గీర్వాణ కవుల కవితా గీర్వాణం-
రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని
పురాణ ప్రవచనం చేసి ,పౌరాణిక విశారద బిరుదు పొంది ,సమస్త రామాయణ సారాన్ని ఒక చోట చేర్చి రామాయణ సారోద్ధారం రచించి ,రామాయణ సుధా సాగర బిరుదాంకి తులై న బ్రహ్మశ్రీ ములుకుట్ల నరసింహ శాస్త్రి గారు గుంటూరు మండలం సత్తెనపల్లి తాలూకా నుదురుపాడు గ్రామం లో నందన నామ సంవత్సర శ్రావణ శుక్ల నవమీ జయ వాసరం ,అనూరాధా నక్షత్ర యుక్త తులా లగ్నం లో శ్రీ ములుకుట్ల శంకరనారాయణావధాని ,శ్రీమతి వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు .ఐదో ఏడు వచ్చాక స్వగ్రామం లోనే అక్షరాభ్యాసం జరిగి ,తర్వాత మేనమామ ఇంట చేబ్రోలు లో ఆంద్ర ,ఆంగ్ల భాషలను కొన్నేళ్ళు చదివారు .
ఉపనయనానంతరం కృష్ణా జిల్లా బెజవాడ లో శ్రీ గంటి వెంకటేశ్వరావధాని గారి శిష్యులై వేదాధ్యయనం చేశారు .తర్వాత కన్నడ దేశం లోని బెంగుళూరు చేరి శంకర మఠం లో కావ్య నాటక జ్యోతిష్యాదులు నేర్చారు .విజయవాడ వచ్చి వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ మల్లాది రామ కృష్ణ విద్వత్ చయనులు వద్ద అంతేవాసులై వేదాంత భాష్యం అభ్యసించారు .తమిళనాడులోని కుంభ కోణం లో వేద పరీక్ష నిచ్చి 16-5-1918న ఉత్తీర్ణులై స్వర్ణ పతకం పొందారు .శ్రీమతి సీతారామాంబ ను వివాహమాడారు . .1927లో చీరాలలో శ్రీ మదాంధ్ర మహా భారత పురాణ కాలక్షేపం చేసి ,శ్రోతల ప్రశంసలు పొంది స్వర్ణ సింహ లలాట ,కంకణద్వయాన్ని కానుకగా అందుకొన్నారు .తమిళనాడు లోని తిరుచిరాపల్లి మండలం లో ఉన్న కరూరులో తాము శ్రమతో సంతరించిన ‘’రామాయణ సారోద్ధారం ‘’ప్రవచనం చేసి పండిత పామరజన రంజనం చేశారు .అమూల్య బహుమతులతో పాటు సింహ లలాటాంకిత సువర్ణ ఘంటా కంకణ ద్వయాన్ని అందుకొన్నారు .
24-7-1931నుండి 19-9-33వరకు రెండేళ్ళు బెజవాడ రామ మోహన పుస్తక భాండారం లోను ,శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం,శ్రీ కోదండ రామాలయం ,శ్రీకన్యకాపరమేశ్వరి ,కొత్త గుళ్ళు లోను రామాయణ సారోద్ధార ప్రసంగాలు సభా రంజకం గా చేశారు .అప్పుడు వచ్చిన గోదావరీ పుష్కరాలలో భద్రాచలం లో శ్రీ సీతా రామ చంద్ర స్వాముల సన్నిధానం లో రామాయణ సారోద్ధారం బాలకాండ పురాణ ప్రవచనం చేసి భక్తి భావ లహరి ప్రవహింప జేశారు .వైష్ణవ పండితుల అభినందన పురస్కారాలను అందుకొన్నారు .
అవధానిగారి పెద్దన్నగారు,సనాతన భాగవత భక్త సమాజ కార్య దర్శి శ్రీ లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు సుప్రసిద్ధ కవి పండితులు బ్రహ్మశ్రీ బెల్లం కొండ రామ రాయ కవి గారి శిష్యులై వ్యాకరణ ,వేదా౦తాలను అభ్యసించారు .తమ్ముడు శ్రీ గోపాల కృష్ణ శాస్త్రి ఉభయ భాషా ప్రావీణ .చీరాల పురపాలకోన్నత పాఠ శాలలో తెలుగు పండితులు .వీరి సోదరి రామ సుబ్బాంబ.
