రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని-2(చివరిభాగం )
శ్రీ ములుకుట్ల నరసి౦హావధాని గారు ప్రతి కాండకు’’ న్యాస ప్రకారం’’ తో బాటు ప్రతి శ్లోకానికే వారే సుబోధకం గా తెలుగులో తాత్పర్యమూ రాశారు . .అవసరమైన చోట్ల వివరణలూ ఇచ్చారు . .అయోధ్యాకాండ ప్రారంభం లో శ్రీరాముని స్తుతిస్తూ –‘’ప్రసన్నతాం యా న గతాభి షేక -తస్తదా న మమ్లౌవనవాస దుఖితః –ముఖా౦బుజ శ్రీ రఘు నందనస్య –సదాస్తుసా మంజుల మంగళ ప్రదా.’’శౌర్య ధైర్య స్తైర్య,గాంభీర్య ,సౌందర్య ,మాధుర్య ,చాతుర్య ,ఔదార్య వాత్సల్య ,సౌశీల్య ,ఆనుకూల్య ,నైర్మల్య ,ఔజ్వల్య ,అకౌటిల్య ,అచాపల్య ,తారుణ్య ,కారుణ్య వాల్లభ్య ,సౌలభ్య ,సౌభాగ్యాలకు చక్కని నిర్వచనాలు చెప్పారు .వనవాసానికి వెళ్ళబోతూ రాముడు సీతా గృహానికి వెళ్లి కొన్ని విషయాలు చెబుతూ ‘’భరతుడికి ఎప్పుడూ అప్రియం చేయకు ,ఈ దేశానికి అతడే ప్రభువు ‘’అని చెప్పాడు –‘’విప్రియం నచ కర్తవ్యమ్ భరతస్య కదాచన –సహి రాజా ప్రభుశ్చైవ దేశస్యచ ,పురస్యచ ‘’అన్నాడు .
మంగళ శ్లోకం లో –‘’పితృ సత్య ప్రతిజ్ఞాయ కైకయ్యా వచనాదపి –చిత్ర కూత నివాసాయ సీతారామయ మంగళం ‘’అంటూ 8 మంగళ శ్లోకాలు చెప్పారు .
అరణ్య కాండ ప్రారంభ శ్లోకం –‘’సాన్ద్రానంద పయోద సౌభగత నున్చీరా౦బర సుందరం –పాణౌ బాణ శరాసనం కటి లసత్తూణీర భారం వరం –రాజీవాయత లోచనం ద్రుత జటాజూటేన సంశోభితం –సీతా లక్ష్మణ సంయుతం పది గతం రామాభి రామం భజే ‘’ఈ కాండలో భూగోళం గురించి’’భూగోళ విన్యాసం ‘’లో వివరించారు .8గోధుమ గింజలను వరుసగా పెడితే వాటి మధ్య దూరం అంగుళం లేక వ్రీహి. 12అంగుళాలు ‘’వితస్తి ‘’.రెండు వితస్తులు హస్తం .4హస్తాలు దండం .రెండు వేల దండాలు క్రోసు .నాల్గు క్రోసులు యోజనం .ఇదే మూడు మైళ్ళ అరవై అడుగులకు సమానం .మన భూమి యాభై కోట్ల యోజనాల వైశాల్యం కలది .ఆధునికులు ఉత్తర ధృవాన్ని మేరు పర్వతం అంటున్నారు .అక్కడ పర్వతాలేవీలేవు .మేరు పర్వతం లేదనటం పొరబాటు .వారి అవగాహనా రాహిత్యమే .పౌరాణిక భూ మేరువు ,సిద్ధాంత ఖగోళాన్ని బట్టి మహా మేరువు అని రండు మేరువులున్నాయి సిద్ధాంత మేరువే నార్త్ పోల్ .జంబూద్వీపం లోని పామీరు పీఠ భూమికి తూర్పున ఉన్న ‘’దియన్ షన్ ‘’అనే పేరున్నదే మేరు పర్వతం .దియంసన్ అంటే దేవ పర్వతం .
