నాద యోగం -1

నాద యోగం -1

పరిచయం

ఆత్మజ్ఞానం పొందటానికి కర్మ ,భక్తీ ,జ్ఞాన ,రాజ ,లయ యోగాలను మహర్షులు చెప్పారు .చివరిదైన లయ యోగాన్నే నాద యోగం అంటారు .అరాచకం అస్తిరత్వం ఉన్న ప్రపంచం లో నాదయోగమే అన్నిటికంటే ఎక్కువ సత్ఫలితాల నిస్తుంది .అది మనిషి శారీరక బౌద్ధిక ఆధ్యాత్మిక సమతా స్థితి ని సమ బుద్ధిని కల్పిస్తుంది .ఆధ్యాత్మిక ప్రకాశానికి నాద యోగం కొత్త క్షితిజ సమా౦తరాలలోకి ప్రవేశం కల్పిస్తుంది .నాదయోగం  ఆసక్తి  ,స్పూర్తి , ,పునర్జీవనం , ఉపశమనం కలిగించే  గొప్ప సాధన  .నాద యోగ సాధన చేస్తుంటే చాలా వింత ,ఆనంద దాయక ,ప్రేరణలనిచ్చే  శబ్దాలు బయటి ను౦౦డికాక అంతరింద్రియాలలో వినిపించి దివ్యాను భూతిని కలిగిస్తాయి .దీనివలన ఆనంద మూలకారణం  బాహ్య ప్రపంచం లో లేదని ,మనలోనే ఉన్నదని గ్రహింపు కలుగుతుంది .

భారత దేశం లో నాద యోగ సాధన ప్రక్రియలలో   రాదాస్వామి ,కబీర్ పంది ,ముస్లిం ఫకీర్ పధ్ధతి ,మార్మిక సాధన  మొదలైనవి ఉన్నాయి .దీనినే బైబిల్ ‘’దేవుని మాట ‘’(వర్డ్ ఫ్రం గాడ్ )అన్నది .నాద బిందు ఉపనిషత్ ,ధ్యాన బిందు ఉపనిషత్ ,యాజ్న వల్క్య సంహిత ,శివ మహా పురాణం ,హఠ యోగం ,స్వామి స్వాత్మానంద గారి ప్రదీపిక మొదలైన గ్రంధాలు నాద యోగ వైశిస్ట్యాన్ని తెలియ జేశాయి .నాద బిందు ఉపనిషత్ –‘’సర్వ చి౦ తాంసముత్సుజ్య సర్వ చేస్టా వివర్జితః –నాద మేవాను సందు ధ్యాన్నాదే చిత్తం విలోయతే ‘’అన్నది .ధ్యాన బిందు ఉపనిషత్ –‘’’’అనాహతం తు యచ్చబ్దం తస్య శబ్దస్య యత్పరం –తత్పరం విదంతే యస్తు స యోగోచ్చిన్నా సంశయః ‘’అని చెప్పింది .యాజ్నవల్క్య స్మ్రుతి –‘’వీణా వాదన తత్వజ్ఞః శృతి జాతి విశారదః –తాలజ్ఞశ్చా ప్రయాసేన మోక్ష మార్గ స గచ్చతి ‘’అంటే ,హఠ యోగ ప్రదీపిక –‘’అభ్యస్య మానో నాదోయం బాహ్య మావ్రు శ్రుతే ధ్వనిం –పత్తాద్విత్తేప మఖిలం జిత్వా యోగీ సుఖా భవేత్ ‘’అనగా ,శివ పురాణం –‘’న సుశ్రోతి యదా శ్రున్వయో మాభ్యసేన దేవికే –మ్రియతే మ్యసమానాస్తు యోగీ తిస్టే చ్చివానిశం-తస్మా దుత్పద్వే శబ్డా  మృత్యు జిత్స ప్యాభి ధ్వనైః’’ అని చెప్పింది .ఈ విధంగా నాద యోగ సాధన చాలా స్పూర్తిదాయకంగా ఉండటం వలన దాన్ని వదిలి పెట్టాలని ఎవరూ అనుకోరు.

నాద యోగ విశేషాలు

ధ్యాన సాధనలో ఏ ప్రక్రియ అయినా ఇంద్రియ జ్ఞానాన్ని పూర్తిగా తొలగించే దానినే’’ లయ యోగం ‘’అన్నారు లయ యోగ సాధనకు చాలా విధానాలు చెప్పారు .అందులో నాదయోగం ఒకటేకాక అతి ముఖ్యమైనది .అంతమాత్రం చేత నాద యోగం ఒక్కటే లయ యోగానికి సాధనా మార్గం అని భావించ రాదు .అంతర్ మౌనం కూడా ఇదే ఫలితాన్నిస్తుంది .హఠ యోగులలో శ్రేష్టుడు ఘేరండ రుషి మొదలైన వారు లయ యోగ సాధనకు హఠ యోగం కూడా ఒక మార్గమే అన్నారు .ప్రాణాయామం కూడా  బాహ్య స్మృతిలేని మానసికావస్తను కలిగిస్తుంది .కనుక నాదయోగం లయ యోగ సాధనలో ఒక మార్గం అని గుర్తించాలి .నాద యోగం ఒక్కటే లయ యోగ సాధనకు మార్గం కాదని మరొక్క సారి తెలుసుకోవాలి మనం .ఈ యోగాన్ని మొదట చెప్పినవాడు పరమేశ్వరుడు .నద్ అనే సంస్కృత పదానికి అర్ధం ప్రవాహం .కనుక నాద యోగం అంటే ‘’చేతన ప్రవాహం ‘’అని అర్ధం. చేతనాలహరి అనచ్చు .మామూలు భాషలో నాదం అంటే శబ్దం .

