ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -143
57 -అమెరికా వ్యావహారిక భాషా ప్రచారకుడు, వెర్మాంట్ రాష్ట్ర ఆస్థానకవి –రాబర్ట్ ఫ్రాస్ట్ -2
విమర్శకులు ఫ్రాస్ట్ లిరిక్స్ ను బాగా ఆదరించారు .ఆయన వాడిన అతి సాధారణ శబ్ద జాలాన్ని ,పరిశీలనా దృష్టినీ అభినందించారు .మరచిపోయిన ఆలోచనలను మరపు రాని విధంగా మలచిన తీరు అసాధారణం అన్నారు .ఒక ఏడాది తర్వాత రెండవ పుస్తకం అచ్చు అయి ఫ్రాస్ట్ కీర్తి బాగా వ్యాపించి ప్రసిద్ధుడయ్యాడు .అట్లాంటిక్ కు ఇరువైపులా ఉన్న దేశాలు ‘’నార్త్ ఆఫ్ బోస్టన్ ‘’కవిత్వం లో నవీన హృదయాన౦దకర భావాలు సహజ సుందరంగా మానసిక విశ్లేషణాత్మకంగా ఉన్నాయని మెచ్చుకొన్నారు .సాధారణ భాష ను అత్యంత శక్తి వంతంగా ప్రయోగించిన తీరు అందర్నీ ఆకట్టు కొన్నది .కవితాపర0 గా నేటివిటీ ఉన్న విషయాలను ఎన్నుకొని వాటిని అందల మెక్కించాడు .అందులో వ్యావహారిక పదాలు అందాలొలుకుతూ సొగసు చేకూర్చాయి .ఇదొక కొత్త వరవడి .మార్క్ వాన్ డోరేన్కు ఫ్రాస్ట్ కవితలో సహజ సంభాషణా చాతుర్యం ఉట్టిపడింది ,.ఆయన ఏది రాసినా ప్రజలు మాట్లాడుకొన్నట్లుగా ఉండటం గొప్ప విశేషం .ఫ్రాస్ట్ కు గొప్ప గొప్ప విషయాలను యెంత తేలిక పదాలలో చెప్ప వచ్చో బాగా తెలుసు .అందుకే అతని కవిత్వం లో సహజత్వం పరిమళిస్తుంది ‘’అన్నాడు
నార్త్ ఆఫ్ బోస్టన్ కు ఉపశీర్షిక గా ‘’ఎ బుక్ ఆఫ్ పీపుల్ ‘’అని పెట్టటం సార్ధకమైంది .ప్రజల గురించేకాదు వారి నేపధ్యాన్నీ వివరించే కవితలు ఇవి .కొన్ని గంభీరంగా ఉన్న డ్రామాలూ రాశాడు .వీటిలో ఏకా0కి కలే ఎక్కువ .వ్యవసాయం ఒట్టిపోయి ఆప్రదేశం లో పారిశ్రామిక విస్తరణ జరుగుతున్ననేపధ్యం పై ఎక్కువ గా రాశాడు .అతని సహచరుడు న్యు ఇంగ్లాండ్ కవి ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్ లాగానే స్వీయ ప్రేమ, కోరిక లోని చెడునువ్యతిరేకిస్తూ ఫ్రాస్ట్ కవితలల్లాడు .కానీ ఆయన లాగా కాకుండా అడవులు మానసిక ప్రశాంతికి నిలయాలని ,సహజ రోగ నివారకాలని ,భూమి అన్నీ ఇచ్చే మాత్రు మూర్తి అని నమ్మాడు .రాబిన్సన్ తో కలిసి ముసలి ,ముతక, పేద బలహీన వర్గాలకు సహాయం చేసి సంతృప్తి చెందాడు .
నార్త్ ఆఫ్ బోస్టన్ లో ప్రజలే డామినేట్ చేస్తారు .’’హోం బరియల్ ‘’కొత్త అసాధారణత కనిపిస్తుంది .ఇందులోని మాటలు అందరూ మాట్లాడేవే .కాని సందర్భం మాత్రం చాలా విశేషం గా ఉంటుంది .సహజమైన మాటలేకాని అనుభవం లో అసాధారణంగా ఉంటాయి .కాళ్ళ చెప్పులకు అంటిన బురద కూడా కవితా స్థానం పొందింది .’’ది విచ్ ఆఫ్ కూస్ ‘’ దెయ్యం కద .చనిపోయిన వాడి ఎముకలు మెట్లు ఎక్కి భయం భీభత్సం సృస్టిస్తాయి .’’కోడ్’’అనేది మరో వింత కామెడి ,దాదాపు ట్రాజెడీ.’’The House keeper ‘’ is an instance of pure talk not only in poetry but talks as poetry ‘’.అదొక కుటుంబ నాటకం .
