విక్టోరియా యుగపు బ్రిటిష్ వేశ్యావృత్తి సంస్కరణోద్యమ నాయకురాలు -జోసేఫిన్ బట్లర్
72సంవత్సరాల సార్ధక జీవితం గడిపి 13-4-1828న జన్మించి,30-12-1906న మరణించిన విక్టోరియా యుగానికి చెందిన బ్రిటిష్ స్త్రీవాద రచయితా ,సాంఘిక సంస్కరణ నాయకురాలు జోసేఫిన్ బట్లర్ .ఆమె జీవితాన్ని వేశ్యా వ్రుత్తి నిర్మూలనకే ఎక్కువగా అంకితం చేసింది .ఇవా౦జలిక్ క్రిస్టియన్ మతస్తురాలు .పూర్తిగా మత విశ్వాసాలకు కట్టు బడే ఉంది .ఎన్నో ధార్మిక సేవాకార్యక్రమాలు చేసింది .అన్నిటికంటే ఆమె 1869నుండి 1886వరకు 15సంవత్సరాలు ‘’అంటువ్యాధుల చట్టం ‘’ఉపసంహరణకు బ్రిటన్ లోను అంతర్జాతీయంగాను చేసిన సుదీర్ఘ పోరాటం చిరస్మరణీయమైనది ఆ చట్టమే అమలు లోకి వస్తే వేశ్యా వ్రుత్తి చేస్తున్నారనే అభియోగం తో అన్యాయంగా అరెస్ట్ అయిన వేలాది యువతుల భవిష్యత్తు ప్రమాదకరమౌతుందని ఎలుగెత్తి చాటింది .వారి పక్షాన పోరాడింది .
అసలు పేరు జోసేఫిన్ ఎలిజబెత్ గ్రే .బ్రిటన్ లోని నార్త్ అంబర్ లాండ్ లోని మిలీ ఫీల్డ్ లో ఉన్న మినీ ఫీల్డ్ హౌస్ లో జన్మించింది .తలిదండ్రుల సంతానం లో ఏడవ పిల్ల .తండ్రి జాన్ గ్రే .తల్లి మేరి బరన్ బ్రిటిష్ ప్రధాని ,సంస్కరణాభిలాషి ,బానిసత్వ నిర్మూలన కోరే చార్లెస్ గ్రే కు దగ్గర బంధువు .తండ్రి కేధలిక్ విముక్తికి కృషి చేశాడు .1832 సంస్కరణ చట్టం రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించాడు .కేంబ్రిడ్జ్ దగ్గర ఉన్న డిల్స్టన్ ఎస్టేట్ మేనేజరుగా ఉండి కుటుంబాన్ని ఇక్కడికి మార్చాడు .1857 నాటికి న్యు కాజిల్ బ్యాంక్ ధర్మమా అంటూ కూడ బెట్టినదంతా పోగొట్టుకొన్నాడు .
1852లో విద్యా వేత్త ,మత గురువు అయిన జార్జ్ బట్లర్ ను జోసేఫిన్ పెళ్లి చేసుకొన్నది .ఇద్దరూ కలిసి క్రైస్తవానికి ఇవా౦జెలిక్ విధానాన్ని జోడించే ప్రయత్నం చేశారు .ఇటలీలో సాంస్కృతిక అనుబంధం కోసం కృషి చేశారు .ఉదార సంస్కరణలకోసం ప్రయత్నించారు .భార్యను ప్రజా సంబంధాలలో చురుకుగా పాల్గొన మని బట్లర్ ప్రోత్సహించాడు .కొద్దికాలం లోనే ఆమెకు వస్తున్న కీర్తి ప్రతిస్టలను చూసి ఆశ్చర్య పోయాడు .వృత్తి రీత్యా భర్త బాగా వెనక పడి పోయాడు .ఈ జంట నలుగురు పిల్లలకు తలిదండ్రులైనారు .ఈ దంపతులు బలమైన తీవ్రవాద సానుభూతి ఉన్నవారే కాక అమెరికన్ అంతర్యుద్దం లో యూనియన్ ను బలపరచారుకూడా .ఒక్కగానొక్క కూతురు ఈవాప్రమాద వశాత్తు మెట్ల మీదనుంచి జారిపడి చనిపోయి తల్లికి శోకం మిగిల్చింది .దీన్ని ఉపశమింప జేసుకోవటానికి జోసేఫిన్ తన కంటే అధిక వేదనతో ఉన్న వారిని మాటలతో ,సహాయం తో ఓదారుస్తూ తన గుండె బాధను దూరం చేసు కొన్నది .లివర్ పూల్ లోని బ్రౌన్ లోవర్క్ హౌస్ ను సందర్శించటం తో ఆమె వేశ్య సేవాకార్యక్రమానికి అంకురార్పణ జరిగింది .అక్కడ విశ్రాంతి భవనం ,పారిశ్రామిక నిలయం నిర్మించింది .
