ఇది విన్నారా ,కన్నారా !-12
24-వీణ వాయిస్తూ గానం చేసే నందిగాన వెంకయ్య
186-1852-1916కు చెందినా నందిగాన వెంకయ్య గారు విశాఖ జిల్లాబిటువాడ అగ్రహారీకులు .వాసా అప్పయ్య గుమ్మలూరి వెంకట శాస్స్త్రి గారలవద్ద వీణ నేర్చారు .వీణ వాయిస్తూ పాడటం వీరి ప్రత్యేకత .అనుమంద్ర స్థాయిలో పాడేవారు .ఇలా పాడగలిగే వారు బహు అరుదు .
187-నాభి స్థానం నుంచి నాదాన్ని పూరించిపాడగలిగే వీరి నేర్పు అద్వితీయం .తెల్లవారుజామునననే లేచి గొంతు వరకు నీటి ప్రవాహం లో మునిగి ఉండి మంద్రస్థాయిలో సాధన చేసేవారు .వీరి ముఖ్య శిష్యులే కాక బావ మరిది వీణ విద్యా సార్వ భౌమ శ్రీ తుమురాడ సంగమేశ్వర శాస్త్రి గారు .
25-వీణ విద్యా సర్వ భౌమ శ్రీ తుమురాడ సంగమేశ్వర శాస్త్రి
188-‘’పిఠాపురం సంగమేశ్వర శాస్త్రి’’ గా ప్రసిద్ధులైన శ్రీ తుమురాడ సంగమేశ్వర శాస్త్రిగారు ‘’మెలకువ తో ఉన్నంత కాలం వీణ సాధన’’ చేస్తూండేవారు .పిఠాపుర సంస్థాన ఆస్థాన విద్వాంసులుగా ఉన్న వీరు రాగం ,తానం ,పల్లవి వాయించటం లో దిట్ట ‘’.His music was profound and magnificient ,though not inspired ‘’అన్నారు శ్రీ రంగ రామానుజ అయ్యంగార్ .కాని ఇన్స్పైర్ చేయలేదు అన్నది మాత్రం శుద్ధ అబద్ధం అంటారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .
189-శాస్త్రిగారి గూర్చిన ఘనత ఒకటిఉంది .ఒకే మెట్టు పై సప్తస్వరాలనూ (ఒకే స్థాయి మొత్తాన్ని )పలికి౦చ గలగటం-He specialized in producing a whole octave on a fret .తీగను వెనక్కి లాగి రెండు మూడు స్వరాలు పలికించ వచ్చు కాని ఒకస్థాయికి స్థాయినే పలికించటం దుస్సాధ్యం .దుస్సాధ్యాన్ని శాస్త్రిగారు సుసాధ్యం చేశారు .వీరి తర్వాత బాలచందర్ గారు చేశారు ..అందుకే ‘’గా౦ధర్వం అంటే సంగమేశునిదే ‘’అనే మాట లోకం లో ప్రచారమైంది .వీరికి వాయులీనం లోనూ మంచి ప్రవేశం ఉంది .
190-‘’వీణ గోముఖ వ్యాఘ్రం లాంటిది .ప్రవేశం తేలికే కాని పోను పోను అందాలు పట్టించటం లో కస్టాలు ఎదురవుతాయి .ఒకరకం గా ‘డంబుల్స్ కసరత్తు ‘’లాంటిది ‘’.
191-శాస్త్రి గారు ఒక రాగం వాయించటం మొదలు పెడితే గంటలకొద్దీ వాయించేవారు .ఒక వేళ రాత్రి గడిచి తెల్లారితే ,మళ్ళీ దాన్నే విని పించే వారు .రాత్రి 10గంటలనుండి తెల్లవారుజామున 4 గంటల వరకు సాధన చేసేవారు .విపరీతమైన త్రిస్థాయి సాధన చేసేవారు .శిష్యులు కూడా అలాగే ఉండి పోయేవారు .
182-‘’రాముని మరువకే మనసా ‘’అనే శంకరాభరణ పల్లవి తరచుగా వాయించేవారు .ప్రాణం పోయేవరకూ కూడా శాస్త్రిగారు ఆనంద భైరవి రాగం వీణపై వాయిస్తూ ప్రాణోత్క్ర్మమణం చేశారు .
183-దక్షిణాదిలోనే కాక కాశీ ,కలకత్తా బరోడా లలోనూ కచేరీ చేశారు .ప్రసిద్ధ హిందూస్తానీ గాయకులను ,సితార్ ,దిల్ రుబా ,ఇస్రాజ్ ,సారంగి వాద్యకారులను కలిసి మెళకువలు గ్రహించి వీణ పై వాటిని వారికంటే గొప్పగా వాయించే వారు .
184-ఒక సారి దర్భంగా మహారాజు పాద గయా క్షేత్రమైన పిఠాపురం వచ్చి ,రాజాగారికి మూడు రోజులు అతిధిగా ఉండి,,శాస్త్రి గారి హిందూస్తానీవీణ కచేరీ విని ‘’ఉత్తరాది గవయాలును అంత మనోహరంగా బింకంగా ,దురితంగా ,నాద పూరితం గా పాడటం అరుదు ‘’అని ప్రశంసించారు .
