భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –5
కంచి వరద రాజ దర్శనం -4
‘’త్వాం సర్వ భూతమయ మాశ్రిత సర్వ వర్ణం –యద్వైజయంత్యుపగతాచ్యుత సర్వ గంధం
తేనైవ కిం త్రిభువనైక మహా వదాన్య –సారూప్య మానవతి తే సకలాభి నంద్యం ‘’
వరదా ! నీవు సర్వభూతాత్మకుడివి ,సర్వ వర్ణాశ్రితుడివి ,సుగంధ యుక్తుడివి .అలాంటి నిన్ను ఆశ్రయించి వైజయంతిమాల నీ సారూప్యాన్ని పొందు తోంది .అన్నిప్రాణాలలో నువ్వు అంతర్యామివి .అన్ని వర్ణాల వారూ నిన్ను ఆశ్రయిస్తారు .అన్ని పరిమళాలు నీలోనే ఉన్నాయి .
వైజయంతీ మాల పక్షం లో ఆలోచిస్తే అది పంచ భూతాల రూపం లో ఉంది .
‘’పంచ రూపా తు యా మాలా వైజయంతీ గడాభ్రుతః –సా భూత సంఘాత భూతా మాలా చ వై ద్విజ ‘’అని ఒక లోక ప్రమాణం ఉంది .అన్ని రంగులు అందులోనే ఉంటాయి .అది పంచ భూతాత్మికం .అందులో అనేక రకాల పుష్పాలుంటాయి .రత్న పుష్పాలూ ఉంటాయి .అది సుగంధ బంధురం .కనుక నీకూ మాలిక కూ పోలిక ఉంది .ఈ గుణాలతో ఉన్న నిన్ను ఆశ్రయించి ఈ వైజయంతి మాల ఆశ్ర యించడం వలన నీ లక్షణాలు ఆ మాలకు సంక్రమించాయి .అంటే మాల నీ రూపాన్ని ధరిస్తోందని తాత్పర్యం .పరమాత్మ సుగంధ భరితుడు అనటానికి వేదమే ప్రమాణం –‘’సర్వ కర్మా సర్వ కామః సర్వ గంధః సర్వ రసః ‘’
71వ శ్లోకం లో అప్పయ్య దీక్షితులు కౌస్తుభ విశేషాలు వర్ణించాడు –
‘’నాభీ సరోజ కిరణై ర్మణిరాజ భాభిః-ఆత్మ ప్రభా రపి సంవలితం విభాతి
శ్రీ వత్స విగ్రహ జుషః ప్రకృతే స్త్వదీయం –వక్షః పరీత మితి సత్వ రజస్తమోభిః’’
‘’స్వామీ వరద రాజా !నీనాభి కమల కాంతులు ,కౌస్తుభ మణి దీప్తులు ,నీ శరీర కాంతితో కూడిన వక్షః స్థలం అక్కడ ఉన్న శ్రీ వత్సం అనే పుట్టు మచ్చ తో కలిసి అది ప్రక్రుతి యొక్క సత్వ రజో తమోగుణాలతో ఆవరింప బడి నట్లు గా శోభిస్తోంది .
నాభి సరోజాన్ని కొందరు తెలుపు రంగు అన్నారు .ముఖ్యంగా మురారి నాటకం లో ఈ మాట చెప్పాడు .హరి వంశం అరుణ వర్ణం అన్నది .నైషధం లో తెలుపు అని ఉంది. ప్రపంచ సార సంగ్రహం మాత్రం శ్యామల వర్ణం అన్నది .ఇలా కౌస్తుభ నాభి వర్ణాలు రక రకాలుగా వర్ణింప బడ్డాయి .ఇది విరోదా భాసం అని కంగారు పడక్కర్లేదు .విష్ణు పురాణం స్వామి వారి శ్రీ వత్సం అంటే పుట్టుమచ్చ ప్రక్రుతి స్వరూపం అన్నది .
‘’శ్రీ వత్స సంస్థాన మయ మనంతే చ సమాశ్రితం –ప్రధానం బుద్ధి రూప్యాస్తే గదః రూపేణ మాధవే ‘’
అంటే అది వక్షస్సు కుడి వైపు బిల్వ రూపం లో ఉంటుంది .హరివంశ మహా పురాణం లో –‘’శ్రీ వత్సే నోరసి శ్రీమాన్ రోమ జాలేన రాజతే ‘’అని ఉంది .రోమాల ఆవర్తం అంటే రోమాల సుడి అని అర్ధం చేసుకోవాలి .వామన పురాణం –‘’అదొక భూషణ విశేషమని చెప్పింది .అందులోని ‘’విష్ణు పంజర స్తోత్రం ‘’లో –‘’వైజయంతీం ప్రగ్రుహ్యాథ శ్రీ వత్సం కంఠ భూషణం –వాయవ్యాం రక్షమాం దేవ అశ్వ శీర్ష నమోస్తుతే ‘’అని ఉన్నది .
