నాద యోగం -9
నాద యోగం –సంత్ కబీర్
సంత్ కబీర్ తన పదాలలో ఒకదానిలో నాద యోగాన్ని గురించి ‘’ఎవరు అక్కడ ఆకాశం మధ్యలో నుండి వేణుగానం చేసేదెవరు ?గంగా యమునా కలయిక స్థానం లో ,గంగా యమునా సరస్వతీ సంగమ స్థానమైన త్రివేణీ సంగమ ప్రాంతాన త్రికూటి లో బాసురీ వాదన చేసేదెవరు ?ఉత్తరాభిముఖంగా సమ్మోహన వేణునాదం వినిపిస్తోంది .గోపిక ఆ నాదాన్ని వింటోంది .సర్వ సృష్టీ ఆ నాద సుధారసం లో తడిసి ముద్దయిపోతోంది .మంత్రం ముగ్ధమై పోతోంది ‘’అన్నాడు .నాదయోగం లో చివరగా వినిపించేది వేణునాదం కంటే ఉత్కృష్టమైన నాదం .ఉన్నతోన్నత స్థాయిలో వేణు ,వీణా , మబ్బు ,పిడుగు ,కరతాళధ్వని కాని , ఏ వాయిద్య ధ్వనీ కాని ,ఇత్తడి వస్తువుల శబ్దం కాని వినిపించదు..అది ప్రాచ్య ,పాశ్చాత్య దేశాల సంప్రదాయ సంగీతమూ కాదు .ఆ పరమోన్నత స్థరంలో వినిపించేది ‘’అనాహద నాదం ‘’మాత్రమే .
అనాహద ,అనాహత నాదం
అనాహద నాదం అంటే ఏమిటి ?ఈ నాటివరకు అదేమిటో చెప్పగలిగినవారు ఎవ్వరూ లేరు .కొందరు దాన్ని విశ్వా౦తరాళ నాదమైన ప్రణవనాదం ఓంకారం అన్నారు .కాదు కాదు ,అది తుమ్మెదలు చేసే నిరంతర ఝంకార నాదాన్ని తలపించే భ్రామరీ నాదం అన్నారు మరికొందరు .ఇంకొందరు అదే ఖట్ ఖట్ మని నినదించే హృదయ స్పందనం అనాహద నాదం అన్నారు .
ఈ అనాహద నాదాన్నే కొందరు అనాహత నాదమన్నారు .రెండిటిలో అర్ధ భేదం ఉంది .అన్ +,ఆహతం =అనాహతం .అన్ అంటే కాదు అని అర్ధం. ఆహతం అంటే కొట్టటం ,సుత్తితో మోదటం ,దెబ్బ కొట్టటం అని అర్ధం .మొత్తం మీద దెబ్బ కొట్టటం వలన ఘర్షణ వలన వచ్చే శబ్దం కాదు అని అర్ధం .కనుక అనాహతం అంటే వస్తువుల పరస్పర ఘర్షణ వలన జనించే శబ్దం కాదని అర్ధం .ఎక్కడ శబ్దం ఉత్పత్తి అవాలన్నా రెండు వస్తువుల మధ్య పరస్పర రాపిడి లేక ఘర్షణ ఉండాలని మనకు తెలుసు .ఇదే ‘’ఆహత నాదం’’.అనాహతం అంటే రెండు వస్తువుల మధ్య పరస్పర ఘర్షణ వలన జనించిన శబ్దం కాదని స్పష్టమౌతోంది .అనాహతం సహజంగా(స్పాంటేనియస్ ) ,యాదృచ్చికంగా స్వయం చాలితమైన (ఆటోమేటిక్ )నాదం .కొందరు అనాహద నాదమని ఎందుకన్నారు ?అన్+హదం=అనాహదం.అన్అంటే కాదు అని అర్ధం .హదం అంటే సరిహద్దు (బౌండరి ).ఈ రెండూ కలిస్తే సరిహద్దులు లేని నాదమే అనాహద నాదం అని అర్ధమొస్తుంది .అంతులేని, హద్దు లేని ఏ నాదమైనా అనాహద నాదమే అవుతుంది .
నాద యోగం –మహర్షి గోరఖ్ నాద్
మచ్చేంద్ర ముని నాధుని మహా శిష్యులైన మహర్షి గోరఖ్ నాద్ ఆధ్యాత్మికతలో గురువును మించిన శిష్యులై విపరీతప్రచారం పొందారు .ఆయన ‘’సాదువులారా !’’సో –హం ‘’ను నిరంతరం జపించండి ఈ జపాన్ని మనసుతో చేయకండి .దానిని మీ అంతశ్చేతన తో చేయండి..అలా చేస్తే మీరు మీ దైనందిన జీవితం లో అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పటికీ మీ శ్వాస 24గంటల రోజులో నిమిషానికి 15నుంచి 19సార్లు ఉండేట్లు అంటే రోజుకు 21,600 సార్లు ఉండేట్లు జాగృతమవండి .అంటే మీ శ్వాస గంటకు 900సార్లు లేక ఆ పైన ఉండేట్లు చూసుకోండి . అప్పుడు అనాహద నాదం ఉద్భవించి(ఎమర్జ్ ) వ్యక్తమౌతుంది (మానిఫెస్ట్ ).వెన్నెముకలో కాంతి జ్యోతకమవుతుంది .సూర్య నాడి మేల్కొంటుంది .అప్పుడు వర్ణనాతీతమైన కంపించే నాదం మీ శరీరం లోని ప్రతి సూక్ష్మ రంధ్రం నుండి ఓం లేక సోహం లాంటి నాదం వినే అనుభూతికలుగుతుంది ‘’అని మహర్షి గోరఖ్ నాద్ నాద యోగాన్ని గురించి తన పుస్తకాలలో వర్ణించారు .
