భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –10

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –10

భాగవత పరమార్ధం

ఆచార్య శ్రీ గంటి సోమయాజి గారి దర్శకత్వం లో ‘’తెనుగు వ్యాకరణ వికాసం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.పొంది ,ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో తెలుగు ప్రొఫెసర్ గాను ,ప్రాచ్యభాషా విభాగాలకు అధ్యక్షులుగాను పని చేసి,యుగపురుషుడు  ,విశ్వకవి గద్య రచనలు ,కుమారాంజలి ,సత్యం శివం సుందరం మొదలైన పద్య రచనలు ,మా నిషాదం వంటినాటికలు ,కాళిదాసకవిత వంటి విమర్శన గ్రంధాలు రచించి ,యూని వర్సిటి గ్రాంట్స్ కమీషన్ చే జాతీయోపన్యాసకులుగా గౌరవి౦పబడి ,యావద్భారత దేశం పర్య టించి ఢిల్లీ బెనారస్ ,బెంగుళూర్ అన్నామలై మున్నగు విశ్వ విద్యాలయాలలో వివిధ విషయాలపై ఉపన్యాసాలిచ్చి ప్రభావితం చేసిన ఆచార్య బొడ్డు పల్లి పురుషోత్తం గారు విజయవాడ ‘’రసభారతి ‘’వారి ‘’పీయూష లహరి ‘’కోసం రాసిన పోతన భాగవత విశేషాలలో నుంచి కొన్ని విషయాలను గూర్చి తెలుసుకొందాం .

గాంధీ మహాత్ముడు ఆంగ్ల భాష ను వాడటం చేత ఆ భాషకు ఎంతో గౌరవం కలిగింది అని విశ్వనాధ గాంధీ మరణం పై ‘’మానవ నిర్మితంబైన ఆంగ్లేయంబు శ్రీ రుషి ప్రోక్తంబు చేసినారు –కేవలము రుణ పడ్డ దాంగ్లేయ జాతి –నీకు మానవ సామాన్య నియత ధర్మ –మురలి సామ్రాజ్య ధర్మంబు నొక్కదాని –తెచ్చు కొని బాధ పడుచుండు పిచ్చి జాతి ‘’అని మనల్ని గురించి బాధ పడ్డాడు .నన్నయ తిక్కనలు చెప్పింది లౌకిక కవిత్వం .పాల్కురికి సోమన చెప్పింది మత కవిత్వం కాని కవి యోగి భక్త పోతన్న చెప్పింది భక్తీ కవిత్వం అన్నారు .ఇదే విశ్వనాధ దృష్టిలో జీవుని వేదనను తీర్చి శాంతి చేకూర్చేది అన్నారు బొడ్డుపల్లి వారు .భక్తి సంకుచితమైనది కాదు జాతి మతాతీతమైనది భక్తీ .

పోతన కేవలం భక్తీ కవి కాదు .భక్తీ కవిత్వోద్యమ సారధి .యావద్భారత దేశం లోను భక్తీ కవిత్యోద్యమానికి ఆద్యుడు పోతన .సూరదాసు ,తులసీదాసు తుకారాం వంటి భక్తకవులకు ప్రేరణ పోతన్నయే .వల్లభాచార్యులకు భుక్తిపాదం నెలకొల్పటానికి ఆంద్ర భాగవతమే ఆధారం .

’’వర గోవింద కదా సుధారస మహా వర్షోరు ధారా పరం –పరలకు గాక ,బుదేంద్ర చంద్ర !ఇతరోపాయాను రక్తిం ప్రవి

స్తర దుర్దాంత దురంత దుస్సహ జనుస్సంభావితానేక దు –స్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బారునే ‘’అన్నవాడు పోతన .సంకీర్తన భక్తికి  ప్రాణం పోసి జన తరుణోపాయానికి మార్గం చూపిన కవి పోతన .సంకీర్తన భక్తితో జన చైతన్యం కలిగిందని విమర్శకాభిప్రాయం .చైతన్య ప్రభువు ఆంద్ర దేశం లో సంచారం చేశాడు .మంగళ గిరి పానకాల స్వామి దివ్య దర్శనం చేశాడు .అప్పుడు పోతనగారి భాగవత ప్రభావం పడే ఉంటుంది .చతుర్విధ ,పంచవిధ నవ విధ భక్తులను గురించి ఆంద్ర భాగవతం సవిస్తరంగా తెలిపింది .నిజానికి ఆంద్ర భాగవతం వ్యాస భాగవతం కంటే మహత్తరమైనది అన్నారు ఆచార్య శ్రీ పురుషోత్తమం గారు .వ్యాస భారతం లో భక్తీ శాస్త్రం గా చెప్ప బడింది .శాస్త్రం తండ్రి వంటిది .భక్తి కళ.తల్లి వంటిది .’’భక్తి జననీ భక్తార్భకం రక్షతి ‘’అన్నారు ఆది శంకరాచార్యులవారు .పోతనగారు భక్తిని కళగా పోషించారు.భక్తీ చేత శ్రీ కైవల్యం పొందటానికి కవిత్వం చెప్పాడు పోతన .భగవంతుడు ‘’భక్త పాలన కళా సంరక్షకుడు ‘’అన్నాడాయన ‘’మహానందనా డింభకుడి ‘’లాగా భాగవతం ఆనందాన్ని ప్రసాదిస్తుంది .

