యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -3
యక్షుడు యజ్న సంబంధమైన ప్రశ్నలను ధర్మ రాజును అడుగుతున్నాడు –
10-రాజా ! యజ్ఞానికి సంబంధించి ఉన్న ఏకైక సామం ఏది ?
ధర్మ రాజు –ప్రాణమే యజ్ఞానికి సంబంధించిన ఒకే ఒక్క సామం .
11-‘’తపస్సుకు ,యజ్ఞానికి చెందిన ఒకేఒక్క యజుస్సు ఏది ?’’
‘’మనస్సు యజ్ఞానికి తపస్సుకు చెందిన ఏకైక యజుస్సు .’’
12-‘’యజ్ఞాన్ని కోరే ఒకే ఒక విషయం ఏది ?
‘’రుక్కు యజ్ఞాన్ని వరిస్తుంది .
13-యజ్ఞం దేన్ని అతిక్రమించదు?
‘’రుక్కు ను యజ్ఞం అతిక్రమించదు .
క్షత్రియ సత్పురుషుల ధర్మం యజ్ఞం అని ఇదివరకే ధర్మ రాజు తెలియజేశాడు .కనుక యజ్న పరిజ్ఞానం లోతులను తరచి అడిగాడు యక్షుడు .లోతైన సమాధానాలే చెప్పి ఒప్పించాడు యుదిస్టిరుడు .ఇపుడు శ్రేష్ట విషయాలపై ప్రశ్నలను సంధించ బోతున్నాడు .
14-రైతుకు ఏది శ్రేష్టమైనది ?
‘’ వర్షమే కృషీవలుడికి శ్రేష్టమైనది ‘’
15-బీజావాపనం చేసే వారికి ఏది శ్రేష్టం ?
‘’విత్తనం ‘’
16-ప్రతిజ్ఞా వంతులకు శ్రేస్టమైనదేది .?
‘’గోవు ‘’
17-సంతాన వంతులకు ఏది శ్రేష్టం ?
‘’పుత్రుడే సర్వశ్రేస్టం.’’
ఇప్పుడు యక్షుడు ఎవరు ఏ సందర్భం లో మిత్రుడుగా ఉంటారో చెప్పమని అడుగుతున్నాడు .
18-ప్రవాసం లో ఉన్నవారికి మిత్రుడు ఎవరు?
‘’తనతో బాటు ప్రయాణం చేసేవాడే మిత్రుడు ‘’
19-గృహస్తుకు మిత్రుడు ?
‘’ఇల్లాలే గృహమేదికి మిత్రుడు .
20- రోగికి ఎవరు స్నేహితుడు ?
‘’వైద్యుడే రోగికి మిత్రుడు ‘’
21-చనిపోయేవాడికి మిత్రుడేవరు ?
‘’తాను చేసిన దానమే తన వెంట ఉండే మిత్రుడు .’’ లోకం లో స్నేహితుడు అన్నదానికి ఉన్న సాధారణ అర్ధాన్ని దాటి ధర్మ రాజు ధార్మిక సమాధానాలిచ్చి ,మార్మికత ను చమత్కారంగా అర్ధం చేసుకోవటమే విశేషం .ఇది పాండిత్య పరీక్ష కాదు .జిజ్ఞాసకు సంబంధించింది ;ధార్మిక విషయాలను జీవితాను భవాలకు అన్వయించి చెప్పాల్సిన సమాధానాలివి .తన కన్నా గొప్ప వాళ్ళ సత్సాంగత్యం వలన జ్ఞానాన్ని ఉన్నతీకరించు కొంటూ పరిణతి సాధించిన వాళ్ళు మాత్రమే చెప్పగల సమాధానాలివి .అంతటి పరిణతి ధర్మ రాజుకు ఉన్నదికనుక తేలికగా జవాబులు చెప్పాడని విశ్లేషకులు శ్రీ జి వి సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం సమంజసమైనదే .
