మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -3
11- ఆత్మీయ అనురాగ పుంభావ మూర్తి అన్నయ్య –శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ –మచిలీపట్నం -9247558854
ఊహ తెలిసిన నుంచి ఉద్యోగ భారంతోనో ,వయసు దూరం తోనో
నాన్న నాకు అరుదుగా కనిపించే వ్యక్తి అయినపుడు
‘’అన్న ‘’అంటే అందుబాటులో ఉండే’’ నాన్నే ‘’నని పించేది
బజారుకెళ్లాలన్నా ,బడి కెళ్లాలన్నా
అమ్మ రక్షణ భారాన్ని తానే వహిస్తూ నేటికీ
నా దైన్యాన్ని పోగొట్టి సైన్యం లా నిలబడతాడు .
అమ్మ గోరుముద్దల్లోను నూతి చన్నీళ్ళ స్నానాలలోను
తిరునాళ్ళ తీపి జీడి కొనుగోళ్ళ లోను ,
వేసవి వెన్నెలరాత్రుల ఆరు బయట పడకల్లోను జత కాడే కాదూ
చదువు సందేహాలలో సరస్వతి సందేశం లా సంస్కరించే వాడు మా అన్నయ్య .
వస్తువులను పోగేసుకోవటమే అభి వృద్ధికి
కొలమానమను కొనే రోజుల్లో నూ
మనుషుల్ని ,మనసుల్ని ముడి వేసుకోవటమే మూలం
అన్న అభ్యుదయ వాదిలా అగుపిస్తాడు మా అన్నయ్య .
కోపం లో దూర్వాసుడైనా పట్టుదలకు విశ్వామిత్రుడు
ఆదరణ లోను ,ఔదార్యం లోను వసిస్టులాంటి వాడు
నా నాలుగు పదుల వయసు లోను
అంటి పెట్టుకొన్న ఆత్మీయతకు ,అంటుకొంటున్న అనురాగానికి
పుంభావ మూర్తి మా అన్నయ్య .
12-అనురాగపు కొండ అన్నయ్య –శ్రీమతి గుడిపూడి రాధికా రాణి –మచిలీపట్నం –9494942583
వెన్నంటే అన్నంటే –మిన్నంటే ప్రేమున్నా
వాడిపైన వాడియైన –ఫిర్యాదుల ఫిరంగి మోతలు
ఇదంతా నా పెళ్లి వరకే –అన్నవదనం విరిసిన దిరిసెన
అప్పగింతలు నాడు కురవని మేఘం
-యెడ చాటుతెలిపింది యెద చాటు మమత
దూరంగా నిలబడనిదే -ఆసాంతం కనబడరు కదా .
నేను ,అన్నయ్యా వీణా ,తీగలుగా వేరు వేరైనా
పలికేది ఒకే రాగం –అనురాగం
ఆలయ స్తంభాలుగా వేరు వేరు
మోసేది ఒకే ప్రాకారం –మమకారం
మా అన్నయ్య తాను విల్లుగా కదలక నిలిచి
నను రివ్వున సాగే శరంగా మలిచి
తను కత్తిపోట్లు తిన్న వెదురుగా నిలిచి
నను వేణు మధుర నాదంగా మలిచి
తను చినుకు పడి చి౦దేసే మట్టిగా నిలిచి
నను ఆహ్లాదపు ఆత్మీయపు పరిమళం గా మలిచి
తను ఆలయ పునాది రాయిగా మిగిలి
నను గోపుర శిఖరంగా నిలిపి ….
ఇప్పుడు ఫిర్యాదుల్లేవ్ ,ఫిరంగి మోతల్లేవ్
కొండ దిగి దూరంగా నుంచుంటే
కొండ ఉన్నతి తెలిసింది
మా అన్నయ్య బంగారు కొండ .
13-రక్షాబంధనమే అన్నయ్య –శ్రీమతి మేరీ కృపాబాయి –మచిలీపట్నం -9989347374
అన్నయ్య౦టే కుటుంబ అనుబంధం
అన్నయ్యంటే సామాజిక సంబంధం
విశాల సమాజం లో ఎందరో అన్నయ్యలు
అనాధ చిన్నారిని ఆదుకొనే వేళ అతడే అన్నయ్య
పేదరికం లో మగ్గి పోయే వేళ అమ్మాయికి ఫీజు కడితే అతడే అన్నయ్య
చిమ్మ చీకటిలో చిక్కుకున్న స్త్రీకి దారి చూపి
రక్షించే వేళ అతడే అన్నయ్య .
సమస్యల వలయం లో చిక్కుకున్న వేళ
పరిష్కారం చూపితే అతడే అన్నయ్య .
అన్నయ్య భావన విశ్వ వ్యాపితం
అన్నయ్య అనురాగం ఎల్లలు లేనిది
అన్నయ్యంటే కుటుంబ బంధం
అన్నయ్యంటే సామాజిక అనుబంధం
అన్నయ్యంటే రక్షా బంధం .
14-అమ్మ అయ్యల కలగలుపు అన్నయ్య –శ్రీమతి కందాళ జానకి –మచిలీపట్నం –
అమ్మ అయ్యల కలగలుపు అన్నయ్య
ధర్మ పరిపాలకుడే మన రామన్న
పాండు పుత్రుల బలం ధర్మ రాజన్న
సోదర సోదరీ ప్రేమకు మూలమన్న
తలిదండ్రుల ఋణం తీర్చు తొలి తనయుడన్న
తండ్రి ప్రేమను పంచి తనవి నిచ్చునన్న
తన వారిగా తలచి నందర పైకి తెచ్చు
వదిన ప్రేమే తనకు పేరు మంచిగా నిచ్చు
పుట్టింటి బంధాన్ని తన తోడ ముడి వేయునన్న
స్వార్ధ మెరుగని సాదు శీలియే మా అన్న
ప్రేమామృతాన్ని పంచేది అన్నయ్యే
ఆర్తి వేడిన చెల్లి మానాన్ని కాపాడె నన్న
కన్నయ్యలాంటి అన్నయ్యలున్న దేశం నాది
అన్ని బంధాలకు ఆది మూలం మనది
నిత్య కళ్యాణ పచ్చ తోరణంగా
పిల్ల పాపల తోడ చల్లగా వర్ధిల్లు అన్న
మాకు పసుపు కొమ్మే చాలు ,పట్టెడు కు౦కుమే చాలు
అన్నల౦దరకు ,మా అన్న లందరకు మంగళం శుభ మంగళం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-4-16-ఉయ్యూరు