శ్రీ శివ కర్ణామృతం లో నవ శివ మూర్తి వైభవం

శ్రీ శివ కర్ణామృతం లో నవ  శివ మూర్తి వైభవం

భరద్వాజ మహర్షి రాసిన శ్రీ శివ కర్ణామృతం కర్ణ పేయం .అందులో తొమ్మిది   మంది శివ స్వరూపాలను మహర్షి అద్భుతంగా వర్ణించాడు ఆ సోయగాలనే మనం దర్శించ బోతున్నాం .మొదటగా ఆయన దాత్రీ రూప శివ మూర్తి వర్ణన చూద్దాం –

1-‘’దాత్రీ మనంతాం-స్థిరాం విశ్వంభరాం ధరాం

గాం గోత్రామవనీ మాద్యా –మ్మూర్తిం శంభోర్భజామ్యహం ‘’

తాత్పర్యం –పోషించే అనంతమైన స్థిరమైన విశ్వాన్ని ధరించే గోవులాగా సాధువైన ,ఆవులకు ఆహార మిచ్చిన వారి భయాలను తొలగించి రక్షించే భూమి అనే శివుడిని ప్రధమ మూర్తిని సేవిస్తాను .ఈ మూర్తికి’’ శర్వుడు’’ అనే పేరు .అంగారకుడు కుజుడు అంటే భూమి పుత్రుడు అంటే ఈశ్వర తనూజుడు .శివుని ఫాల భాగం లోని చెమట బిందువులు భూమిపై పడగా అంగారకుడు పుట్టాడు .

శివుని నవ మూర్తులలో రెండవదైన జల మూర్తిని కవి వర్ణిస్తున్నాడు –

2-‘’అమృతం ,జీవనం ,వారి –కమలం సర్వతోముఖం .’

ద్వితీయ మస్య రూపం చ –భజే హం పరమేశితు’’

భావం –మరణం లేని బ్రతుకునిచ్చే ,బ్రహ్మ యొక్క వసతి రూప మలం అయినటు వంటి ,అన్ని వైపులా ముఖాలున్న పరమేశ్వరుని రెండవ రూపమైన జల మూర్తిని సేవిస్తాను .

జలం లేక పొతే జీవనం లేదు మరణమే .మన శరీరం లో వస్తి అనే మలం ఉంటుంది .బ్రహ్మ శివుడికి వస్తిమలం అవటం వలన నీటికి కమలం అనే పేరు వచ్చింది .నీరు అన్నివైపులా ప్రవహిస్తుంది కనుక సర్వతో ముఖం .ఈ జలమూర్తి శివుడికి ‘’భవుడు ‘’ అని పేరు .

ఇక అగ్ని రూప శివుని గురించి చెబుతున్నాడు మహర్షి .

3-‘’జ్వలనం ,పావకం ,దివ్యం –సువర్ణం ,కాంచనం,శుచిం

తృతీయ మూర్తిం తేజోహం –కలయే పార్వతీ పతేః’’

భావం –మండేది ,పవిత్రం చేసేది ,స్వర్గం లో ఉండేది ,మంచి రంగుతో ప్రకాశించేదీఅయిన పవిత్రమూర్తి శివుని మూడవ  మూర్తి అయిన తేజస్సును ధ్యానిస్తాను .

భూ ,జల శబ్దాలకు పైన చెప్పినట్లే ఇక్కడ అగ్ని కి  ఉన్న వివిధ నామాలను అర్ధ వంతంగా చెప్పాడు ‘జ్వలన ,పావక శుచి శబ్దాలు అగ్నికి పర్యాయ పదాలు సువర్ణ ,కాంచన శబ్దాలు బంగారానికి మారు పేర్లు .ఇవి తేజో భూత అంతర్గతాలు అని తార్కికులు అంటారు .అందుకే తేజో మూర్తి వర్ణనలో స్థానం పొందాయి ఈ పదాలు .స్వర్గం లో ఉండే దేవతలకు అగ్ని రూపం దివ్యం .ఈఅగ్ని రూపం లేక తేజో రూపం ధరించిన శివుడిని ‘’పశు పతి ‘’అంటారు .

ఇప్పుడు నాలుగవదైన వాయు  మూర్తి ని వర్ణిస్తున్నాడు మహర్షి –

4-సదాగతిం ,జగత్ప్రాణం-మరుతం మారుతం సదా

చతుర్దంత మ్మూర్తి భేదం –శంకరస్య  భజామ్యహం ‘’

భావం –ఎప్పుడూ కదులుతూ ,జగాలకు ప్రాణాధారమై ,ఇంద్రుని చేత ‘’ఏడవ వద్దు ‘’(మారుద )అని చెప్పబడిన ,చిన్న చిన్న వాయువులతో కలిసి మహా వాయువైన శివుని నాలుగవ మూర్తి వాయువును సేవిస్తాను .