ఇరవైవ ఏడు వచ్చిన దగ్గర్నుంచి జోసఫిన్ స్త్రీవాద కార్యక్రమాలలో లో చురుగ్గా పని చేసింది .దీనికి ముఖ్య కారణం తన అయిదేళ్ళ పాప ఆకస్మిక మరణమే .చెల్టన్ హాం లో ఈ దంపతులు ఉండగా భర్త ఆకాలేజి వైస్ ప్రిన్సిపాల్ గా పని చేశాడు .1866లో జార్జ్ బట్లర్ లివర్ పూల్ కాలేజ్ హెడ్ మాస్టర్ అయ్యాడు .అప్పుడు జోసేఫిన్ మహిళలకు ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రచారం చేసింది .1867లో అన్నా జెమీమా క్లఫ్ తో కలిసి ,తర్వాత కేం బ్రిడ్జ్ లోని మ్యూన్ హాం కాలేజి ప్రిన్సిపాల్ తో కలిసి ‘’నార్త్ ఆఫ్ ఇంగ్లాండ్ కౌన్సిల్ ఫర్ ప్రమోటింగ్ ది హయ్యర్ ఎడ్యు కేషన్ ఆఫ్ వుమెన్ ‘’ఏర్పాటు చేయటం లో ప్రముఖ పాత్ర వహించింది .దీనితో పాటు వేశ్యల సంక్షేమానికీ పని చేసింది .వేశ్యా వ్రుత్తి పాపమే అయినా ,వేశ్యల జీవితాలతో ఆడుకొంటూ మగ వారు వారిని అణచి వేస్తున్న విధాన౦ పై ఎదురు తిరిగింది .లైంగిక నైతికత పై ద్వంద్వ ప్రవ్రుత్తి ని నిందించింది .1869లో అంటువ్యాధుల చట్టం పై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున జరిగిన నిరసన ప్రదర్శన కు నాయకత్వం వహించింది .1860నుండి మూడు సార్లు ఈ చట్టాన్ని వేశ్యలలో లైంగిక వ్యాధి నిరోధించాలన్న ఆలోచనతో ప్రవేశ పెట్టారు .ముఖ్యంగా రాయల్ నేవీ ,బ్రిటిష్ ఆర్మీ లో దీన్ని అమలు చేయాలని ప్రభుత్వ సంకల్పం .ఈ చట్టం వలన మేజిస్ట్రేట్ లకు ఆడవారి మర్మాంగాన్ని పరీక్షించే వీలు కలిగించింది .లైంగిక వ్యాదుల్ని గుర్తించే అవకాశమేర్పడింది .ఈ వ్యాధిసోకిన స్త్రీలను నయం చేయటానికి మూడు నెలలు తాళం వేసిన హాస్పిటల్ లో ఉంచేవారు .దీన్ని కాదని ఎదురు తిరిగిన వేశ్యలను అరెస్ట్ చేసేవారు .ఒక పోలీస్ వేశ్యలపై ఒక్క రిపోర్ట్ ఇస్తే చాలు వ్యభిచారులను పరీక్షించాల్సిందే .కాదంటే అరెస్టే.ఇదీ పరిస్థితి .దీనితో వారి వృత్తిని కోల్పోయేవారు .ఒక స్త్రీ దీన్ని నిరసించి ఆత్మ హత్య చేసుకొన్నది కూడా .
ఈ ప్రభుత్వ విధానం పై పోరాడుతూ బహిరంగ సభలో జోసేఫిన్ దీన్ని ‘’సర్జికల్ రేప్’’అన్నది .వెస్ట్ లండన్ సూప రిండే౦ట్-హఘ్ ప్రైస్ హగ్స్ ఆమెను అదే వేదికపై అభినందించాడు .ఆమె కన్నీరు కారుస్తూ వేదిక దిగి వెళ్ళిపోయింది. ఈ సంఘటన దేశం లో గొప్ప సంచలనం సృష్టించింది .మొదట్లో పోర్టు లలో ,రక్షక దళం లో ప్రవేశ పెట్టారు .తర్వాత దేశమంతా ప్రవేశ పెట్టే ప్రయత్నం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం .దీన్ని క్రిస్టియన్లు ,స్త్రీవాదులు ,పౌర స్వేచ్చ కోరేవారూ పూర్తిగా వ్యతిరేకించారు .దీనితో ఆచట్టాన్ని ఉపసంహరించాల్సి౦దేనన్నధ్యేయం తో రెండు సంస్థ లేర్పడ్డాయి .ఒకటి జోసేఫిన్ నాయకత్వం లో ,మరొకటి డాక్టర్ల ఆధ్వర్యం లో పని చేశాయి .ఆమెను ఉద్యమం నుంచి తప్పించే ప్రయత్నం లో ప్రభుత్వం ఆమెను ఎన్నో విధాలుగా అణచటానికి ,భౌతికంగా హింసించే ప్రయత్నాలు కూడా చేసింది .అయినా మడమ త్రిప్పకుండా సర్వ శక్తులూ ధార పోసి ఉపసంహరణ కోసం పోరాడింది జోసేఫిన్ .చివరికి ప్రభుత్వమే దిగి వచ్చి 1886లో బిల్లును ఉపసంహరించు కొన్నది .
