మా అన్నయ్య –ఆత్మీయ కవితా లహరి
సరాసభారతి ,శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది .వేడుకల సందర్భంగా 3-4-2016 ఆదివారం ‘’మా అన్నయ్య ‘’శీర్షిక పై నిర్వహించిన ఆత్మీయ కవి సమ్మేళనం లో వెల్లి విరిసిన కవితా స్రవంతి-
ఉయ్యూరు విశిష్టత –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు –విజయవాడ -9908344249
శా-ఉయ్యూరా !ఇది పండితుల్ కవులు నత్యుత్సాహ వంతుల్ సదా
నెయ్యంబున్ గడు ప్రేమ జూపు ఘనులున్ ,నిత్యంబు సాయంబులున్
చెయ్యంది౦చెడువారు గల్గు పురి ,యాక్షేపింప బోరెవ్వరున్
వెయ్యండికను పూల హారములు వైవిధ్యంబు కీర్తి౦చు చున్.
తే//పంచదార కర్మాగార బస్తి గాన –ఇచ్చట కవితలన్నియు ముచ్చటింప
నోలలాడించు నెప్పుడు నూయ బాపి –మధుర సుధలనిచ్చుచు మన మానసంబు .
తే//అతిదులన్ గౌరవిం చెడుయశము గల్గి –సంస్కృతీ సంప్రదాయముల్ శాశ్వత మయి
తగువు లాడక నిత్యము దయను పంచి –ధర్మ సత్యంబులను గల్గి ధరణి యందు –
నెల్లెడల పొందు సత్కీర్తి యప్పురంబు .
ఉ//అబ్బురమౌ విధంబునను హారములన్ తెలుగమ్మ కేయగన్
గబ్బిట వారు నిల్పిరిట ఖ్యాతిని పెంచగ సాహితీ సభన్
జబ్బలు గట్టిగా చరఛి జట్టుగ పిల్వగ సత్కవీశులన్
దెబ్బకు నాంగ్ల దెయ్యమును తెల్గున కైతలకున్ దిగెన్ గదా .
సి //ఎందరో నాయకు లెందరో గాయకు లెందరో సత్కవులిక్కడుండె
ఎందరో సజ్జను లెందరో పండితు లెందరో సంస్కారు లీడనుండె
ఎందరో అతిదులెందరో అభ్యాగతు లకీ పురంబును తోడు నిచ్చె
ఎందరో ఘనులకు నెందరో బుధులకు నిచ్చోట గౌరవంబెప్పుడుండె
అట్టి అలరారు ఉయ్యూరు ఆంద్ర మందు –గొప్ప గ్రామమై వెలుగొంది మెప్పు పొందు
స్థానికుల కెప్డు దివ్యమౌ స్థాన మిచ్చి –ఎల్ల వేళల సంరక్షించు నీ యుగాది .
మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -1
1-నా (అ)న్న వసుధ బసవేశ్వర రావు –వెంప-9490832787
చిన్నప్పుడు చీకట్లో నడుస్తూ –భయం తో ‘’నాన్నా ‘’అని అరిచా
‘’నీ వెనక నేనున్నాలే పద ‘’-అన్నాడు నాన్న
కష్టాలవాకిట్లో నడుస్తూ –మళ్ళీ భయం తో –‘’నాన్నా ‘’అని అరిచా
‘’నీ వెనక నేనున్నా పద ‘’-అన్నాడిప్పుడు మా అన్న .
2-చిన్నన్నయ్య –శ్రీ డా .రాచకొండ నరసింహ శర్మ ,ఏం డి.-విశాఖ పట్నం -0891-6671-471
విశ్వమని మేము పిలుచు న –శ్వర కీర్తి యుతు నతి వినమ్రుని,సు కదా
విశ్వము లోన మహా రదు –విశ్వమును వలచిన వాని వినుతింప నగున్ .
ఈ రా.వి.శాస్త్రి కీరితి –ఏరాడను కొండ మించి ఎవరెస్టగుటన్
తీరాన నేను నిల్చితి –గారాబము మదిని నిండి కన్నీరొలుకున్ .
