భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -3(చివరిభాగం )
ఇదే విషయాన్ని పుట్టపర్తివారు ‘’తకఝం,తకఝం ,తకదిరి కిట ‘’నాదాలతో లోకేశుడు నాట్యమాడాడన్నారు .సకల భువనాలు ఆంగికంగా ,సకల వాజ్మయం వాచికంగా ,సకల నక్షత్రాలు కలాపాలుగా ,సర్వం తన యెడ సాత్వికంగా చతుర్విధ అభినయ అభిరతి తో ,తనలోనే తాను వలచి నృత్య నృత్త భేదాలను చూపి ,లాస్య ,తాండవ భేదాలను ఎరుక పరుస్తూ ,సకల దిక్పాలకులకూ పారవశ్యం కలిగిస్తూ నాట్య గరిమతో పరమ శివుడు తాండవ కేళీ విలోలుడయ్యాడు.
ఇప్పుడు భరద్వాజ శివుని తాండవం లో రాగ విన్యాసకేళి ఎలా సాగిందో దర్శిద్దాం –
‘’మూర్చ నాభిర్గిరాం దేవతాయాం సమీ –కృత్య తంత్రీ ర్నభై ర్వల్లకీ౦ చ శ్రుతీః
సాదు సప్తస్వరాన్ వాదయన్త్యాముదా-సం ననంర్త శ్రీ భవానీ పతిః’’
సరస్వతి వీణపై గోళ్ళతో మూర్చనలను సమీకరించి శ్రుతులను ,సప్త స్వరాలనూ ఆహ్లాదంగా వాయిస్తుంటే పరమ శివుడు హెచ్చిన ఉత్సాహం తో అనుగుణం గా నాట్యం చేశాడు .తరువాత వేణు గాన ధ్వనికి అనునర్తనం ఎలా చేశాడో మహర్షి వర్ణిస్తున్నాడు –
‘’శుంభ రారంభ గంభీర సంభావనా –గు౦భన జ్జ్రు౦భణో జంభ దంభాపహే
లంబయత్యుత్కటం వేణు నాదామృతం-సం ననర్త శ్రీ భవానీ పతిః’’
శివుని నాట్య ఆరంభం ప్రకాశమానంగా ఉంది .ఇంద్రుడు వేణుగానామృతాన్నిఅందరిపై ప్రవహింప చేస్తుంటే తదనుగుణంగా గంభీరాలైన భావ సముదాయాన్ని అత్యద్భుతంగా ప్రదర్శిస్తూ నాట్యమాడుతున్నాడుభవానీ పతి.తర్వాత శ్లోకం లో గానాలకు అనుగుణ నాట్యం శంకరుడు ఎలా చేశాడో వివరిస్తున్నాడు భారద్వాజర్షి .
‘’సంభ్రుతోత్కంఠితా కుంఠ కంఠ స్వర .-శ్రీ రమా భామినీ స్ఫీత గీతామృతం
విశ్రుత ప్రక్రమం స శ్రుతిభ్యాం పిబన్ –సం ననర్త శ్రీ భవానీ పతిః’’
శ్రావ్య కంఠం తో లక్ష్మీదేవి గొంతెత్తి పాడుతున్న గీతామృతాన్ని తన సుభగ కర్ణాలతో ఆలకిస్తూ శివుడు అనుగుణమైన నృత్యాన్ని చేశాడు .ఇందులోని పద బంధాలు వ్రుత్యనుప్రాసతో కర్ణపేయం చేయటం మహర్షి కవితా చమత్కృతి .స్రగ్విణీ వృత్తాలతో మహర్షి వీనుల విందు చేస్తున్నాడు .అనుభవించిన వాడికి అనుభవించినంత .మన మనస్సులపై చిత్తరువు గీసి దర్శించమంటున్నాడు .
