భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –8

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –8

రామాయణ  రామణీయకం

విజయవాడ ‘’రస భారతి ‘’వారి ‘’పీయూష లహరి ‘’లో ఆచార్య దివాకర్ల  వేంకటావధాని గారు రాసిన దానిలో వివరించిన రామాయణ  రామణీయక  విశేషాలను  తెలుసుకొందాం .వాల్మీకి మహా కవి అవతరించాకనే’’ కవి ‘’అనే ఏకవచనం వచ్చింది  .వ్యాస మహర్షి తో కలిపితే ‘’కవయః ‘’అనే ద్వివచన మేర్పడింది .దండీ కాళిదాసాదులవలన బహువచనమేర్పడింది . వాల్మీకి ‘’వేదార్ధ ఉప బృంహితార్ధం ‘’అంటే  జగద్ధిత కాంక్షతోశ్రీమద్రామాయణం రచించాడు .ఆ తర్వాత అనేకమందికవులు రామాయణం రాశారు. ఎవరి కోరిక వారిది .అనర్ఘ రాఘవ కర్త బాల మురారి శ్రీరాముని గుణ గణాలు మరో నాయకుని లో లేనందువలన రాశానన్నాడు –‘’యది  క్షుణ్ణం పూర్వైః ఇతి జహతి రామస్య భరితం –గుణై రేతావద్భిః జగతి పునరన్యోజయతికః ‘’.అలాగే జయ దేవ మహాకవి ప్రసన్న యాదవ నాటకం లో ‘’రాముడిని వదలి వేరే నాయకుడి ని ఎలా ఎంచుకోను ?తెలుగులో కంకంటి పాపరాజ కవి –

‘’మానుగకర్మ భూమి పయి మానవ జన్మము నెత్తి నిర్మల –జ్ఞానము గాంచి మానవుడు చారుకవిత్వము నేర్చి ‘’జానకీ

జాని ‘’కదల్ రచింపక అసత్ కద లెన్నోరచించే నేనియున్ –వాని కవిత్వ మేటికి ,వాని వివేక మహత్వ మేటికిన్ ?’’అని ప్రశ్నించాడు .భోజరాజు ‘’చంపూ రామాయణం ‘’లో గంగను భూమి పైకి భగీరధుడు తెచ్చాడని ,అది భగీరధ గంగ అని పితృ దేవతలకు గంగోదకం తో తర్పణం చేయని వాడు ఉంటాడా ?అన్నాడు .అంటే అది జాతీయ సంపద అయింది అలాగే రామాయణం కూడా .వ్యవహార నేతృత్వం రామాయణం లోనే ఉంది .’’ఒక పిల్లాడిని రామాయణం నేర్పి అడవి లో వదిలిపెడితే ,20ఏళ్ళకు సామాన్య నాగారికుడికంటే ఎంతో గొప్పగా వ్యవహరిస్తాడు ‘’అని ఒక పాశ్చాత్య పండితుడు అన్నాడు ..రామాయణం గొప్ప తనానికి సుందర కాండ ఒక కారణం .’’సుం’’అంటే శోకాన్ని ‘’దర’’అంటే ఖండించేవాడు అంటే హనుమంతుడు .సీత శోకాన్ని శ్రీరాముని శోకాన్ని సుందర కాండలో తీర్చిన వాడు శ్రీ ఆంజనేయ స్వామి .పద్మ పురాణం లో శివుడు పార్వతికి హనుమ వైభవాన్ని బోధిస్తూ ‘’మదంశజో,మహాభాగో ,మహా భుజ పరాక్రమః సుభాగః సున్దరః శ్రీమాన్ భక్త రక్షణ పరాయణః’’అని కీర్తించాడు .హనుమ భుజ వివేక పరాక్రమ వర్ణనలు ఉండటం వలన సుందరమైనది .అందువల్ల ఈకాండ చేత రామాయణ ప్రాశస్త్యం హెచ్చింది  అన్నారు .

