ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -104
44- విమాన యానానికి రైట్ చెప్పిన రైట్ సోదరులు-3(చివరిభాగం )
‘’ దేవుడు మనిషిని ఎగిరేట్లు చేయాలనుకొంటే రెక్కలు పెట్టె వాడే కదా’’ అని సన్నాయి నొక్కులు నొక్కారు .దాదాపు వెయ్యి సార్లైనా వీళ్ళ ప్రయత్నాలపై నీళ్ళు చల్లే ప్రయత్నాలు చేశారు జనం. కాని అధైర్యపడకుండా జంకకుండా ముందుకే వెళ్ళారు రైట్ సోదరులు .గాసోలిన్ ఇంజన్ ను పకడ్బందీగా తయారు చేశారు .ఇదే తగినదని భావించారు .వీళ్ళకు అనువైన మోటారు తయారు చేసివ్వటానికి కంపెనీలు చాలా బిజీ గా ఉండటం వలన ముందుకు రాలేదు .కనుక అదీ వాళ్ళే తయారు చేయాలనుకొన్నారు .1903వేసవి అంతా దీనికోసమే వెచ్చించారు దీక్షగా .వీరి కృషిని సమీక్షిస్తూ ‘’ది రైట్ బ్రదర్స్ ‘’పుస్తకం లో ఫ్రెడ్ సి కెల్లీ ‘’ఈ పవర్ మెషీన్ రెక్కలు నలభై అడుగులకు పైన కొన్ని అంగుళాలు .పై రెక్క ,కింది రెక్క మధ్య దూరం ఆరు అడుగులు .ఇంజన్ పైలట్ మీద పడకుండా ఉండటానికి దాన్ని కింద రెక్కపైమధ్యనుండి కొంచెం కుడివైపుకు అమర్చారు .పైలట్ మధ్యనుంచి కొంచెం ఎడమవైపు పడుకొని బాలన్స్ సమకూర్చుకొని నడిపారు .దిగేటప్పుడు మెషీన్ దొర్లి కిందపడకుండా రన్నర్ లను విస్తృతపరచారు .తోక కదిలే రెండు బ్లేడ్ ఆకారాలతో నిర్మించారు .
1903నవంబర్ లో ఈ కొత్త యంత్రాన్ని కిట్టీ హాక్ లో ప్రయోగం చేశారు .లోపాలు గుర్తించి సరిచేశారు .కొన్నిభాగాలు తీసిపారేశారు కొత్తవి కొన్ని అమర్చారు .డిసెంబర్ 14న విల్బర్ పైలట్ అవతారం ఎత్తాడు .యంత్రాన్ని నడిపి పైకి లేపి మూడున్నర నిమిషాలు గాలిలో తేలి దింపాడు .కొన్నిభాగాలు దెబ్బతిన్నాయి అది ఎగురుతుంది అనే ధైర్యం వచ్చింది . రిపైర్ చేశారు .ఆర్విల్లీ వంతు వచ్చింది .కాని నిరాశగా ఉంది .ఉదయం బాగా చలి ,గాలి ఉన్నాయి .గంటకు ఇరవైఏడు మైళ్ళ వేగం తో గాలి వీస్తోంది .సోదరులు పనిలో స్వేచ్చ ఉండదని ఓవర్ కోట్ తొడుక్కోలేదు .డిసెంబర్ 17న మళ్ళీ ప్రయోగం చేశారు .ఇంజన్ లోంచి వింతశబ్దాలోచ్చాయి .చుక్కాని వణికింది కాని యంత్రం మాత్రం పైకి లేచింది .12 సెకన్లు గాలిలో నిలబడింది .ఆర్విల్లీ మాటలలో ‘’ఇదే మొట్టమొదటి సారి మనిషితో యంత్రం గాలిలోకి పైకిస్వయంగా లేచి స్వేచ్చగా పూర్తిగా ఎగరటంతో చరిత్ర సృష్టించబడింది ‘’అన్నాడు .స్పీడ్ తగ్గించకుండా ముందుకు సాగింది .యెంత ఎత్తుమీదనుంచి లేచిందో అంత ఎత్తుమీద దిగింది .రైట్ సోదరుల నాలుగవ ప్రయత్నం విజయ వంతమైంది .59 సెకండ్లు అత్యద్భుతంగా గాలిలో స్థిరంగా యెగిరి రికార్డ్ నెలకొల్పింది .ప్రపంచం అంతా ఈ క్షణాలకోసమే నిరీక్షించింది .అందరి హృదయాలలో హర్షం ఆనందం వెల్లివిరిశాయి . బలహీనమైన రెక్కలు లేని ద్విపాద జీవి గాలిలో ఎగిరిన మధుర క్షణం అది .నిజంగానే మానవుడు గాలిలో యెగిరి చరిత్ర సృష్టించాడు .ఈసడించినవారికి సత్తా చాటి చూపించి తాము కన్నకలలను నిజం చేసుకొన్నారు రైట్ సోదరులు .విమానయానానికి తొలిసారి రైట్ చెప్పారు .
