వేసవిలో ఒక చల్లని కదా సాయంత్రం
శ్రీ అనిల్ అట్లూరి చాలాకాలం నుంచి నెట్ ద్వారానే పరిచయం .ప్రతి మొదటి ఆదివారం సాయంత్రం ఏదో సాహిత్య చర్చ ను ‘’వేదిక –సాహిత్యం కోసం మనం ‘’వేదికగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరితో పాటు నాకూ పంపటం చూసీ చూడనట్లు నేను వదిలేయటం మరీ మంచి కార్యక్రమం అయితే బాగా జరగాలని కోరటం దానికి ఆయన ఒక ఆదివారం హైదారాబాద్ లో ఉన్నప్పుడు వీలు చూసుకొని రమ్మని రాయటం జరిగింది .ఆ అవకాశం ఇంతవరకురాలేదు .ఉయ్యూరు నుంచి ఆదరాబాదరా హైదరాబాద్ రావటం .పని అవగానే పరుగెత్తుకొని వచ్చి ఉయ్యూరులో వాలటం జరుగుతోంది .
మార్చి 10 నుండి 13 వరకు ఈ సారి మా రెండో అబ్బాయి శర్మవాళ్ళ ఇంట్లో బాచుపల్లిలో ఉన్నాం .12వ తేదీ శనివారం సాయంత్రం దాకా ఏదో నెట్ లో రాస్తూనే ఉండగా మా వాడు అనిల్ అట్లూరి గారి కార్యక్రమానికి వెళ్దాం రెడీ అవమనటం,అవటం కారులో కుకట్ పల్లి కల్యాణి జూయలర్స్ దగ్గరున్న ఒక విద్యాలయంలో ‘’వేదిక ‘’జరుగుతోందని అది ప్రతి రెండవ శనివారానికే కూకట్ పల్లి కి మార్చినట్లుతెలిస్సింది .సుమారు పావు తక్కువ అయిదింటికి వెళ్లాం ఇద్దరం. అనిల్ గారితో సహా ఒక ఆరు,మందే కనిపించారు హైదరాబాద్ లోనూ శ్రోతలకు కరువా అను కొన్నా .క్రమంగా వాలటం ప్రారంభించారు .అయిదున్నరకు ఒక ఇరవై ఆ తర్వాతా ముప్ఫై మందీ అవటం ఆనందం కలిగించింది .తలనెరిసిన నాలాటి వారితో బాటు జుట్టేలేనివారే ఎక్కువగా ఉన్నా ,ఒక అరడజను యువకులు కనిపించగానే ఉత్సాహం రెట్టింపయ్యింది .అనిల్ గారు మౌన వ్యాఖ్యాతగానే ప్రేక్షక పాత్రే ఎక్కువగా పోషించారు .స్వీటు హాటు టీలు అందరికీ అందాయి .
ఆ నాటికార్యక్రమం లో ముఖ్య విషయ౦ శ్రీ అఫ్సర్ రాసిన ,ఆంధ్రజ్యోతిలో పడిన ‘’చమ్కీ పూల గుర్రం ‘’పై చర్చ.కధను ఒక కుర్రాడు మొబైల్ లోంచి చదివి వినిపించాడు బాగా చదివాడు కూడా . ఈకద పై చర్చలో పాల్గోనేవ నెటిజన్ లకు ముందే లింక్ లతో అందజేశారు .చదివి సిద్ధమై రావాలని అనిల్ గారి హృదయం .కాని అందరూ చదివి వచ్చారని నాకు అనిపించలేదు . కద పై సభ్యుల స్పందన .సూది తీసి దూలానికి గుచ్చినట్లు మోడీ మీద ,బి జెపి,ఆర్ ఎస్ ఎస్ ల పైనా విమర్శ జడివాన కురిసింది .ముస్లిం లు అభద్రతా భావం లో పడిపోవటం దీని వెనుక ఉందని ఒకాయన అంటే ,యునాని ఆయుర్వేదాలలో ముస్లిం లను తీసుకోరని ప్రచారం సాగుతోందని మరొకరు అన్నారు .