శ్రీశివ కర్ణామృతం లో శివ సంసారం ,శృంగారం ,పంచాక్షరి

శ్రీశివ కర్ణామృతం లో శివ సంసారం ,శృంగారం ,పంచాక్షరి

భరద్వాజ మహర్షి రచించిన శ్రీ శివ కర్ణామృతం లో శివుని సంసారాన్ని ఆయన శృంగార చేష్టలను మహర్షి మహా అందంగా వర్ణించాడు .మొదట శివ సంసార వర్ణన చూద్దాం .

1-‘’అర్దా౦గే హిమ శైలజాం దధ దయం  బంధుం గృహం తద్గురోః-కైలాసాచల ముద్వహన్ కరతలే కృత్వా సుమేరుం ధనుం

గంగా మ్మూర్ధ తలే తదా భమపి సన్మౌలౌ విదుం తత్క్రుతే—కాశీ వాస కరః శుభం వితనుతాం శంభు ర్మహాకార్ముకః ‘’

తాత్పర్యం –సగం శరీరం లో హైమవతి ని ధరించి ,హిమవంతుని బంధువైన కైలాసాన్ని  ఇల్లుగా చేసుకొని ,సుమేరువును ధనుస్సుగా స్వీకరించి ,గంగను, చంద్రుని శిరస్సు పై ధరించి ,కాశీ వాసి,మహా కార్ముకుడు అయిన  అయిన శంభుడు శుభం చేకూర్చుగాక .

హైమవతి తండ్రి హిమ వంతుడి బంధువైన కైలాసాన్ని ఇల్లుగా చేసుకొన్నాడు .వేటాడే వృత్తికి సహాయ పడటానికి హిమవంతుని మరొక చుట్టం సుమేరువు వేటాడే ధనుస్సుగా సహకరిస్తున్నాడు .శివుడికి ఆభారణాలపై ప్రేమ చాలానే ఉంది .అందుకే చంద్రుని గంగను తలపై పెట్టుకొన్నాడు. ధనుర్విద్యా నైపుణ్యం తో మహా  కార్ముకుడైన  శివుడు జ్ఞాన రూప బాణాన్ని వ్యర్ధం కాకుండా ,వేటాడుతూ ,సంసారులకు నరక భయం చూపించి బెదిరిస్తూ ,వాళ్ళ అజ్ఞాన ధనాన్ని  దోచుకొంటూ జీవిక సాగిస్తున్నాడు .వేట సాగక పొతే కాశీ లో నివాసం ఉండి భార్య అన్న పూర్ణ పెట్టె భిక్షతో జీవిస్తు,కైలాసం లో భార్య బిడ్డలకు పెడుతూ సంసారం లాగిస్తున్నాడు శివుడు .గంగను నెత్తిమీద పెట్టుకొన్నా గౌరియే అర్ధాంగి అని నమ్మిస్తున్నాడు .ఇలా ఇద్దరు భార్యల ముద్దుల మొగుడుగా దక్షిణ నాయకత్వశృంగారం  వెలిగిస్తున్నాడు .గంగను రెండో భార్యగా తెచ్చుకొన్నా గౌరీ ఏమీ మాట్లాడలేదు కారణం ఆమె ఒక జడురాలు అంటే కొండకు పుట్టినది .చంద్రుడూ జడుడేఅయినా నెత్తి కెక్కి౦చు కొన్నాడు .నీరు అవసరం కదా అని భార్య గౌరికి నంగనాచి కబుర్లు చెప్పినెత్తిన పెట్టుకొన్నాడు .

తరువాతి శ్లోకం లో శివుని  శృంగార రసోత్కర్షను వర్ణిస్తున్నాడు

2-‘’కోవాహే శైలజాతే! వపుషి ద్రుత తరాలింగితోవర్తతే తే-మాయా మద్వేష దారీ వద విదిత మహో తావకీనం హిశీలం

ఇత్యుర్వీ భ్రుత్తనూజాం క్షణం చకిత తరాం భీష యిత్వాసహాసో –వీక్ష్యాత్మానం తదంగ ప్రతి ఫలిత ముమా ప్రాణ నాదో వతాన్నః .’’