ఇపుడు కాసేపు ఆచార్య తాండవ దృశ్యాన్ని తిలకిద్దాం –నాట్యానికి కావాల్సిన సర్వ లక్షణాలను వివరిస్తూ ,అవి ఒకదానితో ఒకటి కలిసి రసోత్పత్తి ఎలా చేస్తున్నాయో పుట్టపర్తి వారు వివరించిన తీరు అమోఘం –
‘’కర ముద్రికల తోనే ,గనుల చూపులు దిరుగ-దిరుగు చూపులతోనే బరువెత్త హృదయమ్ము –హృదయమ్ము వెనువెంట ,గదిసికొన భావమ్ము –కుదిసిభావము తోనె,కుడురుకోగ రసమ్ము –శిరము ,గ్రీవమ్ము,పేరురము ,హస్త యుగమ్ము –సరిగాగ మలచి గండరువు నిల్పిన యట్లు –తారకలు జలియింప దారకలు నటియింప-గోరకములై గుబురు గొన్న జూటము నందు -నురగాలి ,నలిరేగి ,చొక్కి వీచిన యట్లు –పరపులై పడ గల్ప పాదపంబుల బూవు –లాడే నమ్మా శివుడు ,పాడేనమ్మా భవుడు ‘’అన్నారు .ముక్త పద గ్రస్తం తో ఊపిరి సలపనీక.ఆవేగానికి యదార్ధ స్థితి కల్పించటం సామాన్య కవి వల్ల అయ్యే పనికాదు .తానూ అనుభవిస్తూ మనకు కూడా ఆ పరమానందాన్ని అనుభవం లోకి తెప్పించారు సరస్వతీ పుత్రులు .భరద్వాజుని శివుడు చే సే నాట్యం కంటే పుట్టపర్తి వారి శివ నాట్యం మనోహరమై విరాజిల్లింది .మహర్షి శబ్దాలంకారాలతో సాధిస్తే పుట్టపర్తి వారు అనుభూతిని రంగరించి నిండుదనం చేకూర్చారు .
మళ్ళీ ఒకసారి భరద్వాజ శివ తాండవం లోకి ప్రవేశిద్దాం –వీణ ,వేణువు ల అమృత గాన లహరికి తేలిపోయి శివుడు నాట్యం చేశాడని తెలుసుకొన్నాం .ఇప్పుడాయన మృదంగ భంగిమలకు ఎలా పాదాలు కలిపి నర్తి౦చాడో మహర్షి వర్ణిస్తున్నాడు –
‘దర్శయత్యాదరా ద్వాదనే నైపుణీం-సన్మ్రుదంగస్యగోవింద మార్దంగికే
తాలభేదం సహోదాహర త్యబ్జకే –స్సం ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’
విష్ణుమూర్తి తన మృదంగ వాదనా నైపుణ్యాన్నిప్రదర్శిస్తుంటే ,బ్రహ్మ దేవుడు ‘’తల భేదాలుకాదు’’ తాల భేదాలను ఉదహరిస్తుంటే పరమశివుడు స్వయంగా నర్తించాడు .ఈ శ్లోకం లో’’ దకారం ‘’అనేకమార్లు ఆవృత్తి చెందటం చేత మృదంగ ధ్వని శ్లోకం లోనే మారు మోగింది .అదీ కవి చమత్కారం .మృదంగానికి లయ ప్రాణం .నాట్యానికి చాలా అవసరమైన వాద్యం మృదంగం. విష్ణువు అమోఘ మార్దంగికుడు .నాట్యం యొక్క రక్తి మ్రుదంగంపైనే ఎక్కువ ఆధార పడి ఉంటుంది .అందుకే శివుని సరి జోడు విష్ణువే స్వయంగా మృదంగ సహకారం అందించి ,శివ తాండవాన్ని రక్తి కట్టించాడు .ఆయన మృదంగ వాదనకూడా చాలా ఆదరంగా నైపుణ్యంగా చేయటంకూడా ఇక్కడ విశేషమే .
