నాద యోగం -3
విశ్వం –నాదం
నాద యోగుల భావనలోను ,నాద యోగ గ్రంధాలలోను’’ నాదబ్రహ్మ’’ .లేక పారమార్ధిక నాదం నుండే సకల సృష్టి ఆవిర్భావం జరిగిందని ఉన్నది .ప్రపంచం అంటే శబ్ద కంపనాల ప్రాక్షేపణ(ప్రొజెక్షన్ )అని నాద యోగుల విశ్వాసం .ఈ నాద ప్రకంపన వలననే సకల చరాచర సృష్టి ఆవిర్భవించింది .బైబిల్ లో కూడా దీనికి సాక్ష్యం ఉంది .’’మొదట శబ్దము ఉండెను .అదే దేవునిదై ఉండెను ‘’.ఈ మాటయేశబ్దం లేక నాదం . ఇండియాలోని సూఫీలు దీనినే ‘’సూరత్ ‘’అంటారు .సురత్ –శబ్ద –యోగం నాద యోగ సాధనకు మరొక పేరు .ముస్లిం మత పెద్దలు వేదాంతులు కూడా శబ్దం ,రూపం లనుండే సృష్టి ఉద్భవమైనదని అన్నారు .5జ్ఞానేంద్రియాలు ,5కర్మేంద్రియాలు ,5జ్ఞానేంద్రియాలు ,4 విధాల మానసిక వృత్తులు ,3గుణాలు అన్నీ ఒక ఒక విశ్వ నాదం నుండి ఆవిర్భ వి౦చాయని నాద యోగులు భావిస్తారు .అంటే ప్రక్రుతి ,భౌతిక ,మానసిక బౌద్ధిక విశ్వాలన్నీ నాద బ్రహ్మ నుండే ఉద్భవించాయి .ఇదే నాద యోగులందరి ఏకాభిప్రాయం .కనుక కంపనాల వలన అది ఏర్పడిందన్న సత్యాన్నినాద యోగి నమ్ముతాడు ,ఈ కంపనాలు ఒకో సారి అసలు కంపించక పోవటం లేక అధిక తీవ్ర ఫ్రీక్వెన్సీలలోమానవ ఇంద్రియాలు అందుకోలేని విధంగా కంపించటం జరుగుతుంది .
శాశ్వత ,మూల నాదం కు అత్యంత గరిష్ట ఫ్రీక్వెన్సీ ,కంపనాలు ఉంటాయి .ఏ వస్తువైనా విపరీతమైన ,ఊహింప రాని వేగం తో కంపిస్తే అది చివరికి చలనం లేనిది అవుతుంది .కనుక కదలిక లో,కంపనలో గరిష్ట బిందువు వద్ద ఏర్పడేది నిశ్చలనమే .ఈ నిశ్చలనమే సకల చరాచర సృష్టికి మూల కారణ హేతువౌతుంది .
నాద యోగుల భావనలో ఈ విశ్వం లో ప్రతిదీ శాశ్వత ,అనంత నాదం నుండే పుట్టి ,పరిణామం చెందుతుంది .ఈ విషయాలపై పూర్తీ పరిజ్ఞానం పొందాలంటే నాద బిందు ఉపనిషత్,మరియు హంసోపనిషత్ లను పూర్తిగా అధ్యయనం చేయాలి .ఇవికాక అనేక మత సంస్థలు నాద యోగశాస్త్రం పై ప్రత్యేక అధ్యయనం చేసినవి ఉన్నాయి .అందులో ఇండియాలో అందరినీ బాగా ఆకర్షించినది ‘’రాదాస్వామి మతం ‘’.
సంగీతం కూడా ఆ నాదం యొక్క భౌతిక రూపమే .స్వచ్చమైన మంత్ర౦ కూడా ఆ నాదం యొక్కఅభివ్యక్త రూపమే (మాని ఫెస్టే షన్) .శరీరం లోని ప్రాణ స్పందనలు కూడా నాద వ్యక్తీకరణలే .నాద యోగ సాధన ముఖ్యోద్దేశం ప్రాధమిక, మూల, అత్యుత్తమ ,అంతిమ ,అంతర్నాదం, శబ్దం ,పదాన్ని కనుగొనటమే .ఈ శాశ్వత అభౌతిక నాదాన్ని అన్వేషింఛి తెలుసుకోవటానికి విధానాన్ని స్థూలం నుండే ప్రారంభించాలి .చివరికి ఆ అనంత శాశ్వత పారమార్ధిక మానసిక నాద దర్శన కోసం మన చేతన ప్రభావాన్ని దాటి మరింత లోతుగా వెతకాలి .
నాద కేంద్రం
పారమార్ధిక నాదానికి కేంద్రం ఎక్కడుంది ?భక్తులు అనాహతం లో ఉన్న ఇష్టమే దీని కేంద్రం అంటారు .యోగులు ఆజ్ఞాచక్రం లో ఈ కేంద్రం ఉందని వెతుకుతారు .వేదాంతులు సహస్రారం లో హిరణ్య గర్భునిలో కేంద్రముందని అన్వేషిస్తారు .అలాగే నాద యోగులు బిందువులో ఈకేంద్ర దర్శనం కోసం సాధన చేస్తారు .ఇంతకీ బిందువు అంటే ?నిరంతరమై ,శాశ్వత మై ,వినిపించని కనిపించని ,తెగని అంటే అవిచ్చిన్న అజేయ నాద కేంద్రాన్నే బిందువు అన్నారు .కనుక నాదాన్ని కనుక్కోవాలి అంటే ముందుగా ప్రాధమికంగాను ,అ౦తిమం గాను బిందువును గుర్తించాలి .
ఈ శాస్త్రపు లోతులను తరచటానికి వెళ్ళే ముందు సాధకుడు నాదం యొక్కశాబ్దిక , మానసిక ,అతీంద్రియ ఖగోళ ,భౌతిక ,బౌద్ధిక స్వభావాలను తీవ్రంగా అన్వేషించి తెలుసుకోవాలి .అంతరాత్మ చివరగా అసలైన మూల నాదం తో శృతి చేయటానికి ముందు గా ,అతీంద్రియ ,అభౌతిక శబ్దాలను తెలుసుకోవటానికి నాద యోగులకు అనేక పద్ధతులను ప్రవేశ పెట్టి వివరించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-3-16-ఉయ్యూరు .