నాద దశలు

శబ్ద ఉత్పత్తిలో నాలుగు దశలున్నాయి  .ఇవి ఆ శబ్దాల పౌనః పున్యం అంటే ఫ్రీక్వెంసి ,సూక్ష్మత ,మోటుతనాలను   బట్టి ఏర్పడ్డాయి .ఆ నాలుగు దశలే 1-పరా 2-పశ్యన్తి 3-మధ్యమ 4-వైఖరి .వీటిని శాస్త్రీయ విధానం లో విశ్లేషించి తెలుసుకోవాలి .

1-పరా నాదం –

అధిక ఫ్రీక్వెంసి కలిగిన  సర్వో త్కృష్ట శబ్దానినే  పరానాదం అంటారు .ఇది ఇంద్రియాలకు, బుద్ధికి అందదు వినిపించదు .పరా అంటేనే అవతలి అని అర్ధం .అంటే మనకు అందుబాటులో లేనిది .కనుక పరానాదం అంటే ఉత్క్రుస్టనాదం . దీనినే ఇంగ్లీష్ లో transcendental అంటారు .దీనివలన మనకు మన చేతనను దాటి అతి చేతనమైన ఒక ఆవరణ ఉన్నదని ,అక్కడ శబ్దం వేర్వేరు పరిమాణాలలో వినిపిస్తుందని గ్రహించాలి . ప్రతిస్వరానికి  ప్రతి సెకండుకు అనేక రీతులలో మారే కంపనాలు౦ టాయని శాస్త్రీయ సంగీతం నేర్చిన వారికి తెలుసు .అవి పొడవు ,వేగం స్థాయి లలో తేడాలుగా ఉంటాయి .ధ్వని తరంగాలను రికార్డ్ చేసే సాధనాల వలన వీటిని తెలుసుకోవచ్చు .భారతీయ సంగీతం లో కంపనాలను’’ ఆందోళనలు’’ అంటారు .ఒకసెకను కాలం లో శబ్దం అనేక వేల కంపనాలను చేయచ్చు .కానీ ఒకనిర్దిస్ట గరిష్ట పరిమితి దాటినా కంపనాలు మనకు వినిపించవు . .మన చెవులు వాటిని గ్రహించ జాలవు .కనుక విశ్వం లో ఉన్న అన్ని శబ్దాలను మనం గ్రహించలేము వినలేము కూడా .ఎక్కువ ఫ్రీక్వెంసి లో లయాత్మకంగా ఉన్న శబ్దాలు చివరికి నిశ్శబ్దాన్నే ఇస్తాయి .చెవులు వినగలిగిన శబ్ద పరిమితి దాటిన ఏ శబ్దమూ మనకు వినిపించదు .అలాంటి శబ్దాన్ని సృష్టిస్తే ఎవరూకూడా దాన్ని విశ్లేషించి అర్ధం చేసుకోలేరు .

ఇలాంటి హై ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దమే పరా అంటే .అనేక గ్రంధాలు పరా శబ్దానికి కంపనలే లేవు అని తెలియ జేశాయి .కనుక పరానాదానికి కదలికలు ఫ్రీక్వెన్సీలు ఉండవు .కాని అది శబ్దమే .కదలిక లేని శబ్దాన్ని మనం వినలేము .శబ్దం తారా స్థాయికి వెడితే (హై పిచ్ )అది అకస్మాత్తుగా నిశ్శబ్దం అవుతుంది .అదే పరా నాదం .ఉపనిషత్తులు ఓంకారం పరానాదం నుండి జనించింది అని చెప్పాయి .మనం ఉచ్చరించే ఓం పరానాదం కాదు .కారణం ఈ ఓంకారం మనం చేస్తూ వింటాం కనుక.  వినబడే ఓంకారం సర్వోత్క్రుస్ట నాదం కాదని గ్రహించాలి .కాని పరా అనేది కాస్మిక్ ,ట్రాన్సెన్ డెంటల్ శబ్దం.  దానికి ఏ రకమైన కదలికా ఉండదు .అది నిశ్చలం, అనంతం కూడా .దానికి ఆకారం కాంతి కూడా ఉన్నాయి .దాని ఆకారం ‘’జ్యోతిస్వరూపం ‘’.అది మనం వినే,అనుభవించే  అన్నిరకాల ధ్వనులకు భిన్నమైనది .దీనినే ఉపనిషత్ ‘’అదే ఓం .ఆనాదమే ఓం ‘’అన్నది .

Inline image 1 Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-23-3-16-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.