185 –శాస్త్రి గారి శత జయంతినాడు’’ గానకళ’’ పత్రికలో శిష్యుడు శ్రీ ఆకొండి రాజా రావు ‘’వీణా చార్య సంగ మేశ్వరులు ‘’అనే వ్యాసం రాస్తూ ‘’శాస్త్రిగారి చేతిలో వీణ వీణ కాదు కీలు బొమ్మ .వెన్నవలె కరిగి మధురస మొలికిస్తుంది .నారదుని మహతి వీణ అప్రయత్నంగా పాడినట్లు ,వీరి వీణ కూడా అంతే .
186-పిఠాపురం మహా రాజా ఆహ్వానాన్ని అందుకొని రవీంద్ర నాద టాగూర్ వారి ఆస్థానానికి అతిధిగా వచ్చాడు ఆయనా సంగీత రసజ్ఞుడే .ఆయన పేర’’ రవీంద్ర సంగీతం’’ ఉన్నది .కొందరు దాక్షిణాత్యగాయకుల చేత రాజావారు కచేరీలు ఏర్పాటు చేయించారు .ఒక రోజు సంగమేశ్వర శాస్త్రి గారు కూడా వీణ కచేరీ చేశారు .ఆ కచేరీకి పరవశించిన రవి కవి ‘’దయ చేసి మేము కోరినపుడల్లా శాస్త్రిగారిని శాంతినికేతన్ కు పంపించండి ‘’’అనికోరాడు .అలాగే అన్నారు రాజావారు .
187-‘’శాస్త్రి గారు నా గురు దేవులు .ఆయన గానం నాకు అపూర్వ అలౌకికానందాన్ని అందించింది ‘’అన్నాడు గీతా౦జ లికర్త .,దక్షిణాది వాయులీన విద్వాంసుడు శ్రీ తిరుక్కోటి కావలి కృష్ణయ్య శాస్త్రిగారి వీణావాదన విని ఆనంద బాష్పాలు రాలుస్తూ కౌగిలించుకొని ‘’శాస్త్రీజీ !నేను వీణ నేర్చుకొని ఉంటె ,నా ప్రతిభ మరింత రాణిందేమో ? ‘’అని శ్లాఘించాడు .
188-శ్రీ వీణ శేషన్నగారు ‘’శాస్త్రి గారి ప్రతిభ దేవతలకు మాత్రమే సాధ్యం .మానవ మాత్రులు అలా వాయించ లేరు ‘’అన్నారు .ప్రముఖ నాద స్వర విద్వాంసుడు ‘’శాస్త్రి గారిలాగా సన్నాయి పై కల్యాణి రాగాన్ని వాయించటం నా జీవిత లక్ష్యం ‘’అన్నాడు .కృష్ణా జిల్లాకి చెందిన ప్రఖ్యాత సన్నాయి విద్వాంసుడు శ్రీ దాలి పర్తి పిచ్చి హరి ‘’శాస్త్రి గారు తోడి రాగాలాపన చేయగా విని ముగ్దుడనయ్యాను .గంటలకాలాన్ని నిమిషాలుగా మార్చే సమర్ధత వారిది .ఆ మాధుర్యం లో పిసరంతైనా మేము సన్నాయి పై వాయి౦చగలిగితే ధన్యులం ‘’అన్నాడు .
189-శాస్త్రిగారు పాశ్చాత్య సంగీతం వాయించటం లోనూ దిట్టలే.గురువు వెంకన్నగారు ,వీణ వెంకట రమణ దాసు గారు సంగమేశ్వర శాస్త్రిగారల సాధనా పద్ధతిలో ఒక గొప్ప విశేషం ఉంది .అది ‘’త్రిస్థాయిలో వెయ్యి సార్లు స్వరాలను వాయించటం .మూడు కాలాలలోనేకాకుండా ఇంకా పై కాలాల్లోనూ ఈ ముగ్గురూ వీణ సాధన చేసేవారు .
190-శాస్త్రి గారి వీణకు 6వ మెట్టుశ్రుతి గా పెట్టుకొనేవారు .అంత హెచ్చు శ్రుతికి తీగను బిగిస్తే వేళ్లకీ గమకాలకూ బాదే .అయినా అంత శ్రుతి లోనూ అతి సునాయాసంగా వాయించటం శాస్త్రి గారి ప్రత్యేకత . మైకులు ,సౌండ్ ట్రాకులూ లేని ఆ కాలం లో స్పష్టతా మాధుర్యం యే మాత్రం తగ్గేవికావు .ప్రతి సంగతి గుండెకు పట్టినట్లు ,రస నిష్య౦దమై ,భావ యుతంగా ఉండటం వారి ప్రత్యేకత .
191-శ్రీ లలితోపాసకులైన శాస్త్రి గారు సన్మానాల్లో కప్పిన శాలువాలను ఎప్పుడూ కచేరీలో పైన వేసుకోలేదు .వచ్చిన పారితోషికాలు ,నగదు కూడా ,ఆభరణాలు వాడుకోలేదు ‘’ఇవన్నీ శ్రీ తిరుపతి వెంకన్న సొమ్ములు .నేను ఉపయోగించ రాదు .మొక్కు బడి సొమ్ములు వాడుకో వచ్చా ?’’అని ప్రశ్నించేవారు .
192-ఆశించకుండా వచ్చే ధనాన్ని మాత్రమే తీసుకొనేవారు .గాయకులకు శిష్యులకు తృప్తి కలిగేట్లు దానితో వారికి విందులు ఇచ్చేవారు .తాను ధన్యులై ఆంద్ర లోకాన్ని ధన్యులను చేసిన వారు శ్రీ తుమురాడ సంగమేశ్వరశాస్త్రి గారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-16-ఉయ్యూరు