యక్ష ప్రశ్నల సమాదానలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత
పాండవులు ద్వైత వనం లో ఉండగా దాహార్తి తీర్చటానికి సమీపం లో ఉన్న సరస్సునుండి నీరు తెమ్మని ధర్మ రాజు వరుసగా నకుల ,సహదేవ ,అర్జున భీములను పంపగా వారెవ్వరూ తిరిగి రాక పోయేసరికి అనుమానించి తానె స్వయంగా బయల్దేరాడు .అక్కడ విగత జీవులుగా కనిపిస్తున్న సోదరుల్ని చూసి అంతటి యుదిస్తిరుడు దుఖం ఆపుకోలేక పోయాడు .కొలను చేరి దోసిలితో నీళ్ళు త్రాగాబోయాడు అప్పుడు ఒక కొంగ తానూ చేపల్ని తినేదాన్నని తన సోదారుల్ని యమలోకానికి పంపింది కూడా తానేనని చెప్పి తానూ సంధించే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి నీరు త్రాగా మన్నది .సూక్ష్మ బుధి గల ధర్మ రాజు ‘’అయ్యా !నువ్వేవరవో చాలా గొప్పవాడివి తప్ప కొంగవు కావు .ఇంతటి సాహసం ఒక పక్షి చేయలేదు .నా సోదరులు నలుగురు హిమాలయ ,పారియాత్ర ,వింధ్య ,మలయా పర్వతాల వంటి వారు .వాళ్లకు ఈ గతిపట్టించటం సామాన్యులకు సాధ్యం కాదు .నువ్వెవరివో ముందు చెప్పు ‘’అన్నాడు .అప్పుడా కొక్కెర ‘’యుదిస్టిరా !నువ్వు చాలా బుద్ధిమంతుడివి .నేను కొంగనుకాను .యక్షుడిని .నీ సోదరులు నా మాట వినకుండా అపాయం కొని తెచ్చుకొన్నారు .నేనే వారిని చంపాను ‘’అన్నాడు ధర్మ రాజు హృదయం విల విలలాడింది కర్తవ్యమ్ తోచలేదు .యక్షుడిని సమీపించి అతని భీకర ఉన్నత ఆకారం చూసి మహిమగలవాడని గ్రహించి ‘’యక్ష ప్రశ్నలకు ‘’సమాధానాలు చెప్పటానికి సిద్ధ పడి ‘’యక్షా !నీ అధికారాన్ని ప్రశ్నించటం లేదుకాని నీ ప్రశ్నలేమితో వినాలని మహా కుతూహలంగా ఉంది .ప్రశ్నించు .నా బుద్ధిబలాన్ని ఉపయోగించి సమాదానమిస్తాను ‘’అన్నాడు అతి వినయం గా సుస్థిర చిత్తం తో సిద్ధ పడ్డాడు .
1-రాజా !సూర్యుడు ఉదయిన్చాతానికి కారణం ఏది ?ఆయన చుట్టూ ఎవరు తిరుగుతారు ?సూర్యుడు దేనివలన అస్తమిస్తాడు ?ఆయన దేనిలో ప్రతిష్టింపబడి ఉంటాడు ?’’అని తేజస్సుకు సంబంధించిన నాలుగు ప్రశ్నలను ఒకే సారి అదిగాదూ యక్షుడు .
ధర్మ రాజు ‘’మహానుభావా !బ్రహ్మ వలన సూర్యుడు ఉదయిస్తాడు .దేవతలు ఆయన చుట్టూ పరిభ్రమిస్తారు .ధర్మమే సూర్య అస్తమయానికి కారణం .సూర్య భగవానుడు సత్యం లో సుస్థిరంగా ప్రతిస్టింప బడి ఉంటాడు ‘’అని తడుముకోకుండా యుదిస్తిరుడు సమాధానాలు ఇచ్చాడు .
2-లోపల సంతోషిస్తున్నా దాన్ని ప్రకతనం కానీకుండా యక్షుడు శ్రోత్రియత్వం గురించి ప్రశ్నలను సంధించాడు .’’రాజా ! మనిషి ఏ రకంగా శ్రోత్రియుడు కాగలుగుతాడు ?దేని వలన పరమపదాన్ని పొందుతాడు ?దేని వలన సహాయ భూతుడు కాగలడు?దేనివలన మానవుడు సంపూర్ణ బుద్ధి మంతుడు అవుతాడో చెప్పు ?’’
పాండవాగ్రేసరుడు ‘’మహాత్మా !వేదార్ధాన్ని తెలుసుకొన్నవాడు శ్రోత్రియుడు అవుతాడు .తపస్సు చేస్తే వచ్చే జ్ఞానంతో మహిమాన్విత పదవి పొందగలడు శ్రోత్రియుడికి సహాయం గా నిలిచేది ధీరత్వమే .ధర్మార్ధాలు త్లిసిన పెద్దల సేవ వలన సంపూర్ణ జ్ఞాని అవుతాడు మానవుడు ‘’అనిసుసంగతమైన జవాబు చెప్పాడు .
3-తర్వాత -బ్రాహ్మణ సదాచారం గురించిన ప్రశ్నలను యక్షుడు అడుగుతున్నాడు –‘’బ్రాహ్మణులకు దైవత్వం గా దీన్ని భావించాలి ?మానవత్వంగా దేన్నీ భావించాలి ?బ్రాహ్మణా సత్పురుషుల ధర్మం ఏమిటి ?అసత్పురుషులు ఎలా ప్రవర్తిస్తారు ?’’అని ప్రశ్నించాడు .
యక్షుడా !స్వాధ్యాయం లో ఏమరు పాటు లేకుండా ఉండటమే బ్రాహ్మణులకు దైవత్వాన్ని సిద్ధింప జేస్తుంది .మరణం అనేది వారికి సహజ మానుషత్వం .బ్రాహ్మణ సత్పురుషులు తపస్సు చేయటమే ధర్మం .పరనింద అసత్పురుష మార్గం ‘’అంటూ సద్బ్రాహ్మనత్వాన్ని ధర్మ రాజు ఆవిష్కరించి నిష్కర్షగా తెలియ జేశాడు .
4-ఇప్పుడుక్షత్రియ ధర్మం గురించి ప్రశ్నా సంధానం చేస్తున్నాడు యక్షుడు .’’ధర్మ రాజా !క్షత్రియులకు దైవత్వాన్ని కల్గించేది ఏది ?వాళ్లకు మానుషత్వం ఏది ?క్షత్రియ సత్పురుష ధర్మమేమిటి ?వారిలో అసత్పురుషుల మార్గమేమిటి ?
యుదిష్టిరుడు ‘’పుణ్యాత్మా !సర్వ రక్షణ కోసం ఉపయోగించే ఆయుధ విద్యయే క్షత్రియులకు దైవత్వాన్నిస్తుంది .భయం క్షత్రియునికి మానుషత్వాన్నిస్తుంది .క్షత్రియ సత్పురుషులకు యజ్ఞాచరణమే ధర్మం .బాధ పడే వాళ్ళని పట్టించుకోకుండా స్వసుఖం లో గడిపితే అదే అసత్పురుష మార్గామవుతుంది క్షత్రియులకు ‘’అని ఉత్తరమిచ్చాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-3-16-ఉయ్యూరు