గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 474-వేద వ్యాప్తి ,ఆర్య సమాజ స్థాపనా చేసిన స్వామి దయానంద సరస్వతి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2

— 474-వేద వ్యాప్తి ,ఆర్య సమాజ స్థాపనా చేసిన స్వామి దయానంద సరస్వతి

12-2-1824న గుజరాత్ ,లో కదియవాద్ జిల్లా త౦కారాలో బ్రాహ్మణ కుటుంబం లో మహర్షి దయానంద సరస్వతి జన్మించాడు .మూలానక్షత్రం లో పుట్టటం వలన ‘’మూల శంకర్’’ అని పేరు పెట్టారు .ఆయన జన్మ దినోత్సవాన్ని ఫాల్గుణ కృష్ణ దశమినాడు ,ఫిబ్రవరి 24మంగళవారం నిర్వహిస్తారు .తండ్రి కర్షం జీ లాల్జి తివారి, తల్లి యశోదా బాయి .ఎనిమిదేళ్ళకే ఉపనయనం చేశారు.ఒక శివ రాత్రి నాడు ఉపవాసం ఉండి,జాగరణ చేస్తుంటే శివునికి పెట్టిన నైవేద్యాన్ని ఎలుక తినటం చూశాడు .ఎలుకనే నివారించలేని దేవుడు ప్రపంచాన్నే౦  పాలిస్తాడు అనే అనుమానమొచ్చింది .

వేద,శాస్త్రాలన్నీ నేర్పించారు .చిన్న చెల్లెలు ,బాబాయి కలరాతో చనిపోవటం చూసి అసలు చావు ,పుట్టుకలపై ఆలోచన పెరిగి తలిదండ్రులను ప్రశ్నించేవాడు .పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తే, తెలియకుండా 1846లో ఇంటి నుండి పారి పోయాడు .25ఏళ్ళు దేశమంతా తిరుగుతూ సన్యాసిగా గడిపాడు .అరణ్యాలలో హిమాలయాలలో ఒంటరిగా ఉండి ఆత్మ సాక్షాత్కారం కోసం తీవ్ర తపస్సు చేశాడు .పుణ్య క్షేత్రసందర్శనం చేస్తూ యోగాభ్యాసం చేశాడు .సనాతన  ధర్మాన్ని ఆచరణలో కలుషితం చేస్తున్నారని గ్రహించి దాని శుద్ధి చేయాలని సంకల్పించాడు .’’విరజానంద దండీశ్వర ‘’కు శిష్యుడై ఎన్నో నేర్చి వేదోద్ధరణకు పూనుకొన్నాడు .వేదాలలో ఉన్న సకల మానవ సోదరత్వ భావనా వ్యాప్తికి నడుం బిగించాడు .ఆర్య సమాజ స్థాపన చేసి దశ సూత్రాలను ప్రవచించాడు .తనకున్న వేద,సంస్కృత పరిజ్ఞానం తో ఎందరినో వాదం లో ఓడించి జయించి తన విశ్వాసాన్ని నిలబెట్టాడు .పురోహితుల బండారాలు బయట పెట్టాడు .వేదం చెప్పింది ఒకటి వీళ్ళు చేస్తున్నదొకటి అని మండిపడ్డాడు. దేశ సంచారం చేస్తూ ఆర్య సమాజ భావ జాల వ్యాప్తి చేశాడు .

భారత దేశానికి’’ స్వరాజ్యం ‘’రావాలి అని మొట్ట మొదట చెప్పింది ‘’,భారత్ భారత దేశానిదే’’ అని ఖచ్చితంగా చెప్పిందీ దయానండుడే .స్త్రీకి సమాన హక్కు ,విద్యా ఉండాలి అని చెప్పిన మొదటివాడూ దయానండుడే .క్రిస్టియన్ ,ఇస్లాం బౌద్ధ జైన మతాలన్నీ కాచి వడపోశాడు విగ్రహారాధనను నిరసించాడు .’’సత్యార్ధ ప్రకాశిక ‘’అనే ఉద్గ్రంధం రాశాడు తన సంస్కరణ భావాలను చదువుకొన్న వారికే కాక ప్రపంచం లోని సకల మానవాళికీ అందేట్లు చేశాడు .అన్యమతస్తులను హిందువులుగా మార్చే కార్య క్రమం చేబట్టాడు. వేదం లోని సకల మానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పి దానికోసమే తీవ్ర కృషి చేశాడు .14ఏళ్ళ వయసులోనే మత గ్రంధాలు చదివి వాటిని జనాలకు బోధించేవాడు 22-10-1869న వారణాసి లో జరిపిన గొప్ప చర్చ ఆయనకు పెద్ద పేరు తెచ్చింది .27మంది విద్యావేత్తలు ,12మంది నిష్ణాతులతో జరిపిన బహిరంగ చర్చ అది యాభై వేల మంది ప్రజలు పాల్గొన్నారు .’’’వేదాలు విగ్రహా రాదన ను అంగీకరిస్తున్నాయా ?’’అనే విషయం పై జరిగిన చర్చ అది యజ్న యాగాదులలో జంతుబలి పనికిరాదని ,,తీర్ధ యాత్రలు దేవుళ్ళకు నైవేద్యాలు ,రదోత్సవాలు బాల్య వివాహాలు మాంస భక్షణ ఆర్య సమాజం లో నిషిద్ధం .స్త్రీ విద్య, సమానావకాశాలు వేదాలలో ఉన్నాయని రుజువు చేశాడు .కర్మ సిద్ధాంతాన్ని ,పునర్జన్మ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశాడు .బ్రహ్మ చర్యం అనుసరించాల్సిన ఆవశ్యకతను తెలియ జేశాడు .పరమాత్మకు తప్ప వేరెవరికీ మొక్క రాదన్నాడు ‘’.స్వదేశీ ‘’అనే మంత్రమూ ఆయనదే ., గాంధీజీ కన్నా ఎన్నో ఏళ్ళకు ముందే దళితులను ‘’ హరిజనులు ‘’ అనే గౌరవ పదంతో సంబోధించి,  మొదట ప్రయోగించినవాడు మహర్షి యే.మూఢాచారాలను విసర్జి౦చాలన్నాడు. ఆయనను చంపాలని చాలా సార్లు ప్రయత్నాలు జరిగాయి .గొప్ప’’ హఠ యోగి’’కనుక అన్నిటినీ తప్పించుకొన్నాడు .

