యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -7(చివరిభాగం)
86-‘’ఎవరిని పండితుడు అనాలి “”?
‘’ధర్మం తెలిసిన వాడినే ‘’
87-‘’నాస్తికుడెవడు ‘’?
‘’’’పరలోకం లేదనే వాడు ‘’
88-‘’కామం అంటే ‘’?
‘’సంసార హేతువు ‘’
89-‘’మత్సరం ‘’?
‘’హృదయ తాపం ‘’
90-‘’అహంకారం ?’’
‘’తీవ్ర మైన అజ్ఞానం ‘’
91-‘’దంభమంటే ‘’?
‘’’’ధర్మాత్ముడిగా ప్రకటించుకోవటం ‘’
92-‘’పరదైవమెవరు ‘’?
‘’దానఫలం ‘’
93-‘’పిశునత్వమంటే “”?
‘’పరదూషణం ‘’.
ఇక్కడ కొంత వివరణ నిచ్చారు శ్రీ జి వి ఎస్ .-అహంకారమంటే నేను ,నాది అనే స్వీయ కేంద్ర ప్రవ్రుత్తి అని ,దీనికి మూలం అవిద్య ,అజ్ఞానమని ,తీవ్రమైన అజ్ఞానమే అహంకారమని ధర్మ రాజు నిర్వచనం .ధర్మాత్ముడుగా ఉండటానికి ప్రకటన అక్కర్లేదు .జీవించే విధానమే ధర్మాత్ముడిని చేస్తుంది. దానం ఎలా ప్రకటించుకో రాదో ధర్మాన్నీ అలానే ప్రకటించుకోరాదని అర్ధం .దైవాలకే దైవం –పర దైవం అని చెప్పకుండా యుధిష్టిరుడు-దానఫలాన్ని పరదైవంగా నిర్వచించి చెప్పాడు .ధర్ముడి సమాధానాలన్నీ చాలా విస్త్రుతార్ధం లోనూ మూలార్ధం లోను ఉండి అతని వివేక సంపత్తిని ఆవిష్కరిస్తాయి .ఇప్పుడు మరిన్ని సంక్లిష్ట ప్రశ్నలను సంధిస్తున్నాడు యక్షుడు –
94-‘’ధర్మ రాజా !ధర్మార్ధ కామాలు పరస్పరం విరోధించేవి గా కనిపిస్తాయి కదా ,మరి అవి ఎక్కడ కలుస్తాయి ?’’
‘’ధర్మం –భార్య పరస్పరం విరోది౦చ కుండా మానవుడికి వశమైనప్పుడు ధర్మార్ధ కామాలు ఒకే చోట కలుస్తాయి ,నిలుస్తాయి ‘’
95-‘’అక్షయ నరకాన్ని ఎవరు పొందుతారు “”?
‘’పరమ దరిద్రుడైన యాచక బ్రాహ్మణుడిని ,ఆహ్వానించి ,లేదు పొమ్మనే వాడు నరకం లోనే శాశ్వతంగా ఉండి పోతాడు ‘’
96-‘’కులం ,నడవడి స్వాధ్యాయన,పా0డిత్యాలలో దేనివల్ల బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది ‘?
‘’మహాత్మా !కులం ,స్వాధ్యయనం ,పా౦డిత్యాలు బ్రాహ్మణత్వానికి కారణాలు కావు .ఉత్తమమైన నడవడి మాత్రమే బ్రాహ్మణత్వానికి ప్రధానకారణం .బ్రాహ్మణుడు సదాచారం పాటిస్తూ బ్రాహ్మణత్వాన్ని కాపాడుకోవాలి .చతుర్వేదాలు చదివినా ,సదాచార పరాయణుడు కాని వాడు శూద్రుని కంటే హీనాతి హీనుడు .ఇంద్రియ విజయాన్ని సాధించిన వాడెవడైనా బ్రాహ్మణుడే .’’నిర్మొహమాటంగా ధర్మ రాజు సమాధానం చెప్పాడు .శీలమే బ్రాహ్మణత్వానికి ముఖ్య కారణం అని స్పష్టం గా చెప్పాడు .బుద్ధుడు కూడా ‘’ఉత్తమ శీలాన్ని సాధించిన అర్హతులను బ్రాహ్మణుడు’’అన్నాడు .
97-‘’ప్రియంగా మాట్లాడేవాడు దేన్ని పొందుతాడు ‘’?
‘’ పరమ హితాన్నిపొంది అందరికీ ఇస్టు డౌతాడు ‘’
98-‘’ఆలోచించి పని చేసేవాడు “”?
‘’ఎక్కువగా విజయాలు సాధిస్తాడు ‘’
99-‘’స్నేహితులెక్కువగా ఉన్నవాడు దేన్ని పొందుతాడు “?
‘’సుఖాన్ని పొందుతాడు ‘’
100-‘’ధర్మ పరుడు పొందేది ?’’
‘’సద్గతి ‘’
101-‘’ఎవడు ఆనందిస్తాడు “”?
‘’అయిదు రోజులకొక సారి కూర వండుకొన్నా ,,అప్పులేని వాడు ,పర దేశం లో లేని వాడు ఆన౦దిస్తాడు ‘’
102- “”ఆశ్చర్య కరమైనది ఏది “”?
‘’చావకుండా స్థిరంగా ఉంటాము అనుకోవటమే ‘’
103-‘’ఏది మార్గం “”?
‘’మహా పురుషులు నడిచిన మార్గమే ‘’
104-‘’ఏది వార్త ?
‘’’’ఈ బ్రహ్మాండ భాండం మోహ మయం .దీనిలో సూర్యుడిని అగ్నిగా నిలిపి ,రాత్రి ,పగలు ఇంధనంగా చేసి ,ఋతువులు ,మాసాలను గరిటలుగా చేసి కాలం ప్రాణుల్ని పక్వం చేస్తుంది ‘’అన్నదే వార్త మహానుభావా !
105-‘’పురుషుడెవరు””?
‘’ఎవడి పుణ్య కార్యాలను ప్రజలు పొగుడుతున్న ధ్వని స్వర్గాన్నీ ,భూమినీ తాకుతూ ఉంటుందో వాడు పురుషుడు అనబడతాడు ‘’
106-‘’సర్వ శ్రేష్ట ధన వంతుడు ఎవరు “”?
‘’ప్రియాప్రియాలను సమానంగా స్వీకరించేవాడూ ,భూత భవిష్యత్తులను సమానంగా భావించే వాడూ సర్వ శ్రేష్ట ధనవంతుడు మహాత్మా !’’
యక్ష ప్రశ్నలు సంపూర్ణం
ఆధారం – శ్రీ జి వి .సుబ్రహ్మణ్యం గారి రచన –‘’భారతం లో రసవద్ఘట్టాలు –సమీక్షలు’’ –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-16-ఉయ్యూరు