ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -115

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -115

47- భారత జాతి పిత మహాత్మా గాంధి -5(చివరి భాగం కొనసాగింపు )

‘’భూమిమీద గాంధీ లాంటి మానవుడు జన్మించి జీవించి జాతిని ప్రపంచాన్ని ప్రభావితం చేశాడంటే భవిష్యత్తరాలు నమ్మ వేమో”’అన్నాడట ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ అయిన్ స్టీన్.నిజమే అంతటి చరిత్రనే సృష్టించాడు గాంధి .తన జీవిత చరిత్రను ‘’ది స్టోరి ఆఫ్ మై ఎక్స్పరిమేన్ట్స్ విత్ ట్రూత్’’ (సత్య శోధన )’గా రాసుకొన్నాడు దీన్ని తెలుగులోకి తెనుగులెంక శ్రీ తుమ్మల సీతారామ మూర్తిగారు ,శతావధాని శ్రీ వేలూరి శివ రామ శాస్త్రిగారు అనువదించారు .ఎన్నో భాషలలోకి అనువాదం చెందిన పుస్తకం అది ఎందరెందరికో కర దీపికగా భాసించింది .గాంధీపై రస్కిన్ దోరో టాల్ స్టాయ్ ప్రభావం ఉంటె గాంధీ ప్రభావం నల్ల జాతి అమెరికా నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ పై అమితంగా ఉంది. లక్షలాది నల్లజాతి ప్రజలతో లాంగ్ మార్చ్ నిర్వహించి తన జాతి వారి హక్కులు సాధించాడాయన .అహింసా సిద్ధాంతాన్నే నమ్మి ఉద్యమించాడు .

బాల్యం లో సత్య హరిశ్చంద్ర నాటకం చూసి ప్రభావితుడై సత్యానికి జీవితాంతం కట్టుబడ్డాడు గాంధి .శ్రావణ పితృ భక్తీ ఆయన్ను ఏంతో బాగా ఆకర్షించింది .భగవద్గీత ఆయన ఆరవ ప్రాణం. తనకు ఏ  సందేహం వచ్చినా  అదే తీరుస్తుందని చెప్పేవాడు .పుతలీబాయ్ ,కరం చంద్ ల చివరి  పుత్రుడైన మోహన్ దాస్  గాంధి బొంబాయిలో లాయర్ గా ఫెయిల్ అయి దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ లాయర్ గా ఇండియన్ ప్రజా నాయకుడిగా సక్సెస్ అయ్యాడు .1906లో అక్కడి ప్రభుత్వం జూలూ రాజ్యం పై నటాల్ లో    యుద్ధం ప్రకటిస్తే  భారతీయులను సైన్యం లో చేర్చుకోమని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చాడు .సరేనని 20మంది స్వచ్చంద సేవకుల్ని స్త్రేచర్ మోయటానికి   నియమించి గాయపడిన బ్రిటిష్ సైనికులకు వైద్య సహాయం అందించటానికి   వినియోగించుకోన్నది .దానికి   గాంధీ నాయకత్వం వహించి రెండు నెలకు పైగా పని చేశారు .ఈ ఉదంతం వలన బలీయమైన సైన్యం ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం తో తలపడటం కష్టం అని తెలుసుకొని నెమ్మదిగా అహింసా విధానం లో ,నిరసన ,,సమ్మె లతో వారి మనసు మార్చాలని నిర్ణయించాడు .

ఇండియాలో లోమితవాదభావాలున్న  గోపాల కృష్ణ గోఖలే నాయకత్వం లో శిష్యుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో పని చేశాడు .బ్రిటిష్’’ విగ్గిష్ ‘’విధానాన్ని అనుసరించి పార్టీని పూర్తీ స్వదేశీయంగా మార్చాడు .1920లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై 1930భారత స్వాతంత్రం కోసం జాతికి పిలుపు నిచ్చాడు .1939 బ్రిటిష్ ప్రభుత్వం జర్మనీపై యుద్ధానికి దిగినప్పుడు గాంధీ ,కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించారు .సమ్మెలు హర్తాళ్ళతో దేశాన్ని హోరెత్తి౦ చాడు.  గాంధీమాటే మంత్రం అయింది .1942లో ఇండియాకు అత్యవసరంగా స్వేచ్చను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు .

