ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -122
50- రష్యాలో అక్టోబర్ విప్లవ నాయకుడు ,బోల్షివిక్ పార్టీ నేత మార్క్సిజం లెనినిజం కు మార్గ దర్శి –లెనిన్-3
లెనిన్ దంపతులు పారిస్ నుంచి క్రాకో చేరారు ఇది వాళ్ళ ఊరుకు, అనుచరులకు దగ్గరే .లెనిన్ కు అన్ని రకాలా సాయ పడుతూ వెంట ఉన్న భార్య నడేఝా కు తీవ్ర అనారోగ్యంవల్ల అనేక ఆపరేషన్లు జరిగి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది .అయినా ఆత్మ ధైర్యం తో కోలుకొని కష్ట తరమైన తన విధులను నెర వేరుస్తోంది .అప్పటికే ఆమె గుండె చాలా దెబ్బ తిన్నదనీ ఇక ఎక్కువ శ్రమ చేస్తే ఆమె బతకదని డాక్టర్లు చెప్పారు .కాని భర్త మరణం తర్వాత 15ఏళ్ళు బతికి అందరికి ఆశ్చర్యం కలిగించింది .1914లో లెనిన్ దంపతులు ఆస్ట్రియాలో భాగమైన గెలీషియా కు వెళ్ళారు .అదే సమయం లో ఆస్ట్రియా రష్యాపై యుద్ధం ప్రకటించింది .లెనిన్ ను అరెస్ట్ చేశారు .ఆయన రష్యాకు దాదాపు గూఢచారి లాంటి వాడు అని రుజువై వదిలేశారు .స్విట్జర్లాండ్ కు వెళ్ళాడు లెనిన్ .
మొదటి ప్రపంచ యుద్ధం అంతర్జాతీయ సోషలిజాన్ని దెబ్బ తీసింది .మార్క్సిజం ప్రకారం అలాంటి యుద్ధం కార్మిక పోరాటాన్ని ప్రతి కాపిటలిస్ట్ దేశం లోనూ బలీయం చేస్తుంది .కార్మికులు సంఘటితమై ఆ ఘర్షణలో పాల్గొని చివరికి విప్లవ అంతర్యుద్ధాన్ని సృష్టిస్తారని భావించింది .కాని అలాంటిది ఏదీ జరగ లేదు .జర్మన్ సోషలిస్ట్ లు తమ దేశపు మిలిటరీ లక్ష్యాలను సమర్ధించారు .ప్లేఖ నోవ్ పూర్తిగా లెనిన్ నుంచి విడిపోయి రష్యన్ సోష లిస్టులు రష్యా యుద్ధాన్ని సమర్ది౦చాలన్నాడు .లెనిన్ లాంటి కొద్దిమందిమాత్రం గట్టిగా నిలబడ్డారు .లెనిన్ మాత్రం ప్రతి దేశం లోని బీద పోరాడే జనం అంతా జాతీయతను ఎదిరించి సోషలిజం యొక్క అంతిమ విజయానికి తోడ్పడాలని ప్రకటి చాడు .అదే ‘’ప్రపంచ కార్మికు లారా ఏకం కండి ‘’అనే నినాదం .లెనిన్ ను సమర్ధించిన వారు ఒక్క బోల్షి విక్కులు మాత్రమే .దీని పర్యవసానం అయిదుగురు బోల్షెవిక్ ల ప్రవాసమే .
అంతర్జాతీయ విప్లవం రావటం అసాధ్యం అని గ్రహించి లెనిన్ రష్యా దేశ పేద ప్రజలు రష్యా కోసం ఏమి చేయాలో ఆలోచించాడు .రష్యాలో దిగజారిన పరిస్తితులు ఆయనకు కలిసొచ్చాయి .దేశం తన సైన్యాన్ని సరైన విధానం లో ఉంచ లేక పోతోంది .సైన్యానికి కడుపు నిండా తిండీ ఒంటినిండా బట్టా కూడా ఇవ్వలేక పోయింది .వ్యాపారులు విపరీతంగా లాభాలు గడిస్తున్నారు .కార్మికుల స్థితి సంస్కరణ నాటి కంటే దిగ జారి పోయింది .హిస్టీరియా రాజ్యమేలుతోంది .జార్ రాజు నికొలాస్ జర్మనీతో విడిగా శాంతి ఒడంబడిక కుదుర్చుకొన్నాడు .ఇది కోర్టు అరిస్టో క్రాట్ లను జాగృతం చేసింది .యుద్ధంవలన విపరీతంగా వాళ్లకు డబ్బు అందుతోంది .కనుక దోపిడీ దారులు ,తిరుగు బాటు దారుల పైకి వెళ్ళకుండా సైన్యం యుద్ధం లో ఉంటేనే తమకు మేలు అను కొన్నారు .ముగ్గురు నోబుల్స్ 1916 డిసెంబర్ 16న రాజరికానికి వెన్ను దన్నుగా ఉండి నడిపిస్తున్న పూర్వపు మాంక్ రాస్పుటిన్ ను హత్య చేయటం తో తో వీళ్ళ అసంతృప్తి పెరిగిపోయింది .దీనితో సంఘం, రాజ్యం లలో పతనం పరా కాష్ట కు చేరింది .విప్లవానికి సర్వం సంసిద్ధంగా ఉంది .1917 ఫిబ్రవరి 23న సెయింట్ పీటర్స్ బర్గ్ లోని మిల్లు మహిళా కార్మికులు సమ్మె చేశారు .