నిరపరాధులైన నిరు పెదలనెపుడు –వాదించి విడి పించు వాద యుక్తి
‘’ఘన పారు ‘’లను మించు దన ధారణా శక్తి –సాంప్రదాయము వీడి సాగు ముక్తి
శ్రమ జీవి సాదలను శ్రవణింప నాసక్తి-సిద్ధాంతములు దాటు స్నేహ శుద్ధి
తా నెరుంగక యుండి,తన లోన లీనమై –దాగి యుండిన గాఢ దైవ భక్తి
ధరను జరుగు చుండు అనేక దారుణముల –క్రందు దీన జనాళి ఆక్రందనలకు
ఎదను స్పందించు శక్తియు –ఇన్ని గూడి –‘’కధక చక్ర వర్తి’’యితండు కాక యెట్లు ?
షేక్సిపియర్ కాదులే ,చేక్కోవుయును కాదు -కాళిదాసీతండు కాదు కాని
ప్రాచీన నూతన రచన లందీపాటి-ఉపమాన వైదగ్ధ్య ముండు టరిది
నవ రసముల మహార్ణవము లందీరీతి-ఉర్రూత లూగించు ఓజలేవి ?
పాటకపు జనుల బాధల చిత్రించు –నితని కధా శిల్ప మెచట దొరకు ?
కధలలో నవలల ,నాటకమ్ము లందు –మంచి చెడ్డల భేదమ్ము మనకు నేర్పె
‘’ఉత్తరా౦ద్రుల యాస ‘’ పెల్లుబుకు చుండు-యీతని అనన్య సాధ్యమౌ వ్రాత లందు .
3-మా శర్మన్నయ్యచిరంజీవి –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -9989066375
అన్నయ్యంటే మాకందరికీ విపరీతమైన అభిమానం
తాను కాలుతూ వెలుగినిచ్చిన కొవ్వొత్తి మా అన్నయ్య
ఇంటికెప్పుడూ దూరంగానే ఉన్నా
మా ఇంటిల్లి పాది గుండెల్లో ఉండేవాడు
గాంధీ గారి’’ స్మోకింగ్’’ ఇంగ్లీష్ పాఠం
మా సావిట్లో చెమటలు కక్కుతూ వేసవిలో చెప్పటం
తాను’’ చైన్ స్మోకర్ ‘’అని మాకు తెలిసినా
మేమూ ,అన్నయ్యా చిరు నవ్వులు చిందిస్తూ
వినటం చెప్పటం ఎప్పటికీ మర్చి పోలేను
అన్నయ్య కొన్న తాజ్ మహల్ మార్బుల్ బొమ్మ
అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఇస్టమే
అన్నయ్య ఇంగ్లీష్ పరిజ్ఞానం సాటి వారిలో లేనేలేదని
తాడంకి హైస్కూల్ ఇంగ్లీష్ డిబేటింగ్ లో
ఎప్పుడూ అన్నయ్యే ఫస్ట్ అని
అన్నయ్య క్లాస్ మేట్లు ఆ తర్వాతెప్పుడో చెబితేకాని అర్ధం కాలేదు
గోర్కీ సాహిత్యమంతా దాచాడు మాకోసం
అమ్మ అంటే ప్రేమ, నాన్నంటే గౌరవ భయం
చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళన్నా అభిమాన దనం
హోస్పేటలో పాతాళ భైరవి ,మిస్సమ్మ
సినిమాలు నాకు చూపించి వాటిపై చక్కని విమర్శ చేసేవాడు
రైల్వే స్టేషన్ లో అరగంటకో సారి అరకప్పు కాఫీ తాగుతూ, తాగిస్తూ
బియ్యపు గింజల పలువరుసతో చిరునవ్వు చిందించే వాడు
జి .ఎల్ .శర్మగా అన్నయ్య సంతకం చెక్కు చెదరని జ్ఞాపకం నాకు
అకస్మాత్తుగా 32 ఏళ్ళకే గుండె ఆగి అన్నయ్య చనిపోతే
ఇల్లు శోక సముద్రమే అయింది
అన్నయ్యఎప్పుడూ మా గుండెల్లో, స్మృతిలో చిరంజీవే .
4-రామయ్యన్నయ్య –శ్రీ డా.వేదాంతం శ్రీధరాచార్యులు –ఉయ్యూరు
శ్రీరాముడు ఆదర్శ అన్నయ్య
మనం అవ్వాలి రామానుజులం
రామయ్య రాజ్యమే అన్ని కాలాల ప్రభుతల ఆశయం
రామయ్యన్నయ్య అన్న మాట ,నడచిన బాట సర్వ శ్రేష్టం .
సశేషం
శ్రీ దుర్ముఖి ఉగాది శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-16