అరణ్య పర్వాన్ని నన్నయ్యే పూర్తిగా రాశాడు
అని ప్రముఖకవి శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజిగారి బావగారు,ఆయనకు దీటైన కవిత్వం తో వర్ధిల్లుతున్న శ్రీ కోడూరు పాండురంగారావు గారు ఏ యూని వర్సిటీ కి పంపని తమ సిద్ధాంత వ్యాసం ‘’ఆదికవి –అరణ్య పర్వం ‘’గ్రంధం లో చాలా స్పష్టంగా ,ఉదాహరణ పూర్వకంగా తెలియ జేశారు .ఆజన్మ సిద్ధంగా వచ్చిన కవిత్వాన్ని శ్రీ వెంకటేశ్వర శతకం ,సాత్రాజితీయం వంటి కావ్యాలలోనూ తమ కుశాగ్ర బుద్ధిని జోడించి పండించిన విమర్శగ్రంధాలైన అశ్వమేధం మొదలైన వాటిలోనూ ,ఇప్పుడు ఈ గ్రంధం లోనూ వెలువరించి లోకానికి చాటారు .తెలుగు పండితుడు ,అర్ధ గణాంక శాఖలో చేరి , గణాంకాదికారిగా ఉద్యోగ విరమణ చేసిన శ్రీ రంగారావు గారు సాహిత్యాన్ని మాత్రం వదలలేదు ,’’పువ్వాడకు సరి జోడు –కోడూరు ‘’అనిపిస్తూ ,శ్రీనాధ ,పోతనల్లాగా సాహిత్య బావా మరుదులుగా ఉన్నారు .’’అశ్వ మేధం ‘’లో తన నిశిత పరిశీలనా దృష్టిని లోకానికి తెలియ జేసి ,ఇప్పుడీ ‘’అరణ్యం ‘’లో దర్జాగా నడిచారు .సరసభారతికి ఆత్మీయులైన శ్రీ కోడూరువారు 2015 జూన్ లో ప్రచురించిన ఈ పుస్తకాన్ని నాకు ఆత్మీయంగా సుమారు రెండు నెలల క్రితమే అందజేశారు .ఈ రోజే దాన్నిచదివి అందులోని అతి ముఖ్య విషయాలను మీకు అందిస్తున్నాను .
ఈ సిద్ధాంత వ్యాసం లో శ్రీ పాండురంగా రావు గారు ముఖ్యంగా భారత అరణ్య పర్వాన్ని నన్నయ భట్టు పూర్తిగా రాశాడని ,అందులో క్రిమి కీటకాదులచేత ధ్వంస మైన భాగాలను మాత్రమే ఎర్రనార్యుడు పూరించాడని అనేక ఉపపత్తులు చూపి వివరించారు .నన్నయ తన కర్త్రుత్వాన్ని ఉత్తమ పురుషలోకాకుండా ప్రధమ పురుషలోనే చెప్పాడని ,తిక్కన కూడా విరాట పర్వ ప్రారంభం లో ఇలాగే చెప్పాడని కనుక నన్నయ్యే ఆది సభా అరణ్య పర్వాలు మూడూ రాశాడని అన్నారు .విరాట పర్వం మొదలు మిగిలిన 15పర్వాలను ‘’తుదముట్ట ‘’తాను రచింప బూని నట్లు తిక్కన చెప్పినదానిలో మొదటి మూడు పర్వాలతో ఆగి పోయిన అసమగ్ర భారతాన్ని ,మిగిలిన 15పర్వాలు రాసి సంపూర్ణం చేయటమే తిక్కన లక్ష్యం అన్నారు .నన్నయకు,తిక్కనకు 150ఏళ్ళ అంతరం ఉంది .అంతవరకూ అరణ్య పర్వం జోలికి ఎవరూ పోక పోవటం అది సంపూర్ణంగా లభించటమే నంటారు .