భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –7
ప్రాచీన సాహిత్యం ఎందుకు చదవాలి ?
అని ప్రశ్నించి డా .ఇరివెంటి కృష్ణ మూర్తి చక్కని సమాధానాలు చెప్పారు .భారత దేశం లో ‘’చప్పన్న ‘’అంటే 56రాజ్యాలు౦డేవి .అన్నీ స్వతంత్ర రాజ్యాలే .సర్వ సత్తాక అధికారం కలిగినవే ..కాని సాంస్కృతిక పరంగా భారతీయ ప్రజలను ఈ 56ప్రభుత్వాలు విడగొట్ట లేక పోయాయి .భారతీయుడు తనది ఫలానా రాష్ట్రం అని గర్వ పడడు.ఏ శుభకార్యం చేసినా ఆ ఊరిలోని నీటినే కలశం లో పోసి దేశం లోని పవిత్ర నదులన్నీ ఆ నీటిలోనే ఉన్నాయని ఆవాహన చేసి గర్విస్తాడు .జంబూద్వీపే భారత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ లేక ఉత్తర దిగ్భాగే శ్రీశైలానికి లేక హిమవత్పర్వతానికి ఏ దిక్కున ఉన్నాడో ,ఏ పవిత్ర నదీమ తల్లుల మధ్య ఉన్నాడో చెప్పుకొని పులకించి పోతాడు .తన సాంస్కృతిక జీవనం లో రాజకీయానికి స్థానం కలిపించడు.అదీ అనాదిగా వస్తున్నా మన సంప్రదాయం .
భారతీయులను అందర్నీ సాంస్కృతిక పరంగా ఏకం చేసినవి పూర్వ భారత సాహిత్యం .వ్యాస వాల్మీకి కాళిదాసాదికవులు .వీరు ఈ దేశ ప్రజలకు ఆలోచనా ధోరణిని ,జీవిత విధానాన్నీ ,జీవిత లక్ష్యాలను ప్రసాదించారు .ఆనాడు వారు సంస్కృతం లో రాస్తే వాటిని చదివి స్పూర్తి పొందారు జనం .అనువాదాలూ వారికి చేరువయ్యాయి .అ సాహిత్యం కావ్యాలు నాటకాలు జానపదాలు కధలూ గాధలుగా విస్తరిల్లింది కావ్యాల పేర్లతో నగరాలు ,గ్రామాలు బిరుదులూ వెలిశాయి.కనుక ఆర్ష సంప్రదాయానికి ఎత్తిన వైజయ౦తిక లు ఈ మహా కావ్యాలు . భారత దేశ భౌగోళిక సౌందర్యం ,భారతీయ జీవిత వృత్తం ధర్మాభిరతి ,లౌకిక పారలౌకిక జీవితాదర్శాలు ,జీవిత సాఫల్యానికి అవసరమయే శాస్త్ర పరిజ్ఞానం ,రాజనీతి,అర్ధ నీతి మొదలైన వెన్నో మన ఇతిహాస పురాణాలలో నిక్షిప్తమై ఉన్నాయి .ఇప్పటికీ యావత్ ప్రపంచానికీ మానవత్వపు విలువలను ఇవే అందజేస్తున్నాయి .అన్ని వర్ణాల, వర్గాల వారూ వీటిని చదివే ప్రేరణ పొందుతున్నారు .అందుకే భారాతీయులందరికి ఏ ప్రాంతీయ భాషాకవి తమ కవి కాలేకపోయాడు .సంస్కృతంలో పరిచయం ఉన్నా లేకున్నా అందరికి వ్యాస వాల్మీక ,కాళిదాస భవ భూతుల వంటి వారే కవులు .ఇదొక అనిర్వచనీయ భారతీయ సంస్కృతీ రహస్యం అంటారు ఇరివెంటి వారు .
భారత స్వాతంత్ర్య సమార యోధుడు మేధావి ,మహా మనీషి ,అపర చాణక్యుడు రాజాజీ భారతీయ ఆత్మను అర్ధం చేసుకోవాలంటే రామాయణ భారతాలను మనం చదివి తీరాల్సిందే అని నిర్మొహమాటం గా స్పష్టంగా చెప్పాడు .దార్శనికుడు రాజకీయ వేత్త పండిత నెహ్రూ రామాయణ భారతాలు భారతీయ సంప్రదాయ విజ్ఞాన సర్వస్వాలని ,భారతీయులను ఏక సూత్రం తో కలిపే సందేశ కావ్యాలని ,భారతీయ తత్వ చింతనకు బహుముఖీన విజ్ఞానానికి ప్రతీకలు అన్నాడు .మహాత్ములందరూ వీటి ప్రేరణతో ఉద్దీప్తులైనవారే నని మనం మరచిపోరాదు .జాతి పిత మహాత్మా గాంధీజీ ‘’గీత నా తల్లి ‘’అన్నాడు భగవద్గీతపై తనకున్న అపార నమ్మకం తో .