ఇప్పుడుధర్మ రాజుకు పంచ భూతాలపై ఉన్న పరిజ్ఞాన౦పై ప్రశ్నలను యక్షుడు అడుగ బోతున్నాడు .
22- ‘’రాజా !ఒంటరిగా తిరిగేది ఏది ?’’
‘’యక్షుడా !ఒంటరి సంచారం చేసే ధీరుడు సూర్యుడు .’’
23-‘’పుట్టి ,మళ్ళీ పుట్టేది ఏది ?’’
‘’మళ్ళీ మళ్ళీ పుట్టేవాడు చంద్రుడే ‘’
24-‘’శీతలత్వానికి మందు ?’’
‘’అగ్నియే శీతలత్వానికి మందు .
25-మహా పాత్ర ఏది ?
‘’భూమి కంటే మహా పాత్ర వేరేది లేదు ‘’
26-ప్రాణులన్నిటికి అతిధి ఎవరు ?
‘’అగ్ని ‘’
27-‘’సనాతన ధర్మమేది ?’’
‘’పాటించాల్సిన నిత్య ధర్మమే సనాతన ధర్మం ‘’
28-జగత్తు అంతా వ్యాపించి ఉండేది ఏది ?
‘’వాయువు ‘’
ఇప్పుడు ఏ ఏ విషయాలు ఎక్కడ ఉంటాయో ప్రశ్నిస్తున్నాడు .
29-ధర్మానికి ముఖ్య స్థాననమేది ?
‘’దక్షత అనేది ధర్మానికి ముఖ్య స్థానం
30-కీర్తికి మూల స్థానం ?
‘’దానం .
31-స్వర్గానికి మూల స్థానం ?’’
‘’సత్యం ‘’
32-సుఖానికి ప్రధాన నెలవు ?
‘’శీలం ‘’
యక్షుని ప్రశ్నలలో మూల స్థానం అంటే మూల కారణం అన్నమాట .
ఒకసారి యుదిస్టిరుని సమాధానాలను పర్యావలోకనం చేస్తే –ధర్మం దక్షతలో ఉందని ధర్మ రాజు చెప్పాడు .దక్షత అంటే నిర్వహణ సామర్ధ్యం .ధర్మం తెలిస్తే చాలదు అది ఆచరణ రూపం లోనే సార్ధక మవుతుందని వివరణ .ధర్మ౦ ధర్మ శాస్త్రాలలో ఉండదు జీవిత ఆచరణ లో కనిపిస్తుంది .అలాగే దానం చేయాల్సింది స్వయం గా సంపాదించిన కష్టార్జితాన్నే అని చెప్పాడు .దానం లో సృజన శీలం ఉండాలి. దాంతో తనను ,ఇతరులను నిర్మించుకోవాలి .దానం కీర్తికారకం .స్వర్గం సత్యం లో ఉందన్నాడు అంటే ఉన్నదాన్ని యదా తధంగా దర్శించటం అని అర్ధం .సుఖం అంటే భౌతిక పరమైనదికాదు .ధర్మ రాజు దృష్టిలో ధార్మిక పరమైనది .ఉత్తమ ప్రశ్న వేయటం సామాన్యులకు సాధ్యం కాదు .సంక్షిప్తంగా ప్రశ్న అడగాలి అంటే సమగ్ర పరిజ్ఞానం ఉండాలి .సంగ్రసమాధానం చెప్పాలన్నా ఇదే కావాలి కనుక ఇక్కడ ప్రశ్నించేవాడు సమాధానాలు చెప్పేవాడూ ఇద్దరూ ఇద్దరే .సరి జోదులు .అందుకే యక్ష ప్రశ్నలకు ఈనాటికీ అంతటి క్రేజ్ ఉంది .ప్రతి దాన్ని మూల తత్త్వం లోకి తీసుకు వెళ్లి సమాధానం చెప్పటం యుదిస్టిరుని గోప్పతనమే కాదు అభి రుచి కూడా .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-3-16-ఉయ్యూరు