1883లో జోధ పూర్ మహారాజు ఆహ్వానించగా దయా నందుడు వెళ్ళాడు .రాజు ఆయన శిష్యుడని తరించాలని భావించాడు .అక్కడ రాజు ఒక నర్తకితో శృంగార క్రియ లో ఉండటం మహర్షి చూసి నిర్భయంగా అడిగి మానసిక పరి వర్తనకోసం ధర్మాచరణ చేయమని హితవు చెప్పాడు .కాని నర్తకి స్వామిపై పగ బట్టింది .స్వామి వంటవాడిని లోబరచుకొని ఆయన త్రాగే పాలలో గాజుముక్కల పొడి కలిపించి తాగించింది .త్రాగాగానే గ్రహించాడు అప్పటికే అవి నరాలను కండరాలనూ కోసేస్తున్నాయి ..విషయం తెలిసిన రాజు పరుగెత్తుకొచ్చి వైద్యుల చేత చికిత్స చేయించే లోపే పరిస్తితి విషమించింది నొప్పి భరించ శక్యం కావటం లేదు .ఇది చూసిన వంటవాడు స్వామి కాళ్ళపై పడి తన తప్పును ఒప్పుకొన్నాడు .స్వామి వాడిపై జాలి చూపించి రాజ భటులకు చిక్కకుండాపారి పోయి  ప్రాణంరక్షించుకోమని తనదగ్గరున్న డబ్బు మూటనిచ్చి పంపి వేసి తన’’ దయానంద ‘’గుణాన్ని సార్ధకం చేసుకొన్నాడు మహర్షి .వైద్యుల సలహాపై రాజు మహర్షిని మౌంట్ ఆబూ కు చేర్చారు .అక్కడినుండి మెరుగైన చికిత్స కోసం అజ్మీర్ పంపారు .కాని ఆరోగ్యం లో మార్పు రాలేదు .30-10-1883ఉదయం ఆరుగంటలకు మహర్షి దయానంద సరస్వతి వేద మంత్రాలు పఠిస్తూ తుది శ్వాస పీల్చాడు .

భారత స్వాతంత్రోద్యమ బీజాలు వేసిన తోలి దేశభక్తుడు దయానంద సరస్వతి .ఆయన ప్రభావం సుభాస్ చంద్ర బోస్ ,మహాదేవ గోవింద రానడే,  మేడం కామాలపై అధికం గా ఉంది .షహీద్ భగత్సింగ్ పై మహర్షి ప్రభావం అత్యధికం .ఈయన దయానంద్ వేదిక్ స్కూల్ లో చదివాడు .సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వామిని గురించి ‘’నవ భారతం లో శిఖరాయమాన వ్యక్తిత్వమున్న యోగీశ్వరుదు  దయానందుడు .రాజకీయ మత సాంస్కృతిక బానిసత్వాలను చేది౦చటానికి ఆయన నిర్విరామ కృషి చేశాడు .హిందూ మతాన్ని వేద ధర్మ ఆధారం పై నిలబెట్టటానికి జీవితాన్ని త్యాగం చేశాడు .భారత దేశం తెచ్చిన సాంఘిక సంస్కరణలు ఆయన ప్రవచి౦చినవే ‘’అని ఘన నివాళి అర్పించాడు .

దయానందుని సాహితీ వైభవం

మహర్షి దయానందుడు వేదా౦గా లపై 16గ్రంధాలు ,పాణిని అస్టాధ్యాయిపై అసంపూర్ణ వ్యాఖ్యానం ,నీతి,ధర్మ బోధకాలైన చిరు పుస్తకాలు వేద విధులు ,.అద్వైత ,ఇస్లాం క్రిస్టియన్ మతాలపై ఖండనాలు మొదలైన 60 గ్రంధాలు రాశాడు అందులో ‘’సత్యార్ధ ప్రకాశం ‘’,సంస్కార విధి ,ఋగ్వేద భాష్య భూమిక ,యజుర్వేద భాష్యం చాలా ప్రసిద్ధమైనవి .స్వామి అజ్మీర్ లో’’ పరోపకారిణి సభ ‘’స్థాపించి వేదాలపై గ్రంధాలు రాసి ప్రచురించి వేద ధర్మ వ్యాప్తి చేశాడు .

అయన రాసిన వాటిలో కొన్ని పేర్లు –సంధ్య ,భాగవత ఖండనం ,,అద్వైత ఖండనం ,పంచ మహా యజ్న విధి ,సత్యార్ధ ప్రకాష్ ,అష్టాధ్యాయి భాష్యం ,ఋగ్వేద యజుర్వేద భాష్యాలు .స్వామి ప్రసిద్ధ మంత్రం –‘’ఓంవిశ్వాని దేవసవితర్ దురితాని పరసుర్ యద్ భద్రం తన్నా ఆశువ ‘’.

సశేషం

 

Inline image 1

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-16-ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.