పురుష కార్మికులు వారికి సపోర్ట్ గా వీధుల్లోకి వచ్చారు .అనేక పరిశ్రమలు మూతపడ్డాయి ట్రాఫిక్ ఆగి పోయింది .పోలీసులు జనాన్ని లాఠీలతో విపరీతంగా బాదిపారేశారు .పోరాటం ఆవేశా కావేషాలకు గురైంది .సైన్యాన్ని పిలిపించారు.రక్షక దళం ,కొస్సాక్ దళాలుపోలీసులకు వ్యతిరేకంగా ప్రజల వైపు నిలబడి పోరాడాయి .అయిదవ రోజు న ప్రజలు విజయం సాధించి విప్లవానికి ముగింపు పలికారు .ఎంతోకాలంగా ఎదురు చూసిన విప్లవ౦ రానే వచ్చింది విజయం పొందింది. కాని దీనిని సంఘటిత పరచి నడిపే నాయకుడు లేక పోయాడు. కార్మికులు, సైనికులు కలిసి తమ ప్రతినిధులను సోవియెట్ కోసం ఎన్ను కొన్నారు. ఇంతలో డ్యూమా ప్రవేశించి వాళ్ళతో కలిసి పని చేస్తానని అన్నాడు .ఒక ప్రాదేశిక ప్రభుత్వం ఏర్పాటై ౦ది కాని అందులో సోవియెట్ లకు ప్రాతినిధ్యమివ్వలేదు మంత్రులలో ఒకడైన కేర్నేస్కి అధ్యక్షుడై,జార్ ను పదవీ త్యాగం చేయాలని పట్టు బట్టాడు .తన ప్రభుత్వం మిత్ర దేశాలతో (అల్లీస్ )కలిసి యుద్ధం కోన సాగిస్తుందని ప్రకటించాడు .
లెనిన్ కు ఈ విప్లవ విజయ వార్త ఒక నెల తరువాత కాని తెలియలేదు .తన మాతృదేశం రష్యాకు తిరిగి వచ్చేద్దామనుకొన్నాడు కాని రష్యా తో సహా ఏ మిత్ర రాజ్యమూ లెనిన్ రాకను సమర్ది౦చ నే లేదు .శత్రుదేశమైన జర్మనీ ద్వారా చేరాడు .జర్మన్లు లెనిన్ కు రష్యా యుద్ధం కొనసాగించటం ఇష్టం లేదని తెలిసి అనుమతించారు . మొదట సెయింట్ పీటర్స్ బర్గ్ చేరి ,ప్రాదేశిక ప్రభుత్వ విధానాలపై ,సర్దు బాట్లపై విరుచుకు పడ్డాడు .యుద్ధం నుంచి రష్యా వైదోలగాల్సిందే అని తీవ్రంగా హెచ్చరించాడు .ప్రజలందరూ లెనిన్ నే సమర్ధించి నిలిచారు .మళ్ళీ ప్రదర్శనలు నినాదాలు ,తిరుగుబాట్లు .కేర్నేస్కి ప్రభుత్వం లెనిన్ జర్మనీతో కలిసి కుట్ర చేస్తున్నాడని ఆరోపించింది మళ్ళీ అజ్ఞాతం లోకి వెళ్లి సమయం కోసం ఎదురు చూశాడు .జనరల్ కోర్నిలోవ్ మిలిటరీ డిక్టేటర్ షిప్ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం లో ఉండగా,కేర్నేలోవ్ ప్రభుత్వానికి పట్టు సడలి బలహీనమైనది .దీనితో బోల్షెవిక్ ల ప్రాధాన్యత ,కంట్రోల్ విపరీతంగా పెరిగింది. సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఒక భవనాన్ని బోల్షెవిక్ లు ఆక్రమి౦చి ,ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోగా ,లెనిన్ రంగ ప్రవేశం చేసి ,దళాల బలాలను సమీక్షించి దెబ్బ తీయాలని ప్రయత్నించాడు .జూలియన్ కేలండర్ ప్రకారం 25-10-1917న జరిగిన ఈ సంఘటననే అక్టోబర్ విప్లవం అన్నారు .మన కేలండర్ ప్రకారం విప్లవం జరిగిన తేది నవంబర్ 7.దీనితో రష్యా అంతటా సోవియెట్ లందరూ ఏకమై సోవియెట్ కాంగ్రెస్ గా పిలువ బడ్డారు .ఈ పేరుతోనే లెనిన్ అధ్యక్షుడయ్యాడు .స్టాలిన్ సభ్యుడుగా ఉన్న బోల్షెవిక్ పార్టీ కేంద్ర నాయకత్వం సంస్థాగత నిర్మాణ వ్యవహారం చూసింది .మెన్షెవిక్ ల నుండి విడిపోయిన ట్రాట్ స్కి మళ్ళీ లెనిన్ తో చేతులుకలిపాడు మిలిటరీ దాడులకు నాయకత్వం వహించాడు .కొన్ని వీధి పోరాటాలు సాగాయి .పది రోజుల విప్లవ పోరాటం అంతకు ముందు జరిగిన వాటితో పోలిస్తే అతి తక్కువ రక్త పాతం తో విజయం సాధించి చరిత్రలో లెనిన్ పేరును అక్టోబర్ విప్లవాన్ని చిరస్మరణీయం చేసింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-16-ఉయ్యూరు