1915లో ఫ్రాస్ట్ అమెరికాకు ఒక సెలెబ్రిటి గా తిరిగొచ్చాడు .అజ్ఞాత వ్యక్తిగా అమెరికా నుండి బయటికి వెళ్ళినవాడు ఇప్పుడు’’ నవీన అమెరికా కవిత్వ నాయకుడి ‘’గా కాలుపెట్టాడు .విమర్శకులు బ్రహ్మ రధం పట్టారు .ఆయన తమ వాడే నని యెగిరి గంతులేశారు .లండన్ లో ఎజ్రా పౌండ్ స్నేహితుడుగా నేకాక పోషకుడుగా ఉండేవా డు .ఫ్రాస్ట్ ను ‘’ఇమేజిస్ట్ ‘’కవిగా మారుద్దామని ప్రయత్నించి విఫలు డయ్యాడు.కొందరు క్లాసిస్ట్ అని మరికొంతమంది హ్యూమనిస్ట్ అని ,రియలిస్ట్ అని రూరలిస్ట్ అనీ అన్నారు వీటికి సమాధానంగా ఫ్రాస్ట్ ‘’If I must be classified I might be called a Synecdochist ,for I prefer the synecdoche in poetry –that figure of speech in which we use a part for the whole ‘’అని స్పష్టంగా చెప్పాడు .తాను అఖండత్వాన్నికోరేవాడినని అందులో యే కొద్దిభాగమైనా పూర్ణత్వానికి ప్రతీకగా ఉంటుందని అర్ధం .
ఇలాంటి సరదా స్టేట్ మెంట్ లు ఆయనకిష్టం .ఎక్కువగా చెప్పకుండా అన్నిటినీ సూచించటం ఫ్రాస్ట్ లక్షణం .ఒక మేధావి సలహా మేరకు రోజూ ఒక అవ్యక్త ఉపన్యాసం రాసి దానికి చక్కని ఆకృతి కలిపించేవాడు .రియలిజం పై చెబుతూ ‘’రియలిస్ట్ లలో రెండు రకాలున్నారు .ఒకాయన అసలైన పోటాటో ను చూపించటానికి దానికి అంటిన మట్టీ మశానం తో సహా చూపిస్తాడు .అది నమ్మినవాడు దాని దుమ్ము దులిపి అసలు బంగాళా దుంపను చూపిస్తాడు .నేను రెండో రకం వాడిని .కళ జీవం తో ఉండాలంటే దాన్ని శుభ్రం చేసి తోలు తీయాల్సిందే నాది అదే పని ‘’అన్నాడు .’’ఒక్కోసారి నెను రాసే పదాలలో అనుమానం వచ్చి నన్ను నేనే ప్రశ్నించుకొంటాను .నాకు సరైన సమాధానమే లభిస్తుంది .మాటలు వాటికి కావాల్సిన స్థానాల్లో అవే వచ్చి చేరుతాయని నమ్ముతాను .సాహిత్యం పై నా నిర్వచనం ‘’మాటలు చేతలుగా మారటం ‘’అన్నాడు ఫ్రాస్ట్ .
ఫ్రాస్ట్ భావాలన్నీ ఆయన లాండ్ స్కేప్ కు చెందినవే .ఆ లాండ్ స్కేప్ లో ఆయన ముఖమే ప్రత్యక్ష మౌతుంది .ముడి గ్రానైట్ రాయిని సాన బెడితే వచ్చే బొమ్మలాగా ఆయన కవళికలు ఉంటాయి .పాలిపోయిన నీలి కళ్ళు వేళాకోళం చేస్తున్నట్లున్న నవ్వు ,కందిరీగ కుడితే వాచిపోయినట్లున్న కింది పెదవి తో బలీయమైన శరీరం తో కనిపిస్తాడు ఫ్రాస్ట్ .ముభావం గంభీరం అయిన విద్యా వేత్త ముఖం ఆయనది .తన ‘’ కలేక్టేడ్ పోయెమ్స్ ‘’కు ముందు మాట రాసుకొంటూ ‘’విద్యావేత్తలూ కళాకారులను విసిరేసిన తర్వాత వాళ్ళు బాధ పడుతూ తమలో విభేదాలకు కారణం ఏమిటి అని వితర్కి౦చు కొంటారు .ఇద్దరూ కూడా జ్ఞానం ద్వారానే పని చేస్తారు అయితే తేడా ఎక్కడ ఉంది అంటే వారు పొందిన జ్ఞాన మార్గాలలోతేడాఅని నా అనుమానం . .విద్యా వేత్తలు తమ మనస్సాక్షి పరి పూర్ణత తో,తర్కం తో ,జ్ఞాన సముపార్జన చేస్తారు .కవులు పుస్తకాలతోనూ ,అవిలేకు0డాను ఉత్సాహ ఉల్లాసాలతో సాదిస్తారు .వారు దేనికీ కట్టుబడి ఉండరు .కాని తమవద్దకు వచ్చి చేరి అంటుకొనే వాటిని తప్పకుండా స్వీకరిస్తారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-15-5-16-ఉయ్యూరు