తనతో పాటు శ్రీరాముని యాగ రక్షణార్ధం తీసుకు వెళ్లి ఆయనను ‘’కౌసల్యా సుప్రజా రామా ‘’అనే శ్లోకం తో నిద్ర లేపాడు ఇదే  సాహిత్యలోకం  లో మొదటి సుప్రభాతంగా రికార్డ్ సృష్టించింది .సీతాపహరణం లేకపోతె రామాయణం ద్రౌపదీ వస్త్రాపహరణం లేక పొతే భారతం లేవు .రామాయణం నాయక ,నాయిక ,ప్రతి నాయక అంటే 3 పేర్లతో పిలవబడటం విశేషం . ‘’కావ్యం’’ రామాయణం’’ క్రుత్స్హ్నం’’ సీతాయాశ్చరితం’’ మహాత్ –‘’పౌలస్త్య వధం’’ ‘’ .వాల్మీకి సామాన్య కవికాడు .దర్శన వర్ణనం ఉన్న కవి .తమసానది ని వర్ణిస్తూ వాల్మీకి –‘’ఆకర్దమ మిదం తీర్ధం భరద్వాజ నిశామయి-రమణీయం ప్రసన్నాంబుసన్మనుష్య మనో యధా’’-సత్పురుషుని మనసులాగా తమసానది ఉన్నది .’’

‘’ మానిషాద ప్రతిస్టాంత్వమగమః శాశ్వతీస్సమాః-యత్ క్రౌంచ మిధునాదేక మవధీః కామ మోహితం ‘’అనే భారతీయ సాహిత్యం లో వాల్మీకినోట వెలువడిన  ప్రధమ అనుష్టుప్ శ్లోకం లో’’ సప్త స్వరాలు ‘’నిక్షేపి౦చ బడ్డాయి అని విశ్లేషకులు తేల్చారు .అందుకే ‘’పాఠయే చ మధురం ‘’అన్నారు .గురువు విశ్వామిత్రుని గంగావతరణం కధ చెప్పమని రాముడు కోరితే రుషి కుమారస్వామి జననం చెప్పాడు .ఇదే గడసరి కధాకధనం అంటాడు విశ్వనాధ .తను రాక్షస సంహారం యాగ రక్షణా చేసుకోగాలిగినా విశ్వామిత్రుడు  రాముని  తెచ్చుకొన్నాడు. ఆయనద్వారా లోకానికి గురు శుశ్రూష ఎలా చేయాలో బోధించాడు .శ్రీ కృష్ణ బలరాములు సాందీపని గురువు వద్ద విద్య నేర్చారు .నిజంగా వాళ్లకు ఆ అవసరం లేదు అయినా లోకానికి చాటటానికి చదివారు .అదీ పరమార్ధం .

రాముడిని తనతో పంపమని అడగటానికి దశరధుని దగ్గరకు విశ్వామిత్రుడు వచ్చాడు .ఆయనను వర్ణిస్తూ దశరధుని చేత విశ్వనాధ ‘’మీరు రావటం ఊసర క్షేత్రానికి వర్షం రావటం ,పుట్టు పేదకు కొండలో నిధి అందినట్లు ‘’లుప్త పిండమై లొచ్చున వడ్డ వంగడములో నిసువొక్కటి చొచ్చుటే ప్రభూ ‘’అంటాడు .ఇంతగొప్పగా చెప్పిన వారు తెలుగు కవిత్వం లో లేరు అంటారు అవధానిగారు .దీన్ని కొనసాగిస్తూ

‘’నీవై వచ్చుట మా గృహంబులు త్రివేణీ మంగళ స్నాన పు –ణ్యావిర్భావములయ్యె,మా యెడల గాయత్రీ మహాదేవి ,శ్రీ