ఈ సాహిత్యం లోని కధలూ ఉపాఖ్యానాలు నేటి మన పత్రికలలో పతాక శీర్షికలకు మార్గ దర్శనం చేస్తున్నాయి .సామెతలుగా ,జాతీయాలుగా ఉపయోగ పడుతున్నాయి .అందులో కొన్ని –పరశురామ ప్రీతి ,కబంధ హస్తాలు ,లక్ష్మణ రేఖ ,రావణ కాష్టం ,పుష్పక విమానం వంటివి ఎన్నో ఎన్నెన్నో .అయితే ఇప్పటి యాంత్రిక రాజకీయ జీవితం లో సంప్రదాయం క్రమంగా కనుమరుగై పోతోంది .ప్రపంచం లో భారత్ కు ఉన్న విశిష్ట స్థానం ఇప్పుడు లేదు ..పశువులోని మానవుడు వృద్ధి చెందాడని పాశ్చాత్య దేశాలు నమ్మితే మనం మాత్రం మానవుడు దైవాంశ సంభూతుడు అని ఎలుగెత్తి చాటాం, చాటుతున్నాం, చాటుతాం .ఈ విశిష్ట ఆలోచనా ఫణితి మనం కాపాడుకొంటే ప్రపంచ దేశాలు మనకే అగ్రాసనాదిపత్యమిస్తాయి .ప్రాచీన సాహిత్యం చదవటం అంటే తిరోగమనం అనుకోటం పెద్ద పొరబాటు .సార్వకాలీన సార్వ జనీనమైన విలువల తో బతకటాన్ని నేర్చుకోవటం అని గ్రహించాలి.అదే అందరి ఆదర్శం అయితే అంతా ఆర్యావర్తమే అవుతుంది .
పురాణ ఇతిహాసాలలో మన గత చరిత్ర నిన్నటి అనుభవాలు దాగి ఉన్నాయి .నిన్నటి కన్నీరు తో బాటు పన్నీరూ ఉందని గుర్తించాలి .జీవితాన్ని రసాత్మకం గా మార్చుకొనే ప్రక్రియలున్నాయి .పాశవికత నుండి పరమోన్నత స్థాయికి చేరుకొనే విధానాలున్నాయి .ఆ సాహిత్యం దైవ భక్తికీ ,ధర్మానురక్తికీ ,ధర్మానుసరణకూ ప్రమాణంగా నిలిచింది .వీటిని చదవని వాడు ఏదీ చదవని వాడి కిందే లెక్క .ఇవికాక క్రీ శ .ఒకటవ శతాబ్ది లో వచ్చిన ‘’బృహత్కధ ‘’లేక కదా సరిత్సాగరం ,రెండవ శతాబ్దం లో శ్రీ మధిర సుబ్బన్న దీక్షితుల ‘’కాశీ మజిలీ కధలు ‘’ కూడా మానవ మస్తిష్క వికాసానికి తోడ్పడేవే .అలాగే బసవ పురాణం లో మనవ సంబంధాలున్నాయి. ఇవన్నీ చదివి అర్ధం చేసుకొని అన్వయించుకొని జీవిస్తే వేరే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు వందలూ వేలూ పోసి కొని చదవక్కరలేదు .పురాణ ఇతహాస వాగ్మయం తో మన పరిచయం భారతీయత లక్షణం .,జాతీయత లక్షణం విశిష్ట వ్యక్తిత్వ లక్షణం అంటారుమహా వక్త ,ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడేమీ కార్య దర్శి ,యువ భారతి స్థాపకులు ,ఉస్మానియా విశ్వ విద్యాలయ స్నాతకోత్తర కేంద్ర తెలుగు శాఖ రీడర్ డా .ఇరివెంటి కృష్ణ మూర్తి- విజయవాడ ‘’రసభారతి’’వారు ప్రచురించిన ‘’పీయూష లహరి ‘’లో .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-16-ఉయ్యూరు