నాద యోగం -5
నాద యోగి ఆహారం
తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే నాద యోగి తీసుకోవాలి .రక్తాన్ని అధిక ప్రవాహంగా వేగంగా మెదడుకు పంపే ఆహారం తినరాదు.అధిక రక్త పోటు ను కలిగించే ఆహారం విసర్జించాలి సాధారణ పోషక విలువలతో శరీర కార్యకలాపాలను నిర్వర్తించ డానికి మాత్రమే ఉపయోగపడే పదార్ధాలు భుజించాలి .
సంగీతం –నాద యోగం
సంగీతం కూడా నాద యోగమే .సంగీతం లో నాదాన్ని శాస్త్రీయంగా ,అత్యుత్తమంగా పలుకుతారు .పూర్వపు సంగీత విధానాలలో నాద యోగ సాధన విధానాలనే అనుసరించేవారు .అందరికి తెలిసిన అతి ప్రాచీన సామవేదాన్ని అతి శాస్త్రీయంగా నిర్దుష్టంగా నాద యోగ సాధనకు అనుగుణంగా గానం చేస్తారు .ఈ సాధనలో ప్రాణాయామం అతి ప్రాధమిక ,ముఖ్యమైన విధానం .
అనేక దశల చేతన అవగాహనలో ,మనసు తేలికగా వివిధ నాద తరంగాలతో ఆకర్షింప బడుతుంది .వీటిలో కొన్ని కంపనాలు ఒక్కో సమయం లో అంగీకారంగా ఉండవు .కొన్ని నాద కంపనాలు పగలు ఒక నిర్దిష్ట సమయం లో ఆహ్లాదాన్నిస్తాయి .కొన్ని రకాల నాద సమ్మేళనాలు కొంతమందికి ఇష్టమైతే ,మరికొందరికి అయిష్టంగా ఉంటాయి సంగీతం లోని ఈ నాద కంపనలనే రాగాలు లేక సంగీత స్వరాలు అంటారు .తక్కువ కంపనాలతో ఉన్న రాగం కొందరికి రుచించదు .భారతీయ ఉదయరాగమైన భైరవ రాగం కొందరికి అభిరుచికలిగిస్తే కొందరికి కలిగించదు.కొందరు అర్ధ రాత్రి సంగీతమైన మాల్కోస్ ,దుర్గ ,లేక జోగీయ రాగాలంటే చెవి కోసుకొంటారు .సాయంకాల రాగాలైన భీం పలాస్ వంటివి కొందరికి మహా ఇష్టం.లేత వయసు ఆడ ,మగ పిల్లలు భైరవి రాగాన్ని అమితంగా ప్రేమిస్తారు .కనుక మనసు వివిధ శబ్ద తరంగాలకు బహువిధంగా స్పందిస్తుంది అని రుజువైంది . ప్రాధమిక ఆహ్లాదకర , ఆధ్యాత్మిక,ఆసక్తికర ,స్పూర్తిదాయక నాద యోగ సాధనగా ,దానితో మనసు ను అతి సూక్ష్మ కంపనాలతో శృతి చేయటానికి,దానికి ముందు కొనసాగించే చివరి పారమార్ధిక నాద శబ్ద అన్వేషణ కోసం సంగీతాన్ని స్వీకరించ రాదు .
నాదయోగానికి కాలం -పరిమితి
నాద యోగ సాధన కాలం –ఎప్పుడు స్వేచ్చగా ఉంటె అప్పుడే నాద యోగాన్ని సాధన చేయ వచ్చు .మొదటి సారిగా సాధన ప్రారంభించేవారు అర్ధ రాత్రి నుండి రాత్రి రెండు గంటల వరకు సాధన చేయాలి .అర్ధరాత్రిలో బాహ్య శబ్దాలవలన ఆటంకం తక్కువ గా ఉంటుంది .వాతావరణం లో కాంతి లేక పోవటమూ దీనికి బాగా సహకరిస్తుంది .అర్ధరాత్రి వేళ ,కాంతి లేని సమయం రెండూ కూడా అంతరింద్రియ జ్ఞానానికి పూర్తిగా తోడ్పడుతాయి .
