శ్రీ శివ కర్ణామృతం లో రామాకృతి శివ వైభవం

శ్రీ శివ కర్ణామృతం లో రామాకృతి శివ వైభవం

భరద్వాజ మహర్షి శ్రీ శివ కర్ణామృతం లో రామాకృతి లో ఉన్న శివుడిని ఎనిమిది శ్లోకాలలో గొప్పగా వర్ణించాడు .అన్నీ శార్దూల వృత్తాలే .మకుటంగా ‘’నిత్యమ్మానస వాస మీశ్వర మహం రామాకృతిం భావయే ‘’గా ఉంచాడు .వీటిలో శ్లేష వైభవం ఉంటుంది ప్రతి పదం రామ పరంగా ,శివపరంగా అర్ధం చెప్పుకోవాలి .అప్పుడే భావం అందుతుంది పండుతుంది.ఈఎనిమిది శ్లోకాలను ‘’రామాకృతీశ్వరాస్టకం’’అంటారు  .ఆ వైభోగాన్ని తిలకిద్దాం –

1-శ్రీ కంఠం స్పుట నీర స౦భవ దృశం వందారు కల్ప ద్రుమం-రత్నోద్భాస్వద హీన కంకణ ధరం బ్రహ్మాదిభిః సంస్తుతం

సత్యం చిత్తజ వైరి సంభ్రమ హరం తం పార్వతీ నాయకం –‘’నిత్యమ్మానసవాస మీశ్వర మహం ‘రామాకృతిం భావయే ‘’’

భావం –విషం కంఠంలో ఉన్న (శివుడు )లక్ష్మీ అంశ గల సీతాంకం పై ఉన్న (రాముడు )కమలాల వంటి కన్నులున్న ,నమస్కరించిన వారి కోర్కెలు తీర్చే దేవ వృక్షము వంటి వాడు ,రత్నాల కంకణం తో ప్రకాశించేవాడు ,బ్రహ్మాదులచే స్తుతింప బడేవాడు అయిన ఈశ్వరుడు ,నిత్యుడు ,మనసులో పుట్టే లోపలి శత్రువులను హరించేవాడు ,అందమైన ఆకారం లేక రాముని ఆకారం గల పార్వతీ పతికి నమస్కారం .

ఇందులో మానస వాస స్పుట వీరసంభవ దృశం వందారు కల్పద్రుమ ,సత్య ,ఈశ్వర శబ్దాలు శ్రీరామ శివులిద్దరికీ చెందుతాయి .

2-‘’లోకేశం బహురాజ రాజ వినుతం పౌలస్త్య సంతోషధం –సీతా రమ్య పయోదరాది కల సచ్చ్రీ కుంకు మాలం కృతం

భవ్యం సధ్వజ జాత నంద పరం కైలాస నాదం ప్రభుం –నిత్యమ్మానసవాసమీశ్వర మహం రామాకృతిం భావయే ‘’

భావం –లోకేశ్వరుడు ,ఎక్కువగా కుబేరుని చేత స్తుతింప బడేవాడు ,పులస్త్య వంశ సంజాతుడైన రావణునికి (శివుడు )విభీషణుడికి (రామ ) సంతోషం కలిగించి ,నాగేటి చాలుకు మనోహరమైన మేఘాల మెరుపు కాంతి అనే కుంకుమ చేత అలంకరింప బడిన ,మంచి వారైన బ్రహ్మ కుమారులకు ఆనందం కలిగించటానికి ఆసక్తడయ్యే ,మనసులో నివసించే ప్రభువైన ,సమర్ధుడైన రాముని ఆకారం లో ఉన్న కైలాస నాధుని భావిస్తాను .

రామాకృతి శబ్దం లో రామ అంటే స్త్రీ ,అంటే పార్వతి అంటే అర్ధనారీశ్వరత్వం .రామ పరంగా నాగేటి చాలులో దొరికిన సీత అని అర్ధం ‘

3-‘’కౌసల్యా వర నందనం గుణ యుతం ,హంసాన్వయోల్లాసకం –కల్యాణం వరరాజ శేఖర మతి ప్రాలేయ శైలాశ్రయం

బాణోత్దాత మహా గజాసుర శిరోభార మ్మునీన్ద్రస్తుతం –నిత్యమ్మానస వాస మీశ్వరమహం రామాకృతిం భావయే ‘’.

