ఆ సంస్కారానికి నమస్కారం

ఆ సంస్కారానికి నమస్కారం

‘’శ్రీ హర్ష నైషధం –దర్శన పరామర్శ ‘’అనే సంస్కృత పరిశోధన గ్రంధాన్ని రాసి ,పి .హెచ్ డి.పొందిన  డా.శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారు సంస్కృతాంధ్రాలలో ఉద్దండ పండితులు .డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ ,డా .శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి ,తత్వ శాస్త్ర పారంగతులు శ్రీగరిమెళ్ళ సోమయాజులు శర్మగారు వంటి సంస్క్రుతంద్రాలలో లబ్ధ ప్రతిష్టులైన కవి పండితులకు గురుస్థానం వహించి కైమోడ్పు లందుకొనే సాహిత్యోపజీవి శాస్త్రిగారు . తల్లిగారు శ్రీమతి బాలమ్మగారువీరికి బాల్యం లోనే  అమర కోశం ,రమాయణ పారాయణం ఉపదేశించారు .కావ్య శాస్త్రాలలో సంప్రదాయ శాస్త్ర పద్ధతిలో పాఠం చెప్పి లోతులు తచి చూపించిన వారు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి  వరేణ్యు లు .’’పుత్ర సంజీవనం’’అనే సంస్కృత మహా కావ్యాన్ని రచించిన తండ్రిగారు  శ్రీ నారాయణ  శాస్త్రి గారు ఆది గురువులు .అది తమ అదృష్టపు తొలిదశగా  భావించారు శాస్త్రిగారు .

భాషా ప్రవీణ చదివే రోజుల్లో పూజ్య గురువులు ఉత్తర నైషద కావ్య కర్త శ్రీ మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారు .వీరి శిష్యరికం  ‘’జ్ఞానా౦జన శలాక తో చక్షురున్మీలనం చేసింది  ‘’అని కృతజ్ఞత చెప్పుకొన్నారు .ఇది  వారి విద్యాజీవితం లో రెండవ దశ అన్నారు .

కవి సమ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు విమర్శకునిగా రూపొందించారని ,మంచిమనిషిగా మలచిన వారు మిత్రులని ,మంచి ఆదర్శ ఉపాధ్యాయునిగా తీర్చి దిద్దినవారు తన విద్యార్ధులే నని ,వీరందరూ తన జీవిత మధ్య భాగాన్ని ప్రభావితం చేశారని కొండంత ఆనందం తో,వినయం తో  కృతజ్ఞతలు తెలుపుకొన్నారు .

బ్రహ్మశ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారు ‘’నైషద కావ్య రహస్యాలను ’’ వందలు,వేలు ‘’గా వివరించి జ్ఞాన జ్యోతిని ఉద్దీపనం చేయటమే కాక ,’’చింతామణి మంత్రం’’ఇచ్చి ఆశీర్వదించారు .ఈ ఆశీః ఫలితమే ‘’శ్రీ హర్ష నైషధం –దర్శన పరామర్శ ‘’అనే పరిశోధన గ్రంథమని అత్యంత వినయంగా చెప్పుకొన్నారు .కామ కోటి పీఠ పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల అనుగ్రహ భాగ్యం పొందిన ధన్యుడనని శాస్త్రిగారు చెప్పుకొన్నారు .ఈ అనుగ్రహానికి వేసిన చివురులే –ఆచర్యవర్యులు శ్రీ గాలి పార్ధ సారధి రావు ,శ్రీ బి ఏం చతుర్వేది ,ఆచార్య పుల్లెల శ్రీ రామ చంద్రుడు ,శ్రీ భాగవతుల కుటుంబ శాస్త్రి ,శ్రీ చెరువు సత్య నారాయణ శాస్త్రి ప్రభ్రుతుల శుభాశీస్సులను ఎన్నటికీ మరచి పోనీ సౌజన్యం వారిది .ప్రచారానికి ,ఆర్భాటానికి ,వేదిక లెక్కి సన్మానాలందుకోవటానికి ,పురస్కారాలు స్వీకరించటానికి వారు పూర్తిగా విముఖులు .