మారన మార్కండేయ పురాణం లోను ,కొరవి గోపరాజు ‘’సింహాసన ద్వాత్రి౦సిక’’లోను ,అప్పకవి ‘’అప్పకవీయం ‘’లోను ,నన్నయ మొదటి మూడు పర్వాలు రాసినట్లు చెప్పారన్నారు .తిక్కన ,ఆ తరువాతి కవులు అరణ్యం అసంపూర్తి అని చెప్పనే లేదని గుర్తు చేశారు .ఎర్రన అరణ్యాన్ని పూర్తి చేసినా తన పేరు చెప్పుకోక పోవటానికి కారణం అందులో 55% రచన నన్నయది అవటమే అంటారు .క్రిములు ధ్వంసం చేసిన భాగాలలో కొన్ని చోట్ల అక్షరాలూ కొన్ని చోట్ల పదాలు ,కొన్ని చోట్ల ఉపాఖ్యానాలు ఉండి ఉండవచ్చునని అభిప్రాయ పడ్డారు .’’రయ విచలత్తుర౦గ ‘’పద్యం సభా పర్వం లోను అరణ్య పర్వం లోకొద్ది మార్పు తో ఉంది .కనుక ఎర్రన అరణ్య పర్వ శేషాన్ని పూర్తిగా రాశాడన వచ్చుఅన్న .చాగంటి శేషయ్య ,దివాకర్ల వెంకటావధాని గార్లు అరణ్యం లో కొంత దోవ తప్పారన్నారు .నన్నయ అరణ్య పర్వం సుమారు రెండు వందల ఏళ్ళు సురక్షితంగానే ఉంది .తర్వాత అక్కడక్కడ శిదిలమైతే ఎర్రన పూరించాడు .
భారతం అంటే సూర్య ,అగ్ని చంద్రుల చేత నడుప బడే సృష్టి కి సంబంధించినది .భారతం 18పర్వాల బృహద్గ్రంధం .నన్నయ రాజా౦కితమ్ గా రచన చేస్తే ,తిక్కన హరిహరనాదునికి అంకితమిచ్చాడు .అంతకుముందు తిక్కన నిర్వాచనోత్తర రామాయణాన్ని మనుమసిద్ధి రాజుకు అంకితమిచ్చాడు .కనుక నరా౦కి తానికి తిక్కన విముఖుడుకాడు .నన్నయ అరణ్యాన్ని పూర్తిగా రాశాడు అంటే ఎర్రనను కించపరచటం కాని అతని సమర్ధతను శంకించటం కాని కాదు నన్నయతో సమానుడిని చేసి సన్మాని౦చటమే నంటారు రావు గారు .నన్నయ రాసిన అరణ్య పర్వ ఏడు ఆశ్వాశాలు తిక్కన వరకు ఉన్నాయి అని ఘంటా పదంగా చెప్పారు .ఎర్రన కవిత్వం నన్నయ కవిత్వం అంత ప్రౌఢమే అన్నారు .
ఎర్రన రామాయణం ,రాయల మదాలస చరిత్ర కాలగర్భం లో కలిశాయి .అరణ్య రచనలో ఎర్రన తన పేరు చెప్పుకోక పోవటానికి తాను నన్నయ్య కంటే అసమర్ధుడు అని భావించి మాత్రం కాదు ,నన్నయ్య గారి యెడల వినయమే .ఎర్రన తాత యెర్ర సూరి మనవడిని’’ నృసింహ పురాణం’’లో ‘’ప్రబంధ పరమేశ్వరుడు’’ అన్నాడు. దీనికి కారణం ఎర్రన అరణ్య పర్వ శేషోన్నయం వలననే అంటారు .ఇందులోనే ఆయన ప్రాభవశ్రీ గుబాళించింది .ఎర్రన రాసిన ఛందో గ్రంధం ‘’కవి సర్ప గారుడం ‘’కూడా లభించలేదు .’’ఎర్రన రచనలో మొదటిదే అరణ్య పర్వం ,అప్పటికి ఇంకను సంపూర్ణ ప్రత్యయ మేర్పడలేదు ‘’అన్న దివాకర్ల వారి మాట యదార్ధం కాదన్నారు రావూజీ .
