మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -2
5-అన్నయ్యకు స్వాగతం –కుమారి .మాది రాజు బిందు వెంకట దత్తశ్రీ –ఉయ్యూరు -9666020842
ఓ విలక్షణ మైన ప్రేమ స్వరూపం అన్నయ్య
జీవిత ప్రయాణం లో ఓ తోడు అన్నయ్య
ఆడపిల్లలకు పుట్టింటి బలం అన్నయ్య
అమ్మానాన్న ల అనురాగ రూపం అన్నయ్య
అందుకే మనం –
రామ లక్ష్మణులను ,బలరామ క్రష్ణులను
నేటికీ మరువ లేకున్నాం
అలాంటి అన్నయ్యకు ప్రేమ పూర్వక స్వాగతం పలుకుతూ
చరిత్ర పుటల్లో శాశ్వత స్థానాన్ని సంపాది౦చు కొంటున్నది
సరసభారతి ‘’మా అన్నయ్య ‘’కవి సమ్మేళనం .
ఓ దుర్ముఖీ !ఇంతమంది అన్నయ్యలను
కవితాపరంగా పరిచయం చేస్తున్న నీకు వందనం
నూతన తెలుగు ఏడాది నాడు అన్నా తమ్ముల అక్కా చెల్లెళ్ళ
ఆప్యాయ అనురాగాలు మరింత ఇనుమడించాలని
ముగురమ్మల మూల పుటమ్మను భక్తితో వేడుకొంటున్నా.
6- దార్శనిక విక్రా౦త కీర్తి అన్న –శ్రీ నవులూరి రమేష్ బాబు –ఉయ్యూరు -9704071079
తే.గీ//శ్రీమదాది గణేశుడు చిన్మహితుడు –సకల సౌభాగ్య సౌకర్య శతము సతము
సుంత సద్బుద్ధి సిద్ధింప జూచు చుండి –ఆదుకొనుట నందరికిని ‘’పెద్దన్న’’యగును .
మత్త కోకిల –‘’అమ్మ ‘’యన్ పద పూర్వభాగము నర్ద వంతము జేయగా
‘’అమ్మహాత్ములు ‘’’’నాన్న ‘’లోని పరార్ధ భాగము జేర్చుచున్
ఇమ్మహిన్ పదమేర్చె’’అన్న ‘’గ నెంత లెంతలొ నేర్పుగా
దిమ్మ దిర్గిన బ్రహ్మ బుర్రకు తేజ మెంతయు జారెగా .
ఉ-ముందున బుట్టి ,యాతడు తమోంతక తేజుడు భానుడే యగున్
ముందుగ వచ్చు నట్టి కడు మోటగు కష్టములెల్ల తానె,యా
నందము తో భరించి ,తదనంతర సంతతి కంతకంతకున్
సుందర సౌఖ్య మంది యిడు చొప్పున వర్తిలు ,’’అన్న ‘’యన్నయే .
మత్తకోకిల –అమ్మ నాన్నల యర్ధ దేహము లైన రెండు సగాలకున్
నమ్మకమ్మును రూప మిచ్చియు ,నాణ్యతన్ గలిగించగా
తమ్ముగుర్రల పుణ్య మార్గము తప్ప కుండగ చూచుటన్
నెమ్మనమ్మున దైవ మట్టుల నిత్య పూజలు ‘’నన్న ‘’కే .
సి –చిన్నతనమునుండి చేరువగా నుండి సకల సమస్యలు చక్క దిద్దు
యుక్త వయసు నందు యోచన బెంచుచు,సలహాలనిచ్చుచు సాకు చుండు
కౌమారమందు సకలమును తానుగా ,అడుగడుగున తానె ఆదుకొంచు
వృద్దాప్యమున గూడ శ్రద్ధగా క్షేమమ్ము ,జూచు చుండెడునట్టి శుద్ధ జీవి
తీ.గీ //పాఠ్య భేదాలు లేని పాఠ మట్లు,స్వార్ధమే లేక బాధ్యతల్ సక్రమ గతి
పూర్తి చేసెడు సంపూజ్య పుణ్యుడతడు,తమ్ము గుర్రల ‘’కన్నయ్య ‘’దార్శనికుడు .
ఆదరాత్మీయతా పూర్ణ వార్ధిఅన్న !సుందరానురాగ ప్రభావ స్పూర్తి అన్న
దివ్య తేజంబు వెదజల్లు దీప్తి అన్న –ఆర్తి పోకార్చు విక్రా౦త కీర్తి అన్న.