సావిత్ర్యాక్రుతి ద్రష్ట వేదముగ సాక్షాత్కర మిప్పించె ,ఏ –లా వేదంబులు నాల్గు నాలుగు మొగాల౦ బాడినట్లయ్యేడిన్’’అని తన జీవితానుభవాన్ని రంగ రించి రాశాడు విశ్వనాధ .గాయత్రీ మంత్రం లో 24అక్షరాలున్నాయి .ఒక అక్షరానికి వెయ్యి చొప్పున రామాయణం లో 24వేలశ్లోకాలున్నాయి .రామాయణం లో ఏ పాత్ర యెంత వరకో అంతవరకే ఉంటుంది .సీతా స్వయం వరం తర్వాత విశ్వామిత్రుడు మళ్ళీ కనిపించడు.మహర్షి రాముడికి అస్త్ర శస్త్రాలివ్వటం ,తాటక సంహారం ,మారీచ సుబాహు వధ ,అహల్యా శాప విమోచనం సీతాకల్యాణం అనే అయిదు పనులు చేసి నిష్క్రమించాడు .’’గురు దక్షిణనిమ్ము తాటకాభల్లము నాకు ‘’అని శిష్యుడిని కోరితేనే రాముడు స్త్రీ అయిన తాటక సంహారం చేశాడు .అహల్యాశ్రమం ‘’హరి విడిచిన వైకుంఠం’’లాగా అనిపించిందట .అహల్యకు రామ పాదం సోకగానే ప్రాణం ఎలా వచ్చిందో విశ్వనాధ నభూతో గా చెప్పాడు .అదే విశ్వనాధ ఉపజ్న –

‘’ప్రభు మేని పైగాలి పై వచ్చినంతనే ,పాషాణ మొకటికి స్పర్శ వచ్చే –ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు మొలిచే

ప్రభు మేని నెత్తావి పరిమళించిన చోట ఆశ్మంబు ఘ్రాణే౦ద్రియంబు నొందే-ప్రభు నీల రత్న తోరణ మంజులాంగంబు కాన వచ్చినంతనే కనులు వచ్చే

అ ప్రభుండు వచ్చి ,ఆతిధ్యమును స్వీక – రించినంత ఉపల హృదయ వాది

ఉపనిషద్విదాన మొలికి శ్రీరామ భ-ద్రాభి రామ మూర్తి యగుచు పొలిచె ‘’

ఇంతటి అద్భుత కల్పన చేసి అహల్యకు పంచేంద్రియత్నాన్ని కల్పించిన వారెవ్వరూ లేరు .

కల్ప వృక్షం లో పరశురామ గర్వ భంగాన్ని ముందే చేయించాడు విశ్వనాధ .శివ ధనుర్భంగ ఘట్టం లో విశ్వనాధ

‘’అతని దృష్టికి జానకి ఆగలేదు –అతని క్రుస్టికి శివధనుస్సాగ లేదు

సీత పూజడ వెన్నుగ శిరసు వంచే –చెరకు గడవోలె నడిమికి విరిగే ధనువు ‘’

ఇంతటి ఉదాత్త వర్ణన చేసిన కవీశ్వరులు కనిపించరు .

శ్రీరాముడిని 4ఘట్టాలలో వాల్మీకి భగ వంతునిగా   చాటి చెప్పాడు అంటారు ఆచార్య దివాకర్ల .శబరికి మోక్షం ,జటాయువు మోక్షం ,గుహునితో సంభాషణం ,సుమిత్ర లక్ష్మణునికి చేసిన ఉపదేశం ఘట్టాలలో రాముడు సాక్షాత్తు పరమేశ్వరుడే నని చెప్పాడు .సుమిత్ర ,కొడుకు లక్ష్మణునితో ‘’రామం దశరధం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం-అయోధ్యామటవీం విద్ధి గచ్చ తాత యదా సుఖం ‘’అని దిశా నిర్దేశనం చేస్తుంది అరణ్య వాసానికి పంపుతూ .ఈ శ్లోకం లో అనేకార్ధాలు చెప్పారు పండితులు .దశ అంటే పక్షి –దశరధుడు అంటే పక్షి వాహనంగా ఉన్నవాడు శ్రీ మహా విష్ణువు .ఆనారాయణుడే ఈ శ్రీ రాముడు .రాముడే దశరధ స్థానానికి అర్హుడని –మాం అంటే లక్ష్మీ దేవిగా సీతను భావించు అని భావం .తాను  మాత్రం’’ I shall become the daughter of my father ‘’అని సుమిత్రమనో నిశ్చయం .తనకు ఒక ప్రత్యేకత లేదని అర్ధం .అడవిని స్వర్గం గా చూడు అని ఉపదేశించింది .’’దేవానాం పూరయోధ్యా ‘’అని అరుణం భగవత్తత్వాన్ని చెప్పింది .