సదాగతి ,జగత్ప్రాణ,మరుత్ ,మారుత శబ్దాలు వాయువుకు ప్రసిద్ధాలు .కశ్యప ,దితులు భార్యా భర్తలు ఇద్దరూ ఒక సాయం వేళ ఉద్రేకానికి లోనై ‘’చీకటి తప్పు’’ చేశారు .అప్పుడు కశ్యపుడు ఒక ఏడాది పాటు పగటి పూట నిద్ర పోకూడని వ్రతం చేయిస్తుండగా ఇంద్రుడు వ్రత భంగం చేయటానికి మారు వేషం లో వచ్చి ఆమెకు సేవలు చేశాడు .పొరబాటున ఒక రోజు ఆమె పగటి నిద్ర పోగా గర్భం లో ప్రవేశించి పిండాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంటే ,గర్భస్త శిశువు ఏడుస్తుంటే ‘’మారుద మారుద ‘’అని ఇంద్రుడు ఓదార్చాడు .ముక్కలు ముక్కలుగా పుట్టిన దితి పుత్రులకు మరుత్తులు అనే పేరు వచ్చింది .వాయురూపశివ మూర్తిని ‘’ఈశానుడు ‘’అంటారు .

తరువాత ఆకాశ  రూప శివమూర్తి వర్ణన

5-‘’ఆకాశం ,పుష్కరం నాకం –అనంతం శబ్ద కారణం

పంచమం మూర్తి రూపం చ-శంభో సేవే నిరంతరం ‘’

భావం –బాగా ప్రకాశించేది ,దేనినీ అంటనిది  ,దుఃఖ రహితమైనది ,అంతంలేని శబ్దాన్ని పుట్టించేది అయిన అయిదవ ఆకాశ మూర్తి శివునికి వందనం .

ఆకాశం ,పుష్కరం అనంతం అనేవి ఆకాశానికి పర్యాయ పదాలు .నాకం అంటే స్వర్గం అనే అర్ధం ఉన్నా అది ఆకాశానికి కూడా చెందుతుంది .ఆకాశం యొక్క లక్షణం శబ్దం . గుణం అనేది ద్రవ్యం నుండే వస్తుంది గుణానికి ద్రవ్యమే కారణం .శబ్ద గుణం ఆకాశ ద్రవ్య రాశి నుంచి వచ్చింది అనే తర్క వాక్య ప్రమాణం ప్రకారం ఆకాశం శబ్ద కారణం అయింది .ఈ ఆకాశ శివ మూర్తికి ‘’భీమ ‘’అని పేరు .

ఇప్పుడు ఆరవ సూర్య శివ రూపాన్నిగురించి చెబుతున్నాడు భరద్వాజ కవి

6-‘’ప్రభాకర మినం  హంసం –లోక బంధుం తమో పహం

త్రయీ మూర్తిం మూర్తి భేదం –షష్ఠం శంభో ర్భజామ్యహం ‘’.

తాత్పర్యం –కాంతికి గని యై ,దాన్ని వెలువరించే ప్రభువైన హంస మంత్రం స్వరూపుడైన (హం –స అనే రెక్కలు గల )లోక బంధువైన ,చీకటీ అజ్ఞానాలను తొలగించే శివుని ఆరవ మూర్తి అయిన సూర్యుని సేవిస్తాను .

రవం అంటే ధ్వని .ధ్వని0 చేవాడు కనుక సూర్యుడిని రవి అంటారు..అద్వని ఓంకారమే ..ఓంకారం లోని అ కార ,ఉకార మకారాలనుండి రుక్ యజుర్ ,సామ వేదాలు ఉద్భవించాయి .సూర్యుడు ఆ వేద స్వరూపం కనుక త్రయీ మూర్తి అయాడు .ఈ త్రయీ మూర్తి శబ్దము చేత చెప్పబడ్డాడు ‘’యస్య నిస్శ్వసితం వేదాః’’అనే శ్రుతిని బట్టి ప్రణవం విస్తృతి యై వేదమైంది .’’సోహం ‘’అనేది రహస్యం అందుకని సోహం అనకుండా హంస మంత్రం గా చెప్పారు .’ఈ మంత్రం ‘’అహం సః’’అంటే ‘’నేనే ఆ బ్రహ్మాన్ని ‘’అని తెలియ జేస్తుంది .భగవంతుని  నిశ్వాసం సృష్టి అని ఉచ్చ్వాసం ప్రళయం అని అందరికి తెలిసిందే .భగవంతుని ఉపాసనకు ప్రతీక సూర్యుడు హంస శబ్ద వేద్యుడు .మానవులు ఉచ్చ్వాస నిస్శ్వాస రూప హంసం  రోజుకు ఇరవై ఆరు వేల సార్లు అప్రయత్నంగా జపిస్తారు దీన్ని జపం కాని జపం’’ అజపా జపం’’అంటారు లేక అజపా గాయత్రి అంటారు .గాయత్రి మంత్రం లోని మూడు పాదాలు రుక్ యజు సామ రూపాలు .ఇదే ‘’సోహమస్మి ‘’అనే మహా వాక్యానికి విస్తారమైన రూపం .అస్మి లేక పోయినా సోహం అనేది. జీవేశ్వర అభేదాన్ని సూచిస్తుంది .గాయత్రి హంస మంత్రార్ధాలు ఒక్కటే .ఈ రవి రూప శివుడినే  ‘’రుద్రుడు ‘’అంటారు .