7-అన్నయ్య ప్రేమ –శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ –ఉయ్యూరు -9666020842
అన్నయ్యంటే నాకిష్టం –మా అన్నయ్యంటే నాకెంతో ఇష్టం
ఈ ఇష్టం ఇప్పటిదికాదు —ఎప్పటిదో
బ్రతుకు పొరల్లో కలిసి తిరిగిన జ్ఞాపకాలు
అమాయక జీవితం లో ,సమర్ధతా సామర్ధ్యాలను పెంచినవాడు
ఎందుకు వెళ్ళానో గుర్తు లేదుకాని
చెంప చెళ్ళు మని పిస్తే ఏడుస్తూ వెళ్ళిపోయిన నాకోసం
సైకిల్ పై నా వెనకే వచ్చి ‘’ఎందుకొచ్చావురా ?’’అని
బుజ్జగించిన సంగతి నేనెన్నడూ మరవనే లేదు
తల నిమిరిన ఆ చేయి అమృత హస్తమే అనిపించింది
మా అన్నయ్య ప్రేమ కొండంత
గగనాంతపు రోదసిలో విహరిస్తున్న
మా అన్నయ్యే ఎన్నటికీ నాకు తోడూ నీడ .
8-కన్నయ్యే అన్నయ్య –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –ఉయ్యూరు -9395379582
సుభద్రకు ప్రత్యక్షంగా ,మనకు పరోక్షంగా
అన్న ప్రేమను పంచిన ఆ కన్నయ్యే మన అన్నయ్య .
నేను సైతం అంటూ ఓ భరోసా ఇస్తూ
ఆ బంధాన్ని రాఖీతో పెనవేసిన వాడే మన అన్నయ్య .
ఆడపిల్ల ఆడ ఉన్నా, ఈడ ఉన్నా నేనున్నానంటూ
అమావాస్య పండక్కి (దీపావళి )పుట్టింటికి రాని
సోదరి ఇంట భగినీ హస్త భోజనం చేసే కన్నయ్యే మన అన్నయ్య
కాలానికి కరగనిది ,ఏ ప్రలోభాలకు లొంగనిది అన్నయ్య ప్రేమ .
9-వీర బంధుడు అన్నయ్య –శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం –ఆకునూరు -9490420476
ఆకాశం లో ఒక తార భువిలోని ఓ జంట మెరుపులా మెరిశాయి
ఆ మెరుపులో మోక్షమే కలిగింది
ధర్మార్ధ కామ మోక్షాలు ప్రజ్వరిల్లాయి
సంతాన ప్రాబల్యం ఓ ప్రబంధ వేదిక
అమ్మానాన్న ల ముద్దు మురిపాలు అగణ్యం
శరీర ధర్మం ఓ ప్రకృతి ప్రభంజనం
అన్నయ్య ఉన్నాడని దరి చేరే చెల్లెలు
అక్కయ్య కలదని చేరే తమ్ముడూ ఉంటారు కాని
తల్లిదండ్రుల చెంత ఉండే దెవ్వరు ?
వీర బంధుడు ఒక్కడే ఒక్కడు –అతడే అన్నయ్య ‘’గణ నాధుడు ‘’.
10-అన్నయ్య మనసు నిర్మలం –శ్రీమతి పెళ్లూరి శేషుకుమారి –నెప్పల్లి-9392458160
అన్నయ్య అనే కమ్మని పిలుపు లోని మార్దవాన్ని
రక్త సంబంధపు అనుబంధాన్నీ రంగరించి
అమ్మా నాన్నా ,అన్నా తమ్ముడు ,అక్కా చెల్లి బంధాలతో
ముడిపడిన కుటుంబ ఆత్మీయతను పంచుకొన్న మనం
మతమేదైనా ,కులమేదైనా ,,మానవతే మన నైజం .
వసుధైక కుటుంబం మన భారతం
ఆప్యాయతల ,అనుబంధాల సుమహారం .
అందునా !ఈ ఉగాది లో అన్నయ్య ఆత్మీయతను
అభిమానాన్నీ ప్రస్పుటీకరిస్తూ
రక్త సంబంధం లేకున్నా ‘’అన్నయ్య ‘’అనే పిలుపు అవగాహించి
పరాయి ఆడ పడుచును సోదరిలా ఆద రించాలనీ
అన్నగా అక్కున చేర్చుకోవాలని నినదిస్తూ
వాస్తవాన జరిగే అత్యాచార ఘాతుకాలను నిరసిస్తూ
నిండు మనసుతో ‘’ఈ సందోహాన్ని’’అపెక్షిస్తున్నాను
సృష్ట్యాది నుండి మరల మరల వచ్చినా
నిన్న మన్మధ –నేడు దుర్ముఖి
ఈ వసంత శోభలో కోయిలల కుహు కుహూ రాగం కూని రాగమైనా
ఆనవాయితీ తప్పని షడ్రుచుల ఉగాది పచ్చడి ఊరిస్తుంటే
‘’అన్నయ్య ‘’అనే పదం లోని నిర్మలత్వం తో
దుర్ముఖి ని స్వాగతిస్తున్నాను .
సశేషం
శ్రీ దుర్ముఖి ఉగాది శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-4-16-ఉయ్యూరు