మరో శ్లోకం లో స్వామి చేతి కంకణం నుండి ప్రభవించే పల్లవ రాగం లాలన తో కలిసి గర్వించి సూర్యుడిని కూడా దిక్కరిస్తోంది అంటాడు దీక్షితకవి
మాణిక్యం పద్మరాగం ,కురువిందం ,సౌగంధికం ,నీల గ౦ధీ అని నాలుగు రకాలు .వీటిలో కూడా నాలుగు వర్ణాలున్నాయి అని రత్న శాస్త్రం చెప్పింది .వీటి రంగులు ఎరుపు మిక్కిలి ఎరుపు ,పసుపు నీలం అని వివరించింది .కురు వి౦దానికే పల్లవ రాగం అనే పేరుంది .’’ప్రచక్రమే పల్లవ రాగ తామ్రా’’అని కాళిదాసమహా కవి చెప్పాడు .దీనికి రాసిన వ్యాఖ్యలో పల్లవ రాగం ఒక రత్న విశేషం అని చెప్పారు .
సవిత్రుడు అంటే సూర్యుడు ,తండ్రి అనీ రెండు అర్ధాలున్నాయి .పల్లవ శబ్దానికి విటుడు అనే అర్ధమూ ఉంది .అంటే ఏది చేయదగినదో ఏదికాదో తెలియని వాడని అర్ధం .విటుడు తండ్రిని దిక్కరించినట్లు పల్లవ రాగమణిసూర్యుడిని తిరస్కరిస్తోంది అని భావం .
‘’ఆబాతి దేవ విధృత స్తవ సవ్య పాణౌ –అంతర్బహిశ్చ శుచి రచ్యుత పంచ జన్యః
అంతే వమన్నివ గలస్య గురో రభీర – ద్వాన క్రియోప నిష దధ్యయ నారద మేషః ‘’
‘’అచ్యుతా !నీ ఎడమ చేతి లో ఉన్న పాంచ జన్య శంఖం లోపలా బయటా ,ఉచ్చ్శ్రై స్రవం తో ఉపనిషత్తులను పఠించ టానికి ,నాదం అనే ఉపనిషత్తును నేర్చుకోవటానికి నీ కంఠ సమీపం లో శిష్యుని మాదిరిగా కనిపిస్తోంది .
బ్రహ్మాండ పురాణం లో ఎవరు భక్తులకు ఇష్టులు అనే వివాదం లక్ష్మీ సరస్వతుల మధ్య జరిగిందనీ బ్రహ్మను తేల్చి చెప్పమని కోరితే లక్ష్మీ దేవే అని చెప్పాడని ,సరస్వతికి కోపం వచ్చిందని ,ఆ కోపం వరద రాజ స్వామి కౌమోదకి గద లాగా ఉందని చమత్కరించాడు దీక్షితులు .కౌమోదకి పచ్చగా ఉంటుంది అన్నది ‘’ప్రపంచ సారం ‘’-‘’చక్రం ,శంఖం గదాంబుజ కౌస్తుభ ముసలాః-స ఖడ్గవనమాలాః రక్తాచ్చ పీత కనక శ్యామల కృష్ణ ద్యుశుక్ల భాసః స్యుహుః’’
80వ శ్లోకం లో అప్పయ్య దీక్షితులు
‘’నామైవ తే వరద వాంచిత దాటరు భావం –వ్యాఖ్యాత్యతో నవ హసే వరదాన ముద్రాం
న హ్యాగ మోదిత రసః శ్రుతి సిద్ధ మర్ధం-లింగేన బోధ్యుమురరీ కురుతే విపశ్చిత్’’
స్వామీ !అభయ ముద్ర లాగా వరద ముద్రను నువ్వు ఎందుకు ధరించలేదు అనే ప్రశ్న ఉంది .అసలు నీ పేరే వరదుడు.కనుక వేరుగా వరముద్ర ఎందుకు ?ప్రత్యక్షంగా కనిపిస్తుంటే మళ్ళీ అనుమాన ప్రమాణం ఎందుకు ?వామన పురాణం లో వరద రాజ వ్యుత్పత్తి ఉన్నది –కోరిన కోర్కెలు తీర్చేవాడూ ,బాధలు పోగొట్టేవాడు కనుక వరద రాజు అయ్యాడని ఉంది –
‘అభి గమ్యోవై వరం దత్తే ప్రణతార్తివినాశినః –ఆఖ్యాం వరద రాజేతి యయౌ నిత్యం క్రుతార్ధయన్ ‘’
వరద అనే పదం తోనే స్వామి తత్త్వం బోధ పడుతుంది వేదమే’’రసో వై సహః రాసగ్గం హ్యేవాయంలబ్ధ్వా నందీభవతి ‘’అని ప్రతిపాదించింది .
ఇంకో శ్లోకం లో ‘’ఉపేంద్రా !నీ ముఖార వింద శోభను గ్రహించాలనే లోభ గుణం వలన చంద్రుడు ,కృష్ణ పక్షం శుక్ల పక్షం అనే మిష తో నీ దేవ మందిరం చుట్టూ చాంద్రాయణ వ్రతం ఆచరిస్తూ నీ కాంతిని తాగటానికా అన్నట్లున్నాడు ‘’అన్నాడు .
వాస్తవానికి సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు .అది మేరు పర్వతం కాదని దేవ మందిరం అనీ కవి చమత్కరిస్తున్నాడు.శుక్ల పక్షం లో పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు రోజుకు ఒక ముద్ద పెంచుతూ పౌర్ణమినాడు 15ముద్దలు తినటం కృష్ణ పక్షం లో తగ్గించుకొంటూ పోవటం గా చేసే వ్రతాన్ని చాంద్రాయణ వ్రతం అంటారు .చంద్ర కళల వృద్ది క్షయాలను బట్టి చంద్రుడు కూడా ఇలా వ్రతం చేస్తున్నాడు అంటాడు కవి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-16-ఉయ్యూరు