భావం –కౌసల్యకు వరమిచ్చి సంతోషింప జేసినలేక కౌసల్య శ్రేష్ట పుత్రుడైన ,గుణాలతో ఉన్న ,జ్ఞానుల కులాన్ని ఉల్లసింప జేసే ,(శివుడు )లేక సూర్య కులాన్ని ఉల్లసింప జేసే (రాముడు ),మంగళ స్వరూపుడైన చంద్రుడు శిరో భూషనంగా ఉన్న (శివుడు )లేక రాజులకు శిరో భూషణం లాంటి వాడైన (రాముడు ),గొప్ప కొండ అయిన కైలాసం లో నివసించే లేక ఉత్తర ధృవం నుంచి దక్షిణానికి వెళ్ళేటప్పుడు మంచుకొండ అయిన హిమాలయాన్ని దాటిన తర్వాత వచ్చే అయోధ్యా పట్టన వాసి అయిన రాముని ,బాణాలతో గజాసుర సంహారం చేసి పార్వతికి (శివుడు )పదితలల రావణుని బలమైన బాణం తో చంపిన (రాముడు )మునీన్ద్రులచే స్తుతింప బడిన ,సుందరమైన మనసు నివాసంగా కల,రామ ఆకారం లో ఉన్న ఈశ్వరుని ఉపాసిస్తాను .

కౌసల్య శివుని ఉపాసిస్తే వరంగా రాముడిని కుమారునిగా అనుగ్రహించాడని పురాణ కద ఉంది .విల్లూ నారి ఉన్నవాడు రాముడు దయా గుణమున్నవాడు శివుడు .హంసాన్వయం అంటే జ్ఞానుల సముదాయమైన మునీశ్వరులు అని శివ పక్షంగా ,సూర్య వంశం లో అని రామ పక్షంగా అర్ధం .ఇద్దరూ కల్యాణం ఇచ్చేవారే .వర రాజ శేఖరం –నెత్తిమీద చంద్రుడున్నవాడు శివుడు రాజ వంశాలలో శిఖరాయమైన వాడు రాముడు .అతి ప్రాలేయ శైలం అంటే ఉత్తరాన మంచుకొండ దాటితే వచ్చేది కైలాసం అని శివుని పక్షాన ,ఉత్తర ధృవం నుండి దక్షిణానికి వెళ్ళేటప్పుడు హిమాలయం దాటితే వచ్చేమొదటి అయోధ్యా పట్టణం అని రామ పరంగా అర్ధం .’’శ్రీరామః శ్యామలాదేవి ‘అనే తాంత్రిక మంత్రం ప్రకారం శ్రీరాముడు శక్తి అవతారం కనుక హరి హర అవతారం లో మోహినిగా శివుని కామించి ‘’హరిం పరం తమను యంతి దేవాః’’అనే వేద వచనం ప్రకారం కూడావిష్ణువు రామ అంటే స్త్రీయే

4-‘’హస్త స్వీకృత బాణ ముజ్జ్వల తనుం భాస్వ ద్విభూతేర్ధధం –నిత్యం సద్వ్రుష వాహ మందక రిపుం రుద్రాక్ష మాలాధారం

నానా శేష శిరః కిరీట విలసన్మాణిక్య శోభోజ్జ్వలం –నిత్యమ్మానస వాస మీశ్వర మహం రామాకృతిం భావయే ‘’

భావం –బాణాసురుని చేబట్టిన (శివుడు )లేక బాణం చేతిలో ఉన్న (రాముడు )ప్రకాశించే బూడిద ఒంటి నిండా ఉన్న లేక ప్రకాశించే శరీరం కల ,ఎద్దు వాహనంగా ఉన్న లేక మంచి ధర్మాన్ని ధరించిన ,అంధ కాసుర శత్రువైన లేక గుడ్డి ద్రుతరాస్త్రుడికి శత్రువైన (కృష్ణావతారం ),రుద్రాక్ష మాలలు ధరించే లేక దుఖాన్ని పోగొట్టే జపమాల ధరించిన ,అనేక రాజుల శిరోమణులచేత ప్రకాశించే పాదాలుగల నిత్యుడైన మనసు నివాసంగా ఉన్న రామాకృతిగల లేక రామ వంటి ఆకారం కల మహేశ్వరునికి వందనం .