‘’మూడుకన్నులతో అయిదు తలల వాడి ‘’నాట్యాన్ని ‘’ఆరుముగాల ‘’సామి తిలకించి పులకించే దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు కవి మహర్షి –
‘’సమస్త ముఖ లాలనం నహి ముఖస్యమే షణ్ముఖ-సమస్త ముఖ లాలనం ఖలు మృగాంక రేఖాననన
ఇతి స్వసుతవాదనమ్ముదిమున్ము ఖైః పంచభిః-సుతస్య మతి లాలనం విరచయ౦చ్ఛివః పాతునః ‘’
ఆనంద పారవశ్యంతో ఆర్ముగం అయిన కుమారస్వామి అయిదు తలల ముక్కంటి నాట్యాన్ని చూస్తుంటే కొడుకుతో తండ్రి ‘’నాయనా షణ్ముఖా !నీ ఆరు ముఖాలను లాలించటానికి నాకు అన్ని తలలూ లేవు కదా ‘’అనగా కొడుకు ‘’చంద్ర రేఖాననా తండ్రీ శివా !సమస్తముఖలాలనమే కదా ఉన్నది ‘’అనగానే ఆనందం తో కుమారస్వామి మతిని లాలించే శివుడు మనలను కాపాడు గాక ‘’అని స్తుతించాడు మహర్షి భరద్వాజుడు .శివుని అన్ని ముఖాలలో మృగాంక లేఖనం ఉంది అని సమర్ధన .ఈశ్వరుని లాలనం నోచుకోని కుమారునిఆరవ ముఖం కుమారుని ఆరవ ముఖం పైఉన్న చంద్ర రేఖను చూసి ఆనందిస్తోందని అర్ధం .ఇది పృధ్వీ వృత్తశ్లోకం . దీనితో మహర్షి శివతాండవ వర్ణనను సమాప్తి చేశాడు ..
ఇప్పుడు పుట్టపర్తి శివుడు ఎలా ముగించాడో తాండవం చూద్దాం –
శివుడు తాండవ మాడుతుంటే ‘’తెలి బూది పూతతెట్టులు కట్టి నట్లు ,చలికొండ మంచు కుప్పలు పేర్చినట్లు ,అమృతం అమతి౦చినట్లు మనసులోని సంతోషం కళ్ళకు కట్టి నట్లు ఆనందం అంతా తాండ వి౦చి౦ దట .నీల గళుని నాట్యం చేత కల్పించబడిన’’నీలిమ ‘’మబ్బులు ఉబ్బి క్రమ్మినట్లుగా ,అబ్బురాలైన నీలాలు లిబ్బి సేరు విధాన ,కాటుక కొండ పగిలి చెదిరినట్లుగా ఉంది .శివుని కనుల హస్తాల భంగిమలు మహాద్భుతం గా ఉన్నాయి .ఒక సారి చిరు చేపల్లగా ,ఒకసారి ధనుస్సుల్లాగా కనులతో నర్తించాడు.హస్త విన్యాసం చేస్తుంటే అవి స్తంభ యుగమా, వేప శాఖాద్వయమా ,కుంభి కరఖండాలా అని అనిపించాయి .షడ్జమం లో నెమలి పించం విప్పి ,వృషభం లో నంది నర్తించాయి .’’శాస్త్రాలను దాటి ,సర్వ స్వతంత్రుడై ,భావ రాగ సంబంధం తో ,రాగ లీలా విలాసంతో ,తానె తా౦ డవమో తాండవమే తానో అన్నట్లుగా ,ఒక అడుగు జననం మరో అడుగు మరణం ,ఒక వైపు సృష్టి వేరోకవైపు ప్రళయం కనిపించేట్లు నర్తించాడు .ఇది కాస్మిక్ డాన్స్ .ఇందులో అందరూ ఒకటే. హరిహర భేదమే లేదు .
‘’హరియే హరుడై ,లచ్చి యగజాతయై ‘’కనిపించారు ‘’హరునిలో హరిని హరిలో హరుని చూసి అద్వైత భావన కలిపించారు ‘’సర్వ మేదినియు ,నద్వైతమే బ్రతిధ్వను లీన –ఆడేనమ్మా శివుడు –పాడేనమ్మా భవుడు ‘’అన్నారు పరాకాష్టగా .శివతాండవం తర్వాత శివా అంటే పార్వతీదేవి ‘’గగన వనం లో విచ్చికొన్న జలదం వలే –వనం లో పారాడే వాత పోత౦ లాగా లాస్యం చేస్తుంది .అర్ధాంగి లాస్యాన్ని’’తరుణ చంద్రా భరణుడు ‘’ఆమోదం తెలిపాడు .శివ శక్తులు ఒకటిగా చేరటం తో అర్ధ నారీశ్వరం సార్ధకమై ,సర్వ మంగళ ప్రదమై ,శివమై ,సౌందర్య సౌభాగ్యమై తాండవ లాస్యాలకు భరత వాక్యం పలికినట్లైంది
సమాప్తం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-5-16-ఉయ్యూరు .