వాళ్ళను పరిచయం చేయ లేదుకనుక పేర్లు రాయలేదు . మోడీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా దర్గాలకు హిందువులు వెడుతూనే ఉన్నారని ,ఎక్కడా స్పర్ధలు కనిపించలేదని అన్నాను .కాని మా ఉయ్యూరు కాలేజి రిటైర్డ్ తెలుగు లెక్చరర్ శ్రీ ఏ ఎస్ ప్రసాద్ తమ్ముడు శ్తీ ఏ వి భాస్కరరావు గారు చురుగ్గా చర్చలో పాల్గొన్నారు .ఇంతలో శ్రీ వడ్డేనవీన్ ,శ్రీ చంద్ర శేఖర్ ఆజాద్ కూడా రావటం నిండు దనాన్నిచ్చింది .మహిళలూ లెక్కింప దగిన సంఖ్య లో హాజరవటం శుభ సూచకం .కాని వారెవరూ చర్చలో పెద్దగా పాల్గొనలేదు .ఈ కధకు ముగింపు గురించి కొద్ది సేపు చర్చ జరిగింది .ఇటీవలే అమెరికానుంచి వచ్చిన శ్రీ బ్రహ్మానందం గారు అసలు ప్రపంచ కధలలో తొంభై శాతం కధలలోముగింపు ఉండదని చెప్పారు. శ్రీ నవీన్ ముగింపు ఉండాలన్న నియమమం ఏదీ కధకు లేదన్నారు .మహా కధకుడు శ్రీ ఆజాద్ దేనికీ స్పందించలేదు .
రెండవ విషయం గా శ్రీ ఆడెపు లక్ష్మీ పతి ‘’నాలుగు కధలు ‘ను శ్రీఏ.వి భాస్కర రావు బాగానే విశ్లేషించారు .లక్ష్మీపతి చేనేతకార్మికుడని ,తర్వాత బొగ్గు గనిపనిలో చేరాడని ,కొద్ది కధలే రాసినా లోతుగా అధ్యయనం చేసి రాశాడని ,ఆంప శయ్య ననీన్ లాగా ‘’చైతన్య స్రవంతి ‘’లో కధలు నడిపాడని ,సాంకేతిక పదజాలాన్ని బాగా గుప్పించాడని ,అది చదువరులకు మింగుడు పడటం కష్టమని ,అయినా చదివి తీరాల్సిన కదలనీ వివరించారు .స్పష్టంగా ముందు వెను కధలను కలుపుతూ వినేవారికి కన్ఫ్యూజన్ లేకుండా భాస్కర్ మాట్లాడిన తీరు ఆకట్టుకొంది .ఆడెం కధలకు పెట్టె పేర్లు కూడా తమాషాగా ఉంటాయని ‘’ముసలమ్మ మూట ‘’తిర్య్గ గ్రేఖ ‘’కధలను విశ్లేషించిన తీరు బాగుంది . అంతావిన్నారే కాని తిర్యగ్రేఖ అంటే ఏమిటో ఎవరికీ పెద్దగా తెలిసినట్లు లేదు .దాచుకోకుండా ఈ విషయాన్ని శ్రీ టి భాస్కర రావు గారు అడిగారు .అప్పుడు నేను ఒకటి లేక ఎక్కువ రేఖలను ఖండి౦చే రేఖను తిర్యగ్రేఖ అంటారని ,చేదన రేఖ అనే పేరు కూడా ఉందని పదవ తరగతి వరకు రేఖా గణిత సిద్ధాంతాలలో ఈ పదం వస్తుందని చెప్పి ‘’రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడు ఏకాంతర కోణాలు సమానమని తిర్యగ్రేఖకు ఇరు వైపులా ఉన్న కొణాల మొత్తం 180డిగ్రీలు ‘’అన్న సిద్దాంతాన్ని చెప్పాను .అందరూ చదివి౦దే కాని దాని అవసరం లేక మర్చి పోయి ఉండచ్చు .