5-‘’అత్య౦తానిల సూను వందిత పదం శ్రీ చందనాలంకృతం-కాంత మ్మోహన వాలి నాశ కరం సద్ధర్మ మార్గా కరం

విశ్వామిత్ర సుయోగ వర్ధన మహోత్క్రుస్ట ప్రభా దర్శకం –నిత్యమ్మానస వాస మీశ్వర మహం రామాకృతిం భావయే .

భావం –ఎక్కువగా ఆంజనేయ లేక భీముని చేత నమస్కరింప బడే పాదాలు కలవాడు ,శ్రీ చందనం చేత అలంకరింప బడేవాడు ,సుందర మోహ రూపుడైన గజాసురుడు లేక వాలి ని నాశనం చేసినవాడు ,విశ్వామిత్రుని మంచి యాగాన్ని కాపాడిన వాడు లేక విశ్వానికి అమిత్రుడు అయిన దక్షుని యాగాన్ని ధ్వంసం చేసినవాడు మహోత్క్రుస్ట ప్రభావాన్ని దర్శి౦ప జేసే నాశనం లేని మానసవాస రామాకృతి శివునికి వందనం

శివుడికి లయకారుడుకనుక భీముడు అనే పేరుంది  .కుంతీ దేవి భీమనామ శివుని  ఆరాధించి పొందిన కుమారుడికి భీముడు అనే పేరు పెట్టింది .అనిలుడు అంటే వాయువు శివుని అస్టమూర్తులలో వాయువు ఉన్నాడు .గజాసురుడు వాలి ఇతరులను మొహం లో పడేసేవారే .విశ్వామిత్రుడు గాది తనయుడు .శివుడికి భాగం ఇవ్వకుండా యజ్ఞం చేసిన దక్షుడు విశ్వానికి అమిత్రుడు .శివుడికి మంచిగంధం పూత ఇష్టం .రాముడు వనవాసం పూర్తీ అయ్యాకే చందన చర్చితుడు అయ్యాడు .

6-‘’దీవ్య ద్రశ్మి తమోను దర్దవిలసత్సద్భాను పట్టం విభుం –శాంతం పూర్ణ నభో౦శుకం నిజ జనాధారం కృపాసాగరం

దేవేశం గుహ మానసా౦బుజ దినాదీశం ప్రియం శంకరం –నిత్యమ్మానస వాస మీశ్వర మహం రామాకృతిం భావయే ‘’

భావం –ప్రకాశించే కిరణాలతో చీకటిని పోగొట్టే అర్ధ చంద్ర ఫాలం కల,లేక సూర్యుడు కట్టుకొన్న పట్టం కల పూర్ణాకాశమేవస్త్రంగా ఉన్న లేక పూర్ణాకాశంవంటి నీలకాంతి ఉన్న ,తనవారికి ఆధారమైన ,దయకు సముద్రుడైన ,దేవతలకు గురువైన కుమారస్వామి లేక భిల్ల రాజైన గుహుని మనస్సు అనే కమలానికి సూర్యుడైన  ,ప్రేమకల సుఖాన్ని  ఇచ్చే శాశ్వతుడైన రామాకృతి గల శివుని భావిస్తాను .

రాజ్యాభిషేక సమయం లో ఫాలానికి కట్టే పట్టు వస్త్రాన్ని ‘’పట్టం’’అంటారు .శివుడికి చంద్రుడే అలాంటి పట్టం .అర్ధ చంద్రుడుకనుక అర్ధ విలసత్ అన్నాడు .ప్రకాశించే కిరణాలవాడు కనుక దీవ్యద్రశ్మి .పూర్ణ నభోమ్శుకం శివుడు దిగంబరుడని సూచిస్తుంది .గుహ అనే మాట కుమారస్వామికి గుహుడికి వర్తిస్తుంది .