దీనితర్వాత ఇంకాసామర్ధ్యమున్న ఫ్లైట్ లను నిర్మించారు .తమ ఊరికి కిట్టీహాక్ చాలా దూరంగా ఉన్నందున డేటాన్ దగ్గరే హాఫ్మాన్ ప్రయరీ భూములలో ప్రయోగాలు చేశారు .51వ ఫ్లైట్ లో ఒక నిమిషం సేపు ఎగిరారు .1904లో 5నిమిషాలు గాలిలో తేలారు .ఏడాదితర్వాత 11మైళ్ళు తర్వాత 15 ,20 మైళ్ళు ఎగిరారు .అక్టోబర్ 5నాటి ఫ్లైట్ లో 24మైళ్ళు అరగంట సేపు ప్రయాణించారు .అయిన ఇవేవీ అస లైన వార్తలు గా నిలబడలేదు .పేపర్లేవీ దీన్ని పట్టించుకోలేదు. నిర్లిప్తంగా ఉండిపోయాయి .దినపత్రికలు విషం కక్కాయి .’’ది సైంటిఫిక్ అమెరికన్ ‘’పత్రికే ఎగరటం అంతా అబద్ధం అంది .న్యు యార్క్ హెరాల్డ్ పత్రిక కరేస్పాన్దేంట్ ఒక ప్రత్యక్ష సాక్షి కధనాన్ని పంపిస్తే యాజమాన్యం తిరస్కరించింది .’’నువ్వు రాసిన కధనం చదవటానికి సరదాగా ఉంది .అది సత్యమూకాదు, ఫిక్షనూ కాదు ‘’అని తేలికగా కొట్టిపారేస్తూ అన్నాడట ఎడిటర్ .అమెరికా సైన్యం కూడా దీన్ని పట్టించుకోలేదు ,ఆసక్తీ చూపలేదు .
కాని యూరప్ దేశంవిమాన యానాన్ని క్రేజీ గా భావించింది .1908 లోవిల్బర్ అన్ని రికార్డులు బద్దలు కొట్టిఫ్రాన్స్ కు వెళ్లి 360అడుగులపైకి విమానం నడిపి గంటఇరవైనాలుగు నిమిషాలు ఆకాశం లో చక్కర్లు కొడితే అవాక్కయి జనం వీక్షించారు .ఇక్కడ అమెరికాలో ఆర్విల్లీ అనేక బహుమతులు అందుకొంటూ ,యుద్ధ శాఖ ఉదాసీనతను భగ్నం చేశాడు .1911లో ఈ బైసికిల్ తయారీ దార్లు విమానాలు తయారు చేయటం ప్రారంభించారు .అప్పుడప్పుడు గాలిలో ఎగిరినా ఎగారటానికంటే తయారు చేయటంపైనే శ్రద్ధ చూపారు .అకస్మాత్తుగా నకిలీ విమానాలు మనుషులు ,తమ పేటెంట్ హక్కులపై కేసులు ,విజయాలతో రైట్ సోదరులు చాలా ఇబ్బందులు పడ్డారు .అంతిమ విజయం సోదరులదేఅయినా ,అప్పటికే విల్బర్ కేసులతో నీరసించి ,న్యాయ పోరాటం లో ,అతి శ్రమవలనఅలసిపోయి టైఫాయిడ్ పాలై 30-5-1912న 46 ఏళ్ళు వచ్చే ముందు చనిపోయాడు .సోదరుల రెక్కలలో ఒకటి విరిగిపోయింది .
ఆర్విల్లీ వ్యాపారం కొనసాగించాడు .ఒంటరిగాచేయలేననుకొన్నాడు .అన్న చనిపోయిన మూడేళ్ళ తర్వాత కంపెనీని ,పేటెంట్ లను అమ్మేశాడు .కాని విమాన తయారీలో రిసెర్చ్ మాత్రం ఆపలేదు .చాలా ఎయిర్ క్రాఫ్ట్ ఫాక్టరీలకు కన్సల్టంట్ గా ఉన్నాడు .అరుదుగా పబ్లిక్ గా కనపడేవాడు .కారణం అనారోగ్యం అని చేప్పేవాడు .వివాదాల జోలికి పోకుండా ఉన్నా ,స్మిత్ సోనియన్ ఇన్ స్టిట్యూట్ తో దీర్ఘకాలం వైరం సాగింది .యాభై ఏళ్ళకే బాగా ముసలివాడైపోయాడు .అన్న మరణం తర్వాత 36ఏళ్ళు జీవించి ,ఊపిరితిత్తుల వ్యాధితో ౩౦-1-1948న 87ఏడేళ్ళ వయసులో ఆర్విల్లీ రైట్ అస్తమించాడు .మరో రెక్క రాలిపోయింది
ఆర్విల్లీ మరణం తర్వాత ఒక నెలకు నేవీ కి చెందిన ఎఫ్ జే 1అనే ఫైటర్ ప్లేన్ సియాటిల్ నుంచి950 మైళ్ళు ఉన్న లాస్ ఏంజెల్స్ కు ఒకగంట యాభై ఎనిమిది నిమిషాలలో చేరింది .కిట్టీహాక్ లో 12సెకన్లు ఎగిరిన రైట్ సోదరుల విమానాన్ని సౌత్ కేంసింగ్ టన్ మ్యూజియం లో భద్ర పరచారు .వార్తాధనానికి అది ఊగిందో లేదో రుజువూకాలేదు ,మనిషి ఎగరటం అసాధ్యం అన్న ప్రొఫెసర్ న్యుకామ్బ్ సమాధి నుంచి కంగారుపడి లేచి బయటికీ రానూ లేదు .
The Lift Equation
L = lift in pounds k = coefficient of air pressure (Smeaton coefficient) S = total area of lifting surface in square feet V = velocity (headwind plus ground speed) in miles per hour CL = coefficient of lift (varies with wing shape) |
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-16-ఉయ్యూరు