భావం –శివుడు పార్వతిని కౌగలించుకో బోయాడు .అప్పుడు ఆమె శరీరం లో శివుడు ప్రతి ఫలించాడు .అది చూసి ఆయన ‘’పార్వతీ !నా వేషం వేసుకొని నిన్ను కౌగిలించుకొన్న వాడేవ్వడు ?ఆహా యెంత గొప్ప శీలం నీది !అని ఒక్కక్షణకాలం ఆమె ఆశ్చర్య పోయేట్లు బెదిరించి చిరునవ్వుతో ఉన్న శివుడు మనల్ని కాపాడాలి .

స్పటిక మణి,జపాకుసుమం ఒకే చోట ఉంటె ఒక దాని లక్షణం రెండవ దానిలో కనపడుతుంది .సాంఖ్యం లో ప్రక్రుతి పురుష సంయోగం –జపా స్పటిక మణి సంయోగంగా చెప్ప బడింది.శివుడు స్పటిక మణి .పార్వతి జపాకుసుమం .కనుక శివుని దేహం లో పార్వతి ప్రతి ఫలించాలి .కాని పార్వతి శరీరం లో శివుడు ప్రతి ఫలించాడు. అంటే శివుని స్పటిక సమానత్వం పార్వతిలో కనపడింది .ఈవిషయం శివుడు గ్రహించాడు .పార్వతిని, దీన్ని సాకుగా తీసుకొని కొంచెం ఆట పట్టించాలని ‘’నన్ను కౌగిలించుకోవటానికి ముందే ఇంకోడిని కౌగలి౦చు కొన్నావ్ .నాకు అసలు విషయం చెప్పు వాడేవడు  ?అని కోపం నటించి ప్రశ్నించాడు .ఆమె చకితురాలైంది .అలాంటి పార్వతిని శివుడు కౌగలించాడు .శృంగారం రసోత్కర్ష మైధ్వనించింది

తరువాత శివా శివుల సమాగమం శ్వేత పీత మహాస్సుల సమాగమం  గా కవి వర్ణించాడు ఆ వైభోగాన్నీ చూద్దాం ..

3-పంచ బాణ విజయస్య కాంచన –స్తంభతా విలసిత ప్రతీతి కృత్-

రాజతాద్రి నిహితో దినోతు మాం –శ్వేత పీత మహాసోస్సమాగమః ‘’

భావం –మన్మధుడి విజయస్తంభం నటబడిందా అన్నట్లు తెల్లని ,పచ్చని కాంతుల కలయిక నన్ను సంతోష పెట్టాలి

ఇప్పటిదాకా వైరాగ్యం లో ఉన్న శివుడు ,పార్వతీ దేవి తపస్సుతో శివుడిలో కాముడు పునర్జన్మ పొందాడు .అలాంటి శివుడిని కామంతో గెలిచాననే ధీమాతో విజయ స్తంభం నాటబడి తెలుపు పసుపు కాంతులు సమాగమమైనాయి .పార్వతి దేహచ్చాయ పసుపు. శివునిది తెలుపు .వీరిద్దరి పేర్లు చెప్పకుండా కవి ఈ రంగుల సమాగమం చెప్పాడు చమత్కారంగా .రజతాద్రి మీద మన్మధుడు నాటిన విజయ స్తంభం బంగారు వర్ణం కలది .బుద్ధి అనే గుహకు ప్రతీక అయిన వెండి కొండపై ఉన్న గుహలో శివ పార్వతుల శ్వేత పీత సమాగమం జరిగింది .ఇది ఆ౦తరంగికమని  నిహిత అనే శబ్దం సూచిస్తోంది .మన్మధుడు అరవింద ,చూతక అశోక ,నవ మల్లిక ,నీలోత్పలం అనే పంచ పుష్ప బాణుడు .మన్మధుని విజయం అంటే పంచ బాణ విజయమే .అంతటి ప్రభావం ఆ పుష్పబాణాలకున్నది అని అర్ధం .ఈ శ్లోకం రదోద్ధత వృత్తం లో రచింప బడింది . తరువాత శ్లోకం లో కవి వారి సమాగమం తన మనసులో జరగాలని కోరాడు .