నాద యోగ సాధనలో జాగ్రత్తలు
నాగ యోగ సాధన ఏదో ఒక రకమైన శబ్దాన్ని సృష్టించటం కాని వ్యక్తం చేయటం కాని జరగవచ్చునని తెలుసుకోవాలి .ఒక్కోసారి సాధకుని మెదడు బలహీనమైనపుడు అతని చెవులలో రోజంతా రణ గొణ ధ్వనులు వినిపించే అవకాశం ఉంది .మరో సారి గంటల శబ్దమో మరేదో వింత ధ్వని యో వినిపించ వచ్చు .అభ్యాస ప్రారంభ సమయం లో ఇలా ఏదో ధ్వని చెవులలో మోగుతూ అతని ఏకాగ్రతకు భంగం కలిగించవచ్చు .మనసుకు ఈ శబ్దాలు ఎక్కువకాలం ఇబ్బంది కలిగిస్తే ,ఆహార విధానం మార్చుకొని వెంటనే సాధనను విరమించాలి. నాద యోగ సాధనలో వినిపించాల్సింది అంతర్ నాదమే కాని బాహ్య శబ్దాలుకావు అని గ్రహించాలి .అయితే అంతర్ నాదాలు క్రమంగా దశల వారీగా అభి వృద్ధి చెందుతాయి .అవి బాహ్య ప్రపంచం జాగ్రుతమై ఉండగా ఎప్పుడూ వినబడవని తెలుసుకోవాలి .
ఒక వేళ నాద యోగి రాత్రి పూట అభ్యాసం చేస్తుంటే వివిధ శబ్దాలు వినిపిస్తాయి .మర్నాడు ఉదయం సాధకుడు ఆఫీసుకో ఉద్యోగానికో క్లాస్ కో వెడితే అక్కడ గంట నాదం వినిపించి దాన్ని తప్పించుకోవాలనుకొంటాడు .తప్పించుకొనే ప్రయత్నం చేసినా శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి .మళ్ళీ ప్రయత్నిస్తే తక్కువ స్థాయి బజ్ శబ్దం వినిపిస్తుంది .ఒక్కోసారి తుమ్మెదల ఝంకారనాదం వినిపిస్తుంది .ఈ లక్షణాలు కనిపించినప్పుడు నాద యోగి సాధన మానేయాలి .నాదయోగి జాగృతావస్థలో స్వరం లేక ద్వనిని వినగలిగితే అతని సాధన పురోగమనం చెందిందని అనుకోవాలి .ఎవరో అతని చెవులలో గుసగుస లాడుతున్నట్లు భావిస్తాడు .ఇదొకరకమైన ‘’ సిద్ధి ‘’.అజ్ఞాత వ్యక్తీ ను౦డి వచ్చే నాదాన్ని వినగలగటం అన్నమాట .
ఇండియాలో బాగా వికాసం చెందిన’’కర్ణ పిశాచి ‘’అనే తంత్ర శాఖ ఒకటి ఉంది .దీని అర్ధం ‘’చెవిలోని దెయ్యం ‘’అని .కర్ణ పిశాచాలను కొందరు అత్యంత కష్ట, వేదన సమయాలలో సంప్రదిస్తారు .వాళ్ళు చేతిలో ఒక గంట లాంటి దాన్ని పట్టుకొని ,దాన్ని మోగిస్తూ చెవి దగ్గర పెట్టుకొంటారు .కొంత సేపటికి వారికి ఒక ధ్వని లేక స్వరం వినిపిస్తుంది .వాళ్లకు ఏది వినిపించిందో ఏ గుస గుస అనుభూతమైందో అడిగిన వారికి తెలియ జేస్తారు .సాధకుడు సాధన సమయం లో తగినంత జాగ్రత్తలు తీసుకోక ఈస్థితిలో పడితే చివరికి చెవుడు కు దారి తీసే ప్రమాదం కూడా ఉంది . కనుక భారత దేశం లో కర్ణ పిశాచాలను వినటం చాలా కష్టం .వాటితో ఏమి మాట్లాడారో ఏమి చెబితే విన్నారో విని అర్ధం చేసుకోవటం చాలా కష్టం .
కర్ణ పిశాచి స్త్రీ కనుక పిశాచిని అంటారు ఆమె ఒక యక్షిణి .మంత్ర తంత్రాలతో ఆమెను ప్రసన్నం చేసుకొంటే భూత భవిష్యత్ వర్తమానాలను తెలియ జేస్తుందని నమ్మకం .కర్ణ పిశాచి ని కొన్నిమంత్రాలను లక్ష సార్లు జపం చేసి వశపరచుకొని సిద్ధి పొందుతారు .అందులో ఒక మంత్రం –
‘’అతి విపుల సుగాత్రం రుక్మ పత్ర స్తమన్నాం-సులలితాధిక నాదం పాణినా దక్షిణేన
కలశమమృత పూర్ణం వామ హస్తేదధానం –తరతి సకల దుఃఖ౦ వామనం భవ వేద్యహః ‘’
‘’ఓం హ్రీం చాచా స్వాహా ‘’తో అనుస్టిస్తారు .లోకం లో మనకు వినబడని మాటలు ఎవడికైనా వినిపిస్తే ‘’ఒరే!వాడికి కర్ణ పిశాచి ఉందిరా ‘’అనటం వింటూ ఉంటాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-3-16-ఉయ్యూరు