శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-2(చివరిభాగం )

శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-2(చివరిభాగం )

సగం అన్నం అందులో సగం నీరు మిగిలింది గాలికి వదలితే సంపూర్ణ ఆరోగ్యమే .మాయ ఆవరించిన ఈ ప్రపంచం లో మాయ తొలగిపోతే బ్రహ్మమయమే అవుతుంది .యోగులకు అసాధ్యమేదీ లేదని చెబుతూ చక్కని పద్యం చెప్పారు శాస్త్రి గారు –‘’నేల జొచ్చు ,నింగి కెగయు ,గాలి నాపు -,నీరు ప్రవహింపగా  జేయు  నిప్పు నణచు –ప్రకృతి ఎల్ల స్వాధీనమై పరగు నెపుడు –యోగులకు నసాధ్యమను టెందు లేదు ‘’అంటారు .యోగులు శరీరాన్ని ఎముకల గూడుగా భావిస్తారు .అందుకే దేహం పై మొహం వదిలి సోహం అంటూ కర్మమును బ్రహ్మమును వీడక ఆత్మ ధర్మాన్ని అన్ని చోట్ల పాటిస్తూ జీవిస్తారు . ఎవడు తింటే సర్వ భూతాలూ తినినట్లు అవుతుందో వాడే సద్గురువైన వాసుదేవుడు .గురు శాపమే బలిని అధోలోకాలకు చేర్చింది .కనుక గురు అనుగ్రహ బలమే సుఖ శాంతులకు మూలం .’’కష్టముల కోర్చి హనుమ భాస్కరుని వద్ద –విద్యలను  నేర్చి యోగ ప్రవీణుడయ్యె ‘’అని హనుమంతుని యోగ వైభవ సాధన గూర్చి తెలియ జేశారు .మనసు నిగ్రహం గా ఉంచుకోవటం యోగ మార్గాలలో ఒకటి .

‘’ బ్రహ్మ మెరుగు సాధనము తపమ్ము ,ఋషులు –మునులు నిశ్చల చిత్తులై ముక్తి గా౦చుదురు ‘’రాజర్షి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవటానికి యోగమే పరమ సాధనమైనదని గుర్తు చేశారు .’’ఆశలు నెరవేరగాహర్ష –మందు కు కృషి –ఆత్మ విశ్వాస ము గలుగుటవసరంబు ‘’అని  ధర్మ సూక్ష్మంతెలియ జేశారు .బుద్ధిజాడ్యాన్ని తొలగించి ,సిద్ధి నిచ్చి ,ఆత్మ విజ్ఞాన మిచ్చి ,చాలాకాలంగా నిద్రాణ మై ఉన్న ‘’జీవ శక్తి మేలు కొలుపు  -యోగాసనాల్ మేలు గూర్చు ‘’అని ప్రాణ శక్తి ఉద్దీపనకు సర్వ విధాలా సహకరించి జీవితాన్ని ఉత్తేజ పరచేది యోగాసనాలే నంటూ స్పష్టం గా చెప్పారు .’’త్రికరణాలు కలుషితమై ,కోపం తారా స్థాయిలో ఉంటె ,అలాంటి క్రోధాన్ని అణగ చేయగల ఏకైక మార్గం యోగా .

‘’అందరికి గల ప్రాణ౦ బానంద రూప –మదియు బరమాత్మ కు బ్రతీక మగుచు వెలుగు –‘’ఆత్మ వత్సర్వ భూతంబు ‘’లాదరింప –దగుననెడి సూక్తికిన్ బరమార్ధ మిదియే ‘’అని వేదోపనిషత్ ధర్మాన్ని కమ్మని పాదం గా మలిచి సుబోధకం చేశారు .అలాగే ‘’దేహమున నవయవముల్ దీప్తి దనర –సూత్ర నేతి యు ,గజకర్ణి సుఖము నిచ్చు ‘’అంటూఈ  రెండు అభ్యసిస్తే సుఖానికి కొరత ఉండదని హామీ యిస్తారు .యోగం వలన బుద్ధి వికసిస్తుందని చెబుతూ పద్య రూపం లో ‘’బుద్ధి వికసించు యోగ విభూతి కతన ‘’అంటారు .ప్రాణాయామం అంటే యెంత తేలికో అంత తేలిక పదాలతో పద్యాలలో అందంగా బంధించి మన ముందు నిలిపారు –‘’ఒక ముక్కు బంధించి ,వేరొకట బీల్చి –రెండు బంధించి తగు నూపిరి బిగ బట్టి –తొలుత మూసిన ముక్కుతో వెలువరింప –ప్రముఖమైన ప్రాణాయామ పధ్ధతి యగు –నాడులనది శోధించు  ననవతరంబు ‘’అంటూ ప్రాణాయామం నాడీ శోధనకు  దివ్యౌషధం అన్నారు .శ్వాసలకు యోగ పరిభాషలో ఉన్న పూరక ,రేచకాలకు నిర్వచనం చెబుతూ గాలిపీలిస్తే పూరకమని వదిలితే రేచకమని వివరించారు .