1918లో మొదటి ప్రపంచ యుద్ధ సమయం లో బ్రిటిష్ ప్రభుత్వ వైస్ రాయ్ గాంధీని ఢిల్లీలో జరిగే  యుద్ధ సమావేశానికి  ఆహ్వా నిస్తే  వెళ్ళాడు .వారిమనసు దోచుకొని స్వాతంత్ర్యాన్ని పొందచ్చు ననే ఆలోచన ఆయనది .భారతీయులను సైనికులుగా చేర్చుకోవటానికి ఒప్పుకున్నాడు .ఇది ఆయన అహింసా సిద్ధాంతానికి వ్యతిరేకమే కాని తానుకాని తన వాల౦ టీర్లుకాని యుద్ధం లో పాల్గొని ఏ ఒక్క సైనికుడినీ చంపము అని వైస్ రాయ్ సెక్రేటరికి విజ్ఞాపన రాసి పంపాడు .అందుకే ఆమ్బులన్స్ లో ఉండి క్షత గాత్రులకు సేవలందించారు .బీహార్ లోని చంపారాన్ ,గుజరాత్ లోని ఖేడా ఉద్యమాలలో  రైతులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకం గా ప్రభుత్వం పై ఆహి౦సా  విధానం లో  పోరాడాడు .రైతులకు న్యాయం చేకూర్చేట్లు ప్రభుత్వాన్ని ఒప్పించాడు .గుజరాత్ లోని నాడియా జిల్లా ఖేడా లో జరిగిన ఉద్యమానికి వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించాడు .ప్రజలతో సంతకాల ఉద్యమం చేయించాడు .శిస్తులు కట్టవద్దని రైతులకు చెప్పి ఒప్పించాడు .అయిదునెలలు తీవ్రంగా ప్రతిఘటించి ప్రభుత్వం దిగోచ్చేట్లు చేసి రైతు హక్కులు కాపాడాడు .దీనితో పటేల్ నాయకత్వాన్ని మెచ్చి ‘’సర్దార్ ‘’బిరుదు ప్రసాదించాడు .1919లో ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్వహించి ముస్లిం లకు న్యాయం జరిగేట్లు చేశాడు

1909లో గాంధీ ‘’హింద్ స్వరాజ్ ‘’పుస్తకం రాశాడు .ఇందులో ఇండియాలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల సహాకారం వల్లనే ఏర్పడి బతుకుతోందని ఇప్పుడు ప్రజా సహకారం లేనందున భారతీయులకు అధికారం అప్పగించి వెళ్ళిపోవాలని తీవ్ర స్వరం తో రాశాడు .తన హరిజన్ పత్రిక, య౦గ్ ఇండియా  లోనూ ప్రజాసమస్యలపై స్పంది౦చి రాసేవాడు..పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ మారణకాండ తో ఆయనలో ఉద్రేకం పెరిగింది .1921లో కాంగ్రెస్ పార్టీ గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆచరణాత్మక ప్రణాళిక రూపొందింప జేసింది .పార్టీని పునర్నిమించాతానికి సూచనలు చేసి ‘’స్వరాజ్ సభ్యత్వం ‘’అందరితో తీసుకొనేట్లు చేశాడు . డబ్బుకట్టి సభ్యులుగా చేర్చే పని ప్రారంభించాడు .అహింసా సహాయ నిరాకరణ శాసనోల్ల౦ఘన లతో బాటు స్వదేశీ విధానాన్ని చేర్చాడు .విదేశీ వస్త్ర ,వస్తు బహిష్కరణ చేయించాడు. వాటిని పబ్లిక్ ప్రదేశాలలో ప్రజలు స్వచ్చందంగా దహనం చేసి పూర్తీ మద్దతు పలికారు .రాట్నం పై తానూ నూలు వడుకుతూ ప్రజల చేత వడికిస్తూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ‘’వణికేట్లు ‘’చేశాడు .బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదులూ సత్కారాలు త్యజించారు నాయకులు .ఇప్పుడు అంతాస్వదేశీయే .ఖద్దరు దుస్తులే కట్టారు.తెల్లని  గాంధీటోపిపెట్టి ప్రాభుత్వానికి ‘’టోపీ పెట్టె ‘’పనిలో పడ్డారు ప్రజలు . ఎక్కడికైనా మడిచి  తేలికగా మోసుకు వెళ్ళేటైప్ రైటర్ సైజ్ లో చిన్న  పోర్టబుల్ రాట్నాన్ని గాంధీ స్వయం గా తయారు చేశాడు .