4-‘’అన్యోన్య నైర్మల్య సమృద్ధి భాజో –రన్యోన్య దేహ ప్రతి బి౦బనేన

తేజోర్ధనారీశ్వర యోర్ధ్వ యోసత్ –ప్రకాశ మానమ్మమ మానసేస్తు’’

భావం – పార్వతీ పరమేశ్వరుల సంయోగం లో ఒకరి శరీరంలో మరొకరి శరీరం ప్రతి ఫలిస్తోంది .అలాంటి అర్ధనారీశ్వర తేజం నా మనసులో శాశ్వతంగా ప్రకాశించాలి .

ఇద్దరి శరీరాలు అత్యంత నిర్మలం కనుక ఈ ప్రతిఫలించటం కుదిరింది .వారి తేజం ‘’సత్త’’అంటే త్రికాలా బాధ్యం అని మంచిదని అర్ధాలు .శివ పారమ్య దృష్టిలో అమ్మవారు ప్రతి బింబ పాత్రగా ఉంటుంది .శక్తి పారామ్య దృష్టిలో శివుని నుంచి అమ్మవారు తొలగిపోతే ఆయన శవమే కాని  శివం కాదు  .నిర్గుణ కైవల్య అద్వైత వాసన కలిగి దానికోసం ప్రయత్నించేవాడు ‘’ఈశ్వరానుగ్రహా దేవ పుంసా మద్వైత వాసనా ‘’అనేదాని ప్రకారం ఈశ్వరోపాసన చేయాల్సిందే

మరో శ్లోకం లో శివుడు శివా ను పరిహసి౦చటం చెప్పాడు –

5-‘’శ్రీ గౌరీం ప్రణయేన జాతు కుపితాంవైముఖ్య సంధాయినీ –మంగీకార మకుర్వతీమను నయైః కందర్ప చేస్టాస్వలం

సంక్రాంతః కిమురోజ యోర్హ్రుది చ తేపాషాణ భారః పరం –తాతస్యేతి నవ దంశ్చిరాదభి ముఖీ కుర్వంచ్చివః పాతునః’’

భావం –పార్వతి ప్రణయం తో కోపం వచ్చి మన్మధ క్రీడకు విముఖురాలైంది .శివుడు ఎన్నో అనునయ వాక్యాలు పలికి ఆమెను ప్రసన్నం చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు .ఆమె అంగీకరించలేదు .అప్పుడు స్థాణువైనశివుడు ఆమెతో ‘’నీ స్తనాలకూ నీ హృదయానికీ కూడా  నీ తండ్రి పాషాణత్వం సంక్రమించిందేమో‘’అని నిష్టూరంగా అన్నాడు .చివరికి ఆమెను ప్రసన్నం చేసుకొని సుఖించిన శివుడు మమ్మల్ని కాపాడాలి .

స్తనాల కాఠిన్యం స్త్రీకి సహజం  అందం శోభా కూడా. కాని హృదయ కాఠిన్యంఆమెకు సహజమైంది కాదు .ఈ రెండు కాఠిన్యాలుఆమెకు తండ్రి హిమగిరి నుండి సంక్రమించాయి అనటం చమత్కారం తండ్రి లక్షణాలు కూతురికి రావటం సహజమే కాక అభి వృద్ధి సూచకం కూడా .

అసలే తాండవ లోలుడు .ఇప్పుడు భార్య మనసు స్వాధీనమైనది .ఇక రెచ్చి పోయి శివుడు నాట్యం చేశాడు ఎలా ?

6-‘’దిం –ధిమి –ధిమి –ధిమి –శబ్డై-ర్బందుర పద మందరం నటంతం తం

ఝం ఝణఝణ ఝణ రావా –రంజిత మణి మండనం శివం వందే ‘’

భావం –దిం ధిమి ధిమి ధిమి అనే మృదంగ ధ్వనులకు అనుగుణంగా ఝం ఝణ ఝణ ఝణ అనే శబ్దాలతో అక్కడ సమావేశమైన వారందరికీ ఆనందం కలిగేట్లు ,రంజింప జేసే భూషణాలు కలిగి ఉన్న నాట్యమాడే శివుని సేవిస్తాను .