దీనితర్వాత ఏడవ చంద్రరూప శివ వర్ణన చేశాడు మహర్షి

7-‘’శుభ్రాంశు సోమమమృత –కరం చంద్ర మసం సదా

కలానిదిం మూర్తి భేదం –సప్తమం శూలినో భజే ‘’.

భావం –తెల్లని కిరణాలతో పాటు ఉమ అనే షోడశ కళ తో కలిసి ,అమృతం అంటే మోక్షాన్ని కలిగిస్తూ ,ఆహ్లాదమిస్తూ ,రమింప జేసే చంద్ర కళానిధి అయిన శివుని  ఏడవ మూర్తిని భజిస్తాను .

ఉదయాన సూర్య ,చంద్రులకాంతి ఎర్రగా ,మధ్యాహ్నాన తెల్లగా ,సాయం వేళ మళ్ళీ ఎర్రగా ఉండటం సహజం .కాని మధ్యాహ్న సూర్యుడు రక్త కిరణుడు గానే భావిస్తారు .ఆహ్లాదమిచ్చే చంద్రుడిని శుభ్రా౦శువు అంటారు .తిధులు 15.కళలు కూడా 15.కాని సమస్టికళ ను ‘’అమ ‘’అంటారు .అంటే ఆతి తక్కువ కాంతి .చంద్ర కాంతి లేని అమావాస్యను ‘’కుహు ‘’అంటారు .చంద్ర స్పర్శ లేని షోడశ కళా సమస్టి అయిన అమావాస్య ను ‘’మహా సప్త దశి దేవి ‘’గా భావిస్తారు దీనికి తంత్ర శాస్త్రం లో ‘’షోడశి ‘’అన్నారు షోడశి చంద్రునికి అది దేవత గా ఉన్న చంద్రునికి ‘’సోమ ‘’అని పేరు .దీనినే అమృత కళ అన్నాడు భవ భూతి .-‘’వందే మహి చ తం వాణి మమృతా మాత్మనః కలాం’’.చంద్ర రూప శివుడిని ‘’మహా దేవుడు ‘’అన్నారు .

శివుని ఎనిమిదవ యజమాన  రూప మూర్తి గురించి చెబుతున్నాడు భరద్వాజుడు

8-‘’ఆహితాగ్నిం యాగా కారం –యజ్వనం సోమ యాజినం

అష్టమం మూర్తి సంభేద –మస్టమూర్తే ర్భజామ్యహం ‘’

భావం –అగ్న్యాధానం ,యాగం దేవ పూజ ,సోమ యాగం చేసే శివుని ఎనిమిదవ రూప మైన యాజమాన మూర్తినిస్మరిస్తాను .ఈ ఎనిమిదవ యాజమాన రూప శివుడిని ‘’ఉగ్రుడు ‘’అంటారు

తరువాత యాజమాన్యాన్ని వదిలేసినముని మూర్తిగా శివుని వర్ణిస్తున్నాడు

9-‘’హస్తద్వయేనా౦ఘ్రి తల ద్వయం స్వ-మూరుద్వయే సంపరి యోజ యంతం

పద్మాసనే రూఢ తరం జపంతం-మునిమ్మహేశమ్ముహు రాశ్రయామి ‘’

భావం –తన చేతులతో తన పాద తలాన్ని ,తొడలలో ఉంచి  ,పద్మాసనం లో కూర్చుని బాగా జపించే ముని అయిన మహేశ్వరుడిని మాటి మాటికీ ఆశ్ర యిస్తాను .

ఆధారం భరద్వాజ విరచిత శ్రీ శివ కర్ణామృతం కు శ్రీ దోర్బల విశ్వనాధ శర్మగారి తెలుగు చేత ,వ్యాఖ్యానం.

Inline image 1Inline image 2

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-5-16-ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.