గాంధీ ప్రమేయం లేకుండా కాంగ్రెస్ రెండు గ్రూపులుగా చీలింది .ఒక దానికి చిత్తరంజన్ దాస్ మోతీలాల్ నెహ్రూ లు రెండవదానికి రాజగోపాలాచారి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ నాయకులు .కలిసి పనిచేసిన హిందూ ముస్లిం లు క్రమంగా దూరమైపోయారు ,దీనికి నివారణగా 1924లో గాంధీ మూడువారా ల నిరాహార దీక్ష చేశాడు .ఆయన ఆశించిన ఫలితం రాలేదు .ఆ ఏడాది కాంగ్రెస్ మహాసభను బెల్గాంలో జరపాలని చెప్పాడు .అందరూఆయనే అధ్యక్షత వహించాలని కోరగా కాంగ్రెస్ కార్యకర్తలంతా చేతితో వడికిన నూలుతో నేసిన వస్త్రాలు ధరిస్తామని ప్రతిజ్ఞచేస్తే అభ్యంతరం లేదన్నాడు .అందరూ ఆమోదించగా   అసభకు గాంధీ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఇదే ఆయన అధ్యక్షతలో జరిగిన ఒకే ఒక్క సమావేశం .స్వరాజ్ పార్టీకి కాంగ్రెస్ కూ ఉన్న విభేదాలను చర్చలతో పరిష్కరించాడు .1928లో గాంధీ మళ్ళీ పూర్తీ ఉత్సాహం తో ఉద్యమించాడు. ప్రభుత్వం నియమించిన సైమన్ కమీషన్ ను ‘’గోబాక్ ‘’ఉద్యమంతో సాగ న౦పాడు .యువనేతలు నెహ్రూను సుభాస్ చంద్ర బోస్ ను దగ్గరకు తీశాడు .వాళ్ళు స్వరాజ్యం వెంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు .రెండేళ్లలో తానె దాన్ని ప్రకటిస్తానని చెప్పి చివరికి ఒక్క ఏడాది గడువుతో సరిపుచ్చుకోన్నాడుగాంది .

31-12-1929న లాహోర్ లో భారత జాతీయ పతాకాన్ని  ఎగరేశారు .1930జనవరి 26ను భారత స్వాతంత్ర్య దినోత్సవంగా సంబరాలను కాంగ్రెస్ లాహోర్ లో సభ జరిపి నిర్వహించింది . 1930మార్చ్ లో గాంధి ఉప్పు సత్యాగ్రహానికి పిలుపు నిచ్చాడు ..మార్చ్ 12నుంచి ఏప్రిల్ 6వరకు గాంధీ అహమ్మదాబాద్ లో బయల్దేరి 388కిలో మీటర్లు నడిచి సముద్ర తీరగ్రామం దండి చేరాడు .ప్రజలు బ్రహ్మరధం పట్టారు దేశం లో ప్రతి చోటా ఉప్పు సత్యాగ్రహాలలో ప్రజలు పాల్గొని ప్రజా బలం నిరూపించాగా బ్రిటిష్ ప్రభుత్వం ఇక అణచి ఉంచటం అసాధ్య మని గ్రహించింది మద్రాస్ లో ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు బ్రిటిష్ వారి తుపాకీకి చాతీ ఎదురుగా పెట్టి కాల్చమన్నాడు ..ఉద్యమాలలో మహిళలను స్వచ్చందంగా పాల్గోనేట్లు చేశాడు .సరోజినీ ,కమలానెహ్రు ,దుర్గాబాయి దేశముఖ్ వంటి వారెందరో ఉద్యమించారు మహిళా చైతన్యం కలిగించారు .గాంధీ ఒక ‘’ప్రవక్త ‘’అయ్యాడు జనాలకు .ఆయన చెప్పిందే వేదం. ఆయన నడచిన బాట ఆదర్శం .ఆయనపై పాటలు పద్యాలు గేయాలు కధలు నవలలు నాటకాలు వచ్చాయి .1931లో గాంధీ -ఇర్విన్ ఒడంబడిక ఏర్పడింది .ఖైదీలన్దర్నీ ప్రభుత్వం విడుదల చేసింది .లండన్ లో రౌండ్ టేబుల్ కాన్ఫ రెన్స్ కు ఆహ్వానిస్తే వెళ్లి నిష్కర్షగా స్వతంతం ఇవ్వాల్సిందేనని చెప్పాడు .బ్రిటిష్ ప్రధాని చర్చిల్ గాంధీ చర్యలను నిందించేవాడు ‘’.అర్ధనగ్న సన్యాసి’’ అని  అవహేళన చేశాడు .