‘’పడక కుదరదు,నిద్రయు పట్ట దెపుడు –నిలబడుతకు కూర్చుండుట కలమట పడు –నడుము నొప్పితో గనపడు  నరక మెపుడు –తొలగునది భుజంగాసన మలవడ౦గ’’అని భుజంగాసనం చేసే మేలును  వర్ణించారు . ఈ విశ్వానికి పరమ యోగా గురువు ఆ శ్రీ మహా విష్ణువే నని చెబుతూ –‘’యోగ నిద్ర బూనెడు హరి ,యుత్తమ గతి –మనల కుపదేశ మొనరించు మమత తోడ –దేహముకన్న భిన్నమౌ దేహి యనుచు –విశ్వ రూపు డైనను తాను  వేరగుటను ‘’ అని విష్ణు యోగ రహస్యాన్ని చేదించి చెప్పి మనల్ని ‘’ఫాలో ఆన్ ‘’అవమన్నారు .యోగాభ్యాసం చేస్తే –యవ్వనం తరగదు ,ముసలితనం ముఖం  లో కనిపించదు ,కాలం తెలియదు గ్లాని ఉండదు .నిత్యోత్సాహంగా మానవుడు ఉండాలంటే యోగమే శరణ్యం అంటారు .’’రక్త పోటును ,మధు మేహ రక్కసులన –బరగు నుగ్ర రోగ౦ బుల బారి బడక –బ్రతుకు సుఖ మయంబుగ జేయు జతన మందు –యోగమే శరణ్య మఖిలాభ్యుదయమునకు ‘’అని’’ నవీన పత౦జలి ‘’లా ఉద్ఘోషించారు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రిగారు .బ్రాహ్మీ ముహూర్తం లో లేచి పక్షుల కలరవాలను వీనుల విందుగా వింటూ ప్రక్రుతి ప్రశాంత అందాలను ఆస్వాదిస్తూ శుభ్రమైన ప్రాణవాయువు  పీలుస్తూ యోగా చేస్తే ఆయురారోగ్యాలు ఖచ్చితంగా పెరుగుతాయంటారు .ఇవి సాధకులకు అనుభవైక వేద్యమైనవే కదా .మితాహారం సత్సాంగత్యం వలన పవిత్ర జీవితం కలిగి ‘’బ్రహ్మ మీ జగంబను జ్ఞాన పధము జూపు ‘’  .

‘’తిష్ట కుదిరిన వారికి నిస్ట కుదురు –నిష్ట కలిగిన ధ్యాన గరిస్టు డగును-ధ్యాన యోగ సాధన పరమాత్మ జేర్చు –పరమద్వైత సుఖమనుభవమున గను’’అని యోగాభ్యాసం తో చివరి మెట్టు అయిన ముక్తి పదం లభిస్తుందని నిర్ద్వందంగా తెలియ జేశారు .జీవికి కావాల్సింది అదే .దాన్ని అందుకోవటానికి యోగం పరమ ప్రమాణమైన సాధనం .శీర్షాసనం ఏకాగ్రత కలిగిస్తుంది .పౌష్టికాహారం ,పళ్ళు పాలు ఆకుకూరలు యోగ సాధకునికి మేలు చేస్తాయి .’’నిన్ను నీవు తెలిసికొనుట’’కే యోగా అవసరం .  ‘’పనిలో దైవాన్ని చూడాలి .విషయ వాంచలు దూరమై ఆత్మనిగ్రహం ,అంతర్ముఖత్వం యోగా వల్ల లభిస్తాయి .ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ –కనుక సౌర శక్తిని ఆస్వాదించి ఆరోగ్యం పొందాలి .సూర్యుడు త్రిమూర్తులకు మూల శక్తి ,ఆత్మ శక్తి కూడా .

చివరగా ఫల శృతి చెబుతూ శాస్త్రిగారు –‘’కాల మతి వేగముగ సాగు,కష్ట సుఖము–లకు ,వియోగ సంయోగములకు నతీత-మగుచు ధనమదికారంము నడ్డు కావు –బలము ,బలగమ్ము నద్దాని నణప లేవు –యోగులకు పునరావృత్తి యుండ బోదు ‘’అని యోగులకు పునర్జన్మ ఉండదని పునరావృత్తి రాహిత మోక్ష సామ్రాజ్యం లో శాశ్వతం గా ఉండి పోతారని యోగ విభూతిని శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు తేట తేట తెలుగు మాటలతో మృదు మధురంగా యోగ రసామృతాన్ని మన చేతిలో పద్య రూపం లో ఉంచి రికార్డు సృష్టించారు .అంతర్జాలం లో ఉన్న ఈ 131పద్యాలను అందరూ చదివి ఆస్వాదించి శాస్త్రి గారిని అభినందించాలని కోరుతున్నాను . ఈ యోగ వైభవ పద్య శతకం ప్రధాని మోడీ గారి దృష్టిని ఆకర్షించాలని కోరిక .

శాస్త్రిగారి ఫోన్ నంబర్ -8106766197

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-16-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.