ఈ ఉత్సాహపు పొంగు చల్లార రాదు

ఈ ఉత్సాహపు పొంగు చల్లార రాదు

ఉయ్యూరులో తెలుగునాటక రంగ దినోత్సవం

ఈ విజయం ఉయ్యూరు కళాభిమానులదే

తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉయ్యూరులో ప్రయోక్త, దర్శక,నిర్మాత డా శ్రీ వల్లభనేని వెంకటేశ్వరరావు ఉయ్యూరు ఫ్రెండ్స్ సహాయ సహకారాలతో ఏప్రిల్ 16నుండి 18వరకు నిర్వహించిన నాటకోత్సవాల ముగింపు సభ  నిన్న 18-4-16 సోమవారం శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొనటం తో పూర్తీ అయింది .

శ్రీ బుద్ధ ప్రసాద్ ఉవాచ

సమాజం లో అనేక సమస్యలను రచయితలు  తమ ప్రతిభ తో అద్భుతంగా నాటకాలుగా మలచి  ,వినోదం తోపాటు విజ్ఞానాన్ని వివేకాన్ని జాగృతిని కలిగిస్తున్నారని వాటిని సమర్ధులైన నటులు నటించి దర్శకత్వం వహించి ప్రజల ముందు ప్రదర్శించి సమాజాన్ని మేల్కొల్పుతున్నారని ,దీనికి ఎప్పుడో శ్రీవీరేశలింగం గారు దారి చూపారని ,సమాజం లోని చెడును, కుళ్ళును కడిగిపారేసి ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయటం రచయితల బాధ్యత అని మన రచయితలూ ఈపనిని చాలా సమర్ధ వంతంగా నిర్వహిస్తూ సమాజ హితైషులుగా మారటం శుభ సూచకమని అన్నారు .కృష్ణా జిల్లాకు చెందిన శ్రీ పూసల శ్రీ డి విజయ భాస్కర్ రచించిన నాటకాలు వందలాది ప్రదర్శనలతో దిగ్విజయంగా సాగుతున్నాయని ఆ ఇద్దరూ దివి సీమ ముద్దుబిడ్డలే అవటం మనందరికీ గర్వకారణమని చెప్పారు .తమ తండ్రి గారు స్వర్గీయ మండలి వెంకట కృష్ణా రాగారు అవనిగడ్డలో నాటకాలు నిర్వహిస్తే ,ఏ సదుపాయమూ బ్రిడ్జిలు లేని ఆకాలం లో లక్షమందికి పైగా వచ్చి నాటకం చూసి స్పూర్తి పొందేవారని గుర్తు చేసుకొన్నారు .తానూ నాటకాలు నిర్వహిస్తూనే ఉన్నానని కాని ఇప్పటి జనం బుల్లితెర మాయలో పడి అన్నీ వదిలేస్తున్నారని ,ఇప్పుడు తాము నాటకాలు ప్రదర్శిస్తున్నా జనం లో  స్పందన  ఉండటం లేదని ,ఇది ఆరోగ్య కరం కాదని ,ప్రేక్షకులు లేని నాటక ప్రదర్శన శోభించదని కనుక ఎన్ని పనులున్నా కళకోసం జనం సమయం కేటాయించుకొని దాన్ని బ్రతికి౦చు కోవాలన్నారు .ఉయ్యూరు లో దాదాపు నాలుగు వందల మంది నాటక ప్రదర్శనను చూడటానికి రావటం అంటే రికారర్డ్ సృష్టించటమే నని , ఉయ్యూరు ప్రజల కళాభిమానానికి చేతు లెత్తి నమస్కరిస్తున్నానని ,ఈ పొంగు చల్లారనివ్వ వద్దని ,ప్రతి యేటా నాటకోత్సవాలు ఉయ్యూరులో జరపాలని దానికి తన వంతు సహకారం అందిస్తానని హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు .

శ్రీ వి. వి. ఆర్ .సద్యో స్పందన

ఉయ్యూరులో నాటకం వేస్తే అయిదారుగురు వస్తే గొప్ప అని తనను చాలామంది నిరుత్సాహ పరచారని ,కాని ఉయ్యూరులో ఉన్న సినిమా దియేటర్ లకు వచ్చే జనం కంటే ఇక్కడికి ఎక్కువ జనం రావటం తనను అమితాశ్చర్య పరచిందని ముఖ్యంగా మహిళామణులు ఏంతోఉత్సాహంగా పాల్గొని ఈ నాటకోత్సవాలను దిగ్విజయం చేశారని వారికి తాను జీవితాంతం రుణ పడి ఉంటానని ప్రేక్షక దేవుళ్ళు లేకపోతె నాటకాలు నిర్వీర్య మౌతాయని ,అలాంటి చక్కని ఉత్సాహ పూరిత వాతావరణాన్ని కల్పించి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపు కొంటున్నానని ,భగవంతుని అనుగ్రహం ,స్థానికుల ప్రోత్సాహం ,ప్రేక్షకాదరణ ఇలా నే కొన సాగితే ప్రతి ఏడూ నాటకోత్సవాలు నిర్వహిస్తామని సవినయంగా మనవి చేశారు .తాము ఆహ్వానించిన వెంటనే లబ్ధ ప్రతిష్టులైన ఆర్టిస్ట్ లు తన పై ఎంతోనమ్మకం తో ఇక్కడికి వచ్చి తమ నాటకాలను ప్రదర్శించి విజయం చేకూర్చారని వారికి ఏమిచ్చినా ఋణం తీరదనని హర్షధ్వానాల మధ్య తెలియ జేశారు .

ఉయ్యూరులో నాటక ప్రదర్శన శాల అవసరం

ఈ మూడు రోజుల నాటక ప్రదర్శనలు చూశాక నాకు ఉయ్యూరు లో అన్ని హంగులతో ఒక నాటక ప్రదర్శన శాల అవసరం ఉందని అనిపించింది .ఏం. పి.,,ఏం .ఎల్ .ఎ., ,ఏం. ఎల్. సి.మంత్రిగారి నిధులు ,డిప్యూటీ స్పీకర్ గారి నిధులు ,మునిసిపాలిటీ నిధుల తో ,కే .సి. పి.సాయం తో అన్ని వసతులతో ఆధునిక సౌకర్యాలతో ఒక పర్మనెంట్ నాటకశాల నిర్మాణం కూడా ఈ ఉత్సాహపు పొంగు కుంగి పోయే లోపు వచ్చి ఫలప్రదమవ్వాలని ఆశిద్దాం .’’నాలుగవ గోడ ‘’(దియేటర్ )బలీయంగా ఉండాలని అది అందరి అవసరాలు తీర్చాలని కోరుకొందాం .ఉయ్యూరు కళాభిమానులు ఈ అత్యుత్సాహాన్ని కొనసాగిస్తారని ఆశిద్దాం .శ్రీ .వి. వి. ఆర్ .సాహసోపేతంగానిర్ణయం  తీసుకొని నాటక ప్రదర్శన దిగ్విజయం గా నిర్వహించినందుకు మనసారా అభి నందిస్తున్నాను .

సందట్లో సడేమియా గుంపులో గోవిందం

నేను నిన్న రాత్రి ప్రదర్శన చూడటానికి వెళ్ళినప్పుడు శ్రీ వల్లభనేని వెంకటేశ్వరారావు గారు నా దగ్గరకొచ్చి ,చేతిలో చేయి వేసి ‘’మీ మెయిల్ చదివాను బాగుంది థాంక్స్ ‘’అన్నారు నిన్న నేను రాసిన ‘’ఈ విజయం ఉయ్యూరు కళాభిమానులదే’’అన్న ఆర్టికల్ చదివి .నా పక్కనే నా స్నేహితుడు సూరి బాబు ఉన్నాడు ఆయనకు పరిచయం చేసి అతనికీ సన్మానం చేస్తే బాగుంటుంది అన్నాను. చేస్తున్నాం అన్నారు .సూరిబాబు మొహం వెయ్యి కాండిల్ బల్బులా వెలిగిపోయింది .మూడవ  రోజూ స్థానిక కళా కారులను సత్కరించారు .సూరిబాబుకూ సన్మానం చేయించారు శ్రీ బుద్ధ ప్రసాద్ గారి చేతుల మీదుగా .నా మిత్రుడు చాలా సంతోషించాడు .నన్నూ స్టేజి పైకి రమ్మన్నారు .ఎందుకు ?అన్నా వినకుండా లాగారు పైకి .శ్రీ బుద్ధ ప్రసాద్ ,కే సి పి సి యి వో శ్రీ వెంకటేశ్వర రావు గార్లుఆప్యాయంగా  దగ్గరగా తీసుకొని శాలువా కప్పారు .ఎందుకు కప్పారో వాళ్ళకేమైనా తెలిసిందో లేదోకాని నాకు మాత్రం తెలియ లేదు సందట్లో సడేమియా గుంపులో గోవిందా చందం అనుకొన్నాను .అయినా ధన్యవాదాలు .

