స్టీఫెన్ హాకింగ్
భౌతిక ఖగోళ శాస్త్ర వేత్త ,స్టీఫెన్ విలియం హాకింగ్ 8-1-1942లో ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో జన్మించాడు .కేంబ్రిడ్జి యూని వర్సిటిలోని సెంటర్ ఫర్ దీరేటికల్ కాస్మాలజి కి రిసెర్చ్ డైరెక్టర్ .జనరల్ రిలేటివిటి కు చెందిన గ్రావిటేషనల్ సింగ్యులారిటి దీరంస్ పై రోజర్ పిన్ రోజ్ తోకలిసి శాస్త్రీయ పరిశోధనలు చేశాడు .బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలాలు )రేడియేషన్ వెలువరిస్తాయని కనుగొన్నాడు .దీనికే ‘’హాకింగ్ రేడియేషన్’’అనే పేరొచ్చింది .క్వాంటం మెకానిక్స్ ను జనరల్ దీరీ ఆఫ్ రిలేటివిటితో అనుసంధానం చేసి కాస్మాలజీ సిద్ధాంతాన్ని తయారు చేసిన వారిలో ప్రధముడు హాకింగ్ .క్వాంటం మెకానిక్స్ చెప్పిన బహు ప్రపంచాలను సమర్ధించాడు .
రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ కు హాకింగ్ ఆనరరి ఫెలో .పాంటిఫికల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ కు జీవిత సభ్యుడు .అమెరికా ప్రభుత్వం నుండి ప్రేసిడేన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం అనే అత్యున్నత పౌర సన్మానం అందుకొన్న ప్రతిభా మూర్తి .1979-2009కాలం లో కేంబ్రిడ్జ్ యూని వర్సిటి లుకేషియన్ ప్రొఫెసర్ ఆఫ్ మాథమాటిక్స్ గా పని చేశాడు .పాపులర్ సైన్స్ పై చాలా పుస్తకాలు రాశాడు .హాకింగ్ రాసిన ‘’ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’’అనే గ్రంధం 237వారాలు బెస్ట్ సెల్లర్ గా రికార్డ్ సృష్టించిందని బ్రిటన్ కు చెందిన సండే టైమ్స్ పత్రిక తెలియ జేసింది .
తక్కువ వయసులో హాకింగ్ కు అరుదైన ‘’ఏమియో ట్రోఫిక్ లేటరల్ సీరోసిస్ (ఎ.ఎల్.ఎస్.)అనే నరాలకు సంబంధించిన జబ్బుతో బాధ పడ్డాడు .అదే తర్వాత శరీర పక్షవాతానికి దారి తీసి కొన్ని దశాబ్దాలుగా బాధ అనుభ విస్తున్నారు .ఇప్పుడు స్పీచ్ జెనరేటింగ్ పరికరం ద్వారా తన మనోభావాలను తెలియ జేస్తున్నారు .. రెండు సార్లు పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలకు జన్మ నిచ్చాడు .అయినా అనేక దేశాలు పర్యటిస్తూనే ఉన్నాడు. కెనడా ప్రభుత్వం ఫ్రాన్సికా ప్రైజ్ నిచ్చి గౌరవించింది .ఇప్పుడు ప్రైవేట్ జెట్ లో పర్యటన చేస్తున్నాడు .2007లో కూతురు లూసీ తోకలిసి ‘’జార్జెస్ సీక్రెట్ కీ టు ది యూనివర్స్ ‘’రాసి ప్రచురించాడు .2002లోబ్రిటన్ దేశపు వందమంది ప్రముఖులలో ఒకడుగా హాకింగ్ ఎంపికయ్యాడు .హాకింగ్ ఉద్యోగ పర్వం లో 39 విద్యార్ధులు పి.హెచ్.డి.చేశారు .ఉద్యోగం నుంచి రిటైర్ కాకుండా కేంబ్రిడ్జ్ యూని వర్సిటి లో డిపార్ట్ మెంట్ ఆఫ్ అప్లైడ్ మాధమాటిక్స్,దీరేటికల్ ఫిజిక్స్ రిసెర్చ్ డైరెక్టర్ గా పనిచేస్తూ ,2012 లో తనకు రిటైర్ అయ్యే ఆలోచనే లేదని తెలియ జేశాడు .20-7-2015న ‘’ఎక్స్ ట్రా టెర్ర్రే స్త్రియల్ లైఫ్ ,పరిశోధనలో ‘’బ్రేక్ థ్రు ఇనిషి యేటివ్స్’’ప్రారంభానికితోడ్పడి’’మనం ఒంటరి వాళ్ళమా ?(ఆర్ వియ్ ఎలోన్ )అన్నదానికి సమాధానం కనుగొనటానికి సహాయ పడ్డాడు .
ఇప్పుడున్న సామాజిక ,రాజకీయ .పర్యావరణ సంక్షోభం లో మానవ జీవితం మరో వందేళ్ళు మనగలుగుతుందా ?అని ఇంటర్నెట్ లో ప్రశ్నించాడు హాకింగ్ .అకస్మాత్తుగా వచ్చే న్యూక్లియర్ యుద్ధం భూమికి చాలా చేటు తెస్తుందని ,వైరస్ ,గ్లోబల్ వార్మింగ్ వంటివాటి వలన అనుకోని ఉపద్రవాలు కలుగుతాయని హెచ్చరించాడు ..’’సూపర్ ఇంటలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ‘’మానవ భవిష్యత్తును నిర్ణ యిస్తుందన్నాడు .మానవ చరిత్రలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆవిష్కరణ అరుదైన గొప్ప సంఘటన అన్నాడు .ఇందులోని ప్రమాదాలను మనం గుర్తించక పొతే ఇదే చివరిది అయ్యే ప్రమాదం ఉందన్నాడు .కంప్యూటర్ వైరస్ కొత్త జీవులకు స్థానం కల్పిస్తోందని,ఆదిమానవ వినాశనానికి దారి తీస్తుందని జాగ్రత్త పడాలని కోరాడు .మన ప్రతి బింబం నుండి జీవిని సృష్టించే దాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలని చెప్పాడు .ఆధునిక శాస్త్రీయ విజయాలను ఫిలాసఫీ లక్ష్య పెట్టటం లేదని బాధ పడ్డాడు .స్వర్గం కాని పునర్జన్మ కాని లేవన్నాడు .2014లోతాను ‘’నాస్తికుడిని ‘’అని హాకింగ్ ప్రకటించాడు .
జీరో గ్రావిటి కార్పోరేషన్ ఆధ్వర్యం లో 2007లో ‘’ వామిట్ కామెట్ ‘’అనే జీరో గ్రావిటి ఫ్లైట్ లో ప్రయాణించి రికార్డ్ సృష్టించాడు. సైన్స్ లో స్వయంగా ఆరు ,ఇతరులతోకలిసి అయిదు ,బాల సాహిత్యం లో నాలుగు రచనలు చేశాడు .హాకింగ్ పైనా, ఆయన రచనలపైనా సినిమాలు తీశారు .వైకల్యం శరీరానికే తప్ప ,సంకల్పానికి, మనసుకు కాదని తన జీవితం ద్వారానిరూపించి మానవాళికి గొప్ప ప్రేరణ ,స్పూర్తి కలిగించిన మహోన్నత శాస్త్ర వేత్త స్టీఫెన్ హాకింగ్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-2-16-ఉయ్యూరు .