శివుని దయాగుణం అపరిమితం అని చెప్పే శ్లోకం

‘’యః శ్రీకరం బాలమంత్ర తంత్రం –క్రీడాదరాత్ స్వంపరి పూజ యంతం

శివః క్రుతార్ధం కృతవాం స్త ధైన-మయం కిమాత్మీయ ముపెక్షతే మాం ‘’

భావం –పూర్వం శ్రీకరుడు అనే పిల్లాడు మంత్రం తంత్రం లేకుండా ఆదరం గా శివుడిని పూజించాడు .ఆబాలుడి భక్తికి మెచ్చి శివుడు అతడిని క్రుతార్దుడిని చేసినట్లు నన్ను క్రుతార్దుడిని చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నావు అని కవి ప్రశ్నించాడు శివుడిని .

శివ పంచాక్షరీ మంత్రం మహాత్మ్యాన్ని వర్ణిస్తున్నాడిప్పుడు –

8-యదోప దిస్టా శ్రవణే శివస్య –పంచాక్షరీ గార్గ మునీశ్వ రేణ

నిర్యాయ భూపస్య తధైవ గాత్రాత్ –కాకాత్మనా పాప చయః ప్రదగ్ధః ‘’

భావం –ఒకప్పుడు ఒక రాజు చెవిలో గర్గమునీశ్వరుడు శివ పంచాక్షరీ మంత్రం ఉపదేశిస్తే ,ఆయన శరీరం లో నుంచి పాపం అంతా కాకి రూపం లోబయటికి వచ్చి,ఆయన పాప సమూహం కాలిపోయింది

అనేక పాపాలు చేస్తేనే కాకి జన్మ వస్తుంది .అందుకే ‘’కాకోపి జీవతి చిరాయ బలిం చ భుక్తే –పాపీ చిరాయచిర జీవ కాకః ‘’అనే సామెత లోకం లో వచ్చింది ‘

ప్రశ్న ,సమాధానం రూపం లో  శివమహిమను వర్ణించే శ్లోకం –

9-‘’కందర్ప మనం వక్తి –పురాణా మమరద్విషాం-కామాశాం కృతవాన్ వ్యర్దాం –క్షణాత్ కోపేన శంకరః ‘’

భావం –పురాణాలు పుర అనే రాక్షసుని దర్పాన్ని అణచిన వాడు ఎవడు అని చెప్పాయి ?కందర్ప దమనుడైన శివుడిని అని సమాధానం .కోపం తో క్షణకాలం లోనే ఆశను వ్యర్ధం చేసినది ఎవరు ?కాముడని పిలువ బడే మన్మధుని ఆశను క్షణ కాలం లో నీరు కార్చిన శివుడు అని జవాబు .

కం దర్ప దమనం –లో కం అంటే ఎవరిని అని అర్ధం. కలిపి తే కందర్ప దమనం –అంటే మన్మధ దహనం చేసిన వాడు అనే అర్ధం వస్తుంది .అలాగే పురా అంటే త్రిపురాసురపురాలు .పురాణామామర ద్విషా అనికలిపితే పుర రాక్షస వినాశనకారి అనే అర్ధం

చివరగా శివుని నమ్మిన వాడికి యే భయం లేదని చెప్పే –శివ పంచాక్షరీ బీజాక్షర ప్రారంభంగా చెప్పిన విశేష శ్లోకాలు

10-‘’న జననీ జన గర్భ నివాసజం –న చ నిరంతర సంసృతి జమ్మమ

న యమ దూత కృతం చ భయం యతో –నవరతమ్మమ దైవత మీశ్వరం ‘’

భావం –నా దైవం  ఈశ్వరుడు కనుక నాకు తల్లికడుపులో మళ్ళీ పుడతానన్న భయం కాని ,సంసార భయం కాని ,యమ దూతల వలన భయం కానీ లేదు .