అంతిమ నాదం
ఉన్నత స్థాయి చేతనలో వ్యక్తమయ్యే నాదాన్ని గురించి మాటలలో వర్ణించి చెప్పలేము .అ నాదం ఆనంద మయ కోశం ఆవలి నుండి వస్తుంది. వ్యక్తిగత చేతన పూర్తిగా కరిగిపోయే నాదం లోని అత్యున్నత బిందువు నాద యోగికి అనుభవమౌతుంది .సాధకుడు నాదం లో తన ఉన్నత చేతనను గుర్తిస్తాడు .అప్పుడు ఈ విశాల విశ్వం అంతా ఆ నాదమే అని గ్రహిస్తాడు .
భారతదేశం లో నాద యోగం
భారత దేశం లో నాద యోగం లో అనేక శాఖలున్నాయి .వీటిలో –మహర్షి మేహిదాస్ శాఖ ,రాదాస్వామి శాఖ ,సంత్ కబీర్ పంధా చాలా ముఖ్యమైనవి .నాద యోగాభ్యాసం మంత్రం ,క్రియా యోగాలతో ప్రారంభమవుతుంది .సాధన ఆచరణలో సిద్ధాంతం లో యెంత చేసినా ఇంకా మిగిలే ఉంటుంది .అంటే అసంపూర్ణంగానే ఉంటుందన్నమాట .హఠ యోగం ధ్యాన యోగం ,రాజ యోగాలు సంపూర్ణంగా చెప్పబడి నిర్దుష్టంగా సూక్ష్మ విషయాలను కూడా తెలియ జేస్తూ రాయబడ్డాయి . కాని నాద యోగం అలా చేయబడలేదు .కనుక ఇంకా అసంపూర్ణమే అనాలి .ముస్లిం లలో ఒక తెగ వారు కూడా నాద యోగాన్ని సాధన చేస్తారు .నాగస్వరం తో పాములను అడి౦చే వారందరూ ఇండియాలో గొప్ప నాద యోగులుగానే పరిగణింప బడుతున్నారు .నాదయోగ శాఖలలో అదీ ఒక శాఖ గా గుర్తింపు పొందింది .
‘’ నాద యోగం’’ సంపూర్ణం
నాద యోగం రచనకు – నాద యోగం పై స్వామి సత్యానంద్ చేసిన ప్రసంగాలను ఆధారంగా ‘’మా యోగ శక్తి ‘’ రచించిన ‘’నాద యోగ ‘’అనే ఆంగ్ల గ్రంధం .
మా యోగ శక్తి గారు పరమహంస సత్యానంద గారి ముఖ్య శిష్యురాలు .12-4-1927 న జన్మించి 23-5-1961లో 37ఏళ్ళ కే సిద్ధిపొందారు .ఆమె అ౦తర్జాతీయ యోగాఫెలోషిప్ ఉద్యమం ,బీహార్ ,మధ్యప్రదేశ్ ,బాంబే స్కూల్స్ ఆఫ్ యోగా ,శివానంద పబ్లిక్ స్కూల్ ,మొదలైన వాటిలో పాల్గొన్నారు .యోగా వీక్లీ గెట్ టుగెదర్ ,సొసైటీ లను అంగోలా ,ముజఫర్ పూర్ లలో స్థాపించారు .బీహార్ లోని మాన్ఘీర్ లో .9నెలలపాటు ‘’యోగా టీచర్స్ ట్రెయినింగ్ కోర్స్ ‘’నిర్వహించి తన దార్శనిక ప్రతిభను నిరూపించారు .ఆధునిక మానవ మనసులపై యోగా అద్భుత ప్రభావం చూపించటానికి ఈ శిక్షణ బాగా ఉపయోగపడింది .గొప్ప విద్యావంతురాలైన’’ మా యోగ శక్తి’’ బీహార్ లోని చాప్రాలో ఉన్న జై ప్రకాష్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా సేవలందించారు .ఆమె అంతర్జాతీయ ప్రఖ్యాత మహిళామణి..ఆమె గొప్ప ఆచరణాత్మక మనస్తత్వశాస్త్ర. వేత్త .మహా యోగిని .అత్యున్నత ఆధ్యాత్మిక మహాత్మురాలు .యోగా పైనా అప్లైడ్ సైన్స్ పైనా ఇంగ్లీష్, హిందీలలోచాలా పుస్తకాలు రచించారు
.
సంత్ కబీర్ స్వామి శివానంద
స్వామి సత్యానంద మా యోగ శక్తి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-3-16-ఉయ్యూరు