హరి వర్షం అంటే మంచి వెండి రంగు గల మనుషులున్న ప్రదేశం .ఇదే చైనా టర్కీ ప్రాంతం రష్యా టర్కీ స్థానం ,పర్షియా టర్కీ స్థానం ,అరేబియా ఆఫ్రికా లలో కొంతభాగం .ఇలావ్రుతం. అంటే సూర్య చంద్ర నక్షత్రాలు ప్రకాశించని భూమి .రోగాలు ఉండవు చిరంజీవులు ఉంటారు .రమణ వర్షం తెల్లని దీవులలో ఉండే వారున్న ప్రాంతం అవే సైబీరియా ,రష్యా ఆస్ట్రియా ,హంగేరి ఫ్రాన్స్ ప్రాంతాలు .హిరణ్యాక వర్షం అంటే ధన వంతులు సౌందర్య వంతులు ఉండే కామచాత్కా ,సైబీరియా ,జర్మనీరశ్యా బెల్జియం లు .
ఆంద్ర దేశం అంటే –కృష్ణా గోదావరీ నదుల మధ్య ప్రాంతం .దీనికి ‘’సింధు యుగ్మాంతరం ‘’,’’షట్సహస్ర జగతి ‘’అనే పేర్లున్నాయి .సింధు అంటే నదికి పేరు .ఆరు వేల గ్రామాలున్నాయి .వీరినే ఆరువేలనియోగులు అంటారు .వరంగల్ ప్రాంతం లోని ‘’త్రిలింగాయన ‘’దగ్గరున్న వారినే తెలగాన్యులు అంటారు .గోదావరీ తీర ప్రాంతం వారిని వెలనాటి నియోగులు అంటారనిఅవధానిగారు తెలియ జేశారు ‘
రామ లక్ష్మణులు ఋష్య మూక పర్వతం చేరటం తో అరణ్య కాండ పూర్తీ అవుతుంది .చివరి శ్లోకం –‘’తతో మహాద్వర్త్మ సుదూర సంక్రమః క్రమేణగత్వా ప్రతి కూల ధన్వనం ,దర్శ పంపాంశుభ దర్శకాననా మానేక నానా విధ పక్షి జాలకాం’’
ఫలశ్రుతి లో ‘’యో విరాధ వధ౦ నిత్యం శ్రుణోతి శ్రావ యేతవా-తస్య పాపాని సర్వాణి వినస్టాని న సంశయః ‘’
మంగళ శ్లోకాలలో ఒకటి-మచ్చుకి –‘’మతంగాశ్రమ వాసాయ శబరీ సేవితాయచ –పంపాదర్శన తోషాయ భవ్య రూపాయ మంగళం ‘’
మనవి –14-2-16 ఆదివారం రధ సప్తమి నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో జరిగిన సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతానికి ముఖ్య అతిధిగా ,విచ్చేసి ,ధార్మిక ప్రసంగం చేసి ,వారి రచన ‘’శ్రీరామ వాణి’’పుస్తకాన్ని సరసభారతి ప్రచురించగా నాచేత ఆవిష్కరణ చేయించి పొన్నూరు నుండి అతి విలువైన బ్రహ్మశ్రీ ములుకుట్ల నరసింహ సిద్ధాంతి గారి ‘’రామాయణ సారోద్ధారం ‘’7 భాగాలను నాకు అందజేసిన శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తిశాస్త్రి గారి సహృదయత ,సౌజన్యాలకు నమస్సులు పలకటం తప్ప నేను ఏమిచ్చి ఋణం తీర్చుకో గలను ? అందుకే ములుకుట్ల వారిపై రెండు భాగాలలో వ్యాసం రాసి దాన్ని శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారికి వారిని అడగకుండా చెప్పకుండా ‘’ఆన్ లైన్ ‘’అంకితమిచ్చి కొంత వరకు రుణ భారం తగ్గించు కొన్నాను .శాస్త్రిగారు పెద్దమనసుతో మన్నిస్తారని భావిస్తాను –దుర్గాప్రసాద్
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-16-ఉయ్యూరు
ఆర్యా…నా పేరు భార్గవ శర్మ. మీరు వ్రాసిన “రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని-2(చివరిభాగం )” చదివాను. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి.
తమరు మీ సెల్ నంబరు ఇస్తే మీతో మాట్లాడగోరుచున్నాను 🙏
తమ జవాబుకై వేచి చూస్తూంటాను.