అవధానిగారు బహు శ్రమకోర్చి అనేక రామాయణ గాధలను కూలంకషంగా పరిశీలించి సంస్కృతం లో ఉత్తరకాండ తో సహా రామాయణ సారోద్ధారం అనే బృహత్ ప్రబంధాన్నిసరళ సంస్కృతం లో రచించారు .ముఖ్యంగా వాల్మీకి రామాయణాన్ని భూమిక గా తీసుకొని శతకోటి రామాయణం దగ్గర్నుంచి ఏక శ్లోకీ రామాయణం వరకు దేనినీ వదలకుండా వాటిలోని సారాన్ని అమృతోపమానంగా అందించారు .కుశలవ రామాయణం ,ఆధ్యాత్మ రామాయణం ,యోగ వాసిస్టం ,దుర్వాస రామాయణం ,మార్కండేయ రామాయణం ,తత్వసంగ్రహ రామాయణం ,హనుమద్రామాయణం ,నారద రామాయణం ,ఆనంద రామాయణం ,అద్భుత రామాయణం ,అగస్త్య రామాయణం,తార సార రామాయణం ,బోధాయన రామాయణం ,బ్రహ్మ రామాయణం ,భారద్వాజ రామాయణం ,శివ రామాయణం ,యాజ్న్య వల్క్య రామాయణం ,విశ్వా మిత్ర రామాయణం ,బృహద్రామాయణం ,శ్వేత కేతు రామాయణం ,సుతీక్ష్ణ రామాయణం ,పులస్త్య రామాయణం ,జైమిని రామాయణం ,దేవీ రామాయణం అనే 24రామాయణాలను విపులంగా శోధించి వాటి సారాన్ని మధుర మనోజ్న సంస్కృత శ్లోకాలలో నిక్షిప్తం చేసి మనకు అందించిన పుణ్యాత్ములు శ్రీ నరసి౦హావధాని గారు .అలాగే అష్టాదశ పురాణాలలో ఉన్న రామ కధను రామాయణ రత్నాకరం ,ఉమా సంహిత ,అగస్త్య సంహిత ,పంచ రాత్రాగమ స్థిత పద్మ సంహిత ,పరాశర సంహిత ,శ్రీ రామ పూర్వోత్తర పితానుపనిషత్ ,తార సారోపనిషత్ ,రామ చంద్ర కదామృతం ,రసాన్న రత్నావళి ,రామాయణ సార సంగ్రహం ,కాల విధానం ,కాల నిర్ణయ మహోదధి ,మనవాది స్మృతులు ,మధ్వన్యక్కారం ,శివ తత్వ వివేకం ,పురాణ తామసత్వ నిరాకరణం ,ధర్మా కూతం ,కాల ప్రకాశిక ,హోరానుభవ దర్పణం ,సూర్య సిద్ధాంతం ,,ఆర్య భటం ,శ్రీ మహా భారతం ,శ్రీ శంకర భాష్యం ,ఆపస్తంభ బోధాయన సూత్రం మొదలైన వాటిలోని ప్రమాణ వాక్యాలను గ్రహించి సంతరించారు .ఇవికాక అగ్ని వేష రామాయణం ,విచిత్ర రామాయణం మొదలైనవాటినీ మధించారు .ఇంతటి గొప్ప పరి శోధన చేసి ఆస్తిక జన హృదయోల్లాసంగా రామాయణ సార సంగ్రోద్ధారం రచించారు వారికి జాతి ఏమిచ్చి ఋణం తీర్చు కోగలదు ? ‘