అరణ్యం లో ఆశ్వాసాంత గద్యాలలో ఎర్రన పేరు రాసుకోలేదు .దీనికి కారణం ప్రతి ఆశ్వాసం లోనూ నన్నయ రాసినది కొంతైనా ఉండటమే .కనుక ఎర్రన అరణ్య పర్వ శేషాన్ని నన్నయ పేరుమీదే పూర్తీ చేశాడు .పెద్దన్న నన్నయ రాసింది ఉ౦ది కనుకే ‘’తద్రచన య కా ‘’పూరించాడు అంటే నన్నయ లాగానే రాశాడని అర్ధం .వ్రాశాను అనలేదు పూరించాను అన్నాడు జాగ్రత్తగా .నన్నయ రాయకుండా వదిలేసిన భాగాన్ని తాను వ్రాస్తున్నానని ఎర్రన ఎక్కడా చెప్పలేదు .అరణ్య పర్వం లోఉన్న 7 ఆశ్వాసాలలో మొత్తం పద్యాలు వచనాల సంఖ్య2890.అందులో నాలుగవ అస్శ్వాసం లోఉన్న 416పద్యాలలో నన్నయ గారు 142రాస్తే ,ఎర్రన 274రాసినట్లు చెప్పబడుతున్నాయి .5,6,7 ఆశ్వాసాలలోని 1320పద్యాలు ఎర్రన రాశాడు .ఇంతకు ముందు చెప్పినట్లు 4 ఆశ్వాసం లో ఎర్రనవి 274 .అంటే మొత్తం ఎర్రన రాసినవి 1594. మరి నన్నయ రాసినవి 1వ ఆశ్వాసం లో మొత్తం 400,2లో మొత్తం 355మూడవ ఆశ్వాసం లో మొత్తం 399, 4వ ఆశ్వాసం లో 142 రాశాడు .అంటే మొత్తం నన్నయవి 1296పద్య గద్యాలు అంటే ఆ పర్వం లో 44.8శాతం నన్నయవే .ఎర్రనవి 55.2శాతం పద్య గద్యాలు ఉన్నాయి .7ఆశ్వాసాలలో ఆశ్వాసాంత గద్యాలన్నీ నన్నయ పేరు మీదే ఉన్నాయి అని స్టాటిస్టిక్స్ తో శ్రీ పాండురంగా రావుగారు వివరం ఇచ్చారు .
ఆంద్ర మహా భాగవతం లో ఉన్న 8993పద్యాలలో పోతన్నగారు రాసినవి 7739పద్య గద్యాలు .అంటే 86.1శాతం .వెలిగందల నారయ ,గంగానార్యుడు ,ఏర్చూరి సి౦గనలు కలిసి 1254రాశారు అంటే 13.9శాతం .4స్కంధంవరకు ఆశ్వాసాంత గద్యాలు పోతన పేరు మీదే ఉన్నాయి .5లో రెండు స్కంధాలలో గంగానార్యునిపేర ,6వ స్కందాన్ని రాసింది ఏర్చూరి సింగన కనుక ఆశ్వాసాంత గద్యాలు సింగన పేరు లోనే ఉన్నాయి .సప్తమ అష్టమ నవమ దశమ స్కందాలు పోతనే రాశాడు కనుక ఆయన పేరుమీదే ఉన్నాయి .ఏకాదశ ద్వాదశ స్కందాలను వెలిగందల నారాయ రాశాడు కనుక ఆశ్వాసాంత గద్యాలు నారయ పేరనే ఉన్నాయి .కనుక ద్వితీయ స్కంధం ఒక్కటే పోతన ,నారయ రాశారు .మిగిలినవన్నీ ఏక కర్తృత్వం లోనే ఉన్నాయి .పోతన ప్రధమ స్కంధం నుండి ద్వాదశ స్కంధంవరకూ పూర్తిగా తానే ఆంధ్రీకరించాడు .కాని కొంతభాగం క్రిమి ధ్వస్తం కాగా గంగన, సింగన ,నారయలు మళ్ళీ రాశారు అని విశ్లేషించారు శ్రీ పాండు .11,12వ స్కందాలలో లో పోతన రాసింది ఏదీ లభ్యంకాలేదు కనుకనే నారయ తనపేరు రాసుకొన్నాడు .అలాగే గంగానా సి౦గనా చేశారు .
