ఇది విన్నారా ,కన్నారా !-14
27-వైణిక సార్వ భౌమ –పొడుగు రామ మూర్తి
201-1871లో జన్మించి విజయనగరం లో నివాసమున్న పొడుగు రామ మూర్తిగారు విజయనగర సంస్థాన ఆస్థాన విద్వాంసులైన శ్రీ సాలగ్రామం గోపాలం గారి వద్దా ,కట్టు వీరన్న గారి వద్దా వీణ నేర్చారు .దక్షిణ దేశానికి వెళ్లి కొనే రాజాపురం వైద్యనాధయ్యర్ ,తిరుకోడి కావాల్ కృష్ణయ్యర్ లతో స్నేహం సాధించారు .మద్రాస్ వచ్చి సంగీత కచేరీ చేశారు .సభలో శ్రోతలైన బెంగుళూరు నాగ రత్నమ్మ ,తిరువత్తూర్ త్యాగయ్య ,సుమతి కృష్ణా రావు వీరి వీణా వైదుష్యాన్ని బాగా మెచ్చుకొన్నారు .
202-విజయనగర ఆనంద గజపతి ఆస్థాన విద్వాంసులై ,రాజావారితో మైసూర్ ,నిజాం తిరువాన్ కూర్,సింధియా మొదలైన సంస్థానాలు సందర్శించి కచేరీలు చేసి మెప్పు పొందారు .
203-విజయ నగర ఆస్థాన పదవి వదిలేసి శ్రీకాకుళం జిల్లాలో నరసన్న పేట లో కాపురముండి,ఒక గురుకులాన్ని స్థాపించి అనేక విద్యార్ధులకు వసతి భోజనాలు ఏర్పాటు చేసి వీణ నేర్పారు .వీరి ఖ్యాతి విని ఉర్లాం ,పోలాకి ,బరంపురం ప్రజలు గాన సభలు ,సంగీతోత్సవాలుజరిపారు ..టెక్కలి ,పర్లాకిమిడి ,మందసా ,చీకటి ,జరతా ,సురంగి మొదలైన సంస్థానాలు దర్శించి సన్మానాలు పొంది వారిచ్చిన ధనం తో శిష్యులకు ఉచితంగా విద్య నేర్పించారు .
204-ఉర్లాం జమీన్దారిణి ,ఆదిభట్ల నారాయణ దాసు గారి ఆధ్వర్యం లో వీరికి సత్కారం చేసి బంగారు కంకణాన్ని తొడిగారు .1911లో దివాన్ బహద్దర్ కొమ్మారెడ్డి సూర్యనారాయణ మూర్తిగారు వీరని మహా ఆదరంగా నాలుగైదు ఏళ్ళు సకల సౌకర్యాలు కలిపించి తమ ఇంట్లోనే ఉంచుకొన్నారు .1912లో రామ మూర్తిగారిచే సరస్వతీ గాన సభ లోఏర్పరచిన కచేరీ కి హరినాగ భూషణం ,మహారాజ పురం విశ్వనాధయ్యర్ శ్రోతలుగా ఉన్నారు .ఆ సభలో శ్రోతలు మైమరచేట్లు వీణ వాయించగా ‘’వైణిక సార్వ భౌమ ‘’బిరుదు ప్రదానం చేశారు .1942 వృష నామ సంవత్సరం పుష్య బహుళ పాడ్యమినాడు పొడుగు రామమూర్తి గారు నిర్యాణం చెందారు .
28-శ్రీ ములుగు శివానంద శాస్త్రి
205-ములుగు నంద్యయ్య గారి కుమారుడు ములుగు శివానంద శాస్త్రి .పెదగురాచార్యుల వారి శిష్యులు వేన పై ప్రతి రోజు నమక చమకాలను వాయించుకొని ఆనంద పడేవారు .రాగం వాయించటం లో అద్వితీయులు .వాద్యం లో ఠీవి వీరి ప్రత్యేకత .నిత్య రోగం దరిద్రం తో బాధ పడుతూ అవసాన కాలం లో తన వీణకు ప్రణమిల్లి శాస్త్రి గారు తనువు చాలించారు .
206-ఆరభి రాగం లో త్యాగ బ్రహ్మ పై ‘’త్యాగ రాజ గురుదేవా ‘’అనే అందమైన కీర్తన రాశారు శాస్త్రి గారు .