అయోధ్య కాండ లో సుమారు 80పేజీలలో పండిత, మహాపండిత అభిప్రాయాలన్నిటినీ క్రోడీకరించి ప్రచురించటం చాలా విశిష్టం గా ఉంది .గ్రంధ గౌరవాన్ని మరింత ఇనుమడింప జేసింది .అవధాని గారిని మనస్పూర్తిగా అభినందించిన మహానుభావులలోమహా మహోపాధ్యాయ శ్రీ ముదిగొండ నాగ లింగ శాస్త్రి ,రాజా విక్రమ దేవ వర్మ,వావికొలను సుబ్బారావు ,శ్రీ పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి ,రాజా మంత్రి ప్రగడ భుజంగ రావు ,శ్రీ ఆది భట్ల నారాయణ దాసు ,శ్రీ వడ్డాది సుబ్బారాయుడు ,శ్రీ రాణీ వెంకట నృసింహ చయనులు,వ్యాఖ్యాన వాచస్పతి శ్రీ మల్లాది రామ కృష్ణ విద్వత్ చయనులు ,న్యాయవాది శ్రీ పెద్ది భొట్ల వీరయ్య ,శ్రీ మరుధూరి తాతాచార్యులు ,తర్క వేదాంత విశారద శ్రీ ముదిగొండ వెంకట రామ శాస్త్రులు ,ఆమ్నాయ తర్క వేదాంత పండిత శ్రీ శ్రీపాద లక్ష్మీ నృసింహ శాస్త్రి వంటి ఉద్దండులున్నారు .వీరిలో ఎక్కువ మంది స్వచ్చమైన గీర్వాణ భాషలోనే అభినందనలు రాసి పంపారు .
శాస్త్రిగారు ఆ నాటి దేశాలను వాటికీ సంబంధించిన ఈ నాటి పేర్లతో వివరించి తెలియ జెప్పటం గొప్పగా ఉంది .ఉదాహరణకు కోసల దేశం అంటే –ఉత్తర ,దక్షిణ కోసలాలు .ఉత్తర కోసలం లో ముఖ్యపట్టణం అయోధ్య దీన్నే ఓద్అంటారు దక్షిణ కోసలలో గుజరాత్ లోని కుశస్తలి రాజధాని .అది గంగానది దక్షిణ తీరం లోని నాగ పూర్ లో ఉంది .కౌసల్య తండ్రి భాను మంతుడు ఉత్తర కోసల రాజు. అదే ఇప్పుడు గౌడ దేశమైంది .దీని రాజధాని శ్రావస్తి .భారత కాలం లో గంగ కు దక్షిణం లో ఉన్న దక్షిణ కోసల ఇప్పుడు ఉత్తర కోసల అయిందని వివరించారు .మగధ దేశం మాగధ అని పిలువ బడింది .ప్రస్తుతం ఇది దక్షిణ బేరార్ లో ఉంది. దీనికి పడమర శోఢా నది,ఉంది. రాజగిరి ముఖ్య పట్టణం .ఇప్పుడు మధ్య పరగణాలు అనే మధ్య ప్రదేశ్ లో ఉంది .
బాల కాండ లో సీతా దేవి జన్మ వృత్తాంతాన్ని శాస్త్రిగారు వర్ణించిన కొన్ని శ్లోకాలు –
‘’సీతా జన్మ ప్రవక్ష్యామి యదుక్తం గ్రంధ కొభిః – ఆసీ త్పురా నృపః కస్చిత్పద్మాక్ష ఇతి విశ్రుతః
స్వాదీయసీం గుణ సుధాం సీతా పిబతి తే ప్రభో-తత్రాక్షిపద్విషం మారస్త్వం భిష గ్రామ రక్ష తాత్ ‘’
శ్రీ రామ సద్గుణ సుదారాసాన్ని సీతమ్మ గ్రోలు తోంది .మన్మధుడు అనే అసూయ ఉన్నవాడు సుధారసం లో విషం కలిపాడు .రామా నువ్వు విష వైద్యుడవై సీతనుకాపాడు .
ఇలా సారోద్ధారం సాగుతుంది .
అవధాని గారి ఫోటో కింద జత చేశాను చూడండి
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-16-ఉయ్యూరు
చాలా మంచి విషయము తెలియచేసారు. దయచేసి మీ వద్దనున్న భూగోళవిన్యాసం పుస్తకము నాకు ఇవ్వగలరా. (జిరాక్స్ లేక స్కాన్)