మినిస్టర్ నాటకం

ప్రముఖ నాటక రచయిత శ్రీ డి విజయ భాస్కర్ రచించి ,ప్రసిద్ధ నాటక సినీ నటుడు శ్రీ కోట శంకరరావు నటించి దర్శకత్వం వహించిన ‘’మినిస్టర్ ‘’నాటకం అనుకొన్న సమయానికంటే గంట ఆలస్యంగా ప్రారంభమైంది .మినిస్టర్ గా శ్రీ శంకర రావు తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు .ఏంతో సీనియర్ నటుడు శ్రీ మల్లాది భాస్కర్ మినిస్టర్ సేక్రేటరిగా ,2004 ఎన్నికలముందు ఈ టి విలో ధారావాహికంగా వచ్చిన ‘’మాయా బజార్ ‘’రాజకీయ నాటకం లో ముఖ్య పాతదారి శ్రీ చలపతి రావు  ,మినిస్టర్ భార్యగా నటించిన ఆవిడా అందరూ సహజ నటనతో ఆకట్టుకొన్నారు .మొన్నటి ‘’అలేక్జాండర్ ‘’ఎకపాత్రాభినయం ,కొంచెం నిర్జీవంగా సాగితే ఈ నాటకం సజీవ పాత్రల తో రంగస్థలం పండింది .ప్రాణం ఉన్న నాటకం అని పించింది. అందరూ బాగానే చేశారు .మొదట్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికిన మినిస్టర్  మృత్యు దేవత బెదిరింపుతో జీవితాన్ని మార్చుకొని అందరికీ ఉపయోగ పడేట్లు ,స్వార్ధ రహితంగా ప్రవర్తిన్చేట్లు ప్రజాహితమే ధ్యేయంగా బతకటానికి నిర్ణయించుకొంటాడు .కాని అది అసాధ్యమని పిస్తారు పెళ్ళాం కొడుకులూ .డబ్బు లేనివాడు కాణీకి చెల్లుబాటుకాడని ,’’డబ్బు టుదిపవర్ ఆఫ్ డబ్బు’’తోనే అధికారం పలుకుబడి వస్తాయని భావిస్తారు .మినిస్టర్ మనసు మారదు .అతన్ని చంపి కొడుకు ఏం ఎల్ ఏ అవాలనుకొని ప్లాన్ వేస్తె మొగుడు పొతే సానుభూతి  పెళ్లానికేనికే వస్తుందని తల్లి వాడిని వారించి భర్తను చంపే ప్రయత్నం చేస్తుంది చేయిస్తుంది .దేనికీ లొంగని మినిస్టర్ ,తన పని తాను  చేసుకుపోతూ ప్రజలలో దేవుడు అనిపించుకొంటాడు .పూర్వం దగ్గరకు చేరినవాళ్ళుశత్రువులై పోతారు .ధ్యేయం మార్చుకోడు .చివరికి అతని నిజాయితీ తెలిసి ఆదర్శం అంటే అదే అని అందరూ తెలుసు కొంటారు .ముఖ్యంగా ఇందులో నీతి ’’రాజకీయ నాయకుడు నీతి,నిజాయితీలతో  ఉంటె అతని కిందపని చేసే ఆఫీసర్లు అలాగే ఉంటారు .ఆ తర్వాత కింది వాళ్ళూ,ప్రజలూ  అనుసరిస్తారు కనుక మార్పు పై స్థాయిలోనే ముందు రావాలి ‘’

సీజండ్ ఆర్టిస్ట్ శ్రీ శంకరరావు మినిస్టర్ పాత్రలో జీవించాడు .భార్య పాత్రదారిణీ అంతే.సెక్రెటరి చిన్ని కృష్ణ పాత్రధారి శ్రీ భాస్కర్ తన అపార నటనానుభావాన్ని రంగరించి ముద్దుముద్దు మాటలతో హావ భావాలతో నటించి మెప్పించాడు. మాటలు సందర్భోచితంగా ఫోర్సుబుల్ గా ఉన్నాయి .మనిషి  మారుదా మన్నా  వ్యవస్థ మారనివ్వదు .దీనికి బలీయమైన దైవ ప్రేరణ కావాలి .అప్పుడేసాధ్యం .తానూ మారి వ్యవస్థను మార్చే మినిస్టర్ పాత్ర నటించిన శ్రీ శంకరరావు ‘’నట కోట ‘’అనిపించాడు . ‘’మా టి. వి ‘’.సీరియల్ లో ఆయన పాత్ర పలికిన  ‘’ఊత పదం’’ ‘’ఇట్ ఈజ్ వెరి గుడ్ –ఐ లైక్ యు ‘’ అన్నది ఆయన నటనకూ వర్తిస్తుంది .అందరూ అభినందనీయులే .మంచినాటకం చూసిన పూర్తీ సంతృప్తి లభించింది .

