8.4.2016
మిత్రులు, సాహిత్య సేద్యులు, శ్రీ దుర్గా ప్రసాద్ గారికి, నా స్పందన
కెమొటాలజి పిత – కొలాచల సీతారామయ
( పుల్లేరు నుండి వోల్గా దాకా )
దుర్ముఖి నామ సంవత్సర
‘ ఉగాది’ శుభాకాంక్షలు ! |
నమస్కారములు ! సాహిత్య సేద్యంలో, మధురమైన బాల రసాలను పండిస్తున్న మీకు ముందుగా నా హార్దిక అభినందనలు ! మీరు నాపట్ల ఏంతో అభిమానంతో రెండు నెలల క్రితం పంపిన ‘కెమొటాలజి పిత’ కొలాచల సీతారామయ్య గారి అద్భుత జీవిత చరిత్ర చదవటం నిన్ననే పూర్తి చేసాను. ఎన్నో సాంకేతిక అంశాలతో నిండి ఉన్నా, మీరు వాటిని పాఠకులకు ఆసక్తికరంగా చదివిచేటట్లు, అలవోకగా రాయటం, ఇందులో ప్రత్యేకత. ఎన్నో ఉపయోగపడే అంశాల గురించి, గొప్ప మేధావుల గురించి మీరు అపురూప గ్రంథాలను సరళ శైలిలో రచించి సమాజానికి అందించటం బహుథా ప్రశంసనీయం !
ఎటువంటి పుస్తకాలు చదవాలి ? – అనే సందేహం వచ్చినపుడు, ఇతిహాసాలూ ;… గొప్పవారి జీవిత చరిత్రలు;– అని అంటాడొకమేధావి ! ఈ కోవలోకే చెందుతుందీ గ్రంథ రాజం !
కృష్ణా జిల్లాలో, ఉయ్యూరు ప్రక్కన ఉన్న ఒక కుగ్రామం, శాకమూరులో సంప్రదాయ పేద కుటుంబం నుండి వచ్చి, తన దృఢ సంకల్పంతో, అప్రమేయ దీక్షా దక్షతలతో, అసమాన మేధా సంపత్తితో, అలుపెరుగని యోధునివలె నిరంతరం, జీవన సమరంలో పోరాడుతూ,‘పడి లేచే కడలి తరంగం’ వలె విజ్రుంభిస్తూ, సీతారామయ్య గారు కాలి నడకన మద్రాస్ చేరి; తదుపరి మొక్కవోని పట్టుదలతో, ఉన్నత చదువుల కొరకు, అమెరికా రష్యా దేశాలలో చేసిన మహా ప్రస్థానం గురించీ, సాధించిన అద్భుత అపూర్వ విజయాల గురించీ, ఏంతో శ్రమకోర్చి, ఆయన‘జీవిత చరిత్రను’ అంకిత భావంతో అక్షరీకరించి మీ రచనా పాటవంతో సమాజానికి తెలిపినందుకు శత సహస్రాభినందనలు.
ఇటువంటి, అద్భుత గ్రంథం లోని కొన్ని విశేషాలను ఎంపిక చేసి ‘పుస్తక పరిచయం’ రాసి, నా అంతర్జాలం -మిత్ర బృందం –‘స్నేహాలయం’ వారికి కూడా ఈ లేఖతో పంపుతున్నాను.
మీరు నా పట్ల గల అభిమానంతో పంపిన మరొక పుస్తకం. “దైవ చిత్తం” అందినది. ధన్యవాదాలు. అది కూడా చదివిన తరువాత నా స్పందనలు తెలియజేస్తాను. ప్రస్తుతానికి సెల
భవదీయుడు,
(గీతాంజలి మూర్తి )
శ్రీ గబ్భిట దుర్గా ప్రసాద గారు, ఉయ్యూరు, కృష్ణ జిల్లా