ఈశ్లోకం లో ఒక విశేషం ఉంది .శివ పంచాక్షరీ మంత్రం లోని నకారం తో నాలుగు పాదాలను నడపటం .మిగిలిన శ్లోకాలలో కూడా ఈ విశేషం గమనించండి

11-మహా వీర రుద్రమ్మనో జాతి రౌద్రం –మహీ భ్రుత్కుమారీ మనః పద్మ మిత్రం

మఖ ద్వంసినం సమ్మత శ్రీకరమ్మ –న్మనో మందిరం మహా దేవ మీడే’’

భావం –మన్మధుడికి అతి భయం కలిగించిన శత్రువు మహా వీర రుద్రుడు .కానీ పార్వతీ దేవి మనస్సు అనే పద్మానికి మిత్రుడు అంటే సూర్యుడు .దక్ష యజ్న ధ్వంసకుడు ,ఇస్టులకు ఇష్టసంపదలిచ్చేవాడు ,నా మనో మందిరం లో నివసించే మహాదేవునికి వందనం .

12-‘’శివేపరాప హ౦తారం  -శివ సందాయినం పరం

శివానంద కరం శాంతం –శివం సేవే నిరంతరం ‘’.

భావం –అమంగళాన్నిపోగొట్టి ,మంగళాన్నికలిగించే వాడు శివానందాన్నిచ్చే వాడు ,శాంతుడు ,ఉత్క్రుస్టుడుఅయిన శివుని సేవిస్తాను .

13-వాసుకీశ్వర విభూషిత కంఠం-వామ భాగ పరి పూరిత బాలం

వారణాస్యభిదా  పట్టణ వాసం –వామ దేవ మది దైవత మీడే’’.

భావం –కంఠం లో వాసుకి అనే సర్పేశ్వరుని ధరించి వామ భాగం లో బాల లేక బాలుడు కల కేశ పాశం తో,వారాణసి పట్టణమైన కాశీ లో నివశించే గొప్ప వాడైన వామ దేవ శివుని నుతిస్తాను .

14-‘’యదు నాద పద్మ భవ వాసవాదయో –యదుదార భావ గుణ నాయకాః శివం

యమ శాసనోగ్ర తర మాశ్రయ౦త్యహో –యమ నాద నాద మహా మాశ్రయామి తం ‘’

భావం –ఏకారణం తో యమశాసనాన్నివిని ఉగ్రుడైన శివుని ఉదార గుణాలకు నాయకులైన విష్ణు బ్రహ్మా ఇంద్రాదులు ఆశ్ర ఇస్తారో ,ఆ కారణంగానే నేను ఉమానాద శివుడిని ఆశ్ర యిస్తాను  .

ఈవిధంగా 5శ్లోకాలతో శివ పంచాక్షరి చెప్పి తరువాత దానిఅర్ధాన్ని వివరిస్తున్నాడు భరద్వాజ మహర్షికవి –

15-‘’నమః సృష్టి స్థితి లయాన్ –కుర్వతే జగతాం సదా

శివ యైక్యం గతా యాంతు –పరమానంద రూపిణే’’

భావం –ఎప్పుడూ లోకాలసృష్టి స్తితి లయాలు చేస్తున్న  పార్వతీదేవి  ఐక్యత తో,పరమానంద స్వరూపుడైన శివునికి నా నమస్సులు .

చివరగా అకార ,ఉకార ,మకారాలతో కూడిన ప్రణవాన్ని వర్ణిస్తున్నాడు –

16-‘’ఆది స్వరం తృతీయేన –సహితం బిందు సంయుతం

ధ్యాయామి హృదయే యోగీ –ధ్యేయం కామిత మోక్షదం ‘’

భావం –కోరుకొన్న మోక్షాన్నిచ్చే ,యోగులచేత ద్యానింప బడే మూడవ స్వరమైన ఉకారం తో,బిందువు అంటే మకారం తో కలిసిన ఆది స్వరం అంటే ఆకారం తో ఉన్న ప్రణవమైన ఓంకారాన్ని మనసులో ధ్యానిస్తాను .

ఆధారం –భరద్వాజ మహర్షి రాసిన శ్రీశివ కర్ణామృతం కావ్యానికి శ్రీ దోర్బల విశ్వనాధ శర్మ గారి అర్ధ తాత్పర్య ‘’ఆస్వాదినీ వ్యాఖ్యానం’’.

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-16-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.