శ్రీ భాస్కర్- లక్ష్మీపతి చాలామంది పాశ్చాత్య రచయితలను చదివాడని వారి సాహిత్య ప్రభావం అతనిపై ఉందని అన్నారు .అప్పుడు నేను ‘’విలియం కార్లోస్ విలియమ్స్ ,దారంటన్,సామ్యుయల్ బెకెట్ ల ధోరణి ఇలాగే ఉంటుందని చెప్పాను . మొత్తం మీదా హాపీ హాపీగా సాహిత్యం లో మమేకమయ్యే మంచి కార్యక్రమం .వీలు ఉన్నవారందరూ హాజరై నిర్వహించేవారికి మరింత ఉత్సాహం కలిగించాలని నా కోరిక .చివరగా అందరితో గ్రూప్ ఫోటో దీనికి హై లైట్ అయి మధురానుభూతిని మిగిల్చి చిరస్మరణీయం చేసింది .వేదిక పదికాలాలు వృద్ధి చెంది సాహిత్య పరిమళాలను సమాజం లో వెదజల్లాలని కోరుతున్నాను .
కొసమెరుపు –వేదిక నిర్వహణకు అధ్యక్షుడు లేకపోవటం, అందరికి ప్రాతినిధ్యం ఉండటం ప్లస్ పాయింట్ అయితే కొత్తవారిని సభ్యులకు పరిచయం చేయటం వారు నిర్వహిస్తున్న సాహితీ కార్య క్రమాల వివరాలు తలియ జెప్పే ప్రయత్నం చేయకపోవటం గొప్ప వెలితి .అలాగే హాజరైన వారందరూ అందరికీ తెలియక పోవచ్చు ఎవరికి వారు స్వ పరిచయం చేసుకొని ఉంటె ఆత్మీయత మరింత పెరుగుతుంది అనిపించింది .
నేను తీసుకొని వెళ్ళిన ‘కేమో టాలజీ పిత కోలాచల సీతారామయ్య –పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’4 పుస్తకాలను శ్రీ అనిల్ ,భాస్కర ద్వయం ,ఆజాద్ లకు అందజేశాను .సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకల ఆహ్వాన పత్రాలను అందరికి ఇచ్చాను . ఆజాద్ గారి దగ్గర చేరి నేను దుర్గాప్రసాద్ –ఉయ్యూరు అనగానే గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు ఆజాద్ మాట అన్నా కద అన్నా ,కద చదివే తీరు అన్నా నాకు ,మా శ్రీమతికి అమిత ఇష్టం .రేడియోలో కద చదవగానే వెంటనే స్పందించి ఫోన్ చేసేవాడిని .సుమారు 5 ఏళ్ళ క్రితం మేము మద్రాస్ లో ఉండగా ఆయనే ఫోన్ చేసి మాట్లాడారు .రాదా -మధు సీరియల్ లో అయన పాత్ర మరీ ఇష్టం .చానెళ్ళలో కనబడటం లేదేమని అడిగాను .నవ్వి రెండు నవలలు రాస్తున్నానని త్వరలో రిలీజ్ చేస్తానని చెప్పారు . నవీన్ విపుల నిర్వహించిన కధలపోటీలో తానూ కారా మాస్టారు అబ్బూరి చాయాదేవిగారు జడ్జీలుగా ఉన్నామని మేష్టారు తానూ లక్ష్మీపతి కధకే మొదటి బహుమతినివ్వాలని నిర్ణయించామని చాయాదేవిగారు ఆ కద అందరికి అర్ధం కాదని,అందుకే తనకు అభ్యంతరం అని చెప్పారని చివరికి అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆ కధకు మొదటి బహుమతినిచ్చామని ఫ్లాష్ బాక్ కద చెప్పారు .
మొత్తం మీద నడి వేసవి లాంటి మార్చి వేసవిలో ఈకార్యక్రమం ఆహ్లాదాన్ని ,ఆనందాన్ని చల్లదనాన్ని కల్గించింది ఏర్పాటు చేసిన శ్రీ అనిల్ గారికి ,పాల్గొన్న సాహిత్యాభిమానులకు అభినందనలు –
గబ్బిట దుర్గా ప్రసాద్ -14-3-16-ఉయ్యూరు