దళితుల పక్షాన అంబేద్కర్ నిలబడి అంటరానితనాన్ని రూపుమార్చాలని కోరాడు .1934లో గాంధీ కాంగ్రెస్ కు రాజీనామా చేశాడు .రెండేళ్ళ తర్వాత మళ్ళీ రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నాడు .రెండేళ్ళ తర్వాత సుభాస్ బోస్ కాంగ్రెస్ అధ్యక్షుడై పట్టాభి సీతారామయ్య ఓడిపోతే పట్టాభి ఓటమి తన ఓటమి అన్నాడు గాంధి. బోస్ కు దూరమైనాడు .గాంధీకి ఇష్టం లేకపోయినా బోస్ రెండవ సారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచాడు .గాంధీ మార్గాన్ని కాదని ముందుకు బోస్ వెడుతున్నాడని కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా రాజీనామా చేశారు .

1942క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహా ఉధృతంగా నడిపాడుగాంది .’’ordered anarchy of the present system of administration was worse than real anarchy ‘’అన్నాడు .స్వాతంత్ర్యం వచ్చినా గాంధీ సంతోషంగా లేడు. అన్నదమ్ములు విడిపోయినందుకు బాధపడ్డాడు .ఉత్సవాలకు పదవులకు దూరంగా ఉన్నాడు .నెహ్రూ ను ప్రధానిగా పటేల్ ను ఉపప్రధానిగా ఉండాలని హితవు చెప్పాడు .

గాంధీ నడచిన మార్గాన్నే’’ గాంధీ యిజం’’అన్నారు .అదే అందరికి ఆదర్శమైంది . There is no such thing as “Gandhism”, and I do not want to leave any sect after me. I do not claim to have originated any new principle or doctrine. I have simply tried in my own way to apply the eternal truths to our daily life and problems…The opinions I have formed and the conclusions I have arrived at are not final. I may change them tomorrow. I have nothing new to teach the world. Truth and nonviolence are as old as the hills.[1

గాంధీయిజం అనేది కొత్తదికాదని అనాదిగా ఈదేశం లో వస్తున్నదాన్నే తానూ అమలు చేశానని చెప్పాడు .గాంధీ అంటే రవీ౦ద్రనాద్ టాగూర్ కు వీరాభిమానం .టాగూర్ నా గురువు అనేవాడు గాంధి .మహాత్ముడన్నాడు టాగూర్ .విద్యావిధానం చదువుతూ ఆర్జి౦చేదిగా  ఉండాలని కోరాడు. అందుకే ‘’నయీ తాలిం ‘’అంటే బేసిక్ ఎడ్యుకేషన్ కోసం శ్రమించాడు. దీనిపై జకీర్ హుసేన్ చేత పుస్తకం రాయించాడు.ఆయనది ‘’సర్వోదయ సిద్ధాంతం ‘’అందరి సంక్షేమం కావాలన్నదే ధ్యేయం .గాంధీ  ప్రభావం మార్టిన్ లూధర్ కింగ్ ,జేమ్స్ లాసన్ ,జేమ్స్ బావెల్ పై అధికం .ఖాన్ అబ్డుల్ గఫార్ ఖాన్ గాంధీని అనుసరించి’’ సరిహద్దు గాంధీ’’ అనిపించుకొన్నాడు .దక్షిణాఫ్రికా స్వాతంత్ర్యం కోసం ఉద్యమించి సంపాదించిన నెల్సన్ మండేలా ,బర్మా నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ ,స్టీవ్ బీకోలు  గాంధీ వల్ల ప్రేరణ పొంది అదేమార్గం లో పని చేసి లక్ష్యాలు సాధించారు .రోమిన్ రోలాండ్ ,బ్రెజిల్ లీడర్ మేరియా లేసెర్డా డీ మోరా లపై గాంధీ ప్రభావం చాలాఉంది ఆయన్ను స్తుతించి కీర్తి౦చిన వారే వీళ్ళు .

గాంధీపై అటన్ బరో  గొప్ప సినిమా తీశాడు. బెన్ కింగ్స్లీ గాంధి పాత్రను గొప్పగా పోషించాడు .గాంధీ మరణించిన జనవరి 30వ తేదీని ‘’అమర వీరుల దినోత్సవం ‘’గా ప్రభుత్వం నిర్వహిస్తోంది .కల్లుతాగద్దని బోధించిన గాంధీ బొమ్మల ఎదుటే ఇవాళ కల్లు,సారా దుకాణాలు వెలిసి ప్రభుత్వానికి ధనం సంపాదించి పెడుతూ ఉండటం ఆశ్చర్యకరం  గాంధీ ఒక మహాత్ముడు .మార్గ దర్శి భారత జాతి పిత .

Inline image 1Inline image 2 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-2-16-ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.