మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -4
15-ఆత్మ బంధువు అన్న –శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీ పట్నం -9849812443
సి –అమ్మానాన్నల యనురాగ మార్ణ వమైన – అన్నయ్య అనురాగ మంబరమగును
అన్నయ్య కురిపించు అనురాగ వర్షమ్ము అంబు దమ్ముల తీరు హర్ష మొసగు
సాదరంబాగు మామ సోదరున్ సందిట –బాలార్కుని కిరణ స్పర్శ తోచు
ఆప్యాయ మొలికెడు అన్నయ్య పిలుపన్న –మలయానిల మ్ముగ మదిని తోచు
ఆ.వె.-అన్నయన్న పిలుపు ఆనంద ప్రదమగున్ –రక్త బంధమె యనురక్తి యనగ
సోదరులిక ప్రేమ సుంత పంచిన చాలు –కాన వచ్చు అన్న కనుల తృప్తి .
సి –అన్నయ్య కిడగను అగ్రాది పత్యము –పెద్దకొడుకనెడు పేరు నిలుపు
వరుసగ గృహమున గురుతర బాధ్యతల్ –నిర్వహించ గ కడు నేర్పు చూపు
కష్ట సుఖమ్ములు కాదు లాభ నస్టముల్ –సహన సంపద తోడ సంస్కరించు
అనుజుల నడిపించ నాదర్శ మార్గమ్ము –అసమాన ప్రతిభను అవధరించు
తీ.గీ.-వినయ స౦పన్నులైన వారు విద్య నేర్చి –ప్రగతి పదమున ప్రతిభ తో పరుగు లిడుచు
లక్ష లార్జించు చుండగ లక్షణముగ-కురియ నానంద బాష్పాలు మురియు నన్న .
సి-శ్రీరాము నంతటి స్థిర చత్తు నన్నగా –పొందగల్గుటపూర్వ పుణ్య ఫలమె
నిస్వార్ధ బుద్ధితో నిరతము కృషి సల్పు –మా యన్న విధిగమా మంచి నెంచు
అన్నయ్య బోధించు కన్నయ్య వలె నింక –మంచి చెడుల గీత ఖచ్చితముగ
ఆత్మ బంధువు మాకు ఆత్మీయుడగు అన్న –సన్నిధిన్ తలతుము పెన్నిదిగను
తే.గీ .-తల్లిదండ్రుల యెడభక్తి తరగనీక –అలుక నెరుగక ,మా యన్న అలుపు లేక
సాకు కుశలమ్ముగ కుటుంబ సారదిగను –కొండ వలె నుండు మా అన్న అండ మాకు .
16-పుట్టింటి వేలుపు అన్న – –శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ –మచిలీపట్నం -9299303035
అన్నంటె సగమౌను ,అమ్మలోనెప్పుడు-అనురాగ సుమముల నంద జేయు
అజ్ఞాన తిమిరమ్ము నార్పి వేయుచు తాను –దీధితుల్ వెదజల్లు దివ్వె యగును
అభిమానమును పంచు ననుజుల కెప్పుడు –స్వార్ధ భావము లేని సదయుడగును
అమృత మెచటనగ అన్న మదిని దాగు –రక్త సంబ౦ధమ్ము రక్తి నిచ్చు
అమ్మలోన నాది ,నాన్నలో తుది కల్సి –అన్న యన్న పదము నమరె గాన
అమ్మలోని ప్రేమ ,నాన్న పాలన బుద్ధి –ఉన్న వాడె’’అన్న ‘’ఉర్వి యందు .
2-త్యాగ శీలి యితడు తన యనుజులకునై –పాలను మురిపాలు పంచి యిచ్చు
వారి భవిత కొరకు వచ్చు ఆపదలన్ని-దాటి ముందు నడచు ధర్మ మూర్తి .
3-అమ్మ నాన్న పిదప నాదరించెడు వాడు -అన్న యొక్కడగును యతివ కెపుడు
అన్న తమ్ముల ప్రేమ అక్క చెల్లెలు కోరు –ఆడరణంబుఅభిలషించు
అత్తింట ఎన్నున్నపుట్టింటి పై ప్రేమ –వీడ దెప్పుడు కాంత వింత గాదు
అమ్మలో సగము ‘’అ’’,నాన్న లో సగము’’న్న’’-అవి రెండు కలిసిన అన్న యగును
అమ్మ వోలె సాకు అన్న తా వెంటుండి –అన్న ధైర్య మొకటి అతిశయించు
ఎచట నున్న కాని ఎప్పుడు పుట్టింటి- మేలుకోరు ఇంటి వేలుపగుచు
కంసు వంటి వానన్నగా కాన నీకు –శూర్పణఖ వంటి చెల్లెలు శోభ యగునె?