‘’నైషధీయ చరితామృతం ‘’అనే పుస్తకం లో శ్రీ హర్ష మహాకవి కవితా సామర్ధ్యాన్ని వివరిస్తూ చివరగా ‘’పవిత్ర మత్రాతనుతే జగద్యుగే స్మృతా రసక్షాలన ఏవ యత్కథా-కదం న సా మద్గిర మావిలా మపి స్వసేవినీ మేవ పవిత్ర యిష్యతి ‘’అనే శ్లోకం ఉదాహరించారు  .దాని అర్ధం ‘’నా వాక్కులు స్వచ్చాలు కావు ,కాని పుణ్యశ్లోకు డైననలుని కీర్తించటానికి పూను కొన్న వాక్కులివి .కలి  గ్రస్తమైన జగత్తు ను స్మరణ మాత్రం చేత పవిత్రం చేసే ఈ కద-నా వాక్కును పవిత్రం చేయ కుండా ఉంటుందా-అనే ధైర్యం నాకుంది .’’ ఈ శ్లోకం శ్రీ హర్షుడు ముందు చూపుతో నా వంటి వాడి కోసమే రాసి ఉంటాడు .ప్రస్తుతం ఇది నా వాక్యమే ‘’అన్నారు నైషధం పై పరిశోధన చేసి న విశ్లేషకులు శ్రీ శాస్త్రి గారు .ఇది వారి వ్యక్తిత్వానికి అన్నివిధాలా సరి పోలుతుంది .

ఇంతటి విశిష్ట వ్యక్తీ ,ఆచార్యులు ,అనుస్టానపరులు శ్రీ జయ సీతా రామ  శాస్త్రి  గారి తో నాలుగు నెలల క్రితం నాకు టెలిఫోన్ లో పరిచయం చేయించారు డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రిగారు .అప్పుడు వారితో మాట్లాడి,పరిచయం పొంది ,సరసభారతి పుస్తకాలు వారికి అందజేసి  వారినుండి వారివీ, వారి తండ్రిగారివీ అరుదైన గ్రంధాలను వారి నుండి అందుకొని ,ఆ తలిదండ్రుల సంస్కృత సాహిత్యసేవలను ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’రెండవ భాగం లో అంతర్జాలం లో రాశాను .ఈ విషయం వారికీ ఫోన్ లో నివేదించాను .చిరునవ్వే వారి సమాధానం .

సరసభారతి నిర్వహించే   శ్రీడుర్ముఖి ఉగాది వేడుకలలో వారిని ఆహ్వానించి సత్కరించాలని మనస్పూర్తిగా భావించి ఫోన్ చేశాను .’’నేను ఇలాంటి వాటికి దూరం గా ఉంటాను .వేదిక లెక్కను .సత్కారాలు అసలు నాకిష్టం లేదు ‘’అని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు .ఈ విషయం శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి చెవిలో ఫోన్ ద్వారా వేశాను. వారొక నవ్వు నవ్వి ‘’వారంతే.వారి సభల్లోనే వేదికపై కూర్చోరు .ప్రేక్షక స్థానం లోనే ఉంటారు .అయినా ప్రయత్నం చేశారు కదా .వారికిష్టం లేనిది మనం చేయరాదు ‘’అని సలహా ఇచ్చారు .ఔదల దాల్చాను .అందరితో పాటే వారికీ ఆహ్వాన పత్రంపంపాను .

