను చేరదీసి తానే వారికి తల్లి అయి పోషించింది .తన పిల్లకూ వీరికి విచక్షణ లేకుండా చేయాలని నిర్ణయించుకొని తన స్వంత కూతుర్ని పూనే లోని శ్రీమంత్ దగ్దు సేట్ హల్వాయ్ కి దానం చేసిన ఉదారస్వభావం సింధూ ది .
ఆ తర్వాత సింధు తన జీవితాన్నంతా అనాధ జన సేవలోనే గడిపింది .అందుకే ఆమెను అందరూ ‘’అమ్మా (తాయ్)అనేవారు ఆప్యాయంగా .దాదాపు 11౦౦ మంది అనాధ పిల్లలను ఆమె పెంచి పోషించింది .ఈ రోజుకు ఆమె కుటుంబం బహు విస్త్రుతమై 207గురు అల్లుళ్ళు ,36మంది కోడళ్ళు,1000మంది మనవలు మనవ రాళ్ళతో సుసంపన్నంగా ఉంది . ఇప్పటికీ రేపటి భోజనం ఆమెకు సమస్యగానే ఉంటుంది .ఆమెదత్తతకు తీసుకొన్న అనాధ పిల్లలు ఉన్నత విద్య నేర్చి డాక్టర్లు గా లాయర్లుగా రాణిస్తున్నారు.వారు కూడా అమ్మలాగానే స్వంతంగా అనాధ శరణాలయాలు నిర్వహిస్తున్నారు . ఆమె కూతురు కూడా విద్యావంతురాలై ఉద్యోగం చేస్తోంది .ఇంతకంటే ఆ తల్లికి కావాల్సిందేముంది ? మాతృత్వానికే ఒక మహోన్నత ఆదర్శ మూర్తిగా నిలిచింది సింధూ సప్కల్ . ఆమె పెంచిన పిల్లలో ఒకామె ‘’అమ్మ జీవితం ‘’పై పి.హెచ్ .డి చేస్తోంది .అంకిత భావం తో చేస్తున్న అనాధ జన సేవకు,త్యాగ నిరతికి ,కఠోర శ్రమకు గుర్తింపుగా అమ్మకు 275కు పైగా గౌరవ పురస్కారాలు లభించాయి .ఆమెకు అందజేయబడిన ధనాన్ని భూమి కొని వారికొక ఆవాసం కల్పించ టానికి ఖర్చు చేస్తోంది ఆ మహా తల్లి .నిర్మాణం జరుగుతోంది. దయగల దాతలు విరాళాలు అందజేస్తూ తోడ్పడుతున్నారు .ప్రపంచం నలు మూలల నుండి ఆర్ధిక సాయం కొరుతోంది అమ్మ.పూనే లోని హద్సపార్ లోని మంజేరిలో నిర్మిస్తున్న ‘’సన్మతి బాల నికేతన్ ‘’లో 300 మంది నివాసం ఉండటానికి వీలుంది .
అమ్మకు 80 ఏళ్ళ వయసులో భర్తతన తప్పు తెలుసుకొని మన్నించమని వస్తే అతనిని తన కొడుకుగా అంగీకరించి,చేరదీసిన కరుణామయి అమ్మ. తాను భర్త తో సహా అందరికీ అమ్మనే అంటుంది ఆ అమ్మ . ఆశ్రమాన్ని సందర్శించేవారికి ఆమె అతనిని తన ‘’పెద్ద ముసలికొడుకు ‘’అని పరిచయం చేస్తుంది . వయసు మీద పడుతున్నా రెట్టించిన ఉత్సాహం తో శ్రమిస్తుంది అమ్మ .అలసట ఆమె నిఘంటువులో లేదు .నిత్యోత్సాహి అమ్మ .వ్యతిరేక భావనలేవీ ఆమె మనసులోకి రానీయదు .ధనాత్మక దృక్పధమే అమ్మ మార్గం .అందుకే అందరికీ మార్గ దర్శి అయింది .
అమ్మ పై మరాఠీ భాషలో ‘’మీ సింధూ తాయ్ సప్కల్ ‘’అనే చలన చిత్రం2010లో నిర్మించారు .అది ఎందరికో ప్రేరణ నిచ్చింది . లండన్ లో జరిగిన 54అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఈ సినిమా ‘’ప్రీమియర్ ‘’చిత్రంగా ప్రదర్శించటానికి ఎన్నికైంది .ఆమె ఆదివాసీల 84గ్రామాల పునరావాసలకోసం తీవ్రంగాఉద్యమించింది .అప్పటి అటవీశాఖ మంత్రి చేదీలాల్ గుప్తాను కలిసి పరిస్తితి వివరించింది .ఆ గ్రామ వాసులకు తగిన ఆవాసం కలిపించే వరకు వారిని అరణ్య ప్రాంతం నుండి కదల్చం అని హామీ ఇచ్చాడు .ప్రధాని ఇందిరా గాంధి టైగర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించటానికి వచ్చినప్పుడు సింధు ఎలుగు బంటి దాడికి కళ్ళు కోల్పోయిన ఒక ఆదివాసి ఫోటోను ఆమెకు చూపి సహాయం అందజేయమని కోరింది .అడవిలో ఒక ఆవు కాని కోడికాని చనిపోతే నష్టపరిహారాన్ని ఇస్తుంటే అతనికి ఇవ్వటానికేమిటి ఇబ్బంది?అని ధైర్యం గా చెప్పేసరికి ప్రధాని అప్పటికప్పుడు నస్టపరిహారాన్ని ఆ కళ్ళు కోల్పోయిన ఆదివాసీకి అంద జేయమని ఆర్డర్ జారీ చేసింది .అమ్మలోని పోరాట పటిమకు, సాటి మనుషులపై ఉన్న సానుభూతికి ఇది నిదర్శనం అని జనం ఆశ్చర్యం గా చెప్పుకొన్నారు .
అనాధ ,బహిష్కరింప బడిన ఆదివాసీ పిల్లల దయనీయ స్థితికి అమ్మ గుండె కరిగి నీరయింది .వారికి వీలైనంత ఆహారం అందజేసేది .వాళ్ళు స్వయం సమృద్ధి సాధించే వీలు కలిపించేది .కొద్దికాలం లోనే దీన్ని ఒక ఉద్యమగా ముందుకు తీసుకు వెళ్ళింది .దేనినైనా అమ్మ సాధించి తీరుతుందనే నమ్మకం అందరిలోనూ కలిగించిన అమ్మ కాని అమ్మ సింధూ తాయ్ సప్కల్ ఎందరికో ఆదర్శం మరెందరికో ప్రేరణ .
-గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~