ఇది విన్నారా ,కన్నారా !-8
15-వైదుష్యం మూర్తీభవించిన శ్రీమతి అరుంధతీ సర్కార్
136-78ఏళ్ళవయసులో ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తం లో లేచి 3-30 నుంచి 5-30దాకా సంగీత సాధన చేసే ఆదర్శ విద్వాంసురాలు శ్రీమతి అరుంధతీ సర్కార్ .
137-సర్కార్ మొదటి గురువు పారుపల్లివారే .పట్టమ్మాళ్ గారిదగ్గరా విద్య నేర్చారు.ఏక సందా గ్రాహి .స్వరం తో రాసుకో కుండా వేల కీర్తనలను అలవోకగా పాడగలగటం అరుంధతి గారి ప్రత్యేకత .
138-పట్టమ్మాళ్ వైదుష్యం అంతా ఇంతాకాదని ఏది అడిగినా అనర్గళంగా గంటల కొలది చెప్పే ఓర్పూ నేర్పూ ఆమెకున్నాయని ,విద్యార్ధుల్ని చంటి పిల్లల్లాగా ధన ద్రుష్టి లేకుండా చూస్తారని తన అనుభవాన్ని చెప్పారు .తొమ్మిదవ ఏటనే డి.కె గారి 78 ఆర్ పి.ఏం రికార్డులు విని ఆమె సంగీత ప్రభావం లో పడ్డారు అరుంధతి .
139-ప్రతి ఏడు త్యాగ రాజ ఉత్సవాలకు తిరువయ్యూర్ వెళ్లి వస్తారు సర్కార్ .దీక్షితులవారు ఏయే క్షేత్రాలపై కీర్తనలు రాశారో ఆయా క్షేత్రాలను యాత్రగాకూడా వెళ్లి సందర్శిస్తారు .
140-తొమ్మిది శైవ క్షేత్రాలలోని తొమ్మిది మంది లింగ మూర్తులపై ఉన్న కృతులను అరు౦ధతి గారు పాడగా ఆకాశవాణి రికార్డ్ చేసింది .
141-ఉత్తరాంధ్ర శ్రీకాకుళం లో సర్కార్ నాలుగు గంటలు కచేరీ చేసి గ్రామీణ ప్రజలను తాదాత్మ్యం లో ముంచారు .స్వరకల్పన ,రాగాలాపనలో రాగాలాపనకే మొగ్గు చూపుతారు .
142-బంగారు కామాక్షి పేరుతొ శ్యామ శాస్త్రిగారి కృతులు పాడితే కళా వారధి వారు క్యాసెట్లు సి డిలుగా తెచ్చారు .
143-ఆకాశవాణి ప్రోగ్రాం ఎక్సి క్యూటివ్ గా 1971వరకు పనిచేసి గొప్ప ఫీచర్స్ చేసి అందించారు అందులో ‘’ఆరిజిన్స్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ విజయనగరం ‘’మంచి ఫీచర్ గా పేరు పొందింది ..వీరు రచించి ప్రసారం చేసినవి –మంత్రాలయ మహాన్ ,గురు గుహోదయం ,శ్రీ కమలాంబా జయంతి ,గురు గుహాంత రంగం .
144-‘’ఆనందం కోసం పాడుకొంటాను .పాడు కొంటూ ఉండాగా మనసు శూన్యం తో నిండుతుంది ‘’అంటారు శ్రీమతి అరుంధతీ సర్కార్ .శూన్యం అంటే ద్వంద్వాతీత స్థితి అని అదే పూర్నత్వానికి పర్యాయ పదమని ఆచార్య ముదిగొండ వీర భద్రయ్య గారు వివరణ ఇచ్చారు .
16-వాయులీన విద్యాదరి శ్రీమతి అవసరాల కన్యాకుమారి
145-మైసూర్ చౌదయ్యగారి వయోలిన్ వాదన ‘’గుర్రాలు పరిగెత్తినట్లు ఉంటుంది ‘’అన్నారు సరస్వతీ పుత్ర పుట్టపర్తి వారు .ద్వారం వారి వాదన ‘’మలయపవనం వీచి నట్లు ఉంటుంది ‘’అన్నారు ఆచార్య .