మార్చి 27వ తేదీ ఆదివారం వారికి ఫోన్ చేసి ఆహ్వానం అందిందా అని అడిగాను .అందిందన్నారు .’’మీరు తప్పక రావాలి .మీ సమక్షం లో కార్య క్రమం జరగాలని నా కోరిక .వేదికపైకి రాకున్నా క్రిందనే ఉందురు గాని ,తప్పక రండి .కారు పంపిస్తాను ‘’అన్నాను .’’అలాంటి పిచ్చి పనులు చేయద్దు .కారు పంపద్దు . మీరు మొదటిసారి నాలుగు నెలల క్రితం నాకు ఫోన్ చేసినప్పుడు నా భార్య కు పుట్టపర్తి శ్రీ సాయిబాబా వారి హాస్పిటల్ లో గుండె ఆపరేషన్ చేయింఛి అక్కడ ఉన్నాను  .అప్పటినుండి మీరు గుర్తుండిపోయారు.ఆమెకు నేనే అన్నీ అయి సేవ చేస్తున్నాను. కని పెట్టుకొని ఉంటున్నాను .ఆమెను వదిలి బయటికి రావటం కష్టమే . మీ రచనా వ్యాసంగామూ బాగుంది . ప్రయత్నం చేసి ఆ రోజు ఏదో ఒక సమయం లో వచ్చి చూస్తాను .’’అన్నారు .మహదానందం వేసింది .’’కృతజ్ఞతలు .మీ రాక మా అదృష్టం ‘’అన్నాను వినయంగా .

నిన్న 3-4-16-ఉగాది వేడుకలలో సాయంత్రం సుమారు 6-30 నుండి వేదికమీదనే ఉండిపోవలసి వచ్చి న కారణంగా ఎవరు వచ్చారో తెలుసుకోవటం కష్టమైంది .శాస్త్రిగారు పంచె కట్టు తో వస్తారని వారికోసం నా చూపులు అన్ని వైపులకు ప్రసరింప జేసి  చూస్తూనే ఉన్నాను .నేను అసలు ఇంత వరకు వారిని ప్రత్యక్షంగా చూడనే లేదు వారి ఫోటో కూడా వారి రచనలలో లేదు .ఎలా గుర్తు పట్టగలను ?అయినా వస్తారో రారో ?ఇంటి వద్ద పరిస్థితి ఏమిటో ?ఇవన్న్నీ మనసులో సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి .కాని కార్యక్రమనిర్వాహణ లో కొంత ద్రుష్టి పెట్ట లేక పోయానేమో ? వచ్చిన అతిధులు కూడా వారోచ్చినట్లు నాకు చెప్పనూ లేదు. కనుక రాలేదనే నమ్మకం లో ఉన్నాను .వారు వస్తే ప్రేక్షక స్థానం లోనే వారికి నూతన వస్త్రాలు సమర్పించి శాలువా కప్పుదామని రెడీ అయ్యే వచ్చాను .

సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన కార్య క్రమం పూర్తీ అయ్యేసరికి రాత్రి 9గంటలయింది .అంటే 5గంటల సుదీర్ఘ కార్యక్రమం అన్నమాట .అందులో నెట్ లో చూడటానికి ప్రత్యక్ష ప్రసారం కూడా చేశాం ..అక్కడ డిన్నర్ ఏర్పాటు కూడా చేశాము  .నేను భోజనం చేయగానే రాత్రి 9గంటలకు శ్రీ శాస్త్రి గారు ఫోన్ చేశారు ‘’మీ కార్యక్రమం బాగా జరిగింది అన్నీ దగ్గరుండి మీరు పర్య వేక్షించి ఎంతో గౌరవంగా అతిధులను సత్కరించటం ఇంకా బాగుంది ‘’అన్నారు .ఆశ్చర్యపోయి నేను ‘’మీరు కంప్యూటర్ లో ప్రత్యక్ష ప్రసారం చూశారా ?’’అని అడిగాను .’’కాదు .నేను సభకు వచ్చాను .అయితే చాలా ఆలస్యంగా వచ్చాను సన్మానాలు అయి పోయి  సన్మానితులు కృతజ్ఞతలు తెలుపుతుండగా వచ్చాను .మీ మినిట్ పుస్తకం లో సంతకంకూడా పెట్టాను ‘’అని నన్ను ఆశ్చర్య పోయేట్లు చేశారు .’’ఒక్కసారి నాకు కనిపించి ఉంటె ఏంతో ఆనందంగా ఉండేది .ఎందుకు అలా వెళ్లి పోయారు “?అన్నాను .’’నేనెప్పుడూ అంతే .నా శిష్యులకు సన్మానం జరుగు.’’ తుంటే చూడాలని ఉబలాటం కలిగి వచ్చాను మీరు వేదిక మీద పూర్తిగా నిమగ్నమయి ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక పోయింది .అక్కడ భోజనాలు అవీ ఉన్నాయని చెబుతున్నారు .నేనేమీ తిననుకనుక వెంటనే తిరిగి విజయవాడ వెళ్లి పోయాను ‘’అన్నారు .ఇంతటి ఉన్నతులు ఇంకా లోకం లో ఉన్నారా అని పించి గంగాధర రావు గారికి త్రినాధ శర్మకు చెప్పాను. వారూ నాతోపాటు అవాక్కయ్యారు .