కాచి రక్షించెడి కరుణాకరునియిచ్చి-అమ్మ బ్రోవుము అవనిని అతివ నెపుడు .
17-దేవుడి వరం అన్న –శ్రీ మునగంటి వెంకటాచార్యులు –విజయవాడ -92925753560
ఆత్మీయులైన అమ్మా నాన్నల ఆద్య౦తాల కలగలపైన కమనీయ రూపమే అన్న
నేనే మా కుటుంబం లో ఆగ్రజుడను –అందుకే తమ్మునిగా ఆ ఆప్యాయతను అందుకోలేక పోయాను
‘’అన్నా ‘’అని నోరారా పిలువ గలిగిన పేగు బంధం నాకు లేక పోయినా
జీవితం నాకొక అన్నయ్య నిచ్చింది .
నేనామిత్రుని ‘’అన్నా ‘’అని ఆదరంగా అంటే –‘’తమ్ముడూ ‘’అని ప్రతిధ్వనిస్తాడు
ఇద్దరం కలిసి మనసు పొరల్లోని ఎన్నో విషయాలను ముచ్చటిస్తాం
వృద్ధాప్యం లో నామిత్రుడు హైదరాబాద్ లో కొడుకు దగ్గరకువ వెళ్లక తప్పలేదు
ఇలా కాలం మమ్మల్ని విడదీసింది –అయినా మనసులు దూరం కాలేదు
నేను భాగ్యనగరం వెళ్ళినప్పుడు చరవాణిలో వివరం తెలుసుకొని ,నా భాగ్యం గా స్టేషన్ కొచ్చాడు
ఆ మిత్రన్నయ్యను చూడగానే గుండె బరువెక్కింది
గొంతు మూగ బోయి కళ్ళు చెమర్చాయి
సరిగ్గా నడవలేని స్థితిలో నాకోసం స్వయంగా వచ్చిన ఆంనయ్యను చూసి చలించి పోయాను
ఆదరంగా గుండెలకు హత్తుకొని ఇంటికి తీసుకొని వెళ్లి ఆతిధ్యమిచ్చాడు
నా కవితా సంకలనానికి ‘’అనుస్పర్శ ‘’నందించిన ఆత్మీయుడీ అన్న
ఆర్ద్ర హృదయం తో నాకు వీడ్కోలు పలికి –నాకు దేవుడిచ్చిన ఆత్మీయుడైనాడు అన్నయ్య .
18-అన్నయ్య అమల బంధం –శ్రీమతి సింహాద్రి వాణి-విజయవాడ -779939113
ఆ.వె.-అమ్మ నాన్న కలిసి అన్న రూపుగ మారి –సేవ చేయు నన్న చెల్లి కొరకు
అన్నకెపుడు చెల్లి ఆరవ ప్రాణమ్ము –అన్న కున్న ప్రేమ అద్భుతమ్ము
ఆ.వె.-కష్ట సుఖములందు కన్నవారికి తోడు-అన్న కూడ నిలిచి యాదుకొనును
అన్న ఉన్న చెల్లి అవనిలో కరువేది >కంటి రెప్ప వలెనె కాపు కాయు .
తే.గీ.—తనదు సుఖములన్ని త్యజియించి వేసైన-అన్న చెల్లి కొరకు అన్ని తీర్చు
తల్ల్లడిల్లు చుండు తల్లి దండ్రి వలెను –తోడ బుట్టినట్టి తోడు కొరకు
తే.గీ.అన్నలందున మా యన్న మిన్న యనగ-చాల కర్తవ్య నిష్టతో చక్కగాను
తల్లిదంద్రికి తోడుగా తాను నిలిచి -తోడ బుట్టిన వారికి త్రోవ చూపె
తీ.గీ.-తనదు జన్మమ్ము మిక్కిలి ధన్య మొండ –ప్రేమ వర్షము కురిపిస్తు పిన్నలెడల
చేయుచున్నాడు నా యన్న జీవ యాత్ర –అన్న సోదర బంధమ్ము అమలమవగ.