శ్రీ గుమ్మడి మరో గుప్పెడు ఉంటే బాగుండేది

తరువాత ప్రదర్శన రాయబార ఘట్టానికి చెందిన శ్రీకృష్ణుని ‘’పడక సీను ‘’అనే శయన దృశ్యం .అర్జున ,దుర్యోధన శ్రీ కృష్ణ పాత్రలు .కృష్ణుడుగా శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ అభినయం గురించి చెప్పాల్సిన పనేలేదు. ఎన్నో వందల ప్రదర్శనలిచ్చిన అనుభవం ఆయనది .పద్యం నల్లేరు పై బండీ.హావ భావాలతో విరుపులతో పద్యం కదను తొక్కింది .’’బావా ఎప్పుడు వచ్చితీవు ‘’అని సుయోధనుడిని పలకరించటం తన శిష్యుడైన అర్జునుని సంభావించటం లో గుమ్మడి నటన’’ గుమ్మడి పూవై’’ విరగ బూసింది .అర్జున పాత్రధారీ చాలా ధారాళంగా పద్యాలు పలికాడు .దుర్యోధన దారీ చాలా దర్పంగా రాజసంగా పద్యం పాడి భేష్ అనిపించాడు .గోపాల కృష్ణుడు అయిన ‘’గుమ్మడి ‘’ఇంకో గుప్పెడు పొడవు ఉంటె వాచిక నటనలతో పాటు రూపం లోనూ సాటి లేని వాడని పించేవాడు అని నాకని పించింది .ఉయ్యూరు కు సమీపం లో ఇద్దరు శ్రీ కృష్ణ పాత్రధారులు ఉండటం మనం చేసుకొన్న అదృష్టం .ఒకరు మేడూరు కు చెందిన ఇప్పటి శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ అయితే మరొకరు పెనమకూరుకు చెందిన కీ శే శ్రీ అబ్బూరి వర ప్రసాద రావు గారు .ఇద్దరూ ఇద్దరే .

చిన్న ఫ్లాష్ బాక్

ఈ పౌరాణిక సీను చూశాక సుమారు పాతిక ముప్ఫై ఏళ్ళ క్రితం కాటూరు రోడ్డులో డేరాలు వేసి సురభివారు ప్రదర్శించిన పౌరాణిక నాటకాలు గుర్తుకొచ్చాయి .డబ్బు చెల్లించి చూసినా ప్రతి సీను పండింప జేసేవారు .అదొక కుటుంబ నాటక వ్యవస్థ ,ఆంద్ర దేశం వారి రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేదు .వారికివ్వాల్సిన గౌరవాన్నిచ్చి కళకుప్రోత్సాహమివ్వాలి .ఇప్పుడు ఇక్కడ జరిగింది ఉచిత ప్రదర్శన.ఎన్ని కస్టాలు నష్టాలు భరించి వీటిని ప్రదర్శిస్తారో ఒక సారి మనం ఆలోచించాలి .వారి అభినయ సామర్ధ్యానికి మనం కొట్టే చప్పట్లే వారికి ప్రోత్సాహం ప్రేరణగా నిలుస్తాయి .శ్రీ వేదాంతం సత్యనారాయణగారు ఉయ్యూరు హైస్కూల్ లో భామా కలాపం నిర్వహించారు సుమారు పాతిక ఏళ్ళక్రితం .కే సి పి వారి ప్రాంగణం లోనూ ప్రదర్శించారు .

కళలకు ప్రోత్సాహం తగ్గిపోతోంది అనుకొన్న కాలం లో ఉయ్యూరు లో ఈ నాటకోత్సవాలు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చి జీవం పోశాయి .ఆ ఉత్సాహపు పొంగు చల్లారకుండా అందరం బాధ్యత వహించాలి .అందర్నీ కలుపుకు పోయే సారధ్యం కావాలి .స్థానికంగా ఉన్న సాహిత్య సంస్థలతో సాన్నిహిత్యం అవసరం ..నా వరకు నాకు మైకు ద్వారా విని తెలుసుకోవటమే కాని ఆహ్వాన పత్రం అందలేదు అంటే నమ్మరేమో .శ్రీ వి. వి .ఆర్. సాహసానికి తగిన ప్రతిఫలం ప్రేక్షకాదరణ వలన లభించి సంతృప్తి మిగిల్చి ఉంటుంది .శుభం భూయాత్ .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-4-16-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.