ఇవాళ ఉదయం నేను ఒక నిర్ణయానికి వచ్చి మా శ్రీమతితో చెప్పి సాయంత్రం రామవరప్పాడులో వున్న శాస్త్రిగారింటికి వెళ్లి వారిని చూసి ఆ దంపతులకు వస్త్రాలు సమర్పించి పాదాభి వందనం చేయాలని ఉందన్నాను .మంచిదే వెళ్దాం .అయినా ఒక సరి శాస్త్రి గారికి ఫోన్ చేసి చెప్పండి అన్నది .సరే నని ఫోన్ చేశాను. వారు ఎత్త లేదు  .పది నిమిషాల తర్వాత వారే ఫోన్ చేశారు ‘’మిమ్మల్ని చూడటానికి సాయంత్రం మీఇంటికి రావాలని ఉంది .అనుమతిస్తారా ?’’అని అడిగాను .వెంటనే వారు ‘’రావద్దు .ఇలాంటివాటికి నేను దూరం. ఏమీ అనుకో వద్దు .ఇందులో మొహమాటం ఉండదు నాకు .’’అన్నారు .’’మరి మిమ్మల్ని చూడటం ఎలా ?’’అని అడిగాను .’’నాకు ఆ ప్రాంతం అంతా బాగా తెలుసు .నేనే ఎప్పుడో అటు వైపు వచ్చినప్పుడు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తాను ‘’అన్నారు ‘’అదే మాకు మహా ప్రసాదం .అయినా నిన్న మీరు పాంట్ లోవచ్చారా పంచలోనా ?’’అని అడిగా .’’పంచ కట్టుకొనే వచ్చాను ‘’అన్నారు .నిన్ననేను పాంట్ తో వచ్చిన ఒక నల్లని పోడుగాటాయన మోహన రావు ,తూములూరు వారల తో మాట్లాడటం చూసి ఆయనేమో అనుకొన్నాను కనుకనే ఈ ప్రశ్న  వేశాను  . కనుక శాస్త్రిగారిని నేను అక్కడ చూడలేదని నిర్దారణకోచ్చాను.’’నిన్న ఆవిష్కరణ జరిగిన పుస్తకం మీకు ఎవరైనా ఇచ్చారా ?’’అని అడిగా .’’అందరూ హడావిడిలో ఉన్నారు నన్నెవరూ అడిగి ఇవ్వలేదు .నేనూ అడగటానికి మొహమాట పడ్డాను ‘’అన్నారు .’’నేను ఇవాళ పోస్ట్ లో మీకు పంపిస్తాను ‘’అని చెప్పాను .సంతోషం అన్నారు ..అన్నట్లుగానే పోస్ట్ లో పంపాను .ఇదీ శ్రీ జయ సీతా రామ శాస్త్రి గారి మహోన్నతవ్యక్తిత్వం ,మహా సంస్కారం .ఇలాంటి  మేధావి ,మహా రచయిత, విశ్లేషకులు  మన మధ్య ఉన్నారు అంటే మహాశ్చర్యం వేస్తుంది .శాస్త్రి గారి ఆ సంస్కారానికి నమస్కారం . ఎందరో మహానుభావులు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-4-4-16-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.