7-‘’కామం లక్ష్మణ హస్త పంకజ కృత ప్రేమాది పూజాద్రుతం –సానందం భరత ప్రమోద నిలయం ధీరం సుమంత్రాదిపం

హర్తారం ఖర దూషణాహృతి పదం సాకేత వాసాదరం – నిత్యమ్మానస వాస మీశ్వర మహం రామాకృతిం భావయే ‘’

భావం –లక్ష్మణుని హస్తకమలాలచే చేయ బడిన  ప్రేమ మొదలైన పూజలయందు ఆదరంకల ,ఆనందం తో భరతుని సంతోషానికి స్థానమైన ,ధీరుడైన మంచి మంత్రాలకు ప్రభువైన (శివుడు )లేకసుమంతుడనే మంత్రికి ప్రభువైన (రాముడు ),సంహారకుడైన ,అతి కఠిన నిందలను  స్వీకరించే స్థానమైన (శివుడు) లేక ఖర దూషణాది రాక్ష సంహారానికి స్థానమైన (రాముడు ),జ్ఞానం తో కూడిన నివాసం లో ఆదరమున్న రామాకార శివుని పూజిస్తాను .

విష్ణువు పురుషుడు అయినా స్త్రీ భావం తో మోహత్వం పొందిన శివుని సంభోగ సుఖం తో ‘’భైరవు’డి’’ని కన్నాడు.శివుడు త్రిముర్త్యాత్మక రూపమైనట్లే రాముడు కూడా .లక్ష్మణ పూజ రాముడు గ్రహిస్తే రామ శివలింగ ప్రతిష్ట శివునికి ప్రీతి కలిగించింది .శివుడికి కైలాసం యెంత ఇష్టమో రాముడికి సాకేత పురి అంత ఇష్టం .

8-‘’పాదాక్రాంత విభీషణం రణ ముఖే సద్రత్న సింహాసనా –రూఢం భీమ ధనుః ప్రభంజ నవర శ్రీ కీర్తి మాలాధరం

కుందానంద నమంద హాస మతులం శ్రీరామ చంద్రం సదా- నిత్యమ్మానస వాస మీశ్వర మహం రామాకృతిం భావయే ‘’

భావం –యుద్ధం లో చేతు లేటత్తేసి నమస్కరించిన వారికి అభయ మిచ్చేవాడు (శివుడు )లేక యుద్ధం లో శరణాగతుడైన విభీషణుడు కలవాడు(రాముడు ),రత్న కిరీట దారి,యుద్ధం లో అరి వీర భీకరుడు అయిన అర్జునుని ధనుస్సును భేదించి ,వరమాలను అనుగ్రహించినవాడు (శివుడు )శివ ధనువును భంజించి లక్ష్మీస్వరూప సీతను ఆమె వేసిన వరమాలను గైకోన్నవాడు (రాముడు )మల్లెమొగ్గల్లాంటి నవ్వుతో అందాన్ని సాటి లేని కాంతినీ ఇచ్చే రాముడు లేక చంద్ర శేఖరుడైన శివుడు మానసావరణానికి ప్రభువైన రామబ్రహ్మం  లాగా క్రియా రహితుడైన  రామాకృతి కల ఈశ్వరునిభావిస్తాను

అర్జునుని అనుగ్రహించాడు అనే కీర్తిమాల శివుడు ధరించాడు .రాముడు శివ ధనుర్భంగము చేసి వరశ్రీ ని అంటే సీతకు భర్తగా వరింప బడే కీర్తిని పొందాడు .ఇతరులు విరవలేని ధనుస్సును విరిచాడనే కీర్తిమాల రాముడు ధరించాడనిఅర్ధం .

ఆధారం –భరద్వాజ మహర్షి రాసిన శ్రీ శివ కర్ణామృతం కావ్యానికి శ్రీ దోర్బల విశ్వనాధ శర్మగారి అర్ధతాత్పర్య వ్యాఖ్యానం

 

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-16-ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.