పాల్ మాల్ గజెట్ పత్రికా సంపాదకుడు విలియం ధామస్ స్టెడ్ అనేక ధారావాహిక వ్యాసాలను ‘’ది మోడరన్ ట్రిబ్యూట్ ఆఫ్ మోడరన్ బాబిలన్ ‘’పేరిట రాస్తూ లండన్ లో ఉన్న ‘’బాల్య వేశ్యావృత్తి’’ గురించి కూడా రాశాడు .దీని పై స్పందిస్తూ జోసేఫిన్ ఎడిటర్ ను సమర్ధిస్తూ ప్రదర్శనలు నిర్వహించింది .దీని ఫలితంగా యునైటెడ్ కింగ్డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ లోను , ఐర్లాండ్ లోను ‘’అనుమతి వయసు ‘’(కన్సేంట్ ఏజ్ )ను 13నుండి 16ఏళ్ళకు పెంచుతూ ఆ ఏడాది నుండే అమలు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం .అ౦తర్జాతీయం గా దీనిపై పోరాటానికి ఆమె స్విట్జెర్లాండ్ ,ఫ్రెంచ్ ధర్డ్ రిపబ్లిక్ లలో పర్యటించింది .కాని అధికారులు సహకరించలేదు .కాని స్త్రీవాద సంస్థలు పూర్తి మద్దతునిచ్చాయి .తన ఆధ్వర్యం లో ఏర్పడిన ‘’ఇంటర్నేషనల్ అబాలిషన్ ఫెడరేషన్ ‘’తో బాటు మిగిలిన అంతర్జాతీయ సంస్థలు మహిళా వేశ్యల ,పిల్లల చట్టాలపై అవగాహనా సదస్సులు నిర్వహించి మార్పుల కోసం ఉద్యమించింది .1897లో బ్రిటిష్ పాలన లో ఉన్న ఇండియా లో ‘’అంటురోగ చట్టం ‘’తెస్తే ,దాన్ని వ్యతిరేకిస్తూ జోసేఫిన్ పెద్ద ఉద్యమమే నడిపింది .జోసేఫిన్ భర్త జార్జ్ రిటైర్ అవగా వి౦చెస్టర్ కేధడ్రిల్ కు’’ కానన్ ‘’గా నియమించారు .అయన 1900లో మరణించాడు .అయినా జోసేఫిన్ తన ఉద్యమాన్ని కొనసాగించి అలసి సొలసి 1906లో డిసెంబర్ 30న మరణించింది .
ఎంతటి స్త్రీవాదియో జోసేఫిన్ అంతటి మతాచార పరురాలు .’’దేవుడు ,ఒక మహిళా కలిస్తే చాలు మెజారిటీయే ‘’అనేది .’’సామాజిక విచారణ ‘’అనే కొత్త జర్నలిజాన్ని స్టెడ్ ప్రతిపాదిస్తే జోసేఫిన్ దాన్ని వ్యాప్తి చేసింది .చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ లో తక్కువ మోతాదు ఉత్సవాలు నిర్వహించేది .లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఉన్న లైబ్రరీలో ఆమె కు సంబంధించిన అనేక విషయాలు భద్ర పరచారు.అందులో నీతికి,సాంఘిక పరిశుభ్రతకు సంబంధించినవి చాలా ఉన్నాయి .ఈ సంస్థపేరును ఆమె గౌరవ చిహ్నంగా ‘’జోసేఫిన్ బట్లర్ సొసైటీ లైబ్రరీ ‘’గా మార్చారు .దర్హాం యూని వర్సిటి ఆమెపేరు మీద కాలేజి ని ఏర్పరచింది .లివర్ పూల్ యూని వర్సిటి పేరును ’’జోసేఫిన్ బట్లర్ హౌస్ ‘’గా మార్చారు .లండన్ లోని కెంసాల్ సేమెటరిలో దక్షిణ భాగాన ఉన్న రిఫార్మర్స్ మెమోరియల్ లిస్టు లో జోసేఫిన్ బట్లర్ పేరును చేర్చి గౌరవించారు .
జోసేఫిన్ వ్రాసిన పుస్తకాలలో ‘’విద్యా –ఉద్యోగం ‘’,జాన్ గ్రే జ్ఞాపకాలు ‘’స్వీయ జీవిత చరిత్ర ‘’వంటివి ఉన్నాయి .
–గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Share on Facebook – See more at: http://vihanga.com/?p=17278#sthash.HCFCzeOU.dpuf