146-కాకినాడలో పుట్టి మద్రాస్ లో పెరిగిన కన్యాకుమారిగారు శ్రీమతి ఏం ఎల్ వసంతకుమారిగారికి 19ఏళ్ళు వాయులీన సహకారమందించారు .అది తనకు సువర్ణ అధ్యాయం అంటారు కన్యా కుమారిగారు .మరెందరికో వాయి0చారామే .
147-మద్రాస్ లో 100 వాద్య కళాకారులతో రెడుగంటల సేపు వాద్య బృంద ప్రదర్శన చేశారు .మరో సారి 75వయోలిన్ లతో ముప్పావుగంట ప్రదర్శన ఇచ్చారు .భారతస్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సమయం లో 50 వయోలిన్ లతో తానే సృష్టించిన ‘’భారత్ ‘’(శంకరాభరణ జన్య ఔడవ షాడవం)అనే కొత్తరాగాన్ని పాడించి రక్తి కట్టించారు.ఒక వైకు౦ఠ ఏకాదశినాడు 29గంటల సేపు నిర్విరామంగా వాయులీన కచేరీ చేసిన సామర్ధ్యం కన్యాకుమారిగారిది .
17-గాంభీర్య మాధుర్యాల శ్రీ మల్లాది సూరిబాబు
148-మల్లాది సూరిబాబు గారి తండ్రి శ్రీ శ్రీరామ మూర్తి గారు శాస్త్రీయ సంగీతాన్ని ,హరికధా గానాన్నీ మద్రాస్ ఆకాశ వాణిలో 1945నుండి 53వరకు వినిపించారు .
149- సూరిబాబుగారు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లుగారి శిష్యులు .పినాకపాణి గారి వద్దా కొంత నేర్చారు .పిట్స్ బర్గ్ శ్రీ వేంకటేశ్వరాలయం లో ఆరునెలలు విద్యార్ధులకు సంగీతం నేర్పారు .
150-సూరిబాబు గారి భార్య శ్రీమతి సుకన్యా ,కుమారులు శ్రీ రాం ప్రసాద్ ,శ్రీ రవికుమార్ లు సంగీతజ్నులే కాక ప్రతిభా పాటవ సంపన్నులు .అంటే తాత దగ్గరనుఛి మనవళ్ళ దాకా అందరూ సంగీత విద్వాంసులే .
151-శ్రుతి మీద ద్రుష్టి ఉన్న సూరిబాబు గారు అన్ని శ్రుతులకూ తంబూరా శ్రుతి చేసి సి .డి.లు తెచ్చారు .ఆకాశవాణి గ్రేడ్ వన్ ఆర్టిస్ట్ మల్లాది .
152-మల్లాది సోదరులు నేదునూరి వారికీ ,పినాక పాణి గారికీ శిష్యులు .కర్నూలు వెళ్లి శ్రీపాద వారి వద్ద వందలాది కృతులకు పాఠం నేర్చారు .సంగీతం తో దేశ విదేశాలలో పర్యటించారు
153-‘’ఆంధ్రదేశం లో సంగీతానికి ఆదరణ తక్కువే అయినా అభిరుచి తగ్గలేదు ‘’అంటారు సోదరులు .’’వేడుక కోసం కచేరీ చేయరాదు .ధర్మ దృష్టితో చేయాలి .’’అంటారు సంగీతాన్ని కళగా కంటే శాస్త్రం గా ,విద్యగా నమ్ముతాము అని చెప్పారు .
154-‘గాయకుడు భగ వంతునితో చేసే సంభాషణ యే సంగీతం ‘’అన్నారు .
155-‘’బాగుగా వింత రాగములు ఆలాపము చేయగ మేను పులకరింపు గ ‘’మల్లాది సోదరులు వేలకు వేలు కచేరీలు చేస్తూ సంగీత సరస్వతిని ప్రపంచమంతా ఊరేగిస్తున్నారు .
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-16-ఉయ్యూరు