శబరి ‘’తుట్ట తుద దాక ఎండిన చెట్టు కొమ్మ –శిఖరంబున యందు పుష్పించినట్లు ‘’గా కనిపించింది రాముడికి .ఆమె రామునితో ‘’ఈ దేశంబున చెట్టు చెట్టు గృహమోయి నాకు ‘’అని చెప్పింది .’’స్నానాదుల్ నిత్య పవిత్ర మూర్తికిని మర్యాదా మహా౦ బోదికిన్’’అని భక్త శబరీ అంటే రాముడు ‘’అవాక్కయ్యాడట ‘’.ఎందుకు ఈ ముసలి వయసులో ఇంతకష్టపడి పూలు ,పళ్ళూ  తెచ్చావమ్మా అని రాముడు అంటే –‘’నేను పూలు పళ్ళు తేలేదు –లీలామనోజ రాలేదు నేను ‘’అందట .’’చేతులున్నాయికనుక పూలు ,చెట్లున్నాయికనుక పళ్ళు ,శరీరం ఉంది కనుక నడిచి వచ్చాను ‘’అంది శబరి .ఫైనల్ టచ్ ఇస్తూ ‘’చిత్తముండుట ఊహ చేసితిని స్వామి ‘’అంది.

శబరితో రాముడు  సరదాగా చలాకీగా మాట్లాడితే ఆమె తగిన సమాధానాలే చెప్పింది విశ్వనాధ శబరీ .’’ఏమిటమ్మా నీ జుట్టు ముగ్గు బుట్టయ్యంది.’’అన్నాడు .దానికి శబరీ ‘’ప్రభు నీ ఆత్మ వాకిట రంగ వల్లి దిద్దుటకు ఇంత పండినది ‘’అన్నది .’’ఎంతో తపించి నీ ఆయువంత ఏర్చి ఇట్లు ఏకైతివి ?’’అని గడుసుగా అడిగితె ‘’ప్రభువ స్నేహంబు (నెయ్యి )చేత,ఆర్ద్రంబు చేసి (తడిపి )ఇంత వత్తిగనన్ను వెల్గి౦చవే ‘’అని బదులిచ్చింది .పరవశించిన ‘’రామ సామి  ‘’శబరికి మోక్షం ప్రసాదించాడు .’’తవ ప్రసాదాత్ గచ్చామి ‘’అంటూ శబరీ పరమపదం చేరింది .అలాగే జటాయువుకూ ‘’గచ్చ లోకానుత్తమన్ ‘’అని భగవంతునిగా దర్శనం ప్రసాదించాడు .వాల్మీకి వర్ణనారీతి నిరుపమానం .’’అహో రాగ వతీ సంధ్యా జాహితి స్వయ మంబరం ‘’శ్లోకం లో నాయకా నాయికల వర్ణనను సంధ్యా వర్ణనలో కలిపేశాడు .ఇలా ఎన్నైనా చెప్పవచ్చు .అందుకే గిరులు తరులు ఉన్నంత వరకు రామాయణ కద ఉంటుంది అంటాడు మహర్షికవి వాల్మీకి .అందుకే విశ్వనాధ ‘’ఎన్ని జన్మలైనా వాల్మీకి ఋణం మనం తీర్చుకోలేము ‘’అన్నాడు .వాల్మీకి ఆది కవి .నాటికీ నేటికీ ఆయన్ను మించినవారు లేనేలేరు అన్నారు ఆచార్య దివాకర్ల వేంకటావాధాని గారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-16-ఉయ్యూరు

‘’

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.