19-ఇష్ట దేవత అన్న –శ్రీమతి లక్కరాజు వాణీ సరోజినీ –విజయవాడ –9346078829
సి—అన్న నిన్ను దలచ ఆనంద ముప్పొంగు –మరువ జాలనెపుడు మదిని నిన్ను
కంటి రెప్పల వోలె కాచి కాపాడుచు –వెంట నంటెడి దొడ్డ వేల్పు వయ్య
విద్యలందున నీవు విలసిల్ల వలెనని –అభిలషించెడు గొప్ప అన్న నీవు
ఎన్ని జన్మలకైన నిను సరిపోలిన –అన్నగానగ జాల నవని యందు
ఆ.- కలిమి లేములందు కష్టసుఖములందు –నిన్ను మించి నట్టి నెలవు కలదె?
ఏక గర్భమందు ఏర్పడు బంధమ్ము-త్రుంచ నలవి కాదు ఎంచి చూడ .
ఆ .-అన్న యనగా నెంతొ ఆత్మీయ భావన –పొంగి పొరలు ఎడద పోరలనుండి
మనసు నిండ ప్రేమ మమతల నెలవైన –పేగు బంధ మిలను వీగి పోదు .
ఆ .-ఎన్ని జన్మలందు ఏర్పడు బంధమో –వీడ రాణి దెపుడు,వాడి పోదు
రక్త బంధ మెంతొరమణీయ మౌగాడ –పూవులోన తావి పొదిగి నట్లు .
ఆ .-ఆప్త మిత్రువోలె ఆది పాడిన రీతి –మరపు రాణి గాఢ మైత్రి మాది
కల్మషం బెరుగని గాఢాను రాగంబు –తరిగి పోదు మదిని తొలగి పోదు .
ఆ .-కష్ట సుఖము లందు ఇష్ట దేవత వోలె –తోడూ నిలిచె నతడు వీడ కుండ
ఆది నుండి నన్ను అత్యంత ప్రేమతో –చెల్లి యనుచు పిలిచి చెలిమి జేసే .
20-అరుదైన బ్రహ్మ కమలం అన్నయ్య –శ్రీ కందికొండ రవి కిరణ్ –విజయ వాడ -9491298990
అన్న యనంగ మా’’ అమ్మ ‘’,’’నాన్న ‘’లలో సగము సగము
గుణము చూడ నది తలిదండ్రుల గుణ యుగము
తోబుట్టువులకు అతని యండ పెను నగము
దోసమేంచక అనుజుల నాదరించును ,ఇచ్చు భాగము
లక్ష్మణాగ్రాజపాండవాగ్రాజుల వలెచూపు ననురాగము
పెంచగా చూచు పెద్దల కీర్తిని ,మెచ్చగ బంధు జగము .
తన చదువు నాపి తమ్ముళ్ళను బడికి పంపి చేయూతై నాడు
అమ్మకు ఇంటి స్థితి గతులు ఓడలు బండ్లుగా మారినపుడు
సహజన్ముల సంతాన యోగ క్షేమ మరయు నెల్లప్పుడు
శిక్షించు తీక్షణత్వమున సూర్యుడు ,అనురాగ శీతలత్వామున చంద్రుడు
ఇవ్వటమే తప్ప అడుగు టెరుగడు ,మాట తప్పడు ,మడమ త్రిప్పడు
అన్నకు రాముని ,తమ్మునకు కైక సుతుని పేర్కొంటారు విజ్ఞులు
అన్నయ్య లందరూ అలాగా ఉంటె ప్రతి ఇల్లూ అగు నయోధ్య
భరతుడు నేనైనా కాకున్నా ,మా అన్నయ్య రాముడే
దేహానికి హృదయం రీతి ,అన్నయ్య మా కుటుంబానికి
మనకంటూ ఎమున్నవీలోకాన ?రక్తసంబంధము ,తోడ బుట్టిన వాడూ కాక ?
పూలూ చెట్లూ ఎన్నున్నా ,తావి ఉన్న తావునకే కదా పూల సజ్జలు చేరికలు
పూవు వంటి అన్నయ్యను శోభిల్ల జేయు ‘’తావి ‘’వదిన
ఇంటి ఇల్లాలు చూపు ఆడరణాప్యాయతలే ఇంటి గడప గవాక్షాలు
దుర్భావన వాయువులు వీడి సద్భావన పవనాలతో ఆయిల్లు విలసిల్లగ .
సశేషం
శ్రీ దుర్ముఖి ఉగాది శుభా కాంక్షలతో
మీ-గబ్బిట-దుర్గా ప్రసాద్ -7-4-16-ఉయ్యూరు