పల్లవి -‘’త్యాగ రాజ గురుదేవ సాత్విక స్వభావ దేవ
అనుపల్లవి –భాగవతులలో నెల్ల త్యాగ రూపుడై వెలసిన
చరణం –అందముగా వేద శాస్త్ర మంత గూర్చి గాన ఫణితి
సుందరుడగు శ్రీ రాముని స్తోత్రముల నిల్పినారు
వందారు సమస్త జన బృంద శివానంద వినుత .
207-శాస్త్రి గారు వార్ వీణ కు వారే మేళం కట్టుకొనేవారు .కచేరీలలో కూడా వీణ మైనాన్ని కొవ్వొత్తి వెలిగించి వేడి చేసి మేళాన్ని సరి చూసుకోనేవారు.
29-వైణిక రత్న –కంభం పాటి అక్కాజీ రావు
208-కంభం పాటి ఆది నారాయణ రావు ,అనంత లక్ష్మి గారల కుమారుడే అక్కాజీ రావు గారు .తూ.గో.జి.అంతర్వేది పాలెం లో .కర్నాటక ,హిందూ స్తానీసంగీతాలలో ఎటు వంటి అపూర్వరాగాలైనా అవలీలగా వాయించేవారు .స్వర కల్పనా కీర్తన లలో కర్నాటక సంప్రదాయాన్ని పాటించేవారు .రాగాలాపనలో ఔత్తరాహులైన పండిట్ రవిశంకర్ మొదలైన వారి పట్టు జాతులను ,వాటి లోని మృదు మధుర కంపితాలను ప్రత్యేకంగా వాయించే వారు .
209-రావు గారు శాస్త్రీయ సంగీతం లోనే కాక లలిత సంగీతం లో కూడా ప్రసిద్ధులు .విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం లలిత సంగీత విభాగం లో పని చేశారు
210-రావు గారు బాలమురళీ కృష్ణగారి తండ్రిగారు పట్టాభి రామయ్య గారి శిష్యులై తుదిమెరుగులు దిద్దుకొన్నారు .నూకల వారివద్దా శిష్యరికం చేశారు .
211-అనేక పట్టణాలలో సంగీత కచేరీలు చేసి సన్మానాలు పొందారు .విజయవాడలో జరిగిన సంగీతవిద్వాత్ సభ లో అక్కాజీ రావు గారికి ‘’వైణిక రత్న ‘’బిరుద ప్రదానం చేశారు .
212-అనేక బాల గేయాలకూ ,ప్రచార గీతాలకూ స్వర రచన చేశారు .వాటిని శ్రీ ఏం వి రమణ మూర్తి ,శ్రీమతి శ్రీరంగం గోపాల రత్నం ,వింజమూరి లక్ష్మి వంటి వారు పాడారు .
30-వీణాచార్య తిరుమల నల్లాన్ చక్ర వర్తుల వెంకట నారాయణా చార్యులు
213-1902లో శ్రీనివాస రాఘవాచార్య ,లక్ష్మమ్మ ఫంపతులకు జన్మించారు .మద్రాస్ లో ఎన్నో కచేరీలు చేసి పేరు తెచ్చుకొన్నారు .
214-మద్రాస్ లోని తిరువల్లి క్కేణిదేవాలయం లో వీణ కచేరీ చేయమని కోరి స్వామి సన్నిధిలో చేయటం మర్యాదకాదని పూజారులు రెండు ఎత్తైన బల్లలపై రెండు బుర్రలను నిలిపి వాయి౦చమన్నారు .ఆచార్యులవారు వీణ ను బుజానికి కట్టుకొని అద్భుతంగా వాయించి ,ఆక్రిష్ణ లీలకు సమానమైన లీలా ప్రదర్శన చేశారు .
215-తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులైన ఆచార్యుల వారు అనేక గౌరవ సత్కారాలు పొందారు .అద్భుత సంగీత రచనా చేశారు వారి రచనలలో ముఖ్యమైనవి –జాతి భేద సప్త తాళ సహిత రాగ శతరాగ రత్నమాలిక ,అన్నమాచార్య సంకీర్తన స్వర కుసుమాంజలి ,గాంధర్వ వేదామృతం,పద్మావతీ రాగ నక్షత్రమాలిక ,శ్రీ వెంకటేశ్వర స్తోత్ర సహిత బంధ స్వరావళి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-6-16-ఉయ్యూరు