భాస్కర రామాయణం లోని 6కాండలలో 3వ కాండ మాత్రమే హుళక్కి భాస్కరుడు రాశాడు .1,4,5లను మల్లికార్జున భట్టు ,2ను కుమార రుద్రా దేవుడు ,6ను అయ్యలార్యుడు రాశారు. అంటే , భాస్కరుడు మొత్తం 6కాండలు రాశాడు కాని 3వది తప్ప మిగిలినవి క్రిమి కీటకాలు భోంచేసి మిగల్చలేదు .అందుకని మిగిలిన వారు రాశారు. బహు కర్తృత్వం ఉన్నా భాస్కర రామాయణం అనే పేరు నిలిచింది .అని పరిశీలించి చెప్పారు కోదూరువారు
నన్నయ ప్రతిపర్వ ఆశ్వాసాంత గద్యాలలో అందులోని ప్రధాన కదాంశాలను చెప్పాడు. తిక్కన ,ఎర్రన తమ రచనలలో ఎక్కడా ఇలా చెప్పలేదు సాధారణంగా కవి తనకిష్టమైన పద్యాన్ని తనకావ్యం లో మరో చోటకూడా కొద్దిమార్పుతో చెప్పటం ఉంది. నన్నయ కూడా చేశాడు .విశ్వనాధ కూడా ‘’గిరికుమారుని ప్రేమ గీతాలలో ‘’చేశాడు .-కర్త్రుపద ప్రధమకు షష్టిచేసి చెప్పటం –అంటే ‘’నా నేర్చు ‘’వంటి పదాలు నన్నయకు అలవాటు .ఎర్రన రాసిన హరివంశాదుల్లో ఇలా చేయలేదు .
ఏతావాతా శ్రీ కోడూరు పాండురంగా రావుగారు నన్నయ భట్టే అరణ్య పర్వ 7ఆశ్వాశాలు పూర్తిగా రాశాడు .కాలగర్భం లో అందులోని ఉత్తరభాగంలో కొంత కొంత క్రిమికీటకాలు తినేయటం వలన వాటిని ఎర్రాప్రగడ పూరించాడు . తిక్కన విరాట పర్వం నుండి 15పర్వాలు రాశాడు .దీనితో సమగ్ర మహా భారతం 18పర్వాలు సంపూర్ణమై కవిత్రయ విరచితమై లోకం లో ప్రసిద్ధి చెందింది అని విస్పష్టంగా తేల్చి చెప్పారు .
ఈ సిద్ధాంతవ్యాసం ‘’ఆదికవి-అరణ్య పర్వం ‘’ ఏ యూని వర్సిటీ లోనో ఉండేవాళ్ళు చేయాల్సిన పని .సాహిత్యంపై అభిమానం, అభిరుచి ఉన్న శ్రీ కోడూరు పాండురంగారావు గారు ఎనిమిది పదుల వయసులో శ్రమించి విషయ సేకరణ చేసి ,పూర్వాపరాలను పరిశీలించి పరి శోధించి తన మేధస్సుకు, ‘’తానేర్చిన ‘’విద్యకు సార్ధకత కలిపించి ఆంద్ర సాహిత్యలోకానికి ఒక కొత్త ‘’వెలుగు శ్రీ’’ ని ప్రసాదించారు .రాసిన వారు, చదివిన మనం ధన్యులమవటం ఖాయం .
పుస్తకం కవర్ పేజీలు జత చేషాను చూడండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-3-16-ఉయ్యూరు
—
శ్రీ కోడూరు పాండురంగారావు గారు చేసిన కృషితో చాల విషయములు వెలుగులోకి వచ్చాయి. మీకు కృతజ్ఞతలు.