అన్నీ రాసినా మనసు చికాకుగా ఉంటె నారదమహర్షి వ్యాసుని హరినామ స్తుతి చేసే భాగవతం రాయమన్నాడు .ఆయన యెంత ప్రయత్నించినా శాస్త్ర  వైదుష్యం వృద్ధి కాలేదు . అందుకే వ్యాసభాగవతం మహా మనీషికి కాని అవగాహన కాదు .బ్రహ్మ సూత్రాలు భగవద్గీత ఉపనిషత్తులు అధ్యయనం చేస్తేకాని భాగవతాన్ని చే బట్టే సామర్ధ్యం చేకూరదు .కాని పోతన భాగవతం అలాంటిది కాదు .అడుగడుగునా హరినామ స్తుతి అలరారుతుంది .అవకాశం ఉన్నప్పుడే కాదు ,అవకాశం కల్పించుకొని హరినామ స్తుతి చేస్తాడు భక్తకవి పోతన .అంటే నారద మహర్షి ప్రబోధాన్ని ఈ ఆంద్ర వ్యాసుడు పోతన్న తూ చా తప్పకుండా పాటించాడన్న మాట .అందుకే తెలుగు భాగవతం అనువాదం కాక అను సృజన అయింది .మూలానికంటే రెండు మూడు రెట్లు శ్రీధర భాష్యకారుని అభిప్రాయాలతో సమ్మిళితమై సరసంగా సమున్మేషించింది అన్నాడు శ్రీ పురుషోత్తం గారు .సంస్కృతం లో 25శ్లోకాలకే పరిమితమైన గజేంద్ర మోక్షం పోతన చేతిలో 125రసగులిక పద్య గద్యాలలో అలరారి మూలానికే వన్నె తెచ్చింది .పోతన గారి భాగవత భక్తీకళా ప్రపూర్ణమై సామాన్యులకూ దీమాన్యులకు కూడా జీవితపాదేయం ,ఉపాదేయం అయింది .

నిఖిల రసామృతమూర్తి అయిన భగవంతునికి అంకితమిచ్చిన పోతన భాగవతం మిగిలిన వారి కవిత్వాలకంటే ఒక మెట్టు పైనే ఉంది .’’బాల రసాల సాల నవ పల్లవ కోమల ‘’మైన ఆయన కవిత్వం ఉల్లాన్ని ఉప్పొంగ జేసే ఉదాత్త దివ్య భవ్య కవిత్వం  .ఆయన దేనికీ ఎవరికీ భయ పడాల్సిన వాడు కాదు .తన పరిమితమైన కవితాత్మను సచ్చిదానందాత్మక పరమాత్మతో ఏకం చేసి తాదాత్మ్యం చెంది ,తాను  నిమిత్త మాత్రుడుగా ఉండి భాగవతాన్ని పలికాడు పోతన .ఇంతటి విషయ తాదాత్మ్యం నన్నయ ,తిక్కనలకు లేదు .అందుకే వారిద్దరికంటే పోతన ఘనుడు అంటారు ఆచార్యులవారు .ఎప్పుడో దార్శనికుడు ప్లాటో ‘’కవులు నీతి మంతులుకారు .వాళ్ళు రాసేది,జీవించేది ఒకటికాదు ‘’అని నిరసించాడు .పోతనలాంటి నైతిక కవి ఉంటాడు అని ప్లేటో ఆనాడు ఊహించలేక పోయాడు .కవిత్వం  జీవితం రెండూ ఒకటిగా జీవించి ఆదర్శ కవి అయ్యాడు పోతన. అందుకే ఆంధ్రుల ఆరాధ్యదేవత ,కవి,వ్యక్తీ  అయ్యాడు పోతన .

పోతన సర్వతంత్రస్వతత్రుడు భగవంతునికి తప్ప ఎవరికీ భయ పడడు.ఇంద్రియాలకు దాసుడుకానేకాడు .లోపలి శత్రువులను జయించినవాడు .హాలికుడిగా పరమ సంతృప్తి తో జీవించాడు .పూర్తిగా అంతర్ముఖుడు పోతన .త్రికరణాలను ఏకం చేసుకొని రస స్వరూపుడైన భగవంతునితో ఎకో న్ముఖుడైన వాడు .ఆయన కవిత్వం కూడా అంతటి మహత్వాన్ని ,మార్దవత్వాన్ని సముపార్జించుకొని ఆంద్ర జాతిని పూర్తిగా ఆవర్నించు కొన్నది అని తేనే సోనల్లాంటి పదాలతో లలిత లలితంగా మధుర మధురంగా బొడ్డుపల్లి వారు పోతనను ఆయన కవిత్వాన్ని విశ్లేషించారు .

ఆంద్ర భాగవతానికి తెలుగులో ఏ కావ్యానికీ లేని  మరొక ప్రాశస్త్యం ఉంది .ఈ ప్రశస్తి సంస్కృత భాగవతానికి లేదంటారు ఆచార్యులు .తెలుగు దేశం లో ఎవరికైనా తీవ్ర మైన ఆపద కలిగితే దానితో తీవ్ర మనోవేదన తో బాధ పడుతుంటే ‘’గజేంద్ర మోక్షం ‘’పారాయణ చేస్తారు .వెంటనే ఆర్తి నశిస్తుందని విపరీతమైన విశ్వాసం .ఈ పారాయణం అర్ధ రాత్రి అందరూ నిదురించే వేళ కంఠ మెత్తి’’లావొక్కింతయు లేదు ,ధైర్యము విలోలంబయ్యె ‘’అని బిగ్గరగా చదువుతూ పారాయణం చేస్తారు ఆంద్ర జనులు .అభీష్ట సిద్ధి పొందుతారు .మరొక విశేషం .కన్నె పిల్ల వివాహం జరగటం ఆలస్యమైతే ఆమె చేత రుక్మిణీ కల్యాణం పారాయణ చేస్తే మూడే మూడు నెలలలో వివాహం జరుగుతుందని అనుభవపూర్వక విషయమే . ఈ మహత్తు పోతన గారి కవిత కు  ఎలా కలిగింది ?ఆయన’’ భక్త కవి యోగి’’ కావటం వలన.ఉదాత్త నైతిక జీవనుడు ,త్రికరణ శుద్ధి కలవాడు .అంతేకాదు .ఆయనది మాంత్రిక కవిత్వం అంటే మంత్రాల వంటి కవిత .వాటిని శ్రద్ధగా పారాయణ చేస్తే శాంతి దాంతులు కలిగి అభీష్ట౦  సిద్ధి స్తుంది .ఒక రకంగా పోతన వశ్య వాక్కు ఉన్నకవి బ్రహ్మ .

వారణాసి రామ మూర్తి ( రేణు )తెలుగు భాగవతాన్ని హిందీ లోకి అనువదింఛి పోతన పూత కవితను ఉత్తరాది వారికి రుచి చూపించారు .శ్రీ సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారు సంస్కృతీకరించి గీర్వాణ భాషకు పోతన భక్తీ కవిత తో సోగసులందజేశాడు .తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆంగ్లం లోకి అనువది౦ప జేశారు .తమిళ దేశీయ హరిదాసులు  కూడా పోతన గజేంద్ర మోక్ష పద్యాలను వారి విచిత్ర యాసతో చదివే వారట .తమిళులు ఆనందంగా ఆలకి౦ చేవారని శ్రీ ప్రయాగ సంగమేశ్వర భాగవతార్ చెప్పారని పురుషోత్తం గారన్నారు .

నిజానికి తెలుగు భాగవతం కంటే భారతానికి విశేష ప్రాచుర్యం కలగాలి కారణం భారతం జీవిత సమరాన్ని నిరూపించే ఘట్టం .ధర్మ సమన్వయము లో ఎవరికైనా సందేహం వస్తే భారతమే ప్రమాణం .కవిత్రయ శిల్ప హస్తం తో మూల భారత బంగారాన్ని తళుకు బెళుకులోలికే స్వర్ణాభరణం గా చేసి సరస్వతీ కంఠాభరణం చేశారు . భారతం ధర్మాన్ని చెబితే భాగవతం పరమార్ధాన్ని బోధించింది .ప్రజలలో ఎక్కువ మంది పురుషార్ధ పరాయణులేకాని ,పరమార్ధ పరాయణులు కారు .అలాంటి భారతాన్ని అధిగమించి పోతన గారి భాగవతం ఆంద్ర దేశం లో విశేష ప్రాచుర్యం పొందింది .ప్రజలకు శృంగారం పై మోజు ఎక్కువ .పోతనగారు కూడా అసలు శృంగారకవే .ఆయన రాసిన భోగినీ దండకమే సాక్షి .రాను రాను భక్తకవిగా పరిణమించాడు .అయినా శృంగారాన్ని రంగ రించకుండా ఉండలేక పోయాడు .వామనావతార ఘట్టం లో వామన మూర్తి యాచనా హస్తం చూసేసరికి బలి చక్రవర్తి ఉప్పొంగిపోయాడు .ఎటు వంటి హస్తం కింద, తన హస్తం పైన ఉందొ ఆలోచించుకొని ఉప్పొంగి పోయి నోటి తో పోతన గారి పద్యం లో పలికించాడు –

‘’ఆదిన్ శ్రీసతి కొప్పు పై ,తనువుపై ,హంసోత్తరీయంబు పై –పాదాబ్జంబులపై ,కపోల తటిపై ,పాలిండ్లపై నూత్న మ

ర్యాదన్ చెందు కరంబు క్రిందగుట ,మీదై నా కరంబౌట,మేల్ –కాదే?రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే ?-ఇందులోని శృంగార భావానికి ఆనందించని సహృదయుడు ఉండడు అంటారు శ్రీ బొడ్డుపల్లి .భాగవతం సంకీర్తన ప్రధానం దానికి తాళాలు ,మృదంగాది వాద్యాలు అవసరం .ఆ కొరత తీర్చి శబ్దాలంకారాలతో శోభ తెచ్చాడు .పోతన పద్యాలను సంకీర్తన లాగా పాడే వాళ్ళున్నారు అంటారు ఆచార్య బొడ్డుపల్లి .శబ్దాలంకారాల ప్రయోజనం గుర్తించి  సార్ధకం చేసిన వాడు పోతన కవి ఒక్కడే అంటారు .పోతన గారి అర్దాలంకారాలు కూడా రస వ్యన్జకాలై అలంకార ధ్వనిలో పర్య వసిస్తాయి అన్నారు .శ్రీ వేదాల తిరు వేంగళాచార్యుల వారు భాగవతం లో అనేక  ద్వని భేదాలున్నాయని సోపత్తికంగా నిరూపించారు .

ఛందో వైవిద్యం లో ,ఛందఃశిల్పంలోను పూర్ణ ప్రజ్నఉన్నవాడు పోతన .బ్రౌన్ దొర పోతన్న ,వేమన్నలనే ప్రజా కవులు అన్నాడు .కవులందరూ మేధాశక్తి తో కవిత్వం చెబితే ‘’అతి మానసిక కవిత్వం ‘’(ఓవర్ హెడ్ పోయిట్రీ)శ్రీ అరవిందులు చెప్పారు  .తెలుగులో ఒక్క పోతన్నగారే ఇలాంటి కవిత్వం చెప్పారు. నిఖిల రసానంద మూర్తితో ఏకం కావాలని ప్రతి కవీ కోరుకొని విఫలురై విలపిస్తారు .కాని సఫలత పొందిన వాడు పోతన్నగారొక్కరే .అందుకని ఆయనకు ఆయనేసాటి .ఎంత భావోద్రేకం లో ఉన్నా రచన ప్రారంభించే సరికి కవితా శక్తి కొంత సన్నగిల్లుతుంది .దీనినే పాశ్చాత్యులు ‘’A poet;s mind in creation is a fading furnace ‘’అన్నారు .దీనికి అపవాదం పోతన్న .కారణం ఆయన కవితాత్మను అనంత భగవచ్చక్తికి లంకె వేసి తనదన్నది వేరే ఏదీ లేకుండా చేసుకొన్నకవి యోగి .

ఈ నాలుగు వ్యాసాలకు ఆధారం నేను ముందే మనవి చేసినట్లు విజయవాడ రసభారతి వారి ప్రచురణ పీయూష